ఆచార్య ఫణీంద్ర
నాణ్యతను మెరుగుపరచేందుకు గాను ఈ వ్యాసానికి శుద్ది అవసరం. వికీపీడియా శైలిని అనుసరించి వ్యాసాన్ని మెరుగు పరచండి. వ్యాసంలో మెరుగు పరిచవలసిన అంశాల గురించి చర్చా పేజిలో చర్చించండి. లేదా ఈ మూస స్థానంలో మరింత నిర్దుష్టమైన మూస పెట్టండి. |
డా. ఆచార్య ఫణీంద్ర తెలుగు కవి, సాహిత్య విమర్శకుడు, పరిశోధకుడు. వృత్తిరీత్యా శాస్త్రవేత్త. ఆయన తెలుగు కవిత్వంలో పద్యం, గేయం, వచన కవిత్వంలో కృషి చేసాడు. ఆయన కవితలు, పరిశోధక వ్యాసాలు నాలుగు దశాబ్దాలుగా వివిధ పత్రికలలో, అనేక సంచికలలో ప్రచురించబడుతున్నాయి.
గోవర్ధనం వేంకట ఫణీంద్ర శయనాచార్య | |
---|---|
జననం | 27 జూలై 1961 |
విద్య | మెకానికల్ ఇంజనీరింగ్ లో పట్టభద్రుడు. తెలుగులో ఎం.ఏ. తెలుగులో డాక్టరేట్ డిగ్రీ |
విద్యాసంస్థ | ఉస్మానియా విశ్వవిద్యాలయం |
క్రియాశీల సంవత్సరాలు | 1983 నుండి ప్రస్తుతం |
ఉద్యోగం | హైదరాబాదులో "ఎఫ్" గ్రేడు సైంటిస్టు |
సుపరిచితుడు/ సుపరిచితురాలు | కవి, విమర్శకుడు, శాస్త్రవేత్త. |
జీవిత భాగస్వామి | గోవర్ధనం శ్రీవల్లి |
తల్లిదండ్రులు |
|
బంధువులు | గోవర్థనం నారాయణాచార్యులు ఆచి వేంకట నృసింహాచార్యులు ఆచి రాఘవాచార్య శాస్త్రులు |
జీవిత విశేషాలు
ఆచార్య ఫణీంద్ర 27 జూలై 1961 (వ్యాస పూర్ణిమ) నాడు నిజామాబాదు పట్టణంలో గోవర్ధనం దేశికాచార్య, ఇందిరాదేవి దంపతులకు జన్మించారు. ఆచార్య ఫణీంద్ర తండ్రి గారి స్వస్థలం ఉమ్మడి కరీంనగర్ జిల్లా (ప్రస్తుత జగిత్యాల జిల్లా) లోని బండ లింగాపురం గ్రామం..ఆచార్య ఫణీంద్ర మాతామహులు ఆచి వేంకట నృసింహాచార్యులు, పితామహులు గోవర్థనం నారాయణాచార్యులు ఇరువురూ సంస్కృతాంధ్ర పండితులు, కవులు. తెలంగాణ వైతాళికులు సురవరం ప్రతాప రెడ్డి గారి "గోల్కొండ కవుల సంచిక"లో వారి పరిచయ వివరాలు ఉన్నాయి. ఫణీంద్ర బాల్యం, పాఠశాల విద్య నిజామాబాదులోనే గడిచాయి. హైదరాబాదులో ఉన్నత విద్యాభ్యాసం చేసారు. ఆయన మెకానికల్ ఇంజనీరింగ్ లో పట్టభద్రుడు. తెలుగులో ఎం.ఏ. డిగ్రీని సాధించారు. తెలుగులో డాక్టరేట్ డిగ్రీని ఉస్మానియా విశ్వవిద్యాలయం నుండి "19వ శతాబ్దంలో తెలుగు కవిత్వం" అనే విషయం పై పొందారు. ముకుంద శతకం, పద్య ప్రసూనాలు, ముద్దుగుమ్మ, మాస్కో స్మృతులు, వరాహ శతకం, తెలంగాణ మహోదయం వంటి పద్యకవితా గ్రంథాలను రచించి మంచి పద్యకవిగా గుర్తింపు పొందారు. వృత్తిరీత్యా 1983లో కేంద్ర ప్రభుత్వ సంస్థ "అణు ఇంధన సంస్థ" (ఎన్.ఎఫ్.సి).లో చేరారు. 38 ఏళ్ళ ప్రభుత్వ సర్వీసు పూర్తి చేసుకొని 2021 ఆగస్ట్ మాసంలో సీనియర్ శాస్త్రవేత్త (డైరెక్టర్ లెవల్) గా పదవీ విరమణ చేసారు. మూడు దశాబ్దాలకు పైగా భారత అణు రియాక్టర్లకు అందించబడే అణు ఇంధన ఉత్పత్తికి అవసరమయ్యే అనేక యంత్రాల ఎరక్షన్ అండ్ కమీషనింగ్ తోబాటు మేంటెనెన్స్ కార్యకలాపాలను సమర్థవంతంగా నిర్వహించారు. ఉద్యోగపరంగా అనేక సదస్సులలో పాల్గొన్నారు. భారత ప్రభుత్వం దిగుమతి చేసుకొన్న అణు ఇంధనాన్ని తనిఖీ చేయదానికి రష్యాకు పంపిన శాస్త్రవేత్తల బృందంలో ఈయన కూడా ఒకరు. తెలుగు సాహిత్యంలో "మాస్కో స్మృతులు" పేరిట 'తొలి సమగ్ర విదేశ యాత్రా పద్య కావ్యా'న్ని రచించారు.తెలుగు వచన కవిత్వ సాహిత్యంలో "ఏక వాక్య కవితల" ప్రక్రియకు ఆద్యులు. ఆయన చూపిన మార్గంలో చాల మంది యువ కవులు, కవయిత్రులు అంతర్జాలంలో వేలాది ఏక వాక్య కవితలను రచిస్తున్నారు. "వాక్యం రసాత్మకం" పేరిట తెలుగు సాహిత్యంలో ఆయన రచించిన తొలి ఏక వాక్య కవితల గ్రంథం "Single Sentence Delights" పేరిట ఆంగ్లంలోకి అనువదించబడింది.[1] ఆయన శ్రీశ్రీ శతజయంతి (2010) సందర్భంగా, నిండు సభలో, మహాకవి శ్రీశ్రీ "మహా ప్రస్థానం" సంపూర్ణ కావ్యగానం ఏకబిగిన వ్యాఖ్యాన సహితంగా చేసి మన్ననలందుకొన్నారు. "తెలంగాణ మహోదయం" పేరిట ఉద్యమ కవిత్వాన్ని రచించి గ్రంథ రూపంలో పాఠకులకు అందించారు. ఇటీవలే "సాహితీ సల్లాపాలు" అనే సాహితీ ఛలోక్తుల సంపుటిని వెలువరించారు.
రచనలు
ముద్రితాలు
- ముకుంద శతకం [కంద పద్య కృతి] - 1993
- కవితా రస గుళికలు [మినీ కవితల సంపుటి] - 1998
- పద్య ప్రసూనాలు [పద్య కవితా సంపుటి] - 1999
- విజయ విక్రాంతి [కార్గిల్ యుధ్ధంపై దీర్ఘ కవిత] - 2000
- ముద్దు గుమ్మ [పద్య కావ్యం] - 2000
- వాక్యం రసాత్మకం [ఏక వాక్య కవితలు] - 2004
- మాస్కో స్మృతులు [విదేశ యాత్రా పద్య కావ్యం] - 2005 [2]
- Single Sentence Delights [’వాక్యం రసాత్మకం’ అనువాదం] - 2009
- వరాహ శతకం [అధిక్షేప వ్యంగ్య కృతి] -2010
- తెలంగాణ మహోదయం [ఉద్యమ కవితల సంపుటి] - 2018
- సాహితీ సల్లాపాలు [సాహితీ ఛలోక్తుల సంపుటి] - 2019
12. మౌక్తికం [ముక్తక పద్యాల సంపుటి] - 2021
అముద్రితాలు
- సీతా హృదయం [గేయ కావ్యం]
- కులీ కుతుబు కావ్య మధువు [పద్య కృతి]
- భారత భారతి [వ్యాఖ్యాన గ్రంథం]
- పందొమ్మిదవ శతాబ్ది తెలుగు కవిత్వంలో నవ్యత [పిహెచ్.డి.సిధ్ధాంత గ్రంథం]
- పాద రక్ష [పద్య కావ్యం]
- నీలి కురుల నీడలో [లలిత గీతాలు]
- పద్య పరిమళాలు [పద్య కవితా సంపుటి]
- నవ్య పద్య విద్యానాథులు [ప్రముఖులతో ముఖాముఖి]
- విషాద యశోద [లఘు పద్య కావ్యం]
అవార్డులు, బిరుదులు
ఆయన అనేక అవార్డులు, గౌరవాలను ప్రభుత్వం, ఇతర సాంస్కృతిక సంస్థల నుండి పొందారు. ప్రధానంగా - 'వానమామలై వరదాచార్య' స్మారక పురస్కారం, 'దివాకర్ల వేంకటావధాని' స్మారక పురస్కారం, 'పైడిపాటి సుబ్బరామశాస్త్రి' స్మారక పురస్కారం, 'ఆచార్య తిరుమల' స్మారక పురస్కారం, 'బోయినపల్లి వేంకట రామారావు' స్మారక పురస్కారం, "రంజని - విశ్వనాథ" పురస్కారం, 'సిలికానాంధ్ర' గేయ కవితా పురస్కారం, మూడు సార్లు విజయవాడ 'ఎక్స్ రే' పురస్కారాలు, 'కమలాకర ఛారిటబుల్ ట్రస్ట్' నుండి "వైజ్ఞానిక రత్న" పురస్కారం,'శ్రీగిరిరాజు ఫౌండేషన్' నుండి "అమ్మ పురస్కారం", పలుమార్లు రాష్ట్ర ప్రభుత్వ 'ఉగాది' సత్కారాలు పేర్కొనదగినవి. ఆయన 2012లో తిరుపతిలో జరిగిన ప్రపంచ తెలుగు మహాసభలలోనూ, 2014 లో అట్లాంటాలో జరిగిన "నాటా" తెలుగు సభలలోనూ గౌరవింపబడ్డారు. ఆయన హైదరాబాదులోని వి.ఎల్.ఎస్. లిటెరరీ అండ్ సైంటిఫిక్ ఫౌండేషన్ నుండి "పద్య కళా ప్రవీణ" బిరుదుని పొందారు. తూర్పుగోదావరి జిల్లా, ఏలూరు లోని నవ్య సాహిత్య మండలి నుండి "కవి దిగ్గజ" బిరుదుని పొందారు. హైదరాబాదులోని నవ్య సాహితీ సమితి నుండి "ఏకవాక్య కవితా పితామహ" పురస్కారాన్ని, కరీంనగర్ లోని శరత్ సాహితీ కళా స్రవంతి నుండి "ఏకవాక్య కవితా శిల్పి" బిరుదుని పొందారు. ఆయన ప్రస్తుతం "యువభారతి" సాహిత్య సంస్థకు అధ్యక్షులుగా, "పద్య సారస్వత పరిషత్" కు తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులుగా. "ఆంధ్ర పద్య కవితా సదస్సు"కు ఉపాధ్యక్షులుగానూ, "నవ్య సాహితీ సమితి" కి ఉపాధ్యక్షులుగానూ, "నండూరి రామకృష్ణమాచార్య సాహిత్య పీఠం" కు ప్రధాన కార్యదర్శిగానూ ఉన్నారు. ఆయన ఆంధ్ర పద్య కవితా సదస్సు యొక్క పత్రిక "సాహితీ కౌముది" కి పదేళ్ళపాటు సహసంపాదకులుగా వ్యవహరించారు. ఆయనకు 2013 సంవత్సరానికి గాను తెలుగు విశ్వవిద్యాలయం వారు 'పద్య కవిత్వం'లో "కీర్తి పురస్కారం (2013)" ప్రకటించారు.[3] 2017 డిసెంబర్ మాసంలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నిర్వహించిన "ప్రపంచ తెలుగు మహాసభల"లో డా. ఆచార్య ఫణీంద్ర "పద్య కవి సమ్మేళన" అధ్యక్షులుగా వ్యవహరించి సత్కరించబడ్డారు.
మూలాలు
- ↑ Single Sentence Delights (Poornendu Sahiti Samskritika Samstha, Hyderabad ed.). 2009.
- ↑ మాస్కో స్మృతులు (Poornendu Sahiti Samskritika Samstha, Hyderabad ed.). 2005. p. 78.
- ↑ "35 మందికి తెలుగు వర్సిటీ కీర్తి పురస్కారాలు". www.andhrajyothy.com. 2015-06-27. Archived from the original on 2022-09-17. Retrieved 2022-09-17.