ఎటో వెళ్ళిపోయింది మనసు
గౌతం మీనన్ దర్శకత్వంలో 2012 డిసెంబరు 14 న విడుదలైన ప్రేమకథా చిత్రం ఎటో వెళ్ళిపోయింది మనసు. నాని కథానాయకుడిగా,, సమంత కథానాయికగా తెరకెక్కనున్న ఈ చిత్రానికి సంగీత దర్శకత్వం ఇళయరాజా అందించారు. తమిళంలో "నీదానే ఎన్ పొన్వసంతం' గా ఈ చిత్రం ద్విభాషా చిత్రంగా రూపొందింది. అందులో తమిళ నటుడు జీవా నాని నటించిన వరుణ్ పాత్రను పొషించగా, నిత్య పాత్రను సమంత పొషించింది. ఈ చిత్రం తెలుగులో భారీ అంచనాలతో విడుదలై బాక్సాఫీసు వద్ద మంచి విజయాన్ని సాధించింది.
ఎటో వెళ్ళిపోయింది మనసు | |
---|---|
![]() | |
దర్శకత్వం | గౌతం వాసుదేవ మీనన్ |
రచన | గౌతం మీనన్ |
నిర్మాత | గౌతం మీనన్ రేష్మా వెంకట్ సోమసుందరం సీ.కళ్యాణ్ సీవీ రావు |
తారాగణం | నానీ కృష్ణుడు (నటుడు) సమంత |
ఛాయాగ్రహణం | ఎంఎస్ ప్రభు |
కూర్పు | ఆంటొనీ |
సంగీతం | ఇళయరాజా |
నిర్మాణ సంస్థలు | ఫోటాన్ కథాస్ తేజా సినిమా |
విడుదల తేదీ | 2012 |
దేశం | భారతదేశం |
భాష | తెలుగు |
కథసవరించు
తన స్నేహితుడు ప్రకాష్ (కృష్ణుడు) తో కలిసి వరుణ్ (నాని) ఇంజినీరింగ్ కాలేజ్ లో చేరుతాడు. అక్కడ జరుగుతున్న నృత్యప్రదర్శనలో తన చిన్ననాటి స్నేహితురాలు నిత్య (సమంత)ను చూస్తాడు. తన దృష్టిలో పడాలని స్టేజిపై తనకోసం ఒక పాట పాడుతాడు. తర్వాత వాళ్ళిద్దరూ కలిసి తమ చిన్ననాటి రోజులను గుర్తు చేసుకుంటారు. 8 ఏళ్ళ వయసులో స్నేహితులైన నిత్య, వరుణ్ లు చిన్నచిన్న గొడవల వల్ల విడిపోతారు. మళ్ళీ పదోతరగతిలో వీళ్ళిద్దరూ అనుకోకుండా ఒకే స్కూలులో చేరుతారు. మొదట బెట్టు చూపినా, నిత్య మళ్ళీ వరుణ్ తో మునుపటిలగే ఒకరితో ఒకరు స్నేహంగా ఉంటారు. విద్యార్థుల లీడర్ గా ఎన్నికైన నిత్య మరో లీడర్ దీపక్ తో స్నేహంగా మెలుగుతుండటం వరుణ్, నిత్యల స్నేహానికి అనుకోని ముగింపుని ఇస్తుంది.
ఒకే కాలేజ్ లో కలిసిన వీరిద్దరూ గతాన్ని మరచి మళ్ళీ స్నేహంగా ఉండటం ప్రారంభిస్తారు. కాలక్రమేణా వీరి స్నేహం ప్రేమగా మారుతుంది. ఇరువురి మధ్య గల ప్రేమ హాయిగా సాగుతున్న సమయంలో నిత్య ఇండియా వదిలి హాలిడే ట్రిప్ కి వెళ్ళడంతో వరుణ్ ఒంటరిగా కాలం గడుపుతుంటాడు. ఇంతలో తన కుటుంబ ఆర్థిక పరిస్థితులను అర్ధం చేసుకున్న వరుణ్ చదువుల్లో శ్రద్ధను కనబరుస్తూ, CAT పరీక్షకు ప్రిపేర్ అవుతుంటాడు. విదేశాలనుంచి తిరిగివచ్చిన నిత్య వరుణ్ తనను సరిగ్గా పట్టించుకోవట్లేదని గ్రహిస్తుంది. మొదట వరుణ్ పరిస్థితిని అర్ధం చేసుకున్న నిత్య వరుణ్ IIM కొజికోడ్ కి వెళ్తున్నాడని తెలుసుకుంటుంది. తను కూడా వస్తానని వరుణ్ ని అడిగినప్పుడు వరుణ్ దానికి ఒప్పుకోడు. వీరిరువురి గొడవ పెద్దదై నిత్య మళ్ళీ వరుణ్ తో విడిపోతుంది. IIMలో సీటు దక్కించుకున్న వరుణ్ అక్కడడికి వెళ్తాడు.
IIMలో చదువు పూర్తి చేసుకుని ఉద్యోగం సంపాదించిన వరుణ్ నిత్యను కలవాలని తమిళనాడులోని మనప్పాడ్ కి వెళ్తాడు. సునామీ రిలీఫ్ క్యాంపులో టీచర్ గా పనిచేస్తున్న నిత్యతో మాట్లాడాలని ఎంతో ప్రయత్నిస్తాడు. ఒకరోజు నిత్య వరుణ్ ఉనికిని భరించలేక తను నీతో విడిపోయాక చాలా ఆనందంగా ఉన్నానని వరుణ్ తో చెప్తుంది. వరుణ్ ఓపిక నశించి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. ఇలా జరిగిన కొన్ని రోజుల తర్వాత నిత్య వరుణ్ ని తన అక్క పెళ్ళికి రమ్మని పిలుస్తుంది. అదే సమయంలో వరుణ్ కూడా తను రాధిక అనే అమ్మాయిని పెళ్ళి పెళ్ళిచేసుకోబోతున్న విషయాన్ని నిత్యతో చెప్తాడు. వరుణ్ పెళ్ళి చేసుకోబోతున్నాడని తెలిసి నివ్వెరబోయిన నిత్య తను వరుణ్ ని సరిగ్గా అర్ధం చేసుకోలేకపోయానని, అందుకే వరుణ్ తనకు దూరమయ్యాడని తన అక్కతో వాపోతుంది నిత్య.
ఐతే వరుణ్ నిశ్చితార్ధానికి నిత్య రావడం వరుణ్ కి ఎందుకో తను ఇంకా నిత్యను ప్రేమిస్తున్నానన్న భావన కలుగుతుంది. తన తండ్రి దగ్గరికి వెళ్ళిన వరుణ్ కి తన తండ్రి నిత్యనే పెళ్ళిచేసుకోమని, నిత్యను మనసులో ఉంచుకుని రాధికను పెళ్ళి చేసుకుంటే అది వరుణ్ కీ, రాధికకీ ఎంతో నష్టాన్ని కలిగిస్తుందని చెప్తాడు. పెళ్ళి ముహూర్తానికి ఇంకా గంట ఉందనగా వరుణ్ నిత్య ఇంటికి వెళ్తాడు. అక్కడ కుమిలిపోతున్న నిత్యను ఎదుర్కున్న వరుణ్ కిందకి వెళ్ళి నిత్య తల్లిదండ్రులతో నిత్యను ప్రేమించినంతగా తను ఇంకే అమ్మాయినీ ప్రేమించలేనని, అందుకే జరుగుతున్న పెళ్ళిని ఆపి ఇక్కడికి వచ్చానని చెప్పి వెళ్ళిపోతాడు. వరుణ్ వెళ్ళిపోతుండగా నిత్య తనను ఆపి, తన తప్పుకు క్షమాపణ అడిగి వరుణ్ తో కలిసిపోతుంది. ఆపై వారిద్దరూ పెళ్ళైన తర్వాత ఒకరినొకరు ప్రేమించుకుంటూ, ఒకరితో ఒకరు గొడవ పడుతూ కలిసి సంతోషంగా బతికారణ్న ఒక సందేశంతో ఈ కథ ముగుస్తుంది.
తారాగణంసవరించు
- నాని - వరుణ్ కృష్ణ
- సమంత - నిత్య
- కృష్ణుడు - ప్రకాష్
- జీవా - ట్రైనులో వరుణ్ తోటిప్రయాణికుడు (అతిథి పాత్ర)
- విద్యుల్లేఖ రామన్- జెన్నీ
- శ్రీరంజని - నిత్య తల్లి.
నిర్మాణంసవరించు
జనవరి 2011 లో బెల్లంకొండ సురేశ్ గౌతం మీనన్ తో రాం, సమంతలు తారాగణంగా తెలుగు-తమిళ సినిమా తీయనున్నట్టు ప్రకటించాడు. మే 2011 నుండి షూటింగ్ ఉంటుందని ప్రకటన చేసాడు.[1] తరువాత ఈ సినిమా నుండి రాం తప్పుకోవడం, నానీని కథానాయకుడిగా అనుకోవడం జరిగాయి. తమిళ రూపాంతరంతో పాటూ తెలుగు సినిమా నిర్మాణం ఆగస్టు 2011 లో మొదలయింది.[2]
పాటలుసవరించు
క్రమసంఖ్య | పేరు | నేపధ్య గానం | నిడివి |
---|---|---|---|
1. | "కోటి కోటి" | కార్తీక్ | 05:34 |
2. | "నచ్చలేదు మావా" | సూరజ్ జగన్, కార్తీక్ | 06:00 |
3. | "యెంతెంత దూరం nannu" | కార్తీక్ | 04:19 |
4. | "యేది యేది" | షాన్, రమ్య | 06:07 |
5. | "అర్ధమయిందింతే ఇంతేనా" | యువన్ శంకర్ రాజా | 04:06 |
6. | "అటు ఇటు" | సునిధి చౌహాన్ | 03:55 |
7. | "ఇంతకాలం" | రమ్య | 05:57 |
8. | "లాయి లాయి" | ఇళయరాజా, బేల షెండే | 06:02 |
పురస్కారాలుసవరించు
- నంది పురస్కారం - 2012 నంది పురస్కారాలులో ఉత్తమ నటుడు (నాని), ఉత్తమ నటి (సమంత), ఉత్తమ సంగీత దర్శకుడు (ఇళయరాజా), ఉత్తమ పాటల రచయిత (అనంత శ్రీరామ్-కోటి కోటి తారల్లోనా), ప్రత్యేక బహుమతి విభాగంలో అవార్డులు వచ్చాయి.[3][4][5][6]
మూలములుసవరించు
- ↑ "గౌతం మీనన్ రాం లతో ద్విభాషా చిత్రం". Sify. 2011-01-10. Archived from the original on 2011-01-14. Retrieved 2011-10-03.
- ↑ "తొలి వీడియో ప్రకటన".
- ↑ "Nandi Awards: Here's the complete list of winners for 2012 and 2013". hindustantimes.com/ (in ఇంగ్లీష్). 2017-03-01. Retrieved 30 June 2020.
- ↑ మన తెలంగాణ, ప్రత్యేక వార్తలు (1 March 2017). "బెస్ట్ హీరో అవార్డ్ ను సొంతం చేసుకున్న బాహుబలి ప్రభాస్..!!". Archived from the original on 26 June 2020. Retrieved 30 June 2020.
- ↑ సాక్షి, ఎడ్యుకేషన్ (2 March 2017). "నంది అవార్డులు 2012, 2013". www.sakshieducation.com. Archived from the original on 26 June 2020. Retrieved 30 June 2020.
- ↑ నవ తెలంగాణ, నవచిత్రం (2 March 2017). "2012, 2013 నంది అవార్డుల ప్రకటన". NavaTelangana. Archived from the original on 26 June 2020. Retrieved 30 June 2020.