ఎందరో మహానుభావులు (పుస్తకం)

ఎందరో మహానుభావులు 51మంది శాస్త్రీయ సంగీత విద్వాంసుల జీవన చిత్రణలు చేసిన వ్యాసాల సంకలనం. సినీనటునిగా, దర్శకునిగా, సాహితీవేత్తగా బహుముఖప్రజ్ఞ కనబరిచిన తనికెళ్ల భరణి ఈ పుస్తకాన్ని రచించారు.

రచన నేపథ్యం మార్చు

సంగీత విద్వాంసుల జీవిత చిత్రణగా రచించిన ఈ వ్యాసాలను హాసం పత్రికలో ప్రచురించారు. "..అందరికీ వందనములు" శీర్షికన ముందుమాటలో తానే రాసుకున్నట్టు తనికెళ్ల భరణి స్వయంగా సంగీత విద్వాంసుడు కాదు. మృదంగం, వయొలిన్, హార్మోనియం వంటి వాద్యాలపై వేర్వేరు గురువుల వద్ద శాస్త్రీయ సంగీతం నేర్చుకునే ప్రయత్నాలు మాత్రం చేశారు. అయితే ఆ ప్రయత్నాల ఫలితంగాక భరణికి సంగీతంపై లోతైన అభిరుచి ఏర్పడింది. ఈ నేపథ్యంలో చల్లా విజయలక్ష్మి సిద్ధాంత గ్రంథం "ఆంధ్రదేశపు సంస్థానాలూ - సంగీత వాజ్మయం" ముఖ్య ఆధారంగా హాసం పత్రికలో "ఎందరో మహానుభావులు" శీర్షిక రచన చేశారు.
హాసం పత్రికను నిలిపివేశాకా "హాసం ప్రచురణలు" సంస్థ తొలి గ్రంథంగా ఎందరో మహానుభావులు పుస్తకాన్ని ప్రచురించారు.

వ్యాసాలు మార్చు

ఎందరో మహానుభావులు పుస్తకంలో పలువురు సంగీత విద్వాంసుల జీవితాల్లోని రసవద్ఘట్టాలను స్వీకరించి వాటిని కళ్లకు కట్టినట్టుగా వర్ణిస్తూ, కొంతమేరకు జీవితవిశేషాలను, చారిత్రికాంశాలను ప్రస్తావించి వ్యాసాలుగా మలిచారు. వ్యాసంలో ప్రస్తావించిన విద్వాంసుడు వాగ్గేయకారుడు ఐతే ఆయన ప్రఖ్యాత కీర్తనల సంక్షిప్త జాబితా కూడా వ్యాసం ముగింపులో జతచేర్చారు.
ప్రముఖులే కాక దురదృష్టవశాత్తూ మట్టిలోనే మిగిలిపోయిన మాణిక్యాల వంటి విద్వాంసులను కూడా ఎంచుకుని రాశారు భరణి. 51మంది విద్వాంసుల గురించి రాయగా స్వాతి తిరునాళ్, అల్లా రఖా, భీంసేన్ జోషి, గౌడ డిండిమభట్టులు తప్ప ఇతరులంతా తెలుగు విద్వాంసులే. పాఠకులకు ఆ మహావిద్వాంసులు, వాగ్గేయకారులపై సదవగాహన, కొంతవరకూ శాస్త్రీయ సంగీతంపై ఆసక్తి ఏర్పడాలన్న లక్ష్యంతో ఈ వ్యాసాలు సాగుతాయి.[1]

శైలి మార్చు

విద్వాంసుని జీవితంలోని ప్రధాన రసవత్తర ఘట్టాలను పాఠకులకు ఆసక్తి కలిగించేలా మలుస్తూ వ్యాసాలను రాశారు. ఉద్వేగభరితుల్ని చేసే పదచిత్రాలు, కళ్లకు కట్టే ఉపమానాలు పన్ని ఆయా వ్యాసాల ద్వారా వ్యక్తుల జీవితాలను కళ్లముందుంచే ప్రయత్నం చేశారు భరణి.
"గొల్లపిల్లల వ్రేళ్ల సందు మాగాయ పచ్చడి పసందు ఎటుల కనుగొంటివయ్య, నీకెవరు చెప్పిరయ్య అంటూ పోతన గురించి పాపయ్యశాస్త్రి ఆశ్చర్యపోయారు! అలాగే విశ్వపతి శాస్త్రి తపన... తపస్సు... మీ కెలా తెలిసిందండీ!" అంటూ ప్రశంసాపూర్వకంగా టి.వి.సత్యనారాయణ(హబ్సిగూడ, సికిందరాబాదు) అనే పాఠకుడు ప్రశ్నినారంటే భరణి కథన శైలి తెలుసుకోవచ్చు.[2]

ప్రాచుర్యం మార్చు

హాసం పత్రికలో శీర్షికగా వెలువడుతుండగానే పలువురు పాఠకులు, ప్రముఖ రచయితలు, సంగీతవిద్వాంసులు అదనపు సమాచారం అందిస్తూ, భరణి రచన శైలిని మెచ్చుకుంటూ ఉత్తరాలు రాశారు. ఆ ఉత్తరాలను వెలువడుతున్న వ్యాసం క్రింద ప్రచురించేవారు. పుస్తకంగా ముద్రించిన తరువాత పలు ముద్రణలు తక్కువ కాలవ్యవధిలోనే పొంది విశేషంగా పాఠకుల ఆదరణ పొందింది.

ఇతరుల మాటలు మార్చు

  • మీ(భరణి) వ్యాసాలు కొన్ని చాలా బావుంటాయి. కొన్ని అద్భుతంగా ఉంటున్నాయి. సంతోషం... శభాషు.. కాస్త రసజ్ఞత, కాస్తంత హృదయం, కాస్తంత తడి, ఆర్ధ్రత ఇవన్నీ కలబోస్తూ వచ్చేది మంచి పాట, మంచి సంగీతం. దాన్ని మరుసటి తరాలకు అందించడం కొంతమందికే సాధ్యం. ఆస్తులు అందరూ ఇస్తారు. పైన నేను చెప్పినవన్ని అందరూ ఇవ్వరు. అది ఇవ్వమని కాస్తోకూస్తో మీ(భరణి) వ్యాసాలు హెచ్చరిస్తూ కర్తవ్యాన్ని బోధిస్తున్నాయి. నిమ్మరసంలో తేనెలాగో, తేనెలో నిమ్మరసంలాగో జీవితం ఉండాలంటూ చెప్తున్న మీ(భరణి) వ్యాసాలకు పేరు వారసత్వం అంటే బావుంటుంది. - మురారి, (ప్రముఖ సినీనిర్మాత), చెన్నై[3]
  • (పప్పు వెంకన్న గురించిన) వ్యాసంలో ఆనందగజపతి మహారాజు గారి గురించి ప్రస్తావించినపుడు, ఆయన వ్యక్తిత్వాన్ని ఎలా చిత్రిస్తారో అనుకున్నాను,.. ఆయన ఉన్నతమైన వ్యక్తిత్వాన్ని యదార్థంగానే మీరు(తనికెళ్ల భరణి) చిత్రించారు. - మన్నె సత్యనారాయణ, సజ్జాపురం, తణుకు.[4]

మూలాలు మార్చు

  1. తనికెళ్ల భరణి రాసిన "ఎందరో మహానుభావులు"
  2. ఎందరో మహానుభావులు:పేజీ.49
  3. తనికెళ్ల భరణి రచించిన ఎందరో మహానుభావులు: పేజీ.100
  4. తనికెళ్ల భరణి రచించిన ఎందరో మహానుభావులు: పేజీ.97

ఇవి కూడా చూడండి మార్చు

హాసం పత్రిక, తనికెళ్ల భరణి