ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ

ఏ.పి.యస్.ఆర్.టి.సి
(ఎ.పి.ఎస్.ఆర్.టి.సి. నుండి దారిమార్పు చెందింది)

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రరోడ్డు రవాణా సంస్థ (ఏ.పి.యస్.ఆర్.టి.సి (APSRTC)) ప్రభుత్వ రంగంలో నడుస్తున్న రోడ్డు రవాణా సంస్థ. రాష్ట్రంలోని జిల్లాలు, పట్టణాలు, గ్రామాలను అనుసంధానించడమే కాక పెద్ద నగరాలలో సిటీ బస్సు సేవలను, పొరుగు రాష్ట్రాలైన తెలంగాణా, కర్ణాటక, తమిళనాడు, పాండిచ్చేరి, మహారాష్ట్ర, ఒడిషా, చత్తీస్‌ఘడ్, గోవా లకు బస్సులు నడుపుతుంది.

ఏ.పి.యస్.ఆర్.టి.సి
రకంప్రభుత్వ రంగం
పరిశ్రమరవాణా సేవలు
స్థాపన1932 జూన్ (నిజాం రాష్ట్ర రైల్వే - రోడ్డు రవాణా శాఖ)
ప్రధాన కార్యాలయం,
సేవ చేసే ప్రాంతము
ఆంధ్రప్రదేశ్
కీలక వ్యక్తులు
ద్వారకా తిరుమల రావు, ఎం.డి
ఉత్పత్తులుప్రయాణ సేవ , సరకు రవాణా
ఉద్యోగుల సంఖ్య
50,406
మాతృ సంస్థఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం
వెబ్‌సైట్https://www.apsrtc.ap.gov.in/
నందమూరి తారక రామారావు పరిపాలనా భవనం, విజయవాడ

చరిత్ర

మార్చు
 
1932లో నిజాం సర్కారు ప్రవేశపెట్టిన మొట్టమొదటి ఆర్టీసి బస్సు 1932లో నిజాం సర్కారు ప్రవేశపెట్టిన మొట్టమొదటి ఆర్టీసి బస్సు

తెలంగాణాను నైజాం ప్రభువులు పాలించే రోజులలో కోస్తా, రాయలసీమ ప్రాంతాలు మద్రాసు రాష్ట్రంలో ఉండేవి. నైజాంలో అప్పటికే "నిజాం రాష్ట్ర రైల్వే - రోడ్డు రవాణా శాఖ" అనే సంస్థ రైళ్ళు నడుపుతోంది. అందులో భాగంగానే 1932 జూన్‍లో "రోడ్ ట్రాన్స్‌‍పోర్టు" ప్రారంభించారు. మూడులక్షల తొంబై మూడువేల రూపాయల మూల పెట్టుబడితో, మూడు డిపోలు, 27 బస్సులు, 166 మంది కార్మికులతో అది ప్రారంభమైంది.[1] 1951 నవంబరు 1 నుండి 1958 వరకు హైదరాబాదు రాష్ట్ర రవాణా సంస్థగా ఉండేది.

1999 లో ప్రపంచంలో ప్రభుత్వ రంగంలో నడుస్తున్న అతి పెద్ద రోడ్డు రవాణా సంస్థగా గిన్నిస్ బుక్ లో నమోదైంది.[2] 1932లో 27 బస్సులతో ప్రారంభమైన ఈ రవాణా సంస్థ 2017లో 11,678 బస్సులతో ప్రతి రోజు 72 లక్షల మందిని, 55,628 సిబ్బంది సహాయంతో రవాణా చేస్తుంది.

తెలంగాణా, కోస్తా ఆంధ్ర, రాయలసీమ ప్రాంతాల్ని ఏకం చేస్తూ ఆంధ్ర ప్రదేశ్ అవతరణ జరిగాయి. కోస్తా, రాయలసీమ ప్రాంతాల్లో ప్రెవేటు రవాణాను జాతీయం చేస్తూ 1958 జనవరి 11న "ఆంధ్రప్రదేశ్ రోడ్దు రవాణా సంస్థ" ఏర్పాటైంది. ఆంధ్ర ప్రాంతంలో దశల వారీగా ప్రైవేటు రవాణాను జాతీయం చేశారు. 1950లో కేంద్రప్రభుత్వం ఆర్.టి.సి. చట్టం చేసింది. దాని ప్రకారం ఆర్టీసీలో రాష్ట్రం, కేంద్రం 2:1 నిష్పత్తిలో పెట్టుబడి పెట్టాలి. ఆంధ్రప్రదేశ్ విషయానికొచ్చేసరికి 1988 వరకు ఈ నిష్పత్తి కొనసాగింది. ఆ తర్వాత కేంద్రం, రాష్ట్రం కూడా ఆర్టీసీకి నిధులు కేటాయింపు నిలిపి వేశాయి. అంత వరకు రాష్ట్రప్రభుత్వం 140 కోట్లు, కేంద్రం 70 కోట్లు కలపి మొత్తం 210 కోట్ల రూపాయలు ఆర్టీసీకి పెట్టుబడి పెట్టాయి. 1989నుంచి ఈ పెట్టుబడుల కోసం ఆర్టీసీ అప్పులు చేయడం ప్రారంభించింది.

ఆంధ్రప్రదేశ్ నుండి తెలంగాణా వేరుపడడంతో సంస్థ పరిధి నవ్యాంధ్రప్రదేశ్ కు పరిమితంకాగా, తెలంగాణాలో తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ 2015 మే 14న ఏర్పడింది.[3]

సంస్థ లక్ష్యాలు

మార్చు
ముఖ్య బాధ్యతలు
 1. ప్రయాణీకులకు పరిశుభ్రమైన, అనుకూలమైన, సమయానుగుణమైన ప్రయాణ సదుపాయాలను, సరసమైన ఛార్జీలతో అందించడం
 2. ఆర్థికంగానూ, మానవతా యుతంగానూ ఉద్యోగులకు సంతృప్తి కలిగే విధానాలు
 3. ఆర్థిక స్వయంసమృద్ధితో నిర్వహణ, ప్రగతి
 4. సమాజంలో ఉన్నతమైన స్థానాన్ని, గౌరవాన్ని సాధించడం
విధానాలు
 1. వ్యాపారాన్ని నిజాయితీగా, ప్రావీణ్యంగా, సత్ఫలితాలనిచ్చేలా నిర్వహించడం
 2. తమ వ్యాపారానికి పట్టుకొమ్మలైన వినియోగదారులను (ప్రయాణీకులను) గౌరవిస్తూ వారికి సంతృప్తి కలిగేలా నాణ్యమైన సేవలను అందించడం
 3. సాంకేతికంగాను, ఆర్థికంగాను నూతన విధానాలను పరిశీలించి అనుసరించడం
 4. ప్రణాళికాబద్ధంగా, తగు శిక్షణతోను, సహకారంతోను ఉద్యోగుల ఉత్పాదకతను, నైపుణ్యాన్ని అభివృద్ధి చేయడం
 5. సంస్థ ఉద్యోగుల, వారి కుటుంబాల శ్రేయస్సుకై కృషి చేస్తూ సంస్థకు వారి తోడ్పాటును పెంపొందించుకోవడం
 6. రాష్ట్ర, కేంద్ర ప్రభుత్వాల పెట్టుబడికి తగిన ప్రతిఫలాన్ని అందిస్తూ, స్వయం సమృద్ధిని సాధించడం
 7. పర్యావరణానికి, సమాజానికి అవసరమైన విషయాలపట్ల ప్రత్యేక శ్రద్ధ. కాలుష్య నివారణ
 8. వ్యాపారంలో ప్రభుత్వ విధానాలను సంపూర్ణంగా అనుసరించడం
 9. బస్సు రావాణా వ్యవస్థ నిర్వహణలో ఉన్నతమైన స్థాయిని సాధించి సమాజంలో సముచితమైన గౌరవమైన స్థానాన్ని పొందడం

ప్రధాన గణాంకాలు

మార్చు
 
పండిట్ నెహ్రూ బస్ స్టేషన్ విజయవాడ
 
ద్వారకా బస్ స్టేషన్ విశాఖపట్నం
 
2000 దశకంలో హైదరాబాదు, విజయవాడ, విశాఖపట్నం నగరాల్లో నడిచిన మెట్రో బస్సులు
 • డిపోలు:129
 • విభాగాలు: 12 రీజియన్లు, 4 జోనులు
 • వాహనాలు: 11,789
 • ఉద్యోగులు: 50,406
 • బస్సు స్టేషన్లు: 423
 • బస్సు షెల్టర్లు: 274
 • సగటు రోజు ప్రయాణీకులు: 75.99లక్షలు
 • మొత్తం రూట్లు: 3800
 • కలుపుతున్న గ్రామాలు: 14,123
 • ఇంకా చేరని గ్రామాలు: 3,669
 • సమయ పాలన (Punctuality) : 94.00%

వనరులు[4]

సేవలు

మార్చు
 • సీటు ముందస్తు కేటాయింపు.

ఎక్కడి నుండైనా ఎక్కడవరకు అనే పద్ధతిలో 3585 సర్వీసులకు సీటు ముందస్తు కేటాయింపు (రిజర్వేషన్) చేసుకొనే సదుపాయం 111 బస్ స్టేషన్లు, 2051 ఏజెంట్ల ద్వారా అందుబాటులో వుంది. ఆన్లైన్ లో సంస్థ వెబ్సైట్ [5] ద్వారా, ప్రైవేట్ సంస్థలైన అభిబస్, రెడ్ బస్, పేటిఎమ్ ద్వారా కూడా ఈ సౌకర్యం అందుబాటులో వుంది. వెయిట్ లిస్టు సౌకర్యం కూడా వుంది. [6]

 • బస్సు ప్రత్యక్ష స్థానాన్ని చూపించే సౌకర్యం గల మొబైల్ యాప్
 • కాగిత రహిత సేవలు (ఇటికెట్ ద్వారా ప్రయాణం)
 • 24X7 కేందీకృత సమాచార, ఫిర్యాదు సేవలకు కాల్ సెంటర్ ఫోన్ నంబరు 0866-2570005
 • సరకు రవాణా [7]

జాతీయ స్థాయి అవార్డు

మార్చు

డిజిటల్‌ విధానాలను సమర్థంగా అమలు చేస్తోన్నందుకు ఇచ్చే డిజిటల్‌ టెక్నాలజీ సభ అవార్డుకు ఆర్టీసీ వరుసగా నాలుగో ఏడాదికి కూడా ఎంపికైంది. ఈసారి జాతీయ స్థాయిలో పలు ప్రభుత్వ సంస్థలతో పోటీపడి సంస్థ ఉపకరణాల విభాగంలో ఈ అవార్డు సాధించింది.[8][9] ఈ మేరకు 2022 ఫిబ్రవరి 22న ఏపీఎస్ఆర్టీసీ ఎండీ ద్వారకా తిరుమల రావు వర్చువల్ విధానం ద్వారా అవార్డును అందుకున్నారు.

ఇవి కూడా చూడండి

మార్చు

మూలాలు

మార్చు
 1. సాక్షి, విద్య (28 November 2015). "రవాణా సౌకర్యాలు". www.sakshieducation.com. Archived from the original on 7 December 2019. Retrieved 7 December 2019.
 2. "ఆర్కైవ్ నకలు". Archived from the original on 2007-07-17. Retrieved 2007-07-09.
 3. "Division of APSRTC to begin from May 14". times of india. Retrieved 2018-06-12.
 4. "APSRTC at a glance" (PDF). Retrieved 2022-01-24.
 5. "APSRTC OPRS-web". Retrieved 2022-02-24.
 6. "APSRTC IT initiatives". Retrieved 2022-02-24.
 7. "APSRTC logistics". Archived from the original on 2022-02-24. Retrieved 2022-02-24.
 8. "APSRTC: ఏపీఎస్‌ ఆర్టీసీకి జాతీయ స్థాయి అవార్డు". EENADU. Retrieved 2022-02-22.
 9. "AMD Presents Digital Technology Sabha Excellence Awards – Day 1". Express Computer. Retrieved 2022-02-22.

బయటి లింకులు

మార్చు