ఎన్.వెంకటసుబ్బయ్య

స్వాతంత్ర్య సమరయోధుడు, ఆంధ్రప్రదేశ్ శాసనమండలి అధ్యక్షుడు.

నివర్తి.వెంకటసుబ్బయ్య స్వాతంత్ర్య సమరయోధుడు, ఉమ్మడి మద్రాసురాష్ట్ర మాజీ శాసనసభ్యుడు, ఆంధ్రప్రదేశ్ శాసనమండలి మాజీ అధ్యక్షుడు.

నివర్తి వెంకటసుబ్బయ్య
ఎన్.వెంకటసుబ్బయ్య


పదవీ కాలం
1974-1978
ముందు తోట రామస్వామి
తరువాత సయ్యద్ ముఖాసిర్‌షా

పదవీ కాలం
1958-1964
1968-1978

ఉమ్మడి మద్రాసు రాష్ట్ర శాసనసభ సభ్యుడు
ప్రస్తుత పదవిలో
అధికార కాలం
1946-1952

వ్యక్తిగత వివరాలు

జననం (1910-11-24)1910 నవంబరు 24
పత్తికొండ ,కర్నూలు జిల్లా
మరణం 1978 మార్చి 28(1978-03-28) (వయసు 67)
మతం హిందూ

విశేషాలు మార్చు

నివర్తి వెంకటసుబ్బయ్య 1910, నవంబర్ 24వ తేదీ కర్నూలు జిల్లా, పత్తికొండలో జన్మించాడు.[1] ఇతడు మద్రాసు విశ్వవిద్యాలయం నుండి బి.ఎ. పట్టా పొందాడు. మహాత్మా గాంధీ పిలుపును అందుకుని ప్రభుత్వోద్యోగానికి రాజీనామా చేసి జాతీయోద్యమంలో పాల్గొన్నాడు. స్వాతంత్ర్యోద్యమ కాలంలో అఖిల భారత కాంగ్రెస్ కమిటీ సభ్యునిగా, ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ ప్రధాన కార్యదర్శిగా, ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ కార్యవర్గ సభ్యునిగా టంగుటూరి ప్రకాశం, పట్టాభి సీతారామయ్య, బులుసు సాంబమూర్తి, కొండా వెంకటప్పయ్య వంటి నాయకులతో కలిసి పనిచేశాడు. 1940లో కర్నూలులో వ్యక్తి సత్యాగ్రహంలో పాల్గొని 8 నెలలు అల్లీపురం, వెల్లూరు జైళ్ళలో కఠిన కారాగార శిక్షను అనుభవించాడు. జైలు నుంచి బయటకు రాగానే మళ్లీ ఉద్యమంలోకి వెళ్లాడు. విద్యార్థులతో కాంగ్రెస్‌ సభ్యులతో రహస్య దళాలను ఏర్పాటు చేశాడు. 1942లో విప్లవోద్యమాన్ని నడిపించడానికి విధి విధానాలను నిర్దేశిస్తూ ఇతడు రూపొందించిన సర్క్యులర్‌ను బ్రిటీష్‌ ప్రభుత్వం నిషేధించింది. ఇతడిని అరెస్టు చేయడానికి ప్రయత్నించడంతో అజ్ఞాతంలోకి వెళ్లిపోయాడు. తర్వాత గాంధీజీ సలహా మేరకు ఇతడు లొంగిపోయాడు.[2]

ఇతడు 1946 నుండి 1952 వరకు ఉమ్మడి మద్రాసు రాష్ట్ర శాసనసభ్యుడిగా ఉన్నాడు. 1958 జూలై 1 నుండి 1964 జూన్ 30 వరకు రాయలసీమ పట్టభద్రుల నియోజకవర్గం నుండి, 1968 జూలై 10 నుండి 1974 జూన్ 30వరకు నామినేటెడ్ సభ్యుడిగా, 1974 జూలై 1 నుండి 1978 మార్చి 28 వరకు శాసనసభ నియోజకవర్గం నుండి మూడు పర్యాయాలు ఆంధ్రప్రదేశ్ శాసనమండలిలో సభ్యుడిగా ఉన్నాడు. 1974 జూలై 2న ఆంధ్రప్రదేశ్ శాసనమండలి అధ్యక్షునిగా ఏకగ్రీవంగా ఎన్నికై 1978 మార్చి 28వరకు ఆ పదవిలో కొనసాగాడు.

ఇతడు 1969-70, 1970-71 సంవత్సరాలలో అంచనాల సమితి సభ్యుడిగా, 1961 ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ విశ్వవిద్యాలయం బిల్లు, 1962 పంచాయితీ సమితి జిల్లాపరిషత్తుల బిల్లులకు విశిష్ట సమితి సభ్యునిగా, 1969-70లలో రాష్ట్ర గ్రంథాలయ సమితి సభ్యుడిగా, 1972-73, 1973-74 సంవత్సరాలలో ప్రభుత్వరంగ సంస్థల సమితి సభ్యుడిగా పనిచేశాడు. 1972-1973 సంవత్సరాలలో రాయలసీమ అభివృద్ధి మండలి అధ్యక్షుడిగా, రాష్ట్ర స్వాతంత్ర్య సమరయోధుల పెన్షన్ పథకం సమితి సభ్యుడిగా, మద్యనిషేధ మండలి సభ్యుడిగా పనిచేశాడు.

కర్నూలు జిల్లాలో సహకార ఉద్యమానికి ఇతడిని ఆద్యుడుగా పేర్కొనవచ్చు. నంద్యాలను ఆధునిక పట్టణంగా తీర్చిదిద్దడంలో ఇతని కృషి ఉంది. మద్రాసు విశ్వవిద్యాలయం, ఆంధ్ర విశ్వవిద్యాలయం, శ్రీ వెంకటేశ్వర విశ్వవిద్యాలయాలకు సెనెట్ సభ్యుడిగా ఇతడు విద్యావ్యాప్తికి కృషి చేశాడు. నంద్యాలలో అనేక విద్యాసంస్థలను నెలకొల్పాడు.

టంగుటూరి ప్రకాశం స్థాపించిన స్వరాజ్య పత్రికలో ఉపసంపాదకుడిగా పనిచేశాడు. హిందూ దినపత్రికకు విలేకరిగా పనిచేశాడు. 1953 నుండి 1955 వరకు నంద్యాల నుండి ఇతడు "మనసీమ" అనే వారపత్రికను ప్రచురించి దానికి సంపాదకుడిగా వ్యవహరించాడు. రాయలసీమను తరతరాల కరువునుండి కాపాడటానికి అనేక పథకాలను, నివేదికలను రచించాడు. "రాయలసీమ స్పీక్స్" అనే ఆంగ్ల గ్రంథాన్ని రచించాడు.

ఇతడు 1974 సెప్టెంబరులో కొలంబోలో జరిగిన 20వ కామన్‌వెల్త్ పార్లమెంటరీ అసోసియేషన్ సదస్సుకు హాజరయ్యాడు.

ఇతడు 1978, మార్చి 28వ తేదీన తన 67వయేట మరణించాడు.

మూలాలు మార్చు

  1. వెబ్ మాస్టర్. "శ్రీ నివర్తి వెంకట సుబ్బయ్య". లెజిస్లేటివ్ కౌన్సిల్, ఆంధ్రప్రదేశ్. Centre for Good Governance. Archived from the original on 15 డిసెంబరు 2018. Retrieved 11 May 2020.
  2. సంపాదకుడు (15 August 2019). "స్వాతంత్ర్య సంగ్రామంలో కందనవోలు". సాక్షి దినపత్రిక. Archived from the original on 15 ఆగస్టు 2019. Retrieved 11 May 2020.