ఆర్ట్ క్యూరియస్

ఆర్ట్ క్యూరియస్ (ఆంగ్లం: ArtCurious) 2016 లో మొదలుపెట్టబడి, ధారావాహికగా ప్రసారం చేయబడుతోన్న చిత్రలేఖన చరిత్ర వర్గానికి చెందిన ఒక పాడ్కాస్ట్. నార్త్ కేరోలినా మ్యూజియం ఆఫ్ ఆర్ట్ లో ఆర్ట్ క్యురేటర్ (కళను పరిరక్షించే, కళా ప్రదర్శనలు ఏర్పాటు చేసే వ్యక్తి) అయిన జెన్నిఫర్ డాసల్ (Jennifer Dasal) దీని రచయిత, నిర్మాత, వ్యాఖ్యాత.[1][2] ఈ పాడ్కాస్ట్ ను ఆర్ట్ క్యూరియస్ సొంత వెబ్ సైటు అయిన [artcuriouspodcast.com] నుండి నేరుగా వినవచ్చు. యాపిల్ పాడ్కాస్ట్స్, అమెజాన్ ప్రైం మ్యూజిక్, స్పాటిఫై లతో బాటు ఆర్ట్ క్యూరియస్ యూట్యూబ్, గూగుల్ పాడ్కాస్ట్స్ లో కూడా లభ్యం.[3][4][5][6][7] ఆర్ట్ క్యూరియస్ పాడ్కాస్ట్ చిత్రలేఖనం, ఫోటోగ్రఫీ రంగాల గురించి, వీటి చరిత్రలో కళాకారుల మానసిక, భావోద్రేక నీలినీడల గురించి చర్చిస్తుంది. ఈ రంగాలలో సృష్టించబడ్డ గొప్ప కళాఖండాలు, వాటి వెనుక దాగి ఉన్న చిదంబర రహస్యాలను ఛేదిస్తుంది. మారుతోన్న కాలం, ఈ రంగాలలో తెచ్చిన పెను మార్పుల (రెండు ప్రపంచ యుద్ధాలు, ఆ తర్వాత చోటు చేసుకొన్న ప్రచ్ఛన్నయుద్ధం కళ పై తీసుకొచ్చిన ప్రభావాల) ను వెలికితీస్తుంది. ఈ పాడ్కాస్ట్ అటు తర్వాత ఇదే పేరుతో అచ్చువేయబడ్డ పుస్తకం; రెండూ కూడాను కళలో చోటుచేసుకొన్న దోపిడీ, నకళ్ళు, నేరం, హత్య, కళా ఉద్యమం, అశ్లీలత, వృత్తిపరమైన అసూయాద్వేషాలు, కళా వినాశనం వంటి మరెన్నో అంశాలను స్పృశిస్తూ, కళలో సాధారణ ప్రజానీకానికి తెలియని ఒక కొత్త కోణాన్ని ఆవిష్కరిస్తాయి.[1][8][9][10]

ఆర్ట్ క్యూరియస్
దస్త్రం:ఆర్ట్ క్యూరియస్ పాడ్ కాస్ట్ యొక్క ముఖచిత్రం.jpg
The unexpected, slightly odd and strangely wonderful in art history.
ప్రదర్శన
ఆతిథ్యదాతజెన్నిఫర్ డాసల్
కళా ప్రక్రియకళా చరిత్ర
భాషఆంగ్లం
ప్రచురణ
వాస్తవ విడుదల2016 – present
ప్రదాతకబూంకి క్రియేటివ్

నేపథ్యం

మార్చు

2004 లో జెన్నిఫర్ యూనివర్సిటీ ఆఫ్ నాట్రె డేం నుండి చిత్రలేఖన చరిత్రలో మాస్టర్స్ పట్టాను పొందింది.[1] తన బ్యాచెలర్ పట్టా కూడా యూనివర్సిటీ ఆఫ్ క్యాలిఫోర్నియా నుండి చిత్రలేఖన చరిత్ర లోనే.[2] పెన్సిల్వేనియా యూనివర్సిటీలో చిత్రలేఖన చరిత్రలో PhD కూడా పొందింది. 18-19 శతాబ్దాల ఫ్రెంచి చిత్రలేఖనం జెన్నిఫర్ ప్రత్యేకత. అందుకే పాడ్కాస్టులో కూడా ఈ ఎంపికలు స్పష్టమౌతుంటాయి.

తమకు కళ అర్థం కాకపోవటం వలనే తాము మ్యూజియంలను సందర్శించక పోవటానికి కారణం అని చాలా మంది చెప్పటంతో నే తన అదనపు సమయాన్ని వెచ్చించాల్సి వచ్చిననూ, ఇది ఖరీదైన వ్యవహారం అయిననూ ఈ పాడ్కాస్ట్ ను ప్రసారం చేయటానికి ప్రధాన కారణం అని జెన్నిఫర్ చెప్పుకొస్తుంది. తనకు ఇష్టమైన రంగం లోకి తన శ్రోతలను ఆహ్వానించటానికి ఈ పాడ్కాస్ట్ ఒక మార్గం మాత్రమే అని అంటుంది.[11] పాడ్కాస్ట్ కొరకు తాను చాలా శ్రమించవలసి వస్తుంది అని, కానీ ఫలితం మాత్రం మధురమని, దృశ్య కళల, కథనం, ఉత్కంఠల పట్ల తనకున్న ప్రేమ, నేర్చుకోవాలనే కోరిక మాత్రమే తనని ఈ పాడ్కాస్ట్ చేసేలా చేస్తున్నాయని ఆర్ట్ క్యూరియస్ వెబ్ సైటు పై జెన్నిఫర్ అంటుంది. ఇదే తన ప్రధానమైన వ్యాపకం చేసుకోవాలనో, ఈ పాడ్కాస్ట్ ద్వారానే తాను ధనవంతురాలైపోవాలనో అనుకోవటం లేదని తెలుపుతుంది.

చిత్రలేఖన చరిత్ర అధ్యయనానికి మునుపు కళ పట్ల తనకు కొన్ని సంశయాలు ఉండేవని, అందుకే కళ గురించి తెలిసినవారినైనా, తెలియని వారినైనా కలుసుకోవటానికి తనకి సమానమైన సంతోషాన్ని ఇస్తుంది అని తెలుపుతుంది. చిత్రలేఖన చరిత్రను అధ్యయనం చేసే సమయంలో కళాకారుల ప్రేరణ, కొన్ని నేపథ్యాలు, చిత్రలేఖనాలు కళాకారుల గురించి తెలిపే విషయాలు, పూర్వం కళకు ఉన్న స్పందన, ప్రస్తుతసమీపానికి వచ్చే కొద్దీ ఆ స్పందన మారిన తీరు పట్ల తాను ఆకర్షితురాలైనట్లు తెలిపింది.

పాడ్కాస్ట్ గురించి

మార్చు

దృశ్య కళలు ఆసక్తికరంగా ఉండవు, జీవం లేనివి అని వేళ్ళూనుకొన్న దురభిప్రాయాన్ని బద్దలు కొడుతూ జెన్నిఫర్ తన పాడ్కాస్ట్ లోని ఎపిసోడ్ లను మొదలు పెడుతుంది. ఒక్కోమారు మన జీవితాలను రంగులతో నింపేది కళయే అని తెలుపుతుంది.[12] తన పాడ్కాస్ట్ కు జెన్నిఫర్ ఇచ్చుకొన్న ఉపశీర్షిక, "చిత్రలేఖన చరిత్ర యొక్క అనూహ్య, కాస్త అసాధారణమైన, విచిత్రమైన, ఆశ్చర్యమైన కథలు". పేరెన్నికగన్న కళాఖండాల నేపథ్యంలో గల విచిత్రమైన కథల పై, ఆసక్తికరమైన రహస్యాల పై నున్నముసుగులను జెన్నిఫర్ తొలగిస్తుంది.[13] చిత్రలేఖన చరిత్రలో సమాధానం దొరకని అతి పెద్ద ప్రశ్నలకు తాను సమాధానాలను ఇస్తుంది. తక్కువ నిడివి కలిగి ఉన్న ఈ పాడ్కాస్ట్ ఎపిసోడ్ లను జెన్నిఫర్ నేపథ్యాలను బట్టి వర్గీకరించింది.[14] మనకు కళాకారులుగా పరిచయం ఉన్న, చిత్రలేఖన చరిత్రలో తమదైన ముద్ర వేసిన ఫ్రాన్స్, ఇటలీ వంటి దేశాల నుండి, కళల లోకి ఆలస్యంగా ప్రవేశించిన అమెరికా వరకు, వివిధ కళా కాలావధులకు చెందిన లియొనార్డో డా విన్సీ నుండి ఆండీ వార్హొల్ వరకు జెన్నిఫర్ తన చర్చను విస్తరిస్తుంది.[15]

ఎపిసోడ్ ల వివరాలు

మార్చు
విడుదల తేదీల వారీగా ఆర్ట్ క్యూరియస్ పాడ్కాస్టు లోని ఎపిసోడ్ ల జాబితా
క్రమ సంఖ్య సీజన్ విడుదల తేదీ ఎపిసోడ్ పేరు (ఆంగ్లంలో యథాతథంగా) తెలుగులో ఎపిసోడ్ పేరు యొక్క అనువాదం కామెంటు
1 1 2016 ఆగస్టు 10 Is the Mona Lisa a Fake? మోనా లీసా చిత్రపటం నకిలీదా? మోనా లీసా ఎవరు? ఒక కల్పిత పాత్రా, లేక నిజంగా ఉండేదా? మోనా లీసాను చిత్రీకరించటంలో లియొనార్డో డా విన్సీ ఉపయోగించిన పదార్థాలు ఏవి? పాటించిన పద్ధతులు, మెళకువలు ఏమిటి? ఇటలీలో చిత్రీకరించిన ఈ చిత్రపటం ఫ్రాన్సు లోని లూవర్ మ్యూజియానికి ఎలా వచ్చి చేరింది? అక్కడి నుండి ఈ చిత్రపటం ఎందుకు/ఎలా దొంగిలించబడింది? దేశభక్తా? పొరబాటా? భద్రతా లేమా? ఇక దొరకదు అనుకొన్న మోనా లీసా చిత్రపటం మరల ఎలా దొరికింది? మరల దొరికింది అసలా? నకలా? ఒక వేళ నకలు అయితే, ప్రపంచంలో మొత్తం ఎన్ని నకళ్ళు ఉన్నాయి? అన్ని నకళ్ళ రూపకల్పనకు గల కారణం ఏమిటి? అడాల్ఫ్ హిట్లర్ కన్ను మోనా లీసా పై ఉండేదా? దానిని హిట్లర్ తస్కరించదలచాడా? ఈ ప్రయత్నంలో సఫలీకృతుడు అయ్యాడా? పాబ్లో పికాసో మోనా లీసా చోరీలో ఎందుకు అనుమానించబడ్డాడు? ఆ ఉచ్చు నుండి ఎలా బయటపడ్డాడు? వంటి అనేకానేక ప్రశ్నలకు ఈ ఎపిసోడ్ ఒక చక్కని జవాబు!
2 1 2016 ఆగస్టు 29 Was Van Gogh Accidentally Murdered? విన్సెంట్ వాన్ గాఘ్ హత్య చేయబడ్డాడా? స్టారీ నైట్, సన్ ఫ్లవర్స్, కేఫే టెర్రేసి వంటి అద్భుతమైన పెయింటింగులు వేసిన విన్సెంట్ వాన్ గాఘ్ మానసిక స్థితిగతులు, అతనిలో ఉన్న ఆత్మహత్యా ప్రవర్తన, ఒక స్నేహితునితో వాగ్వాదం, తన చెవిని తానే కోసుకోవటం, నేపథ్యాలలో వాన్ గాఘ్ మృత్యువు తొలుత ఆత్మహత్యగా భావించబడింది. హత్యా కోణంలో ఈ ఎపిసోడ్ పరిశీలిస్తుంది.
3 1 2016 సెప్టెంబరు 12 The Semi-Charmed Life of Elisabeth Vigée Le Brun
4 1 26 సెప్టెంబరు The Problem of Michelangelo's Women మైఖేలాంజెలో చే చిత్రీకరించబడిన స్త్రీలలో సమస్య మైఖేలాంజెలో చిత్రీకరించబడిన స్త్రీలు పురుషుల వలె కండలు తిరిగిన దేహధారుడ్యం కలిగి ఉండటం వెనుక కథా కమామీషు
5 1 2016 అక్టోబరు 13 Death and Disaster, Warhol and Weegee మృత్యువు, విషాదం: ఆండీ వార్హోల్, వీగీ ఫోటోగ్రఫీలో పాప్ ఆర్ట్ ను సృష్టించిన ఆండీ వార్హోల్; విషాదకరమైన ఫోటోలను తీయడంలో దిట్టగా కొనియాడబడే వీగీ ల గురించి
6 1 2016 అక్టోబరు 24 Was Walter Sickert Actually Jack the Ripper? PART ONE వాల్టర్ సికర్ట్ యే జాక్ ద రిప్పర్ ఆ? (మొదటి భాగం) ఇంగ్లండులో కొందరు స్త్రీల, ప్రత్యేకించి వేశ్యల పై జరిగిన హేయమైన అత్యాచారం, హత్యలకు జాక్ ద రిప్పర్ అనే ముసుగులో ఉన్న వాల్టర్ సికర్ట్ అనే చిత్రకారుడా?
7 1 2016 అక్టోబరు 31 Episode #7: Was Walter Sickert Actually Jack the Ripper? PART TWO వాల్టర్ సికర్ట్ యే జాక్ ద రిప్పర్ ఆ? (మొదటి భాగం)

స్పందన

మార్చు

"జెన్నిఫర్ తన ఆహ్లాదకరమైన, ఉత్సాహభరితమైన కంఠస్వరంతో చిత్రలేఖన చరిత్రలో గల ప్రశ్నలను పరిశోధిస్తుంది...చిత్రలేఖన చరిత్ర కథనం లో మానవ జీవితం లోని నాటకీయ కోణాన్ని చొప్పించటంతో కళను అభ్యసించటం ప్రారంభించిన వారిని ఆకట్టుకొనే ప్రయత్నం చేస్తుంది...సాంకేతిక పదాల జోలికి పోకుండా కళ గురించి, దాని చరిత్ర గురించి తెలియని వారి ఆలోచనలను సైతం కళ చుట్టూ తిరిగేలా చేస్తుంది. ఆమె పాడ్కాస్ట్ మొత్తం చిత్రలేఖన చరిత్ర పట్ల ఉండే సాధారణ భావాలను సవాలు చేసే ఇటువంటి చారిత్రక గుళికలతో నిండి ఉంది." అని South Bend Tribune తెలిపింది.[1]

Oprah Daily ఆర్ట్ క్యూరియస్ ను "20 Best History Podcasts That'll Make You Rethink What You Learned in School" అని పేర్కొంటూ, "పాశ్చాత్య కళను జెన్నిఫర్ నూతన దృక్కోణంలో చూపిస్తుంది"అని వ్యాఖ్యానించింది.[16] 2020 లో PCMag అనే మాసపత్రిక, యునైటెడ్ కింగ్డమ్ కు చెందిన Evening Standard లు ఆర్ట్ క్యూరియస్ ను కళల విభాగంలో ఉన్నత పాడ్కాస్ట్ గా రేటింగ్ ఇచ్చాయి.[13][17] Daily Art magazine ఈ పాడ్కాస్ట్ గురించి, “చిత్రలేఖన చరిత్ర లోని చమత్కారాన్ని మీ ముందుంచి, అందులో మేధస్సుతో కూడియున్న వైచిత్రాన్ని మీకు తెలిపి మీరు ఈ చరిత్రను నిజంగా ప్రేమించేలా చేసే మనోహరమైన పాడ్కాస్ట్, ఆర్ట్ క్యూరియస్!" అని అభివర్ణించింది.[14] Lifewire జెన్నిఫర్ తన రంగంలో నిష్ణాతురాలని, పాతచింతకాయపచ్చడి వలె ఉన్న దశాబ్దాల కాలం నాటి చర్చలను కూడా తాను సరిక్రొత్త పుంతలు త్రొక్కించగలదని కొనియాడింది.[18]

మార్కెటింగ్

మార్చు

తన పాడ్కాస్ట్ నిర్మాణం, ఎడిటింగ్ లో సహకారం అందించిన Kaboonki Creative అనే మార్కెటింగ్ సంస్థను ప్రతి ఎపిసోడ్ లో జెన్నిఫర్ కొనియాడుతూ ఉంటుంది. ఈ సంస్థ వ్యవస్థాపకుడు స్వయానా జెన్నిఫర్ భర్త అయిన జోష్ డాసల్ యే![11]

ఆర్థిక వనరులు

మార్చు

జెన్నిఫర్ తన సొంత వ్యయంతో, స్థానిక కళా సంస్థల భాగస్వామ్యంతో, తన పాడ్కాస్ట్ లో వాణిజ్య ప్రకటనలు ఇచ్చే ప్రకటనదారులతో నిర్మాణానికి తగిన ఆర్థిక వనరలను చేకూర్చుకొంటుంది. తన శ్రోతలకు మాత్రం ఈ పాడ్కాస్ట్ పూర్తిగా ఉచితం.[1]

పుస్తకం

మార్చు

పాడ్కాస్టు విజయవంతం అయ్యాక ఇదే పేరుతో జెన్నిఫర్ పుస్తకాన్ని విడుదల చేసింది. పెంగ్విన్ బుక్స్ ఈ పుస్తకాన్ని (ISBN 978-0-14-313459-6) ముద్రించింది.[2][19] కళ, కళాకారుల, ప్రపంచం పై వీరి ఆశ్చర్యకరమైన ప్రభావాల గురించి మనోహరమైన కథనాలు ఈ పుస్తకం పంచుతుంది.[10] చిత్రలేఖన చరిత్రలో పలువురి నేపథ్యాలు, వారి కుటుంబాలు, గురువులు, సాటి కళాకారులు, కళా ప్రేమికులు వంటి మరెన్నో విషయాలతో ఒక రసవత్తరమైన నవల వలె ఈ పుస్తకం ముందుకు సాగిపోతుంది. మూడు విభాగాలు (అనూహ్యం, అసాధారణం, ఆశ్చర్యచకితం) గా ఉన్న ఈ పుస్తకం లోని చాలా పాత్రలు, కేవలం కళాకారులు మాత్రమే కారు.[15]

వ్యాఖ్యాత యొక్క ఇతర కార్యక్రమాలు

మార్చు

లెక్చర్లకు, విశ్వవిద్యాలయాల, బుక్ స్టోరు ల, మ్యూజియం లలో కళాసంబంధిత ఇతర కార్యకలాపాలలో పాలుపంచుకోవటానికి జెన్నిఫర్ ఎప్పుడూ సిద్ధమే అంటుంది.[2]

సాంఘిక మాధ్యమాలలో

మార్చు

ఫేస్బుక్, ఇన్స్టాగ్రాం, ట్విట్టర్ లలో జెన్నిఫర్ ఆర్ట్ క్యూరియస్ యొక్క ఖాతాలను నడుపుతూ ఉంటుంది.[2]

ఇవి కూడా చూడండి

మార్చు

మూలాలు

మార్చు
  1. 1.0 1.1 1.2 1.3 1.4 "'ArtCurious' podcast illustrates the unexpected and slightly odd moments in art history". 'ArtCurious' podcast illustrates the unexpected and slightly odd moments in art history. southbendtribune.com. 29 March 2015. Archived from the original on 24 జూన్ 2021. Retrieved 21 June 2021.
  2. 2.0 2.1 2.2 2.3 2.4 "ArtCurious Website".
  3. యాపిల్ పాడ్కాస్ట్స్ లో ఆర్ట్ క్యూరియస్
  4. అమెజాన్ ప్రైం మ్యూజిక్ లో ఆర్ట్ క్యూరియస్
  5. స్పాటిఫై లో ఆర్ట్ క్యూరియస్
  6. యూట్యూబ్ లో ఆర్ట్ క్యూరియస్
  7. గూగుల్ పాడ్కాస్ట్స్ లో ఆర్ట్ క్యూరియస్
  8. The Boston Globe citing episode 59 of ArtCurious which reveals that Eadweard Muybridge, a pioneer in photographing motion, shot and killed his wife’s paramour. Published on Apr 2, 2020. Retrieved on June 21, 2021
  9. ArtCurious reveals that Otto Dix plans to kill Hitler. Published on Parade on Aug 3, 2020. Retrieved on 21 June, 2021
  10. 10.0 10.1 "ArtCurious: Stories of the Unexpected, Slightly Odd, and Strangely Wonderful Art History". ArtCurious: Stories of the Unexpected, Slightly Odd, and Strangely Wonderful Art History. publishersweekly.com. Retrieved 21 June 2021.
  11. 11.0 11.1 "Sounding off about art". Sounding off about art. magazine.nd.edu. 2017. Retrieved 21 June 2021.
  12. “Art isn’t boring. It’s exactly what we need.“ states Dasal. Book list online on Jul 17. 2020. Retrieved on Jun 21, 2021
  13. 13.0 13.1 "Best arts podcasts". Best arts podcasts. standard.co.uk. 27 March 2020. Retrieved 21 June 2021.
  14. 14.0 14.1 "7 Entertaining Art History Podcasts to Listen to". 7 Entertaining Art History Podcasts to Listen to. dailyartmagazine.com. 2 April 2020. Retrieved 21 June 2021.
  15. 15.0 15.1 "Book Review". Book Review. bookpage.com. Sep 2020. Retrieved 21 June 2021.
  16. Oprah Daily says, "Jennifer Dasal will make you look at Western art and history in an entirely new way". Published by Oprah Daily on Aug 22, 2019. Retrieved on Jun 20, 2021
  17. "ArtCurious rated as one of the best Podcasts in 2020. Published by PC Mag on Nov 4, 2020. Retrieved on Jun 20, 2021". Archived from the original on 2021-05-09. Retrieved 2021-07-06.
  18. Livewire: Dasal who is an expert in her field brings fresh perspectives to Art History. Published on January 4, 2021. Retrieved on June 21, 2021
  19. ArtCurious podcast gets published as a book. Published on Art & Object on Aug 31, 2020. Retrieved on June 21, 2021