కాలీబంగా

రాజస్థాన్ లోని ఒక పట్టణం - సింధులోయ నాగరికతకు చెందిన స్థలం
(కలిబంగాన్ నుండి దారిమార్పు చెందింది)

కాలీబంగా రాజస్థాన్, హనుమాన్‌గఢ్ జిల్లా పీలీబంగాన్ తెహసీల్ లోని ఒక పట్నం. ఇది ఘగ్గర్ నదికి దక్షిణపు ఒడ్డున ఉంది. ఈ నదినే సరస్వతీ నదిగా కొందరు పండితులు భావిస్తారు.[1][2] ఈ పట్నం బికనీర్ నుండి 205 కి.మీ. దూరంలో ఉంది. దృషద్వతి, సరస్వతి నదుల సంగమ స్థలంలోని త్రికోణాకార ప్రదేశంలో ఈ పట్నం నెలకొని ఉంది.[3] సింధు లోయ నాగరికత యొక్క ప్రాక్చారిత్రిక లక్షణాలను ఈ స్థలంలోనే మొదటగా, లుయిగీ టెస్సిటోరి గుర్తించాడు. 2003 లో, ఇక్కడ తవ్వకాలు పూర్తైన 34 ఏళ్ళ తరువాత, భారత పురాతత్వ సర్వే సంస్థ తవ్వకాల నివేదికను ప్రచురించింది. సింధు లోయ నాగరికతలో కాలీబంగా ఒక పెద్ద ప్రాంతానికి రాజధానిగా ఉండేదని ఈ నివేదికలో పేర్కొన్నారు. కాలీబంగా, ఇక్కడి హోమగుండాలకు, ప్రపంచపు మొట్టమొదటి దున్నిన పొలానికీ ప్రసిద్ధమైంది.[4]

కాలీబంగా
काली बंगा
కాలీబంగాలోని పశ్చిమ దిబ్బ. దీన్నిదుర్గంగా భావిస్తారు.
కాలీబంగా is located in India
కాలీబంగా
Shown within India
స్థానంరాజస్థాన్, భారతదేశం
ప్రాంతంథార్ ఎడారి
రకంనివాస స్థావరం
చరిత్ర
వదిలేసిన తేదీసామాన్య శక పూర్వం 20, 19 శతాబ్దాల ప్రాంతంలో
పీరియడ్‌లుHarappan 1 to Harappan 3C
సంస్కృతులుసింధు లోయ నాగరికత

సింధు లోయ నాగరికత

మార్చు

కాలీబంగా ప్రాక్చరిత్రకు చెందిన స్థలమని గుర్తించినది, ఇటలీకి చెందిన ఇండాలజిస్టు లుయిగీ పియో టెస్సిటోరి (1887–1919).[5] భారతీయ శాసనాలపై అతడు పరిశోధన చేస్తూండగా, అక్కడి శిథిలాల లక్షణాలను చూసి ఆశ్చర్యపోయాడు. అప్పటి భారత పురాతత్వ సర్వే సంస్థకు సర్ జాన్ మార్షల్‌ సాయం కోరాడు. ఆ సంస్థ అప్పటికే హరప్పాలో కొన్ని తవ్వకాలు జరిపి ఉంది. కానీ వాళ్ళకు ఈ శిథిలాల లక్షణాల గురించి అవగాహనేమీ లేదు. నిజానికి, ఈ శిథిలాలు ప్రాక్చరిత్రకు, మౌర్యులకు పూర్వ కాలానికి చెందినవనీ కనుగొన్నది టెస్సిటోరియే. అప్పటి సంస్కృతి గురించి అతడు భావనలు చేసాడు గానీ, అప్పట్లో ఈ శిథిలాల్లో సింధు లోయ నాగరికత దాగి ఉందని ఊహించడం సాధ్యం కాని పని. అసలు హరప్పన్ సంస్కృతిని కనుక్కోడానికి ఐదేళ్ళ ముందే టెస్సిటోరి మరణించాడు.

భారతదేశానికి స్వాతంత్ర్యం వచ్చాక, రెండు ప్రధాన సింధు లోయ నాగరికత నగరాలైన మొహెంజోదారో, హరప్పా రెండూ కూడా, సింధు నదితో సహా, పాకిస్తాను భాగానికి వెళ్ళిపోయాయి. భారతదేశంలో హరప్పన్ స్థలాల అన్వేషణను భారత పురాతత్వవేత్తలు తీవ్రతరం చేసారు. అమలానంద్ ఘోష్ (ASI మాజీ డైరెక్టరు జనరల్) మొదటగా కాలీబంగా‌ను హరప్పన్ స్థలంగా గుర్తించి, తవ్వకాలకు ఆదేశాలిచ్చాడు.[6] బి.బి. లాల్ నేతృత్వంలో (అప్పటి ASI డై.జ), బాలకృష్ణ థాపర్, ఎమ్.డి. ఖరే, కె.ఎమ్.శ్రీవాస్తవ, ఎస్.పి. జైన్‌లు 1960 నుండి 1969 వరకు తవ్వకాలు జరిపారు. రెండు పురాతన దిబ్బలను వెలికితీసారు. వీటి వైశాల్యం పావు చదరపు కిలోమీటరు. ఇవి అర కిలోమీటరు దూరంలో విస్తరించి ఉన్నాయి. పడమరన 9 మీ. ఎత్తుతో చిన్న దిబ్బ (KLB1) ఉంది. దీన్ని దుర్గం అన్నారు. తూర్పున ఉన్న పెద్ద దిబ్బ 12 మీ. ఎత్తుతో ఉంది. దీన్ని నగరం (KLB2) అన్నారు.

అనుకోకుండా ఈ తవ్వకాలు ఒకదాని తరువాత ఒకటి విలసిల్లిన రెండు వేరువేరు సంస్కృతులను వెలుగులోకి తెచ్చాయి. వీటిలో మొదటిది (కాలీబంగా -1) హరప్పన్ కాలానికి చెందినది. దీనిలో ఆ కాలానికి చెందిన నగర గ్రిడ్ వ్యవస్థ కనిపిస్తోంది. రెండోదాన్ని ప్రాక్-హరప్పన్ (ప్రీ హరప్పన్) అని ముందు అనుకున్నారు గానీ, ఇప్పుడు దాన్ని తొలి హరప్పన్ (ఎర్లీ హరప్పన్) లేదా పూర్వ హరప్పన్ గా పిలుస్తున్నారు.[7] సమీపంలోని ఇతర సింధు లోయ నాగరికతకు చెందిన సైట్లు - బాలు, హర్యానా, కుణాల్ హర్యానా, బాణావాలి మొదలైనవి.

ప్రోటో హరప్పన్ దశ

మార్చు

పడమర దిబ్బ యొక్క కింది స్థాయిల్లో మాత్రమే ప్రీ హరప్పన్ సంస్కృతి ఆనవాళ్ళు కనిపించాయి. పురాతత్వ సాక్ష్యాల ప్రకారం, ప్రోటో హరప్పన్ కాలం నాటి (3500 BC - 2500 BC) నుండి హరప్పన్ కాలం (3500 BC - 2500 BC) వరకు సింధు లోయ నాగరికత ఈ స్థలంలో ఉండేదని తెలుస్తోంది. ఈ తొలిదశను కాలీబంగా-1 (KLB-I) లేదా పీరియడ్-1 గా పిలుస్తున్నారు. ఇక్కడ దొరికిన మట్టిపాత్రల వంటివే ఉత్తర భారతంలోని సోతీ గ్రామంలో అనేకం దొరకడంతో కాలీబంగా-1 కు సోతీ సంస్కృతితో సంబంధాలున్నట్లుగా తెలుస్తోంది.[8]

కోట, ఇళ్ళు

మార్చు
 
కాలీబంగా శిథిలాలు. మధ్యలో ఉన్న రంధ్రం ద్వారా లోపల ఉన్న ఇటుకల గోడను చూడవచ్చు.

ఈ నివాస స్థావరం ఏర్పడినప్పటి నుంచే దాన్ని ఎండిన మట్టి ఇటుకలతో కోటలా కట్టుదిట్టం చేసారు. ఈ కోట వేరువేరు కాలాల్లో రెండు సార్లు కట్టారు. తొలుత కోట గోడ 1.9 మీటర్ల వెడల్పుండేది. రెండో సారి కట్టినపుడు దాన్ని 3.7 నుండి 4.1 మీటర్లకు పెంచారు. రెండు సార్లు కూడా ఇటుక కొలతలు 20 × 20 × 10 సెం.మీ.గా ఉంది. దుర్గం దిబ్బ (చిన్న దిబ్బ) సమాంతర చతుర్భుజి ఆకారంలో, తూర్పు పడమరలుగా 130 మీటర్ల పొడవుతోను, ఉత్తర దక్షిణాలుగా 260 మీటర్ల పొడవుతోనూ ఉంది. పట్టణ ప్రణాళిక మొహెంజోదారో హరప్పాల పద్ధతిలోనే ఉంది. ఇళ్ళ దిశ, ఇటుకల కొలతలు హరప్పన్ దశలో (KLB-II) వాడినవాటికంటే బాగా భిన్నంగా ఉన్నాయి.

కోట లోపలి ఇళ్ళను కూడా కోటను కట్టిన ఇటుకల తోటే కట్టారు; ఇళ్ళలోపలి డ్రెయిన్ కాలవలకు, పొయ్యిలకు, స్థూపాకార గుంటలకు కాల్చిన ఇటుకలు వాడిన రుజువులున్నాయి. వీటికి సున్నంతో వెల్లవేసి ఉన్నాయి. వెడ్జి (త్రికోణాకార) వంటి కాల్చిన ఇటుకలు కూడా కనిపించాయి.[9]

అత్యంత పురాతనమైన దున్నిన పొలం

మార్చు

బి.బి. లాల్ ఇలా రాసాడు: "ఏ తవ్వకాల్లోనూ కనిపించని[10][11] అత్యంత పురాతన దున్నిన పొలం (c. 2800 సా.పూ) యొక్క రుజువులు కాలీబంగా‌లో కనిపించాయి[12] ఇది ప్రీ హరప్పన్ స్థలానికి ఆగ్నేయంగా కోటకు బయట కనిపించింది. "ప్రస్తుత రాజస్థాన్ యొక్క పశ్చిమ ప్రాంతంలోని కాలీబంగా‌లో జరిపిన తవ్వకాలలో దున్నిన పొలం కనిపించింది. ప్రపంచంలోనే ఇలాంటి స్థలాల్లో ఇది మొదటిది. ఈ పొలం నిలువుగాను, అడ్డంగానూ సాళ్ళు సాళ్ళుగా దున్ని ఉంది. తూర్పు పడమరలుగా ఉన్న సాళ్ళ మధ్య 30 సెం.మీ. అంతరము, ఉత్తర దక్షిణాలుగా దున్నిన సాళ్ళ మధ్య 190 సెం.మీ. అంతరమూ ఉంది. ఈ పద్ధతి నేటికీ అనుసరిస్తున్న పద్ధతినే దగ్గరగా పోలి ఉండడం విశేషం"[13] నేటికీ, ఈ ప్రాంతంలో రెండు పంటలను ఏకకాలంలో పండించేటపుడు ఈ పద్ధతినే అనుసరిస్తూంటారు. ఈ స్థలాన్ని భద్రపరచడం కోసం ఈ పొలం ఉన్న ప్రాంతాన్ని మళ్ళీ పూడ్చి, ఆ ప్రాంతం చుట్టూ గుర్తుగా ఉండేందుకు కాంక్రీటు స్తంభాలను పాతారు.

కాల్చిన బంకమట్టి పాత్రలు (టెర్రాకొట్టా)

మార్చు

ఈ తొలిదశకు విలక్షణతను ఇచ్చేది ఇక్కడి మట్టిపాత్రలు. ఆరు వస్తువు (ఫ్యాబ్రిక్) రకాలు -A, B, C, D, E, F, -గా వీటిని గుర్తించారు. తరువాతి కాలంలో ఇలాంటివే సోతీ లోనూ గమనించారు.

వస్తువు రకాలు A, B, D లను కలపవచ్చు. వాటన్నిటికీ ఎరుపు రంగు వేసి ఉంది. వస్తువు -A ను కుమ్మరి సారెపై చేసినప్పటికీ, నిర్లక్ష్యంగా తయారు చేసినట్లుగా కనిపించింది. దానిపై తేలికపాటి నలుపు రంగు వేసి ఉంది. అక్కడక్కడా తెలుపు గీతలు ఉన్నాయి. గీతలు, అర్ధ వృత్తాలు, గడులు, పురుగులు, పూలు, ఆకులు, చెట్లు, చతురస్రాలూ వారికిష్టమైన బొమ్మలు. వస్తువు-B మొదటిదానికంటే చాలా మెరుగైన ఫినిషింగుతో ఉంది. కానీ కింది భాగం కావాలని గరుకుగా చేసారు. ఎరుపు నేపథ్యంపై నలుపు రంగుతో పూలు, జంతువుల బొమ్మలు వేసి ఉన్నాయి.

వస్తువు-D లు కొన్నిటిపై వంపుగా ఉన్న గీతలు లేదా అర్ధ వృత్తాలు ఉండగా, చాలా కుండలు ఏ బొమ్మలూ లేకుండా సాదాగా ఉన్నాయి. కానీ వస్తువు-C పాత్రలు మందం గాను, బలంగానూ ఉన్నాయి. వస్తువు-C పై విలక్షణంగా ఊదా రంగులో పాలిషు చెయ్యబడి, డిజైన్లు నలుపు రంగులో ఉన్నాయి; ఇవి ప్రోటో-హరప్పన్ పాత్రల్లో అత్యుత్తమ ఫినిషింగు కలిగినవి. వస్తువు-E తేలిక రంగు వేసి ఉన్నాయి. వస్తువు-F బూడిద రంగులో ఉన్నాయి.[14]

ఇతర కనుగోళ్ళు (ఫైండింగ్స్)

మార్చు

ఈ కాలానికి చెందిన ఇతర కనుగోళ్లలో: చాల్సెడోనీతో చేసిన చిన్న బ్లేడ్లు, స్టీటైట్ పూసలు, ఆల్చిప్పలు, ఎరుపు రాళ్ళు,, మట్టిపాత్రలు, రాగి పాత్రలు; రాగి, పెంకు, మట్టితో చేసిన గాజులు, మట్టితో చేసిన ఆట బండి, చక్రం, విరిగిన ఎద్దు వంటి వస్తువులు; పొత్రము, ఎముక పొన్ను, రాగి చాకులు, అసాధారణమైన గొడ్డలి మొదలైనవి ఉన్నాయి.[15][16] బొమ్మ బండ్లు, కాలీబంగా తొలిదశలో రవాణాకు బండ్లను ఉపయోగించేవారని సుచిస్తున్నాయి.

భూకంపాలు, తొలి దశ అంతం

మార్చు

బి.బి లాల్ ఇలా రాసాడు: "రాజస్థాన్ లోని కాలీబంగా ... 2600 సా.పూ. ప్రాంతంలో అక్కడ భూకంపం సంభవించిందని కూడా తెలుపుతోంది. దీనితో ఈ స్థలంలో తొలి సింధు నివాస స్థావరం అంతమైంది".[10] బహుశా ఇదే పురాతత్వశాస్త్రం రికార్డు చేసిన అత్యంత ప్రాచీనమైన భూకంపం.[17] ఖదీర్‌బెట్ దగ్గరి ధోలావీరా వద్ద విలసిల్లిన సింధు లోయ నాగరికతను ప్రభావితం చేసినవి, 2900–1800 సా.పూ కాలంలో సంభవించినవీ అయిన మూడు ప్రీ-హిస్టారిక్ భూకంపాలు గమనించబడ్డాయి.[18]

KLB-I దశలో 1.6 మీటర్ల మందంతో నిరాటంకంగా ఏర్పడిన ఐదు విస్పష్టమైన భూమి పొరలను గమనించారు. చివరి పొర - బహుశా భూకంపం వలన కావచ్చు - నాశనమైంది. ఈ స్థలం 2600 సా.పూ.లో నిర్జనమైంది. మళ్ళీ త్వరలోనే హరప్పన్లు అక్కడ నివాసాలను ఏర్పరచుకున్నారు.

హరప్పన్ దశ

మార్చు

హోమగుండాలు

మార్చు

కాలీబంగా‌లో హోమగుండాలు కనిపించాయి. ఇవి లోథాల్‌లో దొరికినవాటిని పోలి ఉన్నాయి. ఇవి కర్మకాండలకు తప్ప మరో రకంగా ఉపయోగపడవని ఎస్.ఆర్.రావు భావించారు.[19] నాటి ప్రజలు అగ్నిదేవుణ్ణి పూజించేవారని తెలుస్తోంది. అయితే, దేవతామాతను పూజించే ఆనవాళ్ళు ఇక్కడ కనిపించలేదు. మొత్తం సింధు లోయ నాగరికత స్థలాల్లో దేవతామాతను పూజించని స్థలం ఇది ఒక్కటే.

కోట లోపల, దక్షిణార్థంలో ఇటుకలతో కట్టిన ఐదారు వేదికలున్నాయి. వాటి మధ్య నడవా లున్నాయి. ఈ వేదికలు ఎక్కేందుకు మెట్లు ఉన్నాయి. దొంగలు ఇటుకలను తీసుకుపోవడం వలన ఈ వేదికలపై ఏ కట్టడాలుండేవో స్పష్టంగా తెలియడం లేదు గానీ, దీర్ఘ చతురస్రాకారంలోను, అండాకారంలోనూ ఉన్న హోమగుండాల ఆనవాళ్ళు మాత్రం సందేహాతీతంగా తెలుస్తున్నాయి. ఈ హోమగుండాలు కాల్చిన ఇటుకలతో చేసారు. ఈ హోమగుండాల మధ్యలో యూపస్తంభం ఉంది. అన్ని కుండాలలోనూ మట్టిపిండాలు ఉన్నాయి.

దిగువ పట్నంలోని ఇళ్ళలో కూడా ఇలాంటి హోమగుండాలున్నాయి. ఈ గుండాల్లో కాల్చిన చార్‌కోలు కనబడింది. ఈ గుండాల ఆకృతి వేదకాలంనాటి హోమగుండాలను పోలి ఉంది. కానీ ఈ పోలిక యాదృచ్ఛికం అయి ఉండవచ్చు. ఈ గుండాలు ఓ ప్రత్యేకమైన సంఘ కార్యానికి ఉద్దేశించినవి అయి ఉండవచ్చు. కొన్ని హోమగుండాల్లో జంతువుల అవశేషాలు కనిపించాయి. జంతు బలి జరిగేదని ఇది సూచిస్తోంది.[20]

ASI వెబ్‌సైట్లో ఇలా ఉంది: "పట్నంలోని పై రెండు ముఖ్యమైన భాగాలతో పాటు, అక్కడ ఓ మూడో భాగం కూడా ఉంది: దిగువ పట్నం నుండి 80 మీటర్లు ఉత్తరంగా ఉన్న ఈ నిర్మాణంలో నాలుగైదు హోమగుండాలున్నాయి. ఈ ఒంటరి నిర్మాణాన్ని బహుశా కర్మకాండలకు వాడేవాళ్ళు.[21]" ఈ విధంగా, కాలీబంగా‌లో హోమగుండాలు మూడు విధాలుగా కనిపించాయి: కోటలోపల సార్వజనిక హోమగుండాలు, దిగువ పట్నంలో ఇళ్ళలోని హోమగుండాలు, విడిగా మరోచోట బహిరంగ సార్వజనిక హోమగుండాలు. హోమగుండాలకు కొంత దూరంలో ఒక బావి, స్నానఘట్టాల అవశేషాలూ కనిపించాయి. కర్మకాండల్లో సంప్రదాయిక స్నానం ఒక భాగమని ఇది సూచిస్తోంది.[22]

ఈ నిర్మాణాలను హోమగుండాలుగా భావించడం వివాదాస్పదమైనది. ఇతర స్థలాల్లో జరిగిన తవ్వకాల్లో ఇలాంటి గుండాలే బయల్పడినపుడు వాటిని వంట పొయ్యిలుగాను, మట్టి పొంతలుగానూ భావింఛారు.

దిగువ పట్నం

మార్చు

దిగువ పట్నం కూడా చూట్టూ గోడ కలిగిన ఒక చతుర్భుజి. అయితే ప్రస్తుతం దీని అవశేషాలు మాత్రమే మిగిలి ఉన్నాయి. కోటను 40 × 20 × 10 సెం.మీ. మట్టి ఇటుకలతో నిర్మించారు. దీన్ని మూడు నాలుగు దశల్లో నిర్మించినట్లుగా గుర్తించారు. దీనికి ఉత్తరం, పశ్చిమం వైపున ద్వారాలున్నాయి.

బి.బి. లాల్ ఇలా రాసాడు:

"చక్కగా, పేర్చినట్లున్న వీధులు నాలుగు ప్రధాన దిశల్లో, గ్రిడ్ ఆకృతిలో ఉన్నాయి. (కాలీబంగా‌లో) ఈ వీధుల వెడల్పు కూడా ఒక ప్రత్యేకించిన ఒక నిష్పత్తిలో ఉన్నాయి -అంటే, అతి సన్నటి సందు వెడల్పు ఒకటి అయితే, మిగతా వీధులు దాని కంటే రెండు రెట్లు, మూడు రెట్లు, నాలుగు రెట్లు.. ఇలా ఉన్నాయి. అలాంటి పట్టణ ప్రణాళిక ఆనాటి పశ్చిమాసియాలో మరెక్కడా కానరాదు."

దిగువ పట్నం తూర్పు పడమరలుగా 239 మీ పొడవు ఉంది. ఉత్తర దక్షిణాల పొడవు నిర్ధారించలేకపోయారు. 8 ప్రధాన మార్గాలను -5 ఉత్తర-దక్షిణ దిశగాను, 3 తూర్పు-పడమర దిశగానూ - గుర్తించారు. మరి కొన్ని తూర్పు పడమర మార్గాలు ఇంకా తవ్వకాలు జరగని స్థలంలో ఉండి ఉంటాయని భావిస్తున్నారు. రెండవ తూర్పు-పడమర మార్గం వంపుగా సాగి, మొదటి మార్గాన్ని ఈశాన్య కొసన (నది వైపున) కలిసింది. అక్కడ ఒక ప్రవేశ ద్వారం ఉంది. సరళ రేఖల్లా ఉన్న మార్గాల మధ్య, ఈ ఒక్క మార్గం మాత్రం విభిన్నం. ఇళ్లను కలిపేందుకు చాలా సందులు ఉన్నాయి. ఇతర హరప్పన్ స్థలాల్లో లాగే ఇక్కడ కూడా రహదారులు ఓ కచ్చితమైన నిష్పత్తిలో ఉన్నాయి. 7.2 మీటర్ల వెడల్పున్న ప్రధాన మార్గాల నుండి 1.8 మీటర్ల వెడల్పున్న సన్నటి సందుల వరకూ ఉన్నాయి. వీధుల చివర్ల ప్రమాదాలను నివారించేందుకుగాను అడ్డు స్తంభాల నుంచారు. రెండవ నిర్మాణ స్థాయిలో, రోడ్లను మట్టి పెంకులతో నిర్మించారు. ఇళ్ళలోని మురుగు నీరు ప్రవహించి, ఈ రోడ్ల కింద ఉన్న మురుగు గుంటలలోకి కలిసాయి. దీన్నంతటినీ ప్లాను చేసి, నిర్వహించేందుకు ఒక కేంద్రీయ వ్యవస్థ ఉండి ఉండాలి.[23]

నివాసాలు

మార్చు

పట్టణ ప్రణాళిక లాగానే, నివాసాలు కూడా ఇతర హరప్పన్ స్థలాల పద్ధతిలోనే ఉన్నాయి. చదరంగం బల్ల లాంటి గ్రిడ్ వ్యవస్థ వలన, ఇళ్ళన్నీ రెండు లేదా మూడు, రోడ్లు లేదా సందులకు అభిముఖంగా ఉంటాయి. ప్రతి ఇంటిలోనూ ఒక వీధి గది, మూడు వైపుల్లోను 6-7 గదులూ ఉన్నాయి. కొన్ని ఇళ్ళలో బావి కూడా ఉంది. ఒక ఇంట్లో మిద్దె పైకి వెళ్ళేందుకు మెట్లు ఉన్నాయి. ఇళ్ళను 30 × 15 × 7.5 సెం.మీ. కొలతలు గల మట్టి ఇటుకలతో కట్టారు. (ఇవి కోట గోడ యొక్క రెండవ నిర్మాణ దశలో వాడిన ఇటుకల లాంటివే). హోమగుండాలతో పాటు, మురుగునీటి కాలువలకు, బావులకు, స్నాన ఘట్టాలకు, ద్వారబంధాలకూ కాల్చిన ఇటుకలను వాడారు. గదుల నేలను మట్టితో అలికారు. కొన్ని చోట్ల మట్టి ఇటుకలు, మట్టి పిడకలనూ వాడారు. ఒక ఇంట్లోని నేలను కాల్చిన పెంకులతో నిర్మించి, వాటికి జ్యామితీయ డిజైన్లు వేసారు.[24]

బంకమట్టి పాత్రలు

మార్చు

తొలి కాలీబంగా బంకమట్టి పాత్రలు - ఛోలిస్తాన్ లోని హక్రా పాత్రలను, సింధు లోయ నాగరికతకు చెందిన ఇతర తొలి హరప్పన్ పాత్రలను, ఏకీకృత యుగానికి చెందిన పాత్రలనూ పోలి ఉన్నాయి.[25] వాటి ఉపయోగాలను అనుసరించి, ఈ పాత్రలను గృహోపకరణాలుగాను, మతాచార, ఖనన పాత్రలుగానూ వర్గీకరించవచ్చు. నిర్మాణపరంగా ఇవి సాదా, అలంకృత అనే రెండు వర్గాలుగా చూడవచ్చు. కొన్ని పాత్రలపై హరప్పన్ లిపిలో (ఇంకా ఛేదించలేదు) రాతలు ఉన్నాయి.

కాలీబంగా‌కు చెందిన టెర్రాకొట్టా వస్తువుల్లో అత్యుత్తమమైనది ముందుకు దూకుతున్న భంగిమలో ఉన్న ఎద్దు బొమ్మ. "హరప్పా కాలానికి చెందిన వాస్తవికమైన, శక్తివంతమైన జానపద కళను" ఇది ప్రతిబింబిస్తోందని భావించారు.[26] ఇక్కడ అనేక టెర్రాకొట్టా గాజులు కూడా లభించాయి.

ముద్రలు

మార్చు

ఈ కాలానికి చెందిన అనేక ముద్రలు దొరికాయి. అన్నిటికంటే చెప్పుకోవాల్సినది, ఒక స్థూపాకార ముద్ర. దీనిపై ఈటెలతో యుద్ధం చేస్తున్న లేక బెదిరిస్తున్న ఇద్దరు పురుషుల మధ్య ఉన్న ఒక స్త్రీ బొమ్మ ఉంది. వీరిని గమనిస్తున్న ఒక వృషభ-మానవుని బొమ్మ కూడా ఉంది. ఇవన్నీ దీర్ఘ చత్రురస్రాకారంలో ఉన్నాయి.

ఇక్కడ కనుగొన్న ఇతర వస్తువులు

మార్చు

ఇక్కడ దొరికిన ఇతర వస్తువుల్లో స్థూపాకారంలో ఉన్న ఒక కొలత కడ్డీ, మనుష్యుల బొమ్మలు వేసి ఉన్న ఓ బంకమట్టి బంతీ ఉన్నాయి. బఠానీలు, చిక్‌పీలు కూడా దొరికాయి[27]

ఖనన వ్యవస్థలు

మార్చు
 
శ్మశానానికి దారి

మూడు రకాల ఖనన వ్యవస్థలు ఇక్కడ ఉన్నట్లు శ్మశానంలో దొరికిన ఆధారాలతో తెలుస్తోంది. ఈ శ్మశానం కోటకు 300 మీటర్లు నైరుతిలో ఉంది. అక్కడ 34 సమాధులు లభించాయి. ఖనన రకాలు ఇవి:

  1. ఖననం దీర్ఘచతురస్రాకార, లేదా అండాకార గుంటల్లో చేసారు. శవాన్ని నిటారుగా పడుకోబెట్టారు. తల ఉత్తరానికి, మట్టి పాత్రల మధ్య పెట్టారు. ఒక సమాధిలో ఈ పాత్రల మధ్య ఒక రాగి అద్దం దొరికింది. శవాన్ని ఉంచాక, మట్టితో నింపారు. ఒక సమాధిని మట్టి ఇటుకలతో నిర్మించి లోపలి వైపున ప్లాస్టరింగు చేసారు. ఒక బాల శవానికి పుర్రెలో ఆరు రంధ్రాలు ఉన్నాయి. ఈ సమాధుల నుండి అనేక పాలియోపాథలాజికల్ సాక్ష్యాలను సేకరించారు.
  2. వృత్తాకార గుంటలో ఒక కుండలో ఖననం చెయ్యడం. ఇక్కడ శవం ఉండదు. ప్రధానమైన కుండ చుట్టూ 4 నుండి 29 కుండలు, పాత్రలను ఉంచారు. కొన్ని సమాధుల్లో పూసలు, పెంకులు, మొదలైనవి కనిపించాయి.
  3. దీర్ఘచతురస్రాకార, లేదా అండాకార గుంటల్లో మట్టి పాత్రలు, ఇతర ఖనన సామాగ్రి మాత్రమే ఉండడం. మొదటి వాటి లాగానే ఈ గోతులు కూడా ఉత్తర-దక్షిణ దిశగా ఉన్నాయి. రెండవ, మూడవ పద్ధతుల సమాధుల్లో అస్థిపంజరమేమీ లేదు. ఇది చిహ్నామాత్ర ఖననం కావచ్చు. ఇలాంటిది ఇతర హరప్పన్ స్థలాల్లో లేదు. ఈ మూడవ రకం సమాధులలో కొన్ని గుంటలను పూడ్చలేదు [28] [29]

నాగరికత అంతం

మార్చు

నది ఎండిపోవడం చేత కాలీబంగా‌ను ఖాళీ చేసారని రాబర్ట్ రెయిక్స్ అన్నాడు[30] ప్రొ. బి.బి.లాల్ ఈ వాదనకు సమర్ధిస్తూ ఇలా అన్నాడు: "రేడియో కార్బన్ డేటింగు ప్రకారం కాలీబంగా వద్ద నున్న ప్రౌఢ హరప్పన్ నివాస స్థావరాన్ని 2000–1900 సా.పూ. లో ఖాళీ చేసారు. హైడ్రలాజికల్ సాక్ష్యాల ప్రకారం సరస్వతీ నది ఎండిపోవడం చేత ఈ స్థలాన్ని ఖాళీ చెయ్యవలసి వచ్చిందని తెలుస్తోంది. ఇది రెయిక్స్, అతడి భారతీయ సహపరిశోధకులు చేసిన పరిశోధనలతో నిరూపితమైంది.[31]

ఆధునిక కాలీబంగా

మార్చు

కాలీబంగా అంటే నల్ల గాజులు అని పంజాబీలో అర్థం. కాలీబంగా అనేది అసలు మాట. కొద్ది దూరంలో పీలీబంగా అనే పట్నం ఉంది. దాని అర్థం పసుపు రంగు గాజులు అని.

కాలీబంగా‌లో 1983 లో ASI ఒక పురావస్తు మ్యూజియమ్‌ను ఏర్పాటు చేసింది. 1961-69 లలో జరిపిన తవ్వకాలలో బయల్పడిన వస్తువులను ఈ మ్యూజియమ్‌లో పెట్టారు. ఒక గ్యాలరీలో ప్రీ-హరప్పన్ వస్తువులను, వేరే రెండు గ్యాలరీలలో హరప్పన్ వస్తువులనూ ప్రదర్శనకు ఉంచారు.

మూలాలు

మార్చు
  1. Calkins, PB; Alam M. "India". Encyclopædia Britannica. Retrieved 2008-12-31.
  2. Lal, BB (2002). "The Homeland of Indo-European Languages and Culture: Some Thoughts". Purātattva. Indian Archaeological Society. pp. 1–5.
  3. McIntosh, Jane (2008) The Ancient Indus Calley : New Perspectives. ABC-CLIO. Page 77
  4. Lal, BB (2003). Excavations at Kalibangan, the Early Harappans, 1960-1969. Archaeological Survey of India. pp. 17, 98.
  5. cf. Finding Forgotten Cities.
  6. Shri Krishna Ojha, Elements of Indian Archaeology, p.115.
  7. this is the wording of the official website of ASI : http://asi.nic.in/asi_exca_imp_rajasthan.asp Archived 2011-07-21 at the Wayback Machine
  8. Tejas Garge (2010), Sothi-Siswal Ceramic Assemblage: A Reappraisal. Archived 2021-11-28 at the Wayback Machine Ancient Asia. 2, pp.15–40. doi:10.5334/aa.10203
  9. Elements of Indian Archaeology, p.116.
  10. 10.0 10.1 B. B. Lal, India 1947–1997: New Light on the Indus Civilization
  11. Puratattva, 4:1-3
  12. Its photograph is available in an article by B. B. Lal at https://web.archive.org/web/20091018220438/http://geocities.com/ifihhome/articles/bbl002.html
  13. cf. The Indus Basin History of Irrigation, Drainage and Flood Management
  14. Elements of Indian Archaeology, p.117-118.
  15. official website of ASI : http://asi.nic.in/asi_exca_imp_rajasthan.asp Archived 2011-07-21 at the Wayback Machine.
  16. Elements of Indian Archaeology, p.117. This book gave exactly the same information, in almost same wording, which was later used in ASI website, hence unpublished excavation reports were source of both these accounts.
  17. B.B. Lal 1984. The earliest Datable Earthquake in India, Science Age (October 1984), Bombay: Nehru Centre
  18. Lal, B. B., The earliest datable earthquake in India.
  19. Frontiers of the Indus Civilization
  20. Elements of Indian Archaeology, p.119-120.
  21. "Excavation Sites in Rajasthan - Archaeological Survey of India". Archived from the original on 2011-07-21. Retrieved 2016-11-01.
  22. Bryant, Edwin (2001). The quest for the origins of vedic culture the Indo-Aryan migration debate. New York: Oxford University Press. p. 160. ISBN 9780195137774.
  23. Elements of Indian Archaeology, p. 120-121.
  24. Elements of Indian Archaeology, p.121.
  25. B.B. Lal 2002, The Sarasvati flows on
  26. Elements of Indian Archaeology, p.117.
  27. McIntosh, Jane.(2008) The Ancient Indus Valley: New Perspectives. ABC-CLIO. Page 114
  28. Elements of Indian Archaeology, p.123.
  29. "Excavation Sites in Rajasthan - Archaeological Survey of India". Archived from the original on 2011-07-21. Retrieved 2016-11-01.
  30. Kalibangan: Death from Natural Causes, by Raikes
  31. cf. The Homeland of Indo-European Languages and Culture: Some Thoughts

వనరులు

మార్చు
  • B.B. Lal, Jagat Pati Joshi, B.K. Thapar and Madhu Bala: Excavations at Kalibangan: The Early Harappans (1960–1969); New Delhi, Archaeological Survey of India, Jan 2003, 1st ed., xiv, 340 p. [Memoirs of the Archaeological Survey of India, No. 98] . Contents of this authoritative report: Foreword. Preface. 1. The setting/B.K. Thapar. 2. Discovery and previous work/B.K. Thapar. 3. Summary of results/Jagat Pati Joshi. 4. Chronology of the early Harappan settlement/B.B. Lal. 5. The early Harappan culture-complex of Kalibangan in its wider setting/B.B. Lal. 6. Stratigraphy/Jagat Pati Joshi. 7. Structures/Jagat Pati Joshi. 8. The agricultural field/B.B. Lal. 9. The end of the early Harappan settlement at Kalibangan/B.B. Lal. 10. The pottery/Madhu Bala. 11. Minor antiquities/Madhu Bala. 12. Graffiti/Madhu Bala. 13. Technical reports: A. Scientific analysis of early Harappan pottery/B.N. Tandon. B. Report on metal specimens/B.B. Lal. C. Identification of animal remains/S. Banerjee, R.N. Mukherjee and B. Nath. D. Identification of plants and seeds/Vishnu Mittre and R. Savithri.
  • Nayanjot Lahiri, Finding Forgotten Cities : How the Indus Civilization was Discovered, Seagull Books, Aug 2006, 410 pages, 1-905422-18-0
  • Lal, B. B., The earliest datable earthquake in India. Science Age, 1984, 8, 8–9.
  • Lal, B. B., India 1947–1997: New Light on the Indus Civilization (New Delhi: Aryan Books International, 1998)
  • Lal, B. B., The Earliest Civilization of South Asia (New Delhi : Aryan Books International, 1997)
  • Madhu Bala 1997. Some Unique Antiquities and Pottery from Kalibangan, in Facets of Indian Civilization Recent Perspectives, Essays in Honour of Professor B.B. Lal, (Jagat Pati Joshi Ed.), pp. 103–106. New Delhi: Aryan Books International.
  • Sharma, A.K. 1970. Kalibangan Human Skeletal Remains: an Osteo-Archaeological Approach, Journal of the Oriental Research institute XIX: 109-113.
  • Thapar, B.K. 1975. Kalibangan: a Harappan Metropolis Beyond the Indus Valley, Expedition XVII (2) : 13-19.
  • Thapar, B.K. 1972. New Traits of the Indus Civilization at Kalibangan: an Appraisal, in South Asian Archaeology 1971 (Noman Hammond Ed.), pp. 85–104. Park Ridge: Noyes Press.
  • The Indus Basin History of Irrigation, Drainage and Flood Management, Edited by H. Fahlbusch, Bart Schultz and C.D. Thatte, February 2004, ISBN 8185068771
  • Elements of Indian Archaeology (Bharatiya Puratatva, in Hindi) by Shri Krishna Ojha, published by Research Publications in Social Sciences, 2/44 Ansari Riad, Daryaganj, New Delhi-2. (The fifth chapter summarizes the excavation report of Kalibangan in 11 pages).
  • Robert Raikes, Kalibangan: Death from Natural Causes, Antiquity, XLII,286-291,1968
  • Lal, B. B., The Homeland of Indo-European Languages and Culture: Some Thoughts, Paper presented at a seminar organized by the Indian Council for Historical Research on the same theme in Delhi on 7–9 January 2002.
  • B.B. Lal. Frontiers of the Indus Civilization.1984:57-58
  • S.R. Rao. The Aryans in Indus Civilization.1993:175
  • Madison: Wisconsin Archaeological Reports 2. Bhan, Suraj 1973. The Sequence and Spread of Protohistoric Cultures in the Upper Sarasvati Basin, Radiocarbon and Indian Archaeology (D.P. Agrawal and A. Ghosh Eds.), pp. 252–263. Bombay: Tata Institute of Fundamental Research.
  • Gupta, S.P. 1997. The Origins of the Indus-Sarasvati Civilization, in The Facets of Indian Civilization (J.P. Joshi, Chief Editor), pp. 129–141. New Delhi: Aryan Books International.
  • Gupta, S.P. 1982. The Late Harappan: a Study in Cultural Dynamics, in Harappan Civilization (Gregory L. Possehl Ed.), pp. 51–59. New Delhi: Oxford-IBH.
  • Gupta, S.P. 1997. The Indus-Sarasvati Civilization. New Hegde, K.T.M., K.K. Bhan and V.H. Sonawane 1984-85.
  • Misra V.N. 1993. Indus Civilization and the Rigvedic Sarasvati, in South Asian Archaeology 1991 (A. Parpola and P. Koskikallio Eds.), pp. 511–525. Helsinki: Soumalainen Tiedeakatemia. Mughal, M.R. 1981. New Archaeological Evidence from Bahawalpur, in Indus Civilization: New Perspectives (Ahmad Hasan Dani Ed.), pp. 32–42. Islamabad: Quaid-i-Azam University.
  • Sharma, A.K. 1970. Kalibangan Human Skeletal Remains: an Osteo-Archaeological Approach, Journal of the Oriental Research institute XIX: 109-113.
  • Sharma, A.K. 1993. The Harappan Horse was Buried under Dunes of..., Puratattva (Bulletin of the Indian Archaeological Society, No. 23, 1992–93, pp. 30–34.
  • Singh, Bhagwan 1995. The Vedic Harappans. New Delhi: Aditya Prakshan.
  • Mughal, M.R. 1997. Ancient Cholistan. Lahore: Feroz and Sons.
"https://te.wikipedia.org/w/index.php?title=కాలీబంగా&oldid=3969320" నుండి వెలికితీశారు