కంగనా రనౌత్

భారతీయ చలనచిత్ర కథానాయిక

కంగనా రనౌత్ (జననం 1987 మార్చి 23) ప్రముఖ భారతీయ నటి. బాలీవుడ్ లో అతి ఎక్కువ పారితోషికం తీసుకునే నటుల్లో ఈమె ఒకరు. ఉన్నది ఉన్నట్టు మాట్లాడే విషయంలోనూ, ఫ్యాషన్ గా ఉండే నటిగానూ మీడియాలో ఎక్కువ ప్రసిద్ధమయ్యారు కంగనా. ఆమె ఇప్పటివరకూ మూడు జాతీయ పురస్కారాలు, నాలుగు ఫిలింఫేర్ పురస్కారాలు అందుకున్నారు.

కంగనా రనౌత్
కంగనా రనౌత్


అధికారంలో ఉన్న వ్యక్తి
అధికార ప్రారంభం
10 జూన్ 2024
ముందు ప్రతిభా సింగ్
నియోజకవర్గం మండి

వ్యక్తిగత వివరాలు

జననం (1987-03-23) 1987 మార్చి 23 (వయసు 37)
భంబ్లా గ్రామం, మండి జిల్లా, హిమాచల్ ప్రదేశ్, భారతదేశం
రాజకీయ పార్టీ భారతీయ జనతా పార్టీ
వృత్తి
 • నటి
 • నిర్మాత
 • రాజకీయ నాయకురాలు

హిమాచల్ ప్రదేశ్ లోని భంబ్లా అనే పల్లెటూరిలో జన్మించారు కంగనా.  ఆమె  తల్లిదండ్రుల గట్టి పట్టుదల ప్రకారం డాక్టర్ అవ్వాలని  అనుకునేవారు ఆమె చిన్నప్పుడు. కానీ తన 16వ ఏట తన  కెరీర్ తానే నిర్మించుకోవాలనే సంకల్పంతో ఢిల్లీ వెళ్ళిపోయారు. ఆ  తరువాత కొన్నాళ్ళకు మోడల్ అయ్యారు కంగనా. నాటక దర్శకుడు అరవింద్ గౌర్ శిక్షణలో నటన నేర్చుకున్న ఆమె 2006లో గాంగ్ స్టర్ సినిమాతో తెరంగేట్రం చేశారు. ఆ సినిమాకి ఫిలింఫేర్ ఉత్తమ నటి డెబ్యూ పురస్కారం అందుకున్నారామె. వోహ్ లమ్హే (2006), లైఫ్ ఇన్ ఎ.. మెట్రో (2007), ఫ్యాషన్ (2008) సినిమాల్లోని ఆమె నటనకు ప్రేక్షకుల, విమర్శకుల ప్రశంసలు అందుకున్నారు కంగనా. ఈ మూడు సినిమాలకు జాతీయ, ఫిలింఫేర్ ఉత్తమ సహాయ నటి పురస్కారాలు అందుకున్నారు ఆమె.

రాజ్: ది మిస్టరీ కంటిన్యూస్ (2009), వన్స్ అపాన్ ఎ టైమిన్ ముంబై (2010) వంటి హిట్ సినిమాల్లో నటించారు కంగనా. మానసిక ఇబ్బందులతో ఉండే పాత్రల్లో ఎక్కువగా నటించడంతో కొన్ని విమర్శలు ఎదురైనా, ఆమె నటనకు మాత్రం ప్రశంసలే లభించాయి. 2011లో మాధవన్ తో కలసి నటించిన తను వెడ్స్ మను సినిమా మంచి విజయం సాధించింది. ఆ తరువాత ఆమె గ్లామర్ పాత్రల్లో నటించిన కొన్ని సినిమాలు ఫ్లాప్ అయ్యాయి. హృతిక్ సరసన ఆమె నటించిన క్రిష్ 3 (2013) సినిమా బాలీవుడ్ లో అత్యంత ఎక్కువ వసూళ్ళు సాధించిన సినిమాల్లో  ఒకటిగా నిలిచింది. ఆ తరువాత ఆమె నటించిన క్వీన్ (2014) సినిమాలో ఆమె నటించిన పాత్రకు మంచి గుర్తింపు రావడమే కాక జాతీయ, ఫిలింఫేర్ ఉత్తమ నటి పురస్కారాలు అందుకున్నారు కంగనా. 2015లో తను వెడ్స్ మను రిటర్న్స్ సినిమాలో ద్విపాత్రాభినయం చేశారు ఆమె. ఈ సినిమా కమర్షియల్ గా పెద్ద హిట్ అయింది. ఈ సినిమాలోని ఆమె నటనకు ఫిలింఫేర్ విమర్శకుల పురస్కారం, వరుసగా రెండో జాతీయ ఉత్తమ నటి పురస్కారాలు లభించాయి.

తొలినాళ్ళ జీవితం, నేపథ్యం

మార్చు

23 మార్చి 1986న హిమాచల్  ప్రదేశ్ మండి జిల్లాలోని భంబ్లా  అనే చిన్న పట్టణం (ప్రస్తుతం సురజ్ పూర్) లో రాజ్ పుత్ కుటుంబంలో  జన్మించారు కంగనా.[1][2][3][4] ఆమె తండ్రి అమర్ దీప్ రనౌత్  వ్యాపారవేత్త, తల్లి ఆశా పాఠశాలలో ఉపాధ్యాయిని.[5] ఆమెకు అక్క రంగోలీ, తమ్ముడు అక్షత్  ఉన్నారు.[6][7] కంగనా ముత్తాత సంజు సింగ్ రనౌత్ ఎమ్మెల్యేగా వ్యవహరించారు. ఆమె తాత  ఐ.ఎ.ఎస్ అధికారిగా పనిచేశారు.[8] భంబ్లాలోని వారి పూర్వీకుల హవేలీలో ఉమ్మడి కుటుంబంలో పెరిగారు కంగనా.[7][9]

చిన్నప్పట్నుంచీ పట్టుదల గల వ్యక్తిత్వం  తనదని వివరిస్తారు కంగనా. తన తండ్రి తమ్ముడికి ప్లాస్టిక్ గన్ తెచ్చి, తను ఆడుకోవడానికి మామూలు బొమ్మలు తెస్తే ఈ తేడా చూపొద్దనీ అబ్బాయిలు ఆడుకునేవాటితో తానూ ఆడుకుంటానని చెప్పవారని ఒక ఇంటర్వ్యూలో వెల్లడించారు ఆమె.[10] అందరు ఆడపిల్లలూ వేసుకునే బట్టలు కాక, తన కంటూ విలక్షణమైన ఫ్యాషన్ సృష్టించుకునేవారట కంగనా.[9][10] చండీగఢ్ లోని డిఎవి పాఠశాలలో చదువుకున్నారు ఆమె. సైన్స్ బాగా ఇష్టంగా చదివేవారు. చదువులో ఎప్పుడు ముందు ఉండేవారట కూడా.[11][12] మొదట్లో తన తల్లిదండ్రుల పట్టుదల ప్రకారం డాక్టర్ అవ్వాలని అనుకునేవారు ఆమె.[13] అయితే 12వ క్లాస్ చదివేటప్పుడు ఒక యూనిట్ టెస్ట్ లో కెమిస్ట్రీ సబ్జెక్టులో ఫెయిల్ కావడంతో తన డాక్టర్ కలల్ని వదిలేసుకుని వైద్య విద్యకు ఎంట్రెన్స్ పరీక్ష అయిన అఖిలభారత వైద్య పరీక్షకు హాజరు కూడా కాలేదు కంగనా.[13] తన 16వ ఏట ఢిల్లీకి  నివాసం మార్చారు ఆమె.[6][14] వైద్య విద్య చదవనని ఆమె తీసుకున్న నిర్ణయంతో ఆమె తల్లిదండ్రులు తీవ్ర నిరాశకు గురయ్యారు. లక్ష్యం లేకుండా ఉంటే తనకు నచ్చదని ఆమెపై వత్తిడి తీసుకొచ్చేవారట ఆమె తండ్రి.[10]

ఢిల్లీ వెళ్ళాకా ఏం పనిచేద్దామా అని అనుకుంటూ ఉండగా, ఎలైట్ మోడలింగ్ ఏజెన్సీ వారు తమకు మోడలింగ్ చేయమని ఆమెను అడిగారు.[5][14] దాంతో కొన్నిరోజులు మోడలింగ్ చేసిన ఆమె ఆ వృత్తిలో సృజనాత్మకత  లేదు అని భావించి మానేశారు కంగనా. అస్మితా థియేటర్ గ్రూప్ లో చేరి అరవింద్ గౌర్ వద్ద నటనలో శిక్షణ తీసుకున్నారు కంగనా.[15] గిరీష్ కర్నాడ్ రచించిన ప్రముఖ నాటకం తలెదండాలో కూడా నటించారు ఆమె. అరవింద్ గౌర్ దర్శకత్వంలో ఇండియా హబిటెట్ సెంటర్ లో జరిగిన వర్క్ షాప్ లో ఎన్నో నాటకాల్లో నటించారు కంగనా.[16] ఒక నాటకం జరిగే సమయంలో సహ నటుడు రాకపోవడంతో కంగనా ఆమె పాత్ర, అతని పాత్రా కూడా నటించి అందరి మెప్పులూ పొందారు.[17] ప్రేక్షకుల స్పందన చూసి సినిమాల్లో నటించడానికి నిర్ణయించుకున్నారు ఆమె. దాంతో తన నివాసాన్ని ముంబైకి మార్చారు. అక్కడ ఆశాచంద్రా డ్రామా స్కూల్లో నాలుగు నెలల కోర్సులో చేరారు కంగనా.[18]

ఈ సమయంలో డబ్బు  కోసం ఆమె ఎన్నో కష్టాలు అనుభవించారు కంగనా. తండ్రితో గొడవల కారణంగా ఆయన ఇచ్చే డబ్బు కూడా కాదన్నారు ఆమె. దాంతో చాలారోజులు బ్రెడ్, పచ్చడి మాత్రమే తినేవారట. తర్వాత్తర్వాత తండ్రితో గొడవ పెట్టుకున్నందుకు చాలా బాధపడేవారట.[8][10] ఆమె  సినిమాల్లో నటించడం ఆమె బంధువులకు కూడా ఇష్టం లేదు.[6] అందుకే చాలారోజుల వరకు ఆమెతో వారెవరూ మాట్లాడలేదు.[3][7][10] 2007లో లైఫ్  ఇన్ ఎ.. మెట్రో సినిమా విడుదల సమయంలో తిరిగి వారందరితో కలిశారు కంగనా.[7]

కెరీర్

మార్చు

2004–08: మొదటి సినిమా, గుర్తింపు

మార్చు
 
2006 గ్లోబల్ ఇండియన్ ఫిలిం పురస్కారాల్లో గాంగ్ స్టర్ సినిమాకు ఉత్తమ నటి డెబ్యూ పురస్కారం అందుకుంటున్న సమయంలో మాట్లాడుతున్న కంగనా.[19]

2004లో నిర్మాతలు రమేష్ శర్మ, పహ్లజ్ నిలనిలు కంగనా దీపక్ శివదసని దర్శకత్వంలో ఐ లవ్ యూ బాస్ సినిమాతో తెరంగేట్రం చేస్తారని ప్రకటించారు.[4][20] ఆ తరువాతి ఏడాది ఒక ఏజెంట్ ఆమెను నిర్మాత మహేష్ భట్ కార్యాలయానికి తీసుకెళ్ళగా, అక్కడ దర్శకుడు అనురాగ్ బసుతో పరిచయం అయింది. బసు ఆమెను గాంగ్ స్టర్ సినిమాలో నటించేందుకు ఆడిషన్ చేశారు.[14][21] కానీ ఈ పాత్రకు ఆమె వయసు సరిపోదని భావించిన ఆయన చిత్రాంగద సింగ్ ను చేయమని అడిగారు. కానీ సమయానికి చిత్రాంగద అందుబాటులో లేకపోవడంతో కంగనాతోనే సినిమా చేశారు బసు.[21] దాంతో ఆమె ఐ లవ్ యూ బస్ సినిమా నుండి బయటకు వచ్చేశారు.[20] 2006లో విడుదలైన ఈ సినిమా కమర్షియల్ గానూ, విమర్శనాత్మకంగానూ కూడా మంచి విజయం సాధించింది. ఆమె నటనకు కూడా మంచి గుర్తింపు లభించింది.[22][23] తాగుబోతు పాత్రలో నటించిన కంగనాకు విమర్శకుల నుంచీ ఎన్నో ప్రశంసలు లభించాయి.[24] ఈ సినిమాలోని  ఆమె నటనకు ఫిలింఫేర్ ఉత్తమ నటి డెబ్యూ పురస్కారంతో పాటు ఇతర పురస్కారాలు కూడా లభించాయి.[25]

వ్యక్తిగత జీవితం

మార్చు

ముంబైలో అక్క రంగోలీతో కలసి ఉంటారు కంగనా. ఆమె అక్క యాసిడ్ దాడి బాధితురాలు.[26] ప్రతి ఏటా ఒకసారి తన స్వంత ఊరు భంబ్లాకు వెళ్తారు ఆమె.[10] స్వామి వివేకానంద బోధనలు పాటించే కంగనా ధ్యానమే దేవునికి అసలైన పూజ అని భావిస్తారు.[27] శాకాహారి అయిన ఆమె 2013లో  పెటా సంస్థ నిర్వహించిన పోల్ లో భారత హాటెస్ట్ వెజిటేరియన్ గా ఎంపికయ్యారు.[28] నటేశ్వర్ నృత్య కళా మందిర్ లో 2009 నుండి కథక్ నేర్చుకుంటున్నారు కంగనా.[29] సినిమా అంటే మక్కువ ఉన్న కంగనా 2014లో న్యూయార్క్ ఫిలిం అకాడమీలో రెండు నెలల స్క్రీన్ ప్లే రైటింగ్ కోర్సులో చేరారు.[30][31] 

సినిమాలు, పురస్కారాలు

మార్చు

కంగనా రనౌత్ సినిమాలు & అవార్డుల జాబితా

మూలాలు

మార్చు
 1. ANI (21 May 2016).
 2. Singh, Prashant (23 March 2013).
 3. 3.0 3.1 Deshmukh, Ashwini (1 July 2011).
 4. 4.0 4.1 Sharma, Chander S. (21 December 2004).
 5. 5.0 5.1 "Biography of Kangna Ranaut" Archived 2014-03-10 at the Wayback Machine.
 6. 6.0 6.1 6.2 Singh, Suhani (5 March 2014).
 7. 7.0 7.1 7.2 7.3 KBR, Upala (3 December 2010).
 8. 8.0 8.1 Gupta, Priya (13 March 2013).
 9. 9.0 9.1 Dobhal, Pratishtha (October 2010).
 10. 10.0 10.1 10.2 10.3 10.4 10.5 Ahmed, Afsana (7 July 2013).
 11. Thind Joy, Jagmita (23 April 2012).
 12. "Kangana Ranaut: Enjoyed the anonymity that came with studying abroad" Archived 2014-03-11 at the Wayback Machine.
 13. 13.0 13.1 Nag, Nilanjana (1 June 2010).
 14. 14.0 14.1 14.2 "Kangana Ranaut bares her soul".
 15. Mahajan, Esha (18 June 2012).
 16. "10 things you didn't know about Kangna Ranaut".
 17. Uniyal, Parmita (22 March 2014).
 18. Sahani, Alaka (23 March 2014).
 19. "Kangana Ranaut new face of 2006".
 20. 20.0 20.1 Shah, Kunal M. (1 April 2009).
 21. 21.0 21.1 "Chitrangada Singh's loss was Kangana Ranaut's gain".
 22. "Kangana Ranaut's impressive Bollywood journey".
 23. "Kangana Ranaut: Box Office Details and Filmography".
 24. Sen, Raja (28 April 2006).
 25. "Kangana Ranaut: celeb bio".
 26. Shetty-Saha, Shubha (10 March 2014).
 27. Gupta, Priya (28 October 2013).
 28. "Kangana Ranaut, Vidyut Jamwal named PETA's hottest vegetarians".
 29. Pinto, Rochelle (13 September 2013).
 30. Gupta, Priya (9 January 2014).
 31. "Don't know if I deserve this stardom: Kangana Ranaut".