అష్టవిధ నాయికలు
150అష్టవిధ నాయికలు (Ashta-Nayika) భరత ముని రచించిన నాట్య శాస్త్రంలో పేర్కొనిన ఎనిమిది రకాల నాయికలను కలిపి ప్రయోగించే పదం. ఈ ఎనిమిది రకాల నాయికలు ఎనిమిది వివిధములైన మానసిక అవస్థలను తెలియజేస్తుంది.[1] వీనిని భారతీయ చిత్రకళలోను, సాహిత్యం, శిల్పకళ, శాస్త్రీయ నృత్యాలలో ప్రామాణికంగా పేర్కొన్నారు.
హిందూ సంస్కృతి
మార్చుఅష్టవిధ నాయికల వర్గీకరణ మొట్టమొదట భరత ముని (2వ శతాబ్దం BC నుండి 2వ శతాబ్దం AD) సంస్కృతంలో రచించిన నాట్య శాస్త్రంలో పేర్కొనబడింది.[1][2] ఈ వర్గీకరణ వివరాలు తర్వాత రచనలైన దశరూపకం (10వ శతాబ్దం), సాహిత్య దర్పణం (14వ శతాబ్దం), ఇతర కామశాస్త్ర గ్రంథాలలో తెలిపాయి. కేశవదాసు హిందీలో రచించిన రసికప్రియ (16వ శతాబ్దం) కూడా అష్టనాయికలను విశదీకరించిరి.[3]
అష్టవిధ నాయికలు భారతీయ చిత్రకళ, సాహిత్యం, శిల్పకళ, శాస్త్రీయ నృత్య సంప్రదాయాలలో తెలిపబడ్డాయి.[4][5] మధ్యయుగపు చిత్రకళాఖండాలైన రాగమాల చిత్రాలు అష్టవిధ నాయికలను ప్రముఖంగా చిత్రించాయి.[3]
భారతీయ సాహిత్యంలో జయదేవుడు 12వ శతాబ్దంలో రచించిన గీత గోవిందంలోను, వైష్ణవ కవి వనమాలి రచనలలో రాధ వివిధ నాయికల భూమిక పోషించి, నాయకుడిగా శ్రీకృష్ణుడు కీర్తించబడ్డారు.[6]
- 1. స్వాధీనపతిక
స్వాధీన పతిక లేదా స్వాధీన భర్తృక : (Svadhinabhartruka - "one having her husband in subjection"[2] or Svadhinapatika) "స్వాధీనుడగు భర్త గల నాయిక" ఈమెలోని ప్రగాఢమైన ప్రేమ, సుగుణాలకు భర్త పూర్తిగా ఆధీనుడౌతాడు.[3][5] చిత్రకళలో ఈ నాయికను నాయకునితో పాదాలకు పారాణిని గాని లేదా నుదుట తిలకం దిద్దుతున్నట్లుగా చూపిస్తారు..[3] జయదేవుడు గీత గోవిందంలో రాధను స్వాధీనపతికగా వర్ణించాడు. రాధమాధవుల రతిలో చెదిరిన తన అలంకరణను శ్రీకృష్ణునితో సరిచేయించుకుంటుంది.[5]
- 2. వాసకసజ్జిక
వాసకసజ్జిక : (Vasakasajja :"one dressed up for union") [2] వాసకసజ్జిక సుదీర్ఘ దూరప్రయాణం నుండి తిరిగివచ్చే ప్రియుని కోసం నిరీక్షిస్తుంది. చిత్రకళలో ఈమెను పడకగదిలో పద్మాలు, పూలదండలతో ఉన్నట్లు చూపిస్తారు.[3] "సర్వమునలంకరించుకుని ప్రియుని రాకకై ఎదురుచూసే నాయిక". ఈమె అందంగా తయారై ప్రియుని రాకకోసం తద్వారా లభించే ఆనందాల కోసం నిరీక్షిస్తుంది.[5] ఈమె అందాన్ని రతీదేవితో పోలుస్తారు.[3] వాసవసజ్జిక శిల్పం ఖజురహో లోని లక్ష్మణ దేవాలయంలోను, జాతీయ సంగ్రహాలయాలలో కనిపిస్తాయి.[5]
- 3. విరహోత్కంఠిత
విరహోత్కంఠిత: Virahotkanthita - "One distressed by separation") [2] "విరహం వల్ల వేదనపడు నాయిక". ఈమె ప్రియుడు పనికారణంగా ఇంటికి రాలేకపోయినప్పుడు విరహంతో బాధపడుతుంది. ఈమెను పానుపుమీద కూర్చున్నట్లు లేదా నిలబడినట్లుగా లేదా వరండాలో నిలబడినట్లుగా చూపిస్తారు.[3]
- 4. విప్రలబ్ధ
విప్రలబ్ధ : (Vipralabdha - "one deceived by her lover") [2] "శృంగార నాయిక, సంకేత స్థలానికి ప్రియుడు రానందుకు వ్యాకులపడే నాయిక, మోసగించబడినది". ఈమె రాత్రంతా ప్రియుని కోసం వేచియున్న నాయిక.[3] ఈమెను ప్రియుడు నమ్మించి రానందుకు కోపగించి ఆభరణాలను విసిరిపారేసే వనితగా చిత్రిస్తారు.[3]
- 5. ఖండిత
ఖండిత : (Khandita - "one enraged with her lover") [2] "ప్రియుడు అన్యస్త్రీని పొందిరాగా క్రుంగునది". నమ్మించిన ప్రియుడు రాత్రంతా వేరొక స్త్రీతో గడిపి మరునాడు వచ్చినందుకు విపరీతమైన కోపంతోవున్న నాయిక. ఈమెను ప్రియునిపై తిరగబడుతున్నట్లుగా చిత్రీకరిస్తారు.[3][5]
- 6. కలహాంతరిత
కలహాంతరిత : (Kalahantarita - "one separated by quarrel") [2] or Abhisandhita) [3] కోపంతో ప్రియుని వదిలి, తర్వాత బాధపడే స్త్రీ. ఈమె కోపంతో కలహించి లేదా ద్వేషంతో లేదా తనయొక్క చపలత్వంతో ప్రియుని వదిలిన నాయిక.[5] ఈమె ప్రియుడు గృహాన్ని విడిచిపోతున్నట్లుగా తర్వాత నాయిక అందులకు బాధపడుతున్నట్లుగా చిత్రిస్తారు.[3][5] మరికొన్ని సందర్భాలలో ఈమె ప్రియుని లేదా తానిచ్చిన మధువును తిరస్కరిస్తున్నట్లుగా చిత్రించబడింది. జయదేవుడు గీత గోవిందంలో ఒక సందర్భంలో రాధను కలహాంతరితగా వర్ణించాడు.[5]
- 7. ప్రోషితభర్తృక
ప్రోషిత భర్తృక లేదా ప్రోషిత పతిక: Proshitabhartruka - "one with a sojourning husband") [2] or Proshitapatika) "ప్రియుడు దేశాంతరం వెళ్ళగా బాధపడే నాయిక". ఈమె భర్త కార్యార్థం దూరదేశాలకు వెళ్లగా సమయానికి రానందుకు చింతిస్తున్న నాయిక. ఈమెను చెలికత్తెలు పరామర్శిస్తున్నా దుఃఖంతో చింతిస్తున్నట్లుగా చిత్రిస్తారు.[3]
- 8. అభిసారిక
అభిసారిక లేదా అభిసారిణి : (Abhisarika - "one who moves") [2] "ప్రియుడి కోసం సంకేతస్థలానికి పోయే నాయిక". (అభిసారం = ప్రేమికులు సంగమార్థం చేసుకునే నిర్ణయం, ప్రేమికుల సంకేతస్థలం) ఈమె నియమాల్ని అతిక్రమించి ఇల్లు వదలి రహస్యంగా ప్రియుడ్ని కలవడానికి వెళుతున్న నాయిక.[5] ఈమెను ఇంటి ద్వారం దగ్గర లేదా త్రోవలో అన్ని అడ్డంకులను అతిక్రమిస్తున్నట్లు చిత్రిస్తారు.[3][5] చిత్రకళలో అభిసారికను తొందరలో ప్రియున్ని కలవడానికి పోతున్నట్లు చూపిస్తారు.[5]
చిత్రమాలిక
మార్చు-
ఈ చిత్రంలో నాయిక పాదాలకు పారాణి దిద్దుతున్న నాయకుడు.
-
ప్రియుని రాకకోసం పానుపును తయారుచేసున్న వాసకసజ్జిక
-
విరహంతో ప్రియుని కోసం తపిస్తున్న విరహోత్కంఠిత
-
విప్రలబ్ధ
-
కలహాంతరిత
-
ఖండిత
-
భర్త రాకకోసం నిరీక్షిస్తున్న ప్రోషితభర్తృక
-
ప్రియున్ని కలవడానికి పోతున్న అభిసారిక. చిత్రంలో పాములు, మెరుపులు అడ్డంకులుగా చిత్రించారు.
మూలాలు
మార్చు- ↑ 1.0 1.1 "Erotic Literature (Sanskrit)". The Encyclopaedia Of Indian Literature. Vol. 2. సాహిత్య అకాడమీ. 2005. ISBN 81-260-1194-7.
- ↑ 2.0 2.1 2.2 2.3 2.4 2.5 2.6 2.7 2.8 Luiz Martinez, José (2001). Semiosis in Hindustani music. Motilal Banarsidas Publishers. pp. 288-95. ISBN 81-208-1801-6.
- ↑ 3.00 3.01 3.02 3.03 3.04 3.05 3.06 3.07 3.08 3.09 3.10 3.11 3.12 3.13 Sodhi, Jiwan (1999). A study of Bundi school of painting. Abinav Publishers. pp. 52–3. ISBN 81-7017-347-7.
- ↑ Banerji, Projesh (1986). Dance in thumri. Abhinav Publications. p. 13. ISBN 8170172128.
- ↑ 5.00 5.01 5.02 5.03 5.04 5.05 5.06 5.07 5.08 5.09 5.10 5.11 Varadpande, Manohar Laxman (2006). "Shringara nayika". Woman in Indian sculpture. Abhinav Publications. pp. 93–106. ISBN 81-7017-474-0.
- ↑ "Learn the lingo". The Hindu. Sep 14, 2007. Archived from the original on 2008-02-12. Retrieved 2010-10-26.