మల్లిక్ (గాయకుడు)

(కందుల మల్లికార్జునరావు నుండి దారిమార్పు చెందింది)

మల్లిక్ గా రేడియో శ్రోతలకు పరిచితులైన కందుల మల్లికార్జునరావు (1921-1996) లలిత సంగీత స్వరకర్త.

మల్లిక్ (గాయకుడు)

జీవిత విషయాలు మార్చు

వీరు 1921లో మచిలీపట్నంలో జన్మించారు. మచిలీపట్నంలో క్రోవి సత్యనారాయణ వద్ద సంగీత విద్యాభ్యాసం గావించారు. 1942లో ఆకాశవాణి మదరాసు కేంద్రంలో లలిత సంగీత స్వరకర్తగా (కంపోజర్) చేరి ఆ తరువాత విజయవాడ కేంద్రానికి 1972లో బదిలీపై వచ్చారు.

రజనీకాంతరావు గారి పర్యవేక్షణలో మదరాసు కేంద్రంలో లలితసంగీత విభాగంలో పనిచేసి తర్వాత విజయవాడకు బదిలీ అయ్యారు. మదరాసు, హైదరాబాదు, విజయవాడ కేంద్రాలలో 38 సంవత్సరాలు అవిశ్రాంతంగా పనిచేసి, 1981లో పదవీ విరమణ చేశారు.

కళారంగం మార్చు

లలిత సంగీత విభాగంలో సీనియర్ గ్రేడ్ మ్యూజిక్ కంపోజర్ గా పనిచేశారు. సినీరంగంలో కొంతకాలం పనిచేసి కీర్తి గడించారు. వెంపటి చినసత్యంగారితో కలిసి నృత్య నాటికలకు సంగీతం సమకూర్చారు. జానపద, లలిత సంగీత బాణీలలో తనదైన ముద్రవేసి పాడేవారు. స్వరపరచేవారు. లలిత సంగీతం ఆడిషన్ బోర్డు మెంబరుగా ఆకాశవాణికి సలహా సంప్రదింపులు అందించారు. భక్తిరంజని కార్యక్రమాలకు వీరు కొత్త ఒరవడి పెట్టారు.

అదిగో అల్లదిగో హరివాసము, తందనాన భళా తందనాన అన్నమయ్య కీర్తనలు వీరు పాడి శ్రోతలను మంత్రముగ్ధులను చేసేవారు.

డా.వెంపటి చిన సత్యంగారి బృందంలో ఎంతో కాలం గాత్రసహకారం అందించారు. నర్తకీమణులు రాజసులోచన,శోభానాయుడు,మంజుభార్గవి, చంద్రకళ, కొత్తపల్లి పద్మ, రత్నపాప మొదలగువారి నృత్యప్రదర్శనలకు గాత్రసహకారం అందించారు. శ్రీనివాస కల్యాణం, చండాలిక, శ్రీకృష్ణ పారిజాతం, మోహినీ భస్మాసుర, వాల్మీకి మొదలైన ఎన్నో నృత్య రూపకాలకు సంగీతం సమకూర్చారు.

మల్లిక్ బంగారుపాప, భాగ్యరేఖ, లవకుశ, వింధ్యరాణి, సంపూర్ణ రామాయణం, భక్త శబరి, జయభేరి, చరణదాసి చిత్రాలలో పాడారు. తమిళ చలనచిత్రరంగంలో చంద్రలేఖ అనే తమిళచిత్రానికి తొలిసారిగా నేపథ్యగానం చేశారు.

1952 నుండి 1993 వరకు తిరుమల తిరుపతి దేవస్థానం ఆస్థాన విద్వాంసులుగా వ్యవహరించారు. ప్రతియేటా అన్నమాచార్య ఉత్సవాలలో పాల్గొన్నారు.

మల్లిక్ స్వరపరచిన పాటలు మార్చు

  1. అదివో అల్లదివో శ్రీహరివాసము (అన్నమాచార్య కీర్తన) - మధ్యమావతిలో ఇప్పుడు ప్రచారంలో ఉన్నబాణీ.
  2. తందనాన ఆహి (అన్నమాచార్య కీర్తన) - బౌళిలో ఇప్పుడు ప్రచారంలో ఉన్న బాణీ
  3. గురుతెరిగిన దొంగ కూగూగు (అన్నమాచార్య కీర్తన) - మోహనలో ఇప్పుడు ప్రచారంలో ఉన్న బాణీ
  4. ఎవరేమన్నా ఏమనుకున్నా (ఆరుద్ర రచన)

బిరుదులు మార్చు

  1. మధుర గాయకుడు
  2. నాదకౌముది

మరణం మార్చు

1996 ఏప్రిల్ శనివారం 76వ ఏట విజయవాడలో మరణించారు.

మూలాలు మార్చు