ఆనంద శంకర్ జయంత్

ఆనంద శంకర్ జయంత్ ప్రముఖ కూచిపూడి, భరతనాట్యం నాట్యకారిణి. ఆమె రైల్వే ట్రాఫిక్ సర్వీసులో తొలి మహిళా అధికారిణి. ఆమె నృత్యకారిణే కాదు గురువు, వక్త, కొరియోగ్రాఫర్, రచయిత, పండితురాలు.[1]

ఆనంద శంకర్ జయంత్
జననం1961 లేదా 1962
తిరునెల్వేలి జిల్లా, తమిళనాడు, భారతదేశం
వృత్తిక్లాసికల్ డాన్సర్
కొరియోగ్రాఫర్
క్రియాశీల సంవత్సరాలు1972 నుండి
సుపరిచితుడు/
సుపరిచితురాలు
భరతనాట్యం
కూచిపూడి
జీవిత భాగస్వామిజయంత్
తల్లిదండ్రులుజి.ఎస్.శంకర్
సుభాషిణి శంకర్ r
పురస్కారాలుపద్మశ్రీ
సంగీత నాటక అకాడమీ పురస్కారం
కళారత్న పురస్కారం
నృత్య చూడామణి
మలైమమణి పురస్కారమ్
నాట్య ఇల్లావరసి
నృత్య చూడామణి
నృత్య కళాసాగర
నాట్య కళాసాగర
గురు డెబాప్రసాద్ పురస్కారం
ఇండియన్ ఎక్స్‌ప్రెస్ దేవీ అవార్డు
అలియన్స్ విశ్వవిద్యాలయం నృత్య సరస్వతి
విద్యా తాపస్వి పురస్కారం
ఆనంద శంకర్ జయంత్‌కు భరతనాట్యానికి ఆమె చేసిన విశేష కృషికి గానూ ప్రతిభా దేవిసింగ్ పాటిల్ సంగీత నాటక అకాడమీ అవార్డు-2009ని ప్రదానం చేస్తున్నారు.

జీవిత విశేషాలు

మార్చు

తమిళ బ్రాహ్మణ కుటుంబంలో పుట్టిన ఆనంద శంకర్ జయంత్ నాలుగేళ్ల ప్రాయం నుంచే పాదాలతో మువ్వల సవ్వడి చేసింది. కూచిపూడి, భరతనాట్యం, వీణ తదితర కళల్లో ప్రావీణ్యం సంపాదించిన ఆమె 17 ఏళ్ల వయసులో హైదరాబాద్‌కు తిరిగివచ్చి ఆరుగురు విద్యార్థులతో శంకరానంద కళాక్షేత్ర నృత్య పాఠశాలను ఏర్పాటుచేసి ఎంతోమందికి శాస్ర్తియ నృత్యంలో శిక్షణ ఇస్తున్నారు. ఆమె రూపొందించిన నృత్య రూపకాల్లో బుద్ధం..శరణం.. గచ్చామి, నేనెవరిని, పంచతంత్ర, శ్రీకృష్ణ వందే జగద్గురుమ్, నవరస, దర్శనం, సత్యం -ఇలా విభిన్న ఇతి వృత్తాలతో రూపొందించిన నృత్య రూపకాలు ప్రపంచ స్థాయి గుర్తింపుపొందాయి. భారతీయ నృత్య రూపకాల ప్రాధాన్యతను వివరిస్తూ ఆమె నేడు దేశ విదేశాల్లో స్ఫూర్తిదాయకమైన ప్రసంగాలు చేస్తున్నారు. తొలినాళ్లలో హైదరాబాద్‌లోని సెయింట్ ఆన్స్ స్కూలోలో చదివిన ఈ 53 ఏళ్ల నృత్యకళాకారిణి హిస్టరీ అండ్ కల్చరల్ కోర్సులో ఎంఫిల్, పర్యాటకంలో పి.హెచ్‌డీ చేసింది. రైల్వే ట్రాఫిక్ సర్వీసులో తొలి మహిళా అధికారిణి. ఆమె ప్రపంచ వ్యాప్తంగా అనేక ప్రదర్శనలు ఇచ్చి నృత్యకళకు సేవనందించారు.

తమిళనాడులో జన్మించిన ఆమె సికింద్రాబాద్‍లోని సెయింట్ ఆన్స్ స్కూల్‍లో విద్యనభ్యసించారు. ఉస్మానియా యూనివర్సిటీలో మాస్టర్స్ డిగ్రీ చేశారు. పీజీ చదువుతున్న రోజుల్లోనే యూపీఎస్సీ పరీక్షలపై ఆసక్తి కలిగింది. అప్పటికే యూనివర్సిటీ టాపర్‌. ఆ పట్టుదలతోనే యూపీఎస్సీ పరీక్షల్లో పాసై సౌత్‌ సెంట్రల్‌ రైల్వేలో తొలి మహిళా ఆఫీసర్‌గా బాధ్యతలు చేపట్టారు.

ఆనంద శంకర్‌ జయంత్‌ ప్రపంచ ప్రఖ్యాతి కళాక్షేత్రం నుంచి గ్రాడ్యుయేషన్‌ను పూర్తి చేశారు. భరతనాట్యం, కూచిపూడి ప్రదర్శనలో ప్రత్యేతను కనిపించేలా ఆమె సాధన చేశారు. ఆనంద కూచిపూడిలో ప్రావీణ్యాన్ని పి. రామలింగ శాస్త్రి వద్ద సంపాదించారు. దూరదర్శన్‌లో ఆనంద ప్రదర్శనలకు మంచి టిఆర్‌పి ఫాలోయింగ్‌ ఉంది. ఐసిపిఆర్‌ ఆర్టిస్ట్‌గా ఎదిగారామె. భారతదేశంతో పాటు విదేశాలలో అనేక ప్రదర్శనలిచ్చారు. కూచిపూడి ప్రదర్శ నలివ్వాల్సిందిగా ఆమెను కజు రహో, భాగ్యచంద్ర డ్యాన్స్‌ ఫెస్టివల్‌, ఇంపాల్‌ వంటి అనేక ఉత్సవాల నుంచి ఆహ్వానాలందుకున్నారు. ఆమెకు అభినయంలో మంచి పేరు ఉంది. కూచిపూడి నృత్యకళాకారిణి, కొరియో గ్రాఫర్‌, శిక్షకురాలిగా ఉంటూ ఆమె కళాసేవకే అంకితం అయ్యారు.[2]

కేన్సర్ ను జయించి

మార్చు

2008లో అమెరికా టూర్‌ ఫిక్సయింది. అంతకు ముందు రోజునుంచే రొమ్ములో ఏదో గడ్డలాగా అనిపించింది. ఎందుకైనా మంచిదని మెమోగ్రామ్‌ టెస్టు చేశారు. రిపోర్టు రాకముందే ఆవిడ అమెరికా వెళ్లారు. రెండు వారాల తర్వాత తిరుగు ప్రయాణం. రిసీవ్‌ చేసుకోవడానికి భర్త ముంబై ఎయిర్‌పోర్టుకి వచ్చారు. ఆయన వస్తారని ఆమె ఊహించలేదు. ఆమెను చూడగానే గట్టిగా హత్తుకొన్నారు. ఆరోగ్యం జాగ్రత్త అని మాత్రమే అన్నారు. క్యాన్సర్‌ అని చెప్పడానికి అతనికి ధైర్యం సరిపోలేదు. కానీ ఆనంద ఊహించగలిగారు. ఆమె ఆత్మస్థైర్యం ఏమాత్రం సడలలేదు. ఎందుకంటే ఆమె ముందుగానే మానసికంగా సిద్ధమయ్యారు. కీమోథెరపీ, రేడియాలజీ కారణంగా శరీరం మెత్తబడి నడవడానికే కష్టమవుతుందని డాక్టర్లన్నారు. డ్యాన్స్‌ను కొంతకాలం పక్కనపెట్టక తప్పదని సూచించారు. కానీ ఆనంద వాళ్ల మాటలు పట్టించుకోలేదు. డ్యాన్స్‌ కోసం ఎందాకైనా వెళ్లాలనుకున్నారు. ప్రాణం ఆగినా ఫరవాలేదు కానీ పాదం ఆగొద్దనుకున్నారు. డ్యాన్స్‌ చేయకుండా నేను ఉండలేను అని కరాఖండిగా చెప్పేశారు ఆనంద. 2009, జూలై 7న శస్త్రచికిత్స. ఆరోజు హాస్పిటల్‌కు వెళ్తున్నట్టు కాకుండా ప్రదర్శన ఇవ్వడానికి వెళ్తున్నట్లే భావించారు. పార్లర్‌కు వెళ్లి మానిక్యూర్‌, పెడిక్యూర్‌ చేయించుకున్నారు. ఆపరేషన్‌ థియేటర్‌ను ఆడిటోరియం ప్రాంగణంగా మనసులో అనుకున్నారు. సర్జరీ ముగిసింది. ఆపరేషన్‌ కాస్ట్యూమ్స్‌తో కాకుండా వెంట తెచ్చుకున్న డ్రెస్‌ వేసుకొని, నుదుటన బొట్టు, లిప్‌స్టిక్‌ పెట్టుకున్నారు. ఇంకా విచిత్రం ఏంటంటే 'పెర్ఫార్మెన్స్‌ ఎలా వుంది డాక్టర్‌' అని రివర్స్‌లో అడిగిన ఆమె ఆత్మస్థయిర్యాన్ని అభినందించకుండా ఉండలేకపోయారు. సర్జరీ జరిగిన రెండురోజుల్లోనే కాలికి గజ్జే కట్టారు. ఈవెంట్లు ఆర్గనైజ్‌ చేయడం, పిల్లలకు నేర్పడం- పర్ఫార్మెన్స్‌కు సిద్ధమవడం ఇలా ఎప్పటిలాగే రోజువారీ కార్యక్రమాల్లో మునిగిపోయారు. ఆనంద దృష్టిలో క్యాన్సర్‌ అనేది జీవన్మరణ సమస్య కాదు. అదొక ఓ సాధారణ వ్యాధి. అదే విషయాన్ని ఆమె చెప్పాలనుకున్నారు. క్యాన్సర్‌ పై ఆనంద చేసిన టెడ్‌ (టెక్నాలజీ, ఎంటర్‌ టైన్‌ మెంట్‌, డిజైన్‌) టాక్‌ అత్యుత్తమ ప్రసంగంగా నిలవడం గమనార్హం. ఆ స్పీచ్‌ విన్న తర్వాత అందరూ ఆమెను క్యాన్సర్‌ బాధితురాలిగా కాకుండా ఓ మహమ్మారిని జయించిన వీరనారిగా గుర్తించడం మొదలుపెట్టారు. ప్రస్తుతం ఆనంద సాధారణ జీవితం గడుపుతున్నారు. రైల్వే అధికారిగా ఉద్యోగం చేస్తూనే ఇటు డాన్సర్‌గా సంగీత కళామతల్లికి నిత్య నృత్యాభిషేకం చేస్తున్నారు.[3]

పురస్కారాలు

మార్చు
 
పద్మశ్రీపురస్కారం

నేటి సామాజిక సమస్యలకు పురాణాల్లోనే పరిష్కారం దొరుకుతుందని విశ్వసించే అనంద శంకర్ జయంత్ వరకట్నం, అత్యాచారాలు వంటి సామాజిక సమస్యలపై చైతన్యం తీసుకువచ్చేలా నృత్యరూపకాలను రూపొందించి దేశ విదేశాల్లో ప్రదర్శిస్తోంది. 2007లో పద్మశ్రీ పురస్కారాన్ని పొందారు. భరత నాట్యంలో సంగీత నాట్య అకాడమీ అవార్డుతో పాటు వివిధ రాష్ట్రాలు ఇచ్చే పురస్కారాలను సైతం ఆమె అందుకున్నారు. చెన్నైకి చెందిన ప్రముఖ కళా సంస్థ భారత్ కళాచార్ నుంచి 2016 సంవత్సరానికి గాను ప్రతిష్ఠాకరమైన ‘విశ్వకళా భారతి’ పురస్కారానికి ఎంపికయ్యారు.[1] లలితకళలను ప్రోత్సహించడంలో విశేష కృషి చేసిన వారికి చెన్నైకు చెందిన ప్రముఖ కళా సంస్థ భారత కళా సంస్థ భారత్ కళాచార్ ప్రతి ఏడాది అందించే 'విశ్వకళా భారతి' పురస్కారానికి ఈ ఏడాది ప్రముఖ నృత్యకారిణి ఆనంద శంకర్ జయంత్ ఎంపికయ్యారు.[4]

మూలాలు

మార్చు
  1. 1.0 1.1 మువ్వల సవ్వడికి మరో పురస్కారం Saturday, 22 October 2016[permanent dead link]
  2. నృత్యమే ఆనందం January 23, 2012[permanent dead link]
  3. క్యాన్సర్‌ను జయించిన నాట్యశిఖరం[permanent dead link]
  4. "ఆనంద శంకర్‍కు విశ్వకళా భారతి పురస్కారం". Archived from the original on 2017-04-19. Retrieved 2016-11-21.

ఇతర లింకులు

మార్చు