ఎం.డి.రామనాథన్

మంజపర దేవేశ భాగవతార్ రామనాథన్ (20 మే 1923 – 27 ఏప్రిల్ 1984) ఒక కర్ణాటక సంగీత స్వరకర్త, గాత్రవిద్వాంసుడు.

జీవిత విశేషాలుసవరించు

ఇతడు మద్రాసు ప్రెసిడెన్సీ(ప్రస్తుతంకేరళ), పాలక్కాడ్ జిల్లా మంజపర గ్రామంలో 1923, మే 20న దేవేశ భాగవతార్, సీతాలక్ష్మి అమ్మాళ్ దంపతులకు జన్మించాడు. ఇతని తండ్రి వృత్తి రీత్యా సంగీతం మేష్టారు. ఇతని ప్రాథమిక విద్య పాలక్కాడులో జరిగింది. ఇతడు పాలక్కాడులోని విక్టోరియా కాలేజీ నుండి భౌతిక శాస్త్రంలో బి.ఎస్.సి. చదివాడు. విద్యాభ్యాసం తరువాత ఇతడు తన సంగీతాన్ని మెరుగు పరుచుకోవడానికి మద్రాసుకు వెళ్ళాడు.

అదే సమయంలో రుక్మిణీదేవి అరండేల్ తన "కళాక్షేత్ర"లో "సంగీత శిరోమణి" అనే కొత్త కోర్సును ప్రారంభించింది. రామనాథన్ ఆ కోర్సుకు ఎంపికయ్యాడు. 1944లో ఆరంభమైన ఆ కోర్సు మొదటి బ్యాచులోని ఏకైక విద్యార్థి ఇతడే. త్వరలోనే ఇతడు టైగర్ వరదాచారి ప్రియ శిష్యుడిగా మారాడు. ఇతని కోర్సు పూర్తి అయిన తర్వాత ఇతడు తన గురువుకు సహాయకుడిగా ఉన్నాడు. కొంత కాలానికి కళాక్షేత్రలో సంగీతం ప్రొఫెసర్‌గా మారాడు. ఇతడు "కళాక్షేత్ర" ఫైనార్ట్స్ కాలేజీకి ప్రిన్సిపాల్‌గా కూడా పనిచేశాడు.

సంగీత ప్రస్థానంసవరించు

పాటలుసవరించు

ఇతడు ప్రత్యేకమైన శైలిలో పాటలు పాడేవాడు. గౌళ గాత్రంతో విళంబ సమయంలో పాడుతూ తనకంటూ సంగీత ప్రపంచంలో వినూత్నమైన స్థానాన్ని ఏర్పరచుకున్నాడు. ఇతడు కర్ణాటక సంగీతంలోని దాదాపు అన్ని రాగాలలో పాడాడు. వాటిలో సహన, శ్రీ, ఆనందభైరవి, రీతిగౌళ, యదుకుల కాంభోజి, కేదార, కాంభోజి, హంసధ్వని రాగాలు ఇతని ప్రీతిపాత్రమైనవి. మందగమనంతో పాడటం ఇతని ముద్ర అయినా ఇతడు తన కచేరీలలో అడపాదడపా వేగంగా పాడేవాడు.

స్వరకల్పనసవరించు

ఇతడు గాయకుడే కాక వాగ్గేయకారుడు కూడా. ఇతడు 300లకు పైగా తెలుగు, తమిళ, సంస్కృత భాషలలో కృతులు రచించాడు. తన గురువు టైగర్ వరదాచారిపై గౌరవంతో తన కృతులలో "వరదదాస" అనే పదాన్ని తన ముద్రగా వాడుకుకున్నాడు.


ఇతడు స్వరకల్పన చేసిన కొన్ని తెలుగు కృతులు:

కృతి రాగం తాళం
అపరాధములెల్లను గౌరీమనోహరి ఆది
బృందావనలోక కళ్యాణి ఆది
బ్రోచుటకు సమయమిదే బేగడ రూపక
దండపాణి రామప్రియ రూపక
దారినీవలె బేగడ రూపక
ధర్మవతి ధర్మవతి రూపక
ఎందుకీ చపలము పూర్వికళ్యాణి ఆది
సాగర శయన విభో బాగేశ్రీ ఆది
విఘ్నరాజ నన్ను శ్రీరంజని ఆది

అవార్డులుసవరించు

సంగీతరంగంలో చేసిన సేవలకు భారత ప్రభుత్వం ఇతడికి 1974లో పద్మశ్రీతో సత్కరించింది. 1975లో సంగీత నాటక అకాడమీ అవార్డులభించింది. 1976లో మద్రాసులోని ది ఇండియన్ ఫైన్ ఆర్ట్స్ సొసైటీ ఇతడికి "సంగీత కళాశిఖామణి" బిరుదును ఇచ్చింది. ఇతడు మద్రాసు సంగీత అకాడమీ నిపుణుల కమిటీ సభ్యుడిగా ఉన్నాడు. 1984-85 సంవత్సరానికి మద్రాసు సంగీత అకాడమీ సంగీత కళానిధి పురస్కారానికి ఇతని పేరు పరిశీలించింది కానీ ఇతనికి ఆ పురస్కారం దక్కలేదు.

మరణంసవరించు

ఇతడు తన 61వ యేట 1984, ఏప్రిల్ 27వ తేదీన దీర్ఘవ్యాధితో బాధపడుతూ మరణించాడు.

మూలాలుసవరించు

బయటి లింకులుసవరించు