దృశ్య కళలు అనగా కళ్ళతో ఆస్వాదించగల కళలు. రేఖాచిత్రాలు, చిత్రలేఖనం, ముద్రణ, ఫోటోగ్రఫీ, చలనచిత్రీకరణ, చలనచిత్ర నిర్మాణం, వంటి వాటిని దృశ్య కళలుగా పరిగణించవచ్చు. [1]


రేఖాచిత్రాలుసవరించు

రేఖాచిత్రం వివిధ రకాల చిత్రకళకి సంబంధించిన పరికరాలని ఉపయోగించి ద్విపరిమాణపు మాధ్యమం (two dimensional medium) పై చిత్రాన్ని ఏర్పరచే ఒక దృశ్య కళ. గ్రాఫైట్ పెన్సిళ్ళు, కలం, సిరా, కుంచెలు, మైనపు పెన్సిళ్ళు, రంగు పెన్సిళ్ళు, కాల్చిన బొగ్గు, ఇరేజర్లు, మార్కర్లు, స్టైలస్ లు, సిల్వర్ పాయింట్ వంటి ప్రత్యేక లోహాలు వంటి పరికరాలని రేఖాచిత్రాలకి ఉపయోగించటం జరుగుతుంది. రేఖాచిత్రాలలో ఉపయోగించే ప్రధాన సాంకేతిక అంశాలు: లైన్ డ్రాయింగ్, హ్యాచింగ్, క్రాస్ హ్యాచింగ్, షేడింగ్, స్క్రిబ్లింగ్, స్టిప్లింగ్, బ్లెండింగ్. రేఖాచిత్రాలని చిత్రీకరించే కళాకారులని ఆంగ్లంలో డ్రాఫ్ట్స్ మెన్ (Draftsman) గా వ్యవహరిస్తారు. [2]

స్మార్ట్ ఫోన్/ట్యాబ్లెట్ లలో రేఖా చిత్రాలుసవరించు

సాంకేతిక పురోగతి తో ప్రస్తుతం మొబైల్ ఫోన్/ట్యాబ్లెట్ లలో కూడా స్టైలస్ పెన్ లభ్యం కావటం తో రేఖాచిత్రాలు మొబైల్ ఫోన్ ల పైనే చిత్రీకరించే సౌలభ్యం ఉంది. స్యాం సంగ్ మొబైల్ లో నోట్ సిరీస్ తో బాటు లభ్యం అయ్యే ఎస్ పెన్ (Spen), యాపిల్ ట్యాబ్లెట్ లలో మినీ ఐప్యాడ్ తో బాటు లభ్యం అయ్యే యాపిల్ పెన్సిల్ తో రేఖాచిత్రాలు స్మార్ట్ ఫోన్/ట్యాబ్లెట్ ల పై చిత్రీకరించబడుతోన్నాయి. [3] [4]

చిత్రలేఖనంసవరించు

 
రాజా రవివర్మ తైల వర్ణ చిత్రం

ఒక ఉపరితలం పై చిత్రాలని గీయటం, ఆ చిత్రాలకి వివిధ రకాలైన రంగులని అద్దటమే చిత్రలేఖనం [5]. దృశ్యపరమైన భాషలో కొలవదగిన ఒక ఉపరితలం పై కొన్ని కళా సౌందర్య ప్రమాణాలను పాటిస్తూ, భావాలను ఆలోచనలను వ్యక్తపరచటమే చిత్రలేఖనం[6]. ఉపరితలం పై రంగుని అద్దటానికి సాధారణంగా కుంచెలని ఉపయోగించిననూ చిత్రలేఖనానికై ప్రత్యేకంగా రూపొందించిన కత్తులు (knives), స్పాంజీ (sponge), రంగుని వెదజల్లే ఎయిర్ బ్రష్ (airbrush) లని కూడా వాడుతారు. ఉపరితలంగా గోడలు, కాగితం, వస్త్రం, కలప, గాజు, బంకమట్టి, పత్రాలు (ఆకులు), రాగి, ఇసుక లేదా కాంక్రీటు మిశ్రమాలని వాడుతారు. చిత్రాలని గీసేవారిని, వాటికి రంగులనద్దేవారిని, చిత్రకారులు అంటారు.

ముద్రణసవరించు

యాంత్రిక మార్గాల ద్వారా కాగితంపై పదాలను, చిత్రాలను ఉంచడాన్ని ముద్రణ అంటారు. పుస్తకాలు, వార్తాపత్రికలు ముద్రణ ద్వారా తయారు చేస్తారు. సాధారణంగా ఈ చిత్రాలు సిరా ద్వారా ఏర్పడతాయి. ముద్రణ యంత్రాలు అని పిలవబడే యంత్రాల ద్వారా కాగితంపై ఈ సిరాను ఉంచుతారు.

ప్రపంచాన్ని మార్చిన పలు టెక్నాలజీలలో ముద్రణ ఒకటి. ఇది అందరికి అందుబాటులో ఉండేలా ప్రతులను తయారు చేయగలదు. కాబట్టి ఇది బహుళ రచనలకు సమర్థవంతమైన మార్గం. కాబట్టి యాంత్రిక మార్గాల ద్వారా వ్రాయడం యొక్క కొనసాగింపుగా ముద్రణ ఉంది.

ఫోటోగ్రఫీసవరించు

ఫోటోగ్రఫీ లేదా ఛాయాగ్రహణం (Photography) అనునది కాంతి లేదా ఇతర విద్యుదయస్కాంత వికిరణాలను భద్రపరచటంతో బాటు రసాయనిక చర్యలతో కాంతి సూక్ష్మాలని గుర్తించే ఛాయాగ్రాహక చిత్రం (photographic film) వలన గానీ /ఎలక్ట్రానిక్ ప్రక్రియతో ఇమేజ్ సెన్సర్ (చిత్రాలని గుర్తించే పరికరము) వలన గానీ మన్నికైన చిత్రాలని సృష్టించే/ముద్రించే ఒక కళ/శాస్త్రము/అభ్యాసము. సాధారణంగా ఒక వస్తువు పై ప్రసరించే కాంతిని గాని, లేదా ఒక వస్తువు నుండి వెలువడుతున్న కాంతిని గానీ ఒక కటకం (lens)తో దృష్టి (focus) ని కేంద్రీకరించి, కెమెరాలో ఉండే కాంతిని గుర్తించే ఉపరితలం పై నిర్దిష్ట సమయం వరకూ బహిర్గతం (exposure) చేయటంతో ఆ వస్తువుల నిజ ప్రతిబింబం (real image) సృష్టించటం జరుగుతుంది. దీని ఫలితంగా వైద్యుదిక చిత్ర సంవేదిక (electronic image sensor) లోని ప్రతి ఒక్క చిత్ర కణము (pixel) పై విద్యుచ్ఛక్తి (electrical charge) వైద్యుదిక చర్య (electronical processing) జరిగి తర్వాత ప్రదర్శితమగుటకు, మార్పులు చేసుకొనుటకు సాంఖ్యిక ప్రతిబింబం (digital image) ఫైల్ గా భద్రపరచబడుతుంది.

భవన నిర్మాణ శాస్త్రంసవరించు

భవన నిర్మాణ శాస్త్రంను ఆంగ్లంలో ఆర్కిటెక్చర్ అంటారు. లాటిన్ ఆర్కిటెక్చురా, గ్రీకు భాషలోని ఆర్కిటెకటన్ అనే పదాల నుండి ఆర్కిటెక్చర్ అనే ఆంగ్ల పదం ఉద్భవించింది. ఈ పదాల యొక్క అర్ధం భవన నిర్మాణానికి మూలమైన నిర్మాణకర్త, వడ్రంగి, బేల్దారులను సూచిస్తుంది. భవన నిర్మాణ శాస్త్రంలో నిర్మాణ ప్రణాళిక, రూపకల్పన, నిర్మించడం ఉంటాయి. భవన నిర్మాణానికి కావలసిన సామాగ్రి, నిర్మాణశైలిలో ఉపయోగించాల్సిన సాంస్కృతిక చిహ్నాలు, ఆకట్టుకునేలా కళాకృతులు భవన నిర్మాణ కర్తలు తరుచుగా గ్రహిస్తుంటారు. చరిత్రలో చారిత్రాత్మక కట్టడాలను నిర్మించి ఎల్లప్పుడు గుర్తిండి పోయేలా చారిత్రాత్మక నాగరికతలు చారిత్రక భవన నిర్మాణ విజయానికి నాంది పలికాయి.

మూలాలుసవరించు

  1. ఎన్సైక్లోపీడియా బ్రిటానికా లో Visual Art పదానికి నిర్వచనం
  2. ఎన్సైక్లోపీడియా బ్రిటానికా లో డ్రాఫ్ట్స్ మన్ గురించి
  3. స్యాంసంగ్ గెలాక్సీ నోట్ 8 తో ఎస్ పెన్ లభ్యం
  4. యాపిల్ ఐప్యాడ్ మినీ తో లభ్యం అయ్యే యాపిల్ పెన్సిల్
  5. మెరియం వెబ్స్టర్ డిక్షనరీ లో పెయింటింగ్ కు నిర్వచనం
  6. ఎన్సైక్లోపీడియా బ్రిటానికా లో పెయింటింగ్ పరిచయ వాక్యం