కల్లూరి విశాలాక్షమ్మ

ప్రసిద్ధ కవయిత్రి

కల్లూరి విశాలాక్షమ్మ ప్రముఖ కవయిత్రి. ఈమె ప్రముఖ కవి శ్రీపాద కృష్ణమూర్తి శాస్త్రి గారి జ్యేష్టపుత్రిక.[1]

కల్లూరి విశాలాక్షమ్మ
జననం
శ్రీపాద విశాలాక్షమ్మ

1900
నడుపూడి
వృత్తికవయిత్రి
బిరుదుకవయిత్రీమణి,
విదుషీమణి
జీవిత భాగస్వామికల్లూరి వేంకట సుబ్బారాయుడు
తల్లిదండ్రులు

జీవిత విశేషాలు

మార్చు

ఈమె వికారి నామ సంవత్సర మాఘ శుద్ధ త్రయోదశిన తన మాతామహుల యింట నడుపూడి గ్రామంలో జన్మించింది.[2] తండ్రి శ్రీపాద కృష్ణమూర్తి శాస్త్రి కాశీయాత్ర చేసిన పిదప ఈమె జన్మించింది కనుక ఆయన ఈమెకు విశాలాక్షి అనే నామకరణం చేశాడు. ఈమె ప్రైమరీ విద్యకంటే ఎక్కువ చదువలేదు. వివాహానంతరం శ్రీపతి భాస్కరశాస్త్రి వద్ద ఆంధ్రనామ సంగ్రహము, భాస్కర రామాయణములను చదువుకున్నది. ఈమెకు వివాహం తన 11వ యేట 1912లో కల్లూరి వేంకటసుబ్బారాయుడుతో జరిగింది.

విశాలాక్షి తండ్రిగారి తోడల్లుడు ఫ్రెంచి యానాం కాపురస్తుడు, రాజకీయనాయకుడైన బులుసు సుబ్రహ్మణ్య శాస్త్రులు. ఆయన భార్య అయిన సూర్యప్రకాశమ్మ విశాలాక్షిగారికి పెద్దమ్మ అవుతారు. అందుచేత కాంగ్రేసు నాయకుడు, స్వాతంత్రసమరయోధుడు అయిన కళా వెంకటరావు ఈవిడకి మావయ్య వరస.

కవిత్వము

మార్చు

ఈమె తండ్రి కవి అగుటచేత ఈమెకు 12వ, 13వయేటనే పద్యములు అల్లడం వచ్చింది. మొదట ఈమె గోపాల శతకమును ప్రకటించింది. తరువాత ప్రభాకర శతకము, చంద్రమతీ చరిత్రము, దమయంతీ చరిత్రము అనే పద్యకావ్యాలను రచించింది. ఈ రచనా కాలంలో సందేహాలను నివృత్తి చేసుకోవడానికి తండ్రిని సంప్రదించెడిది. శ్రీపాద వారు మహాభారతమును రచిస్తుంటే ఈమెకు సంగ్రహ భారతం వ్రాయాలనే అభిలాష కలిగింది. తండ్రి ప్రోత్సాహముతో మూడు నెలల వ్యవధిలో భారత కథామృతమును వ్రాసి తండ్రికి వినిపించింది. అతడు అది విని ఆమెను కొనియాడి తన పత్రిక వజ్రాయుధంలో వరుసగా ప్రకటించాడు. తరువాత ఇది పుస్తకరూపంలో తన 21వయేట ప్రకటించింది. ఈ పుస్తకానికి ప్రముఖ విమర్శకుడు నాగపూడి కుప్పుస్వామయ్య పీఠికను రచించాడు. ఈ కావ్యం జయంతి రామయ్య, ఆదిభట్ల నారాయణదాసు వంటి పండితుల ప్రశంసలను అందుకుంది. తరువాత ఈమె భాగవత కథామృతమును, శ్రీరామ కథామృతమును రచించింది. భాగవత కథామృతము ఆంధ్రప్రదేశ్ సాహిత్య అకాడమీ వారి ద్రవ్య సహాయంతో ప్రచురింపబడింది. దీనికి కేశిరాజు వేంకట నృసింహ అప్పారావు పీఠికను వ్రాశాడు. వెంపరాల సూర్యనారాయణశాస్త్రి, నోరి నరసింహశాస్త్రి, దివాకర్ల వేంకటావధాని, నిడుదవోలు వేంకటరావు మొదలైనవారు ఈ కావ్యాన్ని మెచ్చుకున్నారు. ఇంకా ఈమె అనేక వచన పద్య గ్రంథాలను రచించి ప్రకటించింది.

రచనలు

మార్చు
 1. గోపాల శతకము
 2. ప్రభాకర శతకము
 3. చంద్రమతీ చరిత్రము
 4. దమయంతీ చరిత్రము
 5. భారత కథామృతము
 6. భాగవత కథామృతము
 7. శ్రీరామ కథామృతము
 8. శ్రీరామ శతకము
 9. చిరంజీవుల చరిత్రము (1000 పద్యముల కావ్యము)
 10. వచన భారతము
 11. వచన భాగవతము
 12. వచన రామాయణము
 13. మాలతి (వచన కావ్యము)
 14. చంద్రిక (వచన కావ్యము)
 15. సుచరిత్ర (వచన కావ్యము)
 16. రాజ్యలక్ష్మీ పరిణయము
 17. వచన భగవద్గీత
 18. పంచకన్యా ప్రభావము
 19. ద్వారకా తిరుమల మహాత్మ్యము
 20. రాధామాధవ చరిత్రము (బ్రహ్మవైవర్త పురాణం ఆధారంగా రచింపబడింది)
 21. కాశీఖండము
 22. మహాభారత ధర్మములు
 23. కథామంజరి
 24. ఐశ్వర్యము
 25. శంకర చరిత్రము
 26. మంగళగిరి మహాత్మ్యము
 27. భద్రాచల రామ చారిత్ర్యము
 28. అన్నవర మాహాత్మ్యము
 29. శ్రీహరి శతకము
 30. చంద్రశేఖర శతకము

సన్మానాలు, సత్కారాలు

మార్చు

ఈమె అనేక సన్మానాలను, సత్కారాలను పొందింది.

 • తన 14వ యేట ఒక పోటీ పరీక్షలో "చిలుక"పై పంచరత్నాలు వ్రాసి "మనుచరిత్ర", "భాస్కర రామాయణం" గ్రంథాలను బహుమతిగా పొందింది.
 • ముక్త్యాల రాణి ఆదేశంతో శ్రీ రాజ్యలక్ష్మీ పరిణయము అనే గ్రంథాన్ని రచించి, ఆమెచే 500 రూపాయలతో సత్కరింపబడింది.
 • విజయవాడ త్రిలింగ మహాపీఠము వారు ఈమెకు "కవయిత్రీమణి" అనే బిరుదును ప్రదానం చేసి 116 రుపాయలతో సత్కరించారు.
 • అన్నవరం దేవస్థానం వారు సత్కరించారు.
 • చెన్నపురి ఆంధ్ర మహిళాసభ వారిచే సత్కారం పొందింది.
 • భారతమహిళామండలి, విజయవాడ వారు సన్మానించారు.
 • గుడివాడ భారతీ సమితి వారు "విదుషీమణి" బిరుదుతో సత్కరించారు.
 • 1973 ఫిబ్రవరిలో ఆంధ్రప్రదేశ్ సాహిత్య అకాడమీవారు సన్మానించారు.

మూలాలు

మార్చు
 1. పైడిపాటి, సుబ్బరామశాస్త్రి (4 February 1973). "కవయిత్రీమణి శ్రీమతి కల్లూరి విశాలాక్షమ్మ". ఆంధ్ర ప్రభ దినపత్రిక ఆదివారం అనుబంధం. No. సంపుటి 38 సంచిక 31. Retrieved 18 March 2018.[permanent dead link]
 2. అనంతపంతుల, రామలింగస్వామి (1965). శ్రీకృష్ణకవి జీవితము (2 ed.). మద్రాసు: అనంతపంతుల రామలింగస్వామి. pp. 63–66.