ఇల్లరికం (సినిమా)
ఇల్లరికం , 1959లో విడుదలైన ఒక తెలుగు సినిమా. ఇల్లరికపు అల్లుళ్ళకు తప్పని అగచాట్లు, వారి వల్ల అత్తమామలకు ఎదురయ్యే ఇబ్బందులు నేపథ్యంలో నడచే కథ ఇది. రజతోత్సవం జరుపుకున్న చిత్రం. ఇందులో పాటలు చాలా కాలంగా తెలుగువారి నోట నానాయి. "ఇల్లరికంలో ఉన్న మజా" అనే పల్లవి సంభాషణలలో భాగమయ్యింది.
ఇల్లరికం (1959 తెలుగు సినిమా) | |
దర్శకత్వం | తాతినేని ప్రకాశరావు |
---|---|
నిర్మాణం | అనుమోలు వెంకట సుబ్బారావు, బి.ఎ. సుబ్బారావు |
కథ | వెంపటి సదాశివబ్రహ్మం కోటయ్య ప్రత్యగాత్మ |
తారాగణం | అక్కినేని నాగేశ్వరరావు (వేణు), జమున (రాధ), రమణారెడ్డి (ధర్మయ్య), గుమ్మడి వెంకటేశ్వరరావు (జమీందార్), పి.హేమలత (సుందరమ్మ) , రేలంగి, పద్మనాభం, రాజబాబు, అల్లు రామలింగయ్య (పానకాలు), గిరిజ (కనకదుర్గ), ఆర్. నాగేశ్వరరావు (శేషగిరి), పి.హేమలత, పేకేటి శివరాం, చిలకలపూడి సీతారామంజనేయులు (గోవిందయ్య), బాల (సావిత్రి), టి.జి. కమల (జమీందార్ చెల్లి), బొడ్డపాటి (డాన్స్ మాస్టర్), సురభి కమలాబాయి, విజయలక్ష్మి, లక్ష్మి, లీలాబాయి, పాలడుగు |
సంగీతం | టి.చలపతిరావు |
నేపథ్య గానం | ఘంటసాల, పి.సుశీల, జిక్కి, మాధవపెద్ది సత్యం |
గీతరచన | ఆరుద్ర, శ్రీశ్రీ, కొసరాజు |
సంభాషణలు | ఆరుద్ర వెంపటి సదాశివబ్రహ్మం |
ఛాయాగ్రహణం | ఎ. విన్సెంట్ |
కూర్పు | ఎ. సంజీవి |
నిర్మాణ సంస్థ | ప్రసాద్ ఆర్ట్ పిక్చర్స్ |
విడుదల తేదీ | 1 మే 1959 |
నిడివి | 2 గంటల 32 నిముషాలు |
భాష | తెలుగు |
ఐ.ఎమ్.డీ.బి పేజీ |
కథ
మార్చుజమీందారు (గుమ్మడి) సుందరమ్మ (హేమలత)ల ఏకైక కుమార్తె రాధ (జమున). వడ్డీ వ్యాపారి ధర్మయ్య మేనల్లుడు వేణు (ఏఎన్నార్). కాలేజీ వార్షికోత్సవంలో ఇద్దరూ పోటీ పడతారు. తరువాత ఒకరినొకరు గాఢంగా ప్రేమించుకుంటారు. సుందరమ్మ పెద్ద తల్లి కొడుకు గోవిందయ్య (సీఎస్సార్) దురాశపరుడు. ఆస్తిపాస్తుల పట్ల మక్కువగల సుందరమ్మ ఆస్తిపరుడైన అల్లుడు కావాలని కోరుకుంటుంది. కాని జమీందారు మాత్రం కూతురు రాధ ఇష్టప్రకారం పేదవాడైనా సంస్కారవంతుడైన వేణుతో పెళ్లి జరిపిస్తాడు. అతన్ని ఇల్లరికం తెచ్చుకొని ఆఫీసు బాధ్యతలు అప్పగిస్తాడు జమీందారు. గోవిందయ్య కొడుకు శేషగిరి (ఆర్ నాగేశ్వర రావు) వ్యసనపరుడు, మోసకారి. పట్నంలో వేణు చెల్లెలు దుర్గ (గిరిజ)ను గుడిలో పెళ్లి చేసుకుని కాపురం సాగిస్తుంటాడు. శేషగిరిని అక్కడనుంచి తీసుకొచ్చి రాధకు భర్తగా చేయాలనే ఆశ ఫలించలేదన్న కోపంతో ఉంటాడు గోవిందయ్య. అల్లుడు పేదవాడని సుందరమ్మకు బాధ. దీంతో రాధ, వేణుల మధ్య కలతలు రేపాలని ప్రయత్నిస్తుంటారు. రాధ, వేణులు అనురాగంతో కాపురం చేస్తుండగా, భర్త వదిలేయటంతో నాట్య ప్రదర్శనలు ఇస్తున్న దుర్గను వేణు కలుస్తాడు. తనెవరో భార్యకు తెలియనీయవద్దన్న చెల్లెలి కోరుతుంది. అదే సమయంలో జమీందారు -తన సోదరి (టిజి కమలదేవి)కి డబ్బు సాయం చేయమని వేణుతో 10 వేల రూపాయలు పంపుతాడు. అయితే ఈ విషయం రాధకు తెలియనీయకూడదని అంటాడు. తరువాత విషయం తెలుసుకున్న రాధ కోపంతో, ఆస్తి తనపేర వ్రాయించిన భర్తను అవమానిస్తుంది. ఇలాంటి పరిస్థితులు కొనసాగి వారి కాపురంలో అశాంతి మొదలవుతుంది. జమీందారు మరణించటం, వేణు సహనంతో భార్యలో మార్పుకోసం ప్రయత్నిస్తాడు. చివరకు రాధకు నిజాలు తెలుస్తాయి. అదే సమయంలో శేషగిరి ఆమెను బంధించటంతో, వేణు మారువేషంలో వెళ్లి రక్షిస్తాడు. చివరకు వేణు చెల్లెలు దుర్గ అని గోవిందయ్యతో సహా అంతా తెలుసుకుని క్షమాపణ కోరడంతో సినిమా శుభంగా ముగుస్తుంది.[1]
ప్రక్క ఇళ్ళలో ఇల్లరికం ఉన్న పేకేటి శివరాం, రేలంగిలు ఈ సినిమాలో హాస్యం పంచుతారు.
నిర్మాణం
మార్చునిర్మాణ నేపథ్యం
మార్చుప్రసాద్ ఆర్ట్స్ పిక్చర్స్ నిర్మాణ సంస్థ ద్వారా అనుమోలు వెంకట సుబ్బారావు నిర్మించిన రెండవ చిత్రం ఇది. సుబ్బారావు నిర్మించిన తొలి చిత్రం పెంపుడు కొడుకు పరాజయం పాలైంది. రెండవ ప్రయత్నంగా ఉత్తమ పుత్రన్ అనే తమిళ చిత్రాన్ని వీర ప్రతాప్ గా అనువదించగా విజయవంతమైంది. తొలి సినిమా పెంపుడు కొడుకు అక్కినేని నాగేశ్వరరావుతో తీయాలని ఆశించి, తీయకపోవడంతో దెబ్బతిన్నామన్న ఉద్దేశంతో ఈ సినిమాను నాగేశ్వరరావుతో ప్లాన్ చేసుకున్నాడు. అనుమోలు వెంకట సుబ్బారావు మిత్రుడైన ఎల్.వి.ప్రసాద్ శిష్యుడు తాతినేని ప్రకాశరావు అప్పటికే పలు చిత్రాలకు దర్శకత్వం వహించి ఉండడంతో అతనిని దర్శకునిగా సంప్రదించాడు. అలా సినిమా ప్రారంభమైంది.[1]
చిత్రీకరణ
మార్చుసినిమాని స్టూడియోలో కాక కొంతమేరకు మహాబలిపురంలో చిత్రీకరించారు. క్లైమాక్స్, నిలువవే వాలు కనులదానా పాటలో కొంత భాగం, చేతులు కలిసిన చప్పట్లు అన్న పిక్నిక్ పాట మొత్తం మహాబలిపురంలోనే చిత్రీకరించారు. హీరోయిన్ ని మారువేషంతో ఆటపట్టిస్తూ హీరో పాడే "నిలువవే వాలు కనులదానా" పాట పెట్టడం సరికాదని అక్కినేని నాగేశ్వరరావు భావించాడు. హీరో పాత్ర ఔన్నత్యానికి ఈ పాట భంగమని అతని ఉద్దేశం. బావుంటుందని ఒప్పించి దర్శకుడు చేశాడు.[1]
విడుదల
మార్చు1959 మే 1న ఇల్లరికం సినిమా విడుదలైంది.
పాటలు
మార్చుపాట | రచయిత | సంగీతం | గాయకులు |
---|---|---|---|
ఎక్కడి దొంగలు అక్కడనే గప్ చుప్-ఎవరే పిలిచారు నిన్నెవరే పిలిచారు (ఇది మహమ్మద్ రఫీ పాడిన "తుమ్‌సా నహీ దేఖా"కు అనుకరణ) | శ్రీశ్రీ | టి.చలపతిరావు | ఘంటసాల |
నిలువవే వాలు కనులదానా, వయారి హంస నడకదానా | కొసరాజు | టి.చలపతిరావు | ఘంటసాల |
నేడు శ్రీవారికి మేమంటే పరాకా, తగని బలే చిరాకా ఎందుకో | ఆరుద్ర | టి.చలపతిరావు | ఘంటసాల, పి.సుశీల |
చేతులు కలసిన చప్పట్లు, మనసులు కలసిన ముచ్చట్లు | ఆరుద్ర | ఘంటసాల, సుశీల, మాధవపెద్ది బృందం | |
మధుపాత్ర నింపవోయి సుఖయాత్ర సాగవోయి | ఆరుద్ర | జిక్కి బృందం | |
భలే ఛాన్సులే ...భలే ఛాన్సులే ... లలలాం లలలాం లకీ ఛాన్సులే, ఇల్లరికంలో ఉన్న మజా, అది అనుభవించితే తెలియునులే | కొసరాజు | మాధవపెద్ది | |
అడిగినదానికి చెప్పి ఎదురాడక ప్రశ్నను విప్పి | కొసరాజు | ఘంటసాల, సుశీల బృందం |
విశేషాలు
మార్చు- ఇది అక్కినేనికి 74వ సినిమా. ఇందులో కె. ప్రత్యగాత్మ, కోగంటి గోపాలకృష్ణలు, తాతినేని రామారావులు సహాయ దర్శకులుగా పని చేశారు. తరువాత వారంతా ప్రసిద్ధ దర్శకులయ్యారు.
- సురభి కమలాబాయి చాలాకాలం తరువాత మళ్ళీ సినిమాలో నటించింది.
- ఆరుద్ర డైలాగులు చిత్ర విజయానికి బాగా తోడ్పడినాయి. పోస్టరులపై బాపు కార్టూనులు తెలుగు సినిమా రంగంలో క్రొత్త ట్రెండ్‌గా చెప్పారు.
- నిలువవే వాలు కనుల దానా, నేడు శ్రీవారికి మేమంటే పరాకా వంటి పాటలు ఎవర్‌గ్రీన్ పాటలుగా ప్రసిద్ధి చెందాయి. 50 యేళ్ళ తరువాత కూడా ఈ పాటలు శ్రోతలనోట నానుతున్నాయి. గోపీచంద్ హీరోగా వచ్చిన "లక్ష్యం" సినిమాలో "నిలువవే వాలుకనుల దానా" పాటను రి-మిక్స్ చేశారు.
- ఈ సినిమా 23 కేంద్రాలలో శతదినోత్సవం జరుపుకుంది.
- ఎల్.వి.ప్రసాద్ ఈ సినిమాను హిందీలో "ససురాల్" అనే సినిమాగా పునర్నిర్మించాడు. అది పెద్ద విజయం సాధించింది. హిందీలో కూడా జమునను కథానాయికగా పెట్టాలనుకొన్నారుగాని కొన్ని కారణాల వలన చివరి క్షణంలో బి. సరోజాదేవిని ఆ పాత్రకు ఎంపిక చేశారు. అందుకు ప్రతిగా జమునకు ఐదు సినిమాలలో హీరోయిన్ పాత్ర ఇచ్చారట.
- ఈ సినిమా మలయాళంలో ప్రేమ్‌నజీర్, షీలా జంటగా‘కలితోళన్’ (1966) అనే పేరుతో, తమిళంలో రవిచంద్రన్, జయలలిత జంటగా‘మాడివీట్టు మాపిళ్లై’ అనే పేరుతో, కన్నడంలో జయలలిత, కల్యాణ్‌కుమార్ జంటగా ‘మనె అళియ’ (1964) అనే పేరుతో పునర్మించబడింది.[1]
మూలాలు
మార్చు- ↑ 1.0 1.1 1.2 1.3 సి.వి.ఆర్.మాణిక్యేశ్వరి (27 April 2019). "ఫ్లాష్ బ్యాక్ @50 ఇల్లరికం". ఆంధ్రభూమి దినపత్రిక. Retrieved 29 April 2019.
- సి.హెచ్.రామారావు: ఘంటసాల 'పాట'శాల అనే పాటల సంకలనం నుండి.
- డి.వి.వి.ఎస్.నారాయణ సంకలనం చేసిన మధుర గాయని పి.సుశీల మధుర గీతాలు, జె.పి.పబ్లికేషన్స్, విజయవాడ, 2007.
- తెలుగు సినిమా వెబ్ సైటులో వ్యాసం - రచయితలు: నచకి, అట్లూరి