ధోలావీరా గుజరాత్ లోని కచ్ జిల్లా, భచావ్ తాలూకా, ఖదిర్‌బెట్ వద్ద ఉన్న పురావస్తు క్షేత్రం. ఈ స్థలానికి 1 కిలోమీటరు దక్షిణంగా ఉన్న ధోలావీరా అనే గ్రామం పేరిట ఈ పేరు వచ్చింది. ఈ గ్రామం రాధన్‌పుర్ నుండి 165 కి.మీ. దూరంలో ఉంది. స్థానికంగా కోటాడ టింబా అని కూడా పిలిచే ఈ స్థలంలో సింధు లోయ నాగరికతకు చెందిన పట్టణ శిథిలాలు ఉన్నాయి.[1] ఈ స్థలం కర్కట రేఖపై ఉంది. హరప్పా క్షేత్రాల్లోని ఐదు పెద్ద వాటిలో ఇది ఒకటి. భారత్‌లో సింధు లోయ నాగరికతకు చెందిన ప్రముఖ స్థలాల్లో ఒకటి. దీన్ని, సమకాలీన పట్టణాల్లోకెల్లా అత్యంత ఘనమైనదిగా భావిస్తారు.[2] ఇది రాన్ ఆఫ్ కచ్‌లోని కచ్ ఎడారి వన్యప్రాణి సంరక్షణాలయంలోని ఖదిర్బెట్ దీవిలో ఉంది. 48 హెక్టార్ల చతుర్భుజాకారపు ఈ పట్టణం, ఉత్తరాన మన్‌సార్, దక్షిణాన మన్‌హర్ అనే రెండు వాగుల మధ్య నెలకొని ఉంది.[3] ఈ స్థలంలో సా.పూ 2650 నుండి జనావాసాలు ఉన్నాయి. సా.పూ. 2100 నుండి క్షీణించడం మొదలై, కొన్నాళ్లపాటు పూర్తిగా నిర్జనమైపోయి, తిరిగి సా.పూ. 1450 లో జనావాసాలు మొదలయ్యాయి.[4]

ధోలావీరా
ધોળાવીરા (in Gujarati)
ధోలావీరా
ధోలావీరా is located in Gujarat
ధోలావీరా
ధోలావీరా పట్టణం
ధోలావీరా is located in India
ధోలావీరా
ధోలావీరా (India)
స్థానంకచ్ జిల్లా, గుజరాత్
నిర్దేశాంకాలు23°53′10″N 70°13′0″E / 23.88611°N 70.21667°E / 23.88611; 70.21667
రకంజనావాసం
పొడవు771 మీ. (2,530 అ.)
వెడల్పు617 మీ. (2,024 అ.)
వైశాల్యం100 హె. (250 ఎకరం)
చరిత్ర
పీరియడ్‌లుహరప్పను 2 నుండి హరప్పను 5 వరకు
సంస్కృతులుసింధు లోయ నాగరికత
స్థల గమనికలు
తవకాల తేదీలు1990 నుండి ఇప్పటి వరకు
స్థితిశిథిలం
యజమానిసార్వజనికం
ప్రజలకు అందుబాటుఉంది

ఈ స్థలాన్ని 1967-1968 లో భారత పురాతత్వ సర్వే సంస్థ యొక్క అప్పటి డైరెక్టరు జనరల్ జె.పి.జోషి కనుగొన్నారు. ఇది అతి పెద్దవైన హరప్పా క్షేత్రాల్లో ఐదవది. 1990 నుండి పురాతత్వ సర్వే సంస్థ ఇక్కడ తవ్వకాలు జరిపింది. సంస్థ అభిప్రాయం ప్రకారం, "సిందు లోయ నాగరికత మూర్తిమత్వానికి ధోలావీరా కొత్త కోణాలను చేకూర్చింది"[5]

ఇతర హరప్పా క్షేత్రాల్లో పెద్దవి ఇవి: హరప్పా, మొహెంజో దారో, గనేరివాలా, కలిబంగాన్, రూప్‌నగర్, లోథాల్.

ధోలావీరా ప్రస్థానం

మార్చు
 
ధోలావీరా పటం

ఆర్.ఎస్. బిష్త్ ధోలావీరాలో విలసిల్లిన నాగరికతను కింది ఏడు దశలుగా నిర్వచించాడు:[6]

దశలు కాలం నాగరికత విశేషం
దశ 1 2650–2550 సా.పూ. తొలి హరప్పను – పరిణిత హరప్పను ప్రస్థానం A
దశ 2 2550–2500 సా.పూ. తొలి హరప్పను – పరిణిత హరప్పను ప్రస్థానం B
దశ 3 2500–2200 సా.పూ. పరిణిత హరప్పను A
దశ 4 2200–2000 సా.పూ. పరిణిత హరప్పను B
దశ 5 2000–1900 సా.పూ. పరిణిత హరప్పను C
1900–1850 సా.పూ. వదలిపెట్టి వెళ్ళిన కాలం
దశ 6 1850–1750 సా.పూ. పట్టణానంతర హరప్పను A
1750–1650 సా.పూ. వదలిపెట్టి వెళ్ళిన కాలం
దశ 7 1650–1450 సా.పూ. పట్టణానంతర హరప్పను B

తవ్వకాలు

మార్చు

1989 లో భారత పురాతత్వ సర్వే సంస్థ ఆర్.ఎస్.బిష్త్ నేతృత్వంలో తవ్వకాలు మొదలుపెట్టింది. 1990 2005 మధ్య 13 తవ్వకాలు జరిపింది. ఈ తవ్వకాలలో పట్టణ ప్రణాళిక, వాస్తు రీతులు, వెలుగులోకి వచ్చాయి. అనేక ముద్రలు, పూసలు, జంతువుల ఎముకలు, బంగారం, వెండి, మట్టి ఆభరణాలు, మట్టి కుండలు, కంచు పాత్రలు లభించాయి. పురావస్తు శాస్త్రవేత్తల అంచనా ప్రకారం, ధోలావీరా దక్షిణ గుజరాత్, సింధ్, పంజాబు, పశ్చిమాసియాల్లోని జనావాసాల మధ్య ప్రధాన వర్తక కేంద్రంగా ఉండేది.[7][8]

వాస్తు కళ, వస్తు సంస్కృతి

మార్చు

లోథాల్ కంటే పురాతనమైనది ధోలావీరా.[9] ఇది చతుర్భుజాకారంలో 771.1 మీ. పొడవు, 616.85 మీ. వెడల్పూ కలిగి, 48 హెక్టార్లలో విస్తరించి ఉంది. హరప్పా, మొహెంజో దారోల్లాగా కాకుండా, ఈ పట్టణాన్ని ఒక జ్యామితి ప్రకారం నిర్మించారు. దీనిలో మూడు విభాగాలున్నాయి – ఒక కోట, మధ్య పట్టణం, దిగువ పట్టణం.[10] కోట, మధ్య పట్టణం రెంటికీ కూడా స్వంతంగా రక్షణ నిర్మాణాలు, ద్వారాలు, వీధులు, బావులు, విశాలమైన బహిరంగ స్థలాలూ ఉన్నాయి. పట్టణపు నైఋతి భాగం దాదాపు అంతటా విస్తరించి ఉన్న కోట, పటిష్ఠంగా నిర్మితమై ఉంది. కోటకు జమిలి బురుజుల ద్వారా రక్షణ కల్పించారు.[11] దీనికి పక్కనే ముఖ్యమైన అధికారులు నివసించే బెయిలీ అనే ప్రాంతం ఉంది.[12] గోడలకు ఆవల, మరొక ఆవాస స్థలం కూడా దొరికింది. ధోలావీరాలో కొట్ట్టొచ్చినట్లు కనిపించే విశేషమేమిటంటే ఇక్కడి నిర్మాణాలన్నీ రాతితో కట్టినవే కావడం. మిగతా అన్ని సింధు లోయ స్థలాలు దాదాపు అన్నిటిలోనూ - హరప్పా, మొహెంజో దారోలతో సహా - నిర్మాణాలన్నీ ఇటుకలతో కట్టారు.[13]

తటాకాలు

మార్చు
 
ధోలావీరాలోని తటాకాలు, అందులో దిగేందుకు మెట్లు

"ధోలావీరాలోని హరప్పన్లు నీటి పొదుపు కోసం, నిల్వ చెయ్యడం కోసం అభివృద్ధి చేసిన వ్యవస్థలు సామాన్య శక పూర్వం మూడో సహస్రాబ్దిలో వారు సాధించిన ఉత్కృష్టమైన జల సాంకేతికతకు అద్దం పడతాయి" అని ఆర్.ఎస్.బిష్త్ చెప్పాడు.[14] ధోలావీరా ప్రత్యేకత, పూర్తిగా రాతిలో నిర్మించిన కాలువలు, తటాకాలతో కూడిన నీటి పొదుపు వ్యవస్థ.[15][16] ఇది ప్రపంచంలో ఇతర ప్రదేశాల్లో ఉన్న వ్యవస్థలన్నిటి కంటే కూడా ప్రాచీనమైనది.[17] పట్టణంలో పెద్ద పెద్ద తటాకాలున్నాయి; వాటిలో మూడింటిని తవ్వకాల్లో వెలికి తీసారు.[18] వర్షపు నీటిని పట్టి నిలువ చేసేందుకుగానీ,[16] దగ్గర్లో ప్రవహిస్తున్న వాగుల నుండి నీటిని మళ్ళించి నిలువ ఉంచేందుకు గానీ ఈ తటాకాలను వాడారు.[19] ఏళ్ళ పాటు వర్షాలు పడని ఎడారి ప్రదేశమైన కచ్ ప్రాంతపు పరిస్థితులకు అనుగుణంగా వీటిని నిర్మించినట్లు తెలుస్తూనే ఉంది. దగ్గర్లో ఉత్తరం నుండి దక్షిణానికి ప్రవహించే వాగుకు అనేక చోట్ల ఆనకట్టలు నిర్మించి, నీటిని నిలువ చేసారు.

ధోలావీరా మూడవ దశలో ఇక్కడి పౌరులు 16 లేదా అంతకంటే ఎక్కువ జలాశయాలను వివిధ పరిమాణాల్లో నిర్మించారు. వీటిలో కొన్ని ఇక్కడి నేల వాలును ఉపయోగించుకుని నిర్మించారు. ఈ వాలు ఈశాన్యం నుండి ఆగ్నేయానికి 13 మీటర్ల వరకూ ఉంది. మిగతా జలాశయాలను భూమిని తవ్వి లేదా రాతిని తొలిచీ నిర్మించారు. ఇటీవలి తవ్వకాలలో రెండు పెద్ద జలాశయాలు, కోటకు తూర్పున ఒకటీ దక్షిణాన మరొకటీ, బయట పడ్డాయి.[20]

రాతిని నిట్టనిలువుగా తొలిచి ఈ జలాశయాలను నిర్మించారు. ఇవి 7 మీ. లోతున, 79 మీ. పొడవునా ఉన్నాయి. ఇవి పట్టణపు అంచున ఉన్నాయి. కోట, స్నానఘట్టం పట్టణానికి మధ్యన ఎత్తైన ప్రదేశంలో ఉన్నాయి. ఒక పెద్ద బావి నుండి నీటిని తరలించేందుకు ఒక కాలువ నిర్మించి దాన్ని ఒక జలాశయానికి కలిపారు. స్నానఘట్టం లోనికి దిగేందుకు మెట్లు నిర్మించారు.

2014 అక్టోబరులో తవ్వకాలు జరిపి 73.4 మీ పొడవు, 29.3 మీ. వెడల్పు, 10 మీ. లోతూ కలిగిన ఒక చతుర్భుజాకారపు దిగుడుబావిని వెలికి తీసారు. ఇది మొహెంజో దారో లోని స్నానఘట్టం కంటే మూడు రెట్లు పెద్దది[21]

ముద్రల తయారీ

మార్చు

ధోలావీరా మూడవ దశకు చెందిన ముద్రలపై జంతువుల బొమ్మలు మాత్రమే ఉండి, ఎటువంటి లిపీ లేదు. సింధు ముద్రల తయారీ తొలిదశలో ముద్రలు ఇలా ఉండేవని ఇవి సూచిస్తున్నాయి.

ఇతర నిర్మాణాలు, వస్తువులూ

మార్చు
 
Dholavira

ఈ స్థలంలో ఉన్న ఒక పెద్ద చక్రాకార నిర్మాణం, సమాధిగానీ స్మారక నిర్మాణం గానీ అయి ఉండవచ్చని భావిస్తున్నారు.[16] దానిలో అస్థిపంజరాలుగానీ, ఇతర మానవ అవశేషాలు గానీ ఏమీ లేనప్పటికీ ఇలా భావిస్తున్నారు. ఈ నిర్మాణంలో చక్రంలోని ఆకుల్లాగా మట్టి గోడలున్నాయి.[16] మెత్తటి రాతిలో చెక్కిన, తలా కాళ్ళూ లేని ఒక మగమనిషి రూపం, తూర్పు ద్వారం వద్ద నడకదారిలో ఉంది.[16] ఖనన నిర్మాణాలు అనేకం కనిపించాయి (వీటిలో ఒక్కదానిలోనే మానవ ఎముకలు ఉన్నాయి),[16] ఈ నిర్మాణాలతో పాటు మట్టి కుండలు, మట్టి ముద్రలు, గాజులు, ఉంగరాలు, పూసలు, చెక్కిన ప్రతిమలూ కూడా కనిపించాయి.[16]

అర్థగోళాకార నిర్మాణాలు

మార్చు

రాతిలో నిర్మించిన ఏడు అర్థగోళాకార నిర్మాణాలను ధోలావీరాలో కనుగొన్నారు. వీటిలో రెండింటిలో వివరంగా తవ్వకాలు జరిపారు. ఒకటి ఆకులున్న చక్రంలాగా ఉండగా, రెండవది ఆకుల్లేని చక్రం లాగా ఉంది. వాటిలో ఖనన సంబంధమైన మట్టికుండ లున్నప్పటికీ, అస్థిపంజరాలేమీ కనబడలేదు. ఒక్క సమాధిలో మాత్రం ఒక అస్థిపంజరం, ఒక రాగి అద్దమూ కనిపించాయి. రాగి తీగకు పూసలను గుదిగుచ్చి తయారు చేసిన ఒక గొలుసు (దానికి రెండు చివర్లా కొక్కేలు కూడా ఉన్నాయి), ఒక బంగారు గాజు, బంగారు, ఇతర పూసలు కూడా ఒక అర్థగోళాకార నిర్మాణంలో దొరికాయి.

ఈ అర్థగోళాకార నిర్మాణాలు తొలి బౌద్ధ స్థూపాలను పోలి ఉన్నాయి.[5] తవ్వకాలు జరిపిన పురాతత్వ సర్వే సంస్థ "ఆకులున్న చక్రం, ఆకుల్లేని చక్రాల డిజైన్‌లు శతపథ బ్రాహ్మణం, సులభ సూత్రాలలో ఉదహరించిన శరారత చక్ర సితి, సప్రాధి చక్ర సితిలను గుర్తుకుతెస్తాయి" అని అభిప్రాయపడింది.[5]

కనుగోళ్ళు

మార్చు
 
పురావస్తు స్థలం, ధోలావీరా

రంగు వేసిన మట్టి కుండలు, చతురస్రపు ముద్రికలు, సింధులిపి లేని ముద్రికలు, 3 మీ. పొడవైన సైన్‌బోర్డు మొదలైనవి ధోలావీరాలో లభించాయి. రాతిలో చేసిన కూర్చున్న భంగిమలో ఉన్న ఒక పురుషుని ప్రతిమ కూడా లభించింది. అది హరప్పాలో దొరికిన నాణ్యమైన రెండు రాతి శిల్పాలతో పోల్చదగినది.[22] పెద్ద జాడీలు కూడా దొరికాయి. చాలా పెద్ద కంచు సుత్తి, పెద్ద శానం ఒకటి, ఒక కంచు అద్దం, ఓ బంగారు తీగ, బంగారు చెవిపోగు, రంధ్రం కలిగిన బంగారు గోళీలు, రాగి గాజులు, లింగాకృతిలో ఉన్న రాళ్ళు, సింధు లిపిలో ఉన్న చతురాస్రపు ముద్రికలు, ఓ గుండ్రటి ముద్రిక, మూపురం కలిగిన జంతువులు, రంగులద్దిన మట్టి పాత్రలు, సూక్ష్మ రంధ్రాలు కలిగిన జాడీలు, మట్టి గ్లాసులు, బల్లాస్టు రాళ్ళతో చేసిన శిల్పాకృతులు, ఆకురాళ్ళు, మోర్టార్లు, మొదలైనవి కూడా ఈ స్థలంలో దొరికాయి. వివిధ పరిమాణాల తూనికరాళ్ళు కూడా దొరికాయి.[23]

కోస్తా దారి

మార్చు

లోథాల్, ధోలావీరాలను మక్రాన్ తీరంలోని సుట్‌కాగొన్ దోర్ను కలుపుతూ ఒక తీరపు రహదారి ఉండేదని భావన.[24]

భాష, లిపి

మార్చు

హరప్పన్లు మాట్లాడిన భాష గురించి తెలియదు. వారి లిపిని ఇంతవరకూ చదవలేకపోయారు. దానిలో 400 ప్రాథమిక గుర్తులు అనేక రూపాల్లో ఉన్నాయని భావిస్తున్నారు.[25] ఈ గుర్తులు పదాలను, పద బంధాలనూ కూడా సూచిస్తూ ఉండవచ్చు. రాత కుడి నుండి ఎడమకు రాసేవారు.[26] శాసనాలు ఎక్కువగా ముద్రల మీద (రాతిలో) చిరు ముద్రికల (మట్టిపై ముద్రికలను వత్తగా ఏర్పడిన ఆకృతి) మీదా ఉన్నాయి.కొన్ని శాసనాలను రాగి పలకల మీద, కంచు పాత్రలు, మట్టి, రాయి, పింగాణితో చేసిన చిన్న చిన్న వస్తువులు కూడా ఉన్నాయి. ఈ ముద్రలను వాణిజ్యానికి, అధికారిక కార్యకలాపాల కోసం కూడా వాడి ఉండవచ్చు.[27] మొహెంజో దారో లోను, ఇతర సింధు లోయ నాగరికత స్థలాల వద్దా లిఖిత వస్తువులెన్నో దొరికాయి.

ధోలావీరా సైన్‌బోర్డు

మార్చు
 
ధోలావీరా ఉత్తర ద్వారం వద్ద దొరికిన సింధు సంకేత లిపి

పట్టణపు ఉత్తర ద్వారం పక్కన ఉన్న ఒక గదిలో, ధోలావీరా సైన్‌బోర్డు అని పిలిచే సైన్‌బోర్డు ఒకదాన్ని కనుగొన్నారు. ఈ స్థలంలో దొరికిన వస్తువుల్లో అత్యంత విశిష్టమైన వాటిలో ఇది ఒకటి. ఒక పెద్ద చెక్కపై జిప్సమ్‌తో పది పెద్ద సంకేతాలను పేర్చిన పలక అది.[28] ఒకానొక సమయంలో ఆ పలక బోర్లాపడినట్లుగా తెలుస్తోంది. దీని చెక్క శిథిలమైందిగానీ అక్షరాలు మాత్రం అలాగే ఉండిపోయాయి. పలక మీది అక్షరాలు అక్కడ ఉన్న గోడల కోసం వాడిన ఇటుకలను పోలి ఉన్నాయి. ఒక్కో అక్షరం 37 సెం.మీ. ఎత్తుతో ఉన్నాయి. చెక్క పలక 3 మీటర్ల పొడవు ఉంది.[29] ఈ శాసనం సింధు లిపిలో దొరికిన అతి పెద్ద వాటిలో ఒకటి. ఈ సైన్‌బోర్డు లోని ఒక సంకేతం నాలుగు సార్లు ఉంది. ఇది, దాని పెద్ద సైజూ, బహిరంగంగా ప్రదర్శించిన విధానమూ మొదలైన వాటి ఆధారంగా సింధు లిపి పూర్తి స్థాయి అక్షరాస్యతను సూచిస్తోందని పురావస్తు శాస్త్రవేత్తలు భావిస్తారు. నాలుగు పెద్ద సంకేతాలు చిత్రించిన ఒక ఇసుకరాయి కూడా ఇక్కడ కనిపించింది. హరప్పా క్షేత్రాలన్నింటిలో ఇలాంటి వాటిలో ఇదే మొదటిదని భావిస్తున్నారు.[14]

మూలాలు

మార్చు
 1. "Ruins on the Tropic of Cancer".
 2. Kenoyer & Heuston, Jonathan Mark & Kimberley (2005). The Ancient South Asian World. New York: Oxford University Press. p. 55. ISBN 9780195222432.
 3. Centre, UNESCO World Heritage. "Dholavira: A Harappan City - UNESCO World Heritage Centre". whc.unesco.org (in ఇంగ్లీష్). Archived from the original on 25 మే 2016. Retrieved 3 June 2016.
 4. Possehl, Gregory L. The Indus Civilization: A Contemporary Perspective (in ఇంగ్లీష్). Rowman Altamira. p. 17. ISBN 9780759101722. Retrieved 3 June 2016.
 5. 5.0 5.1 5.2 "Excavations-Dholavira". Archaeological Survey of India. Archived from the original on 3 సెప్టెంబరు 2011. Retrieved 30 June 2012.
 6. Possehl, Gregory. (2004).
 7. Aqua Dholavira - Archaeology Magazine Archive Archived 2012-03-29 at the Wayback Machine.
 8. McIntosh, Jane. The Ancient Indus Valley: New Perspectives (in ఇంగ్లీష్). ABC-CLIO. p. 177. ISBN 9781576079072. Retrieved 3 June 2016.
 9. Suman, Saket. "When history meets development". TheStatesman. Archived from the original on 15 జనవరి 2017. Retrieved 3 June 2016.
 10. McIntosh, Jane. The Ancient Indus Valley: New Perspectives (in ఇంగ్లీష్) (2008 ed.). ABC-CLIO. p. 174. ISBN 9781576079072. Retrieved 3 June 2016.
 11. McIntosh, Jane. The Ancient Indus Valley: New Perspectives (in ఇంగ్లీష్). ABC-CLIO. p. 224. ISBN 9781576079072. Retrieved 3 June 2016.
 12. McIntosh, Jane. The Ancient Indus Valley: New Perspectives (in ఇంగ్లీష్). 2008: ABC-CLIO. p. 226. ISBN 9781576079072. Retrieved 3 June 2016.{{cite book}}: CS1 maint: location (link)
 13. Wheeler, Mortimer. The Indus Civilization: Supplementary Volume to the Cambridge History of India (in ఇంగ్లీష్) (1968 ed.). CUP Archive. p. 33. ISBN 9780521069588. Retrieved 3 June 2016.
 14. 14.0 14.1 Subramanian, T. "The rise and fall of a Harappan city". The Archaeology News Network. Archived from the original on 30 జూన్ 2016. Retrieved 3 June 2016. {{cite web}}: More than one of |archivedate= and |archive-date= specified (help); More than one of |archiveurl= and |archive-url= specified (help)
 15. Singh, Upinder (2008). A History of Ancient and Early Medieval India: From the Stone Age to the 12th Century. New Delhi: Pearson Education India. pp. 155 bottom. ISBN 978-813-17-1120-0.
 16. 16.0 16.1 16.2 16.3 16.4 16.5 16.6 "Dholavira excavations throw light on Harappan civilisation". United News of India. Indian Express. 25 June 1997. Retrieved 15 June 2012.
 17. Centre, UNESCO World Heritage. "Dholavira: A Harappan City - UNESCO World Heritage Centre". whc.unesco.org (in ఇంగ్లీష్). Archived from the original on 2016-05-25. Retrieved 2017-08-19.
 18. McIntosh, Jane (2008). The Ancient Indus Valley : New Perspectives. Santa Barbara, California: ABC-CLIO. p. 84. ISBN 978-157-60-7907-2.
 19. Singh, Upinder (2008). A History of Ancient and Early Medieval India: From the Stone Age to the 12th Century. New Delhi: Pearson Education India. p. 155. ISBN 978-813-17-1120-0.
 20. Possehl, Gregory. (2004).
 21. "5,000-year-old Harappan stepwell found in Kutch, bigger than Mohenjodaro's". The Times of India Mobile Site. 8 October 2014. Retrieved 3 January 2015.
 22. Possehl, Gregory L. (2002). The indus civilization : a contemporary perspective (2nd print ed.). Walnut Creek, CA: AltaMira Press. p. 124. ISBN 9780759101722.
 23. Singh, Upinder (2008). A History of Ancient and Early medieval India : from the Stone Age to the 12th century. New Delhi: Pearson Education. p. 163. ISBN 9788131711200.
 24. Singh, Upinder (2008). A History of Ancient and Early Medieval India : from the Stone Age to the 12th century. New Delhi: Pearson Education. p. 167. ISBN 9788131711200.
 25. Parpola, Asko (2005) Study of the Indus Script. 50th ICES Tokyo Session.
 26. Mahadevan, Iravatham (Feb 4, 2007). "Towards a scientific study of Indus Script". The Hindu. Archived from the original on 6 ఫిబ్రవరి 2007. Retrieved 30 June 2012.
 27. Kenoyer, Jonathan Mark.
 28. Kenoyer, Jonathan Mark.
 29. Possehl, Gregory. (2004).

బయటి లింకులు

మార్చు
"https://te.wikipedia.org/w/index.php?title=ధోలావీరా&oldid=4239816" నుండి వెలికితీశారు