కలంకారీ

వస్త్రాలపై చిత్రించే కళ
(కళంకారీ నుండి దారిమార్పు చెందింది)

కలంకారీ అనగా వెదురుతో చేసిన కలంతో సహజమైన రంగులను ఉపయోగించి వస్త్రాలపై బొమ్మలు చిత్రించే ఒక కళ. ఇది చిత్తూరు జిల్లా శ్రీకాళహస్తిలో పుట్టింది. పురాతన హరప్పా నాగరికతకు సంబంధించిన త్రవ్వకాలలో లభించిన ఒక వెండి పాత్ర మీద చిత్రాలు ఉన్న ఒక వస్త్రం ఆధారంగా కలంకారీ కళ చాలా ప్రాచీనమైనదని తెలుస్తోంది. బౌద్ధ ఆరామాలు కూడా ఈ కలంకారీ వస్త్రాలతో అలంకరించే వారు. అలెగ్జాండర్ కూడా కలంకారీ వస్త్రాలను తనతోపాటు తీసుకువెళ్ళాడంటారు.[1] కారీ అనగా హిందీ లేదా ఉర్దూలో పని అని అర్థం. 10వ శతాబ్దంలో పర్షియన్, భారతీయ వర్తకుల సంబంధాల నేపథ్యం నుంచి ఈ పదం ఉద్భవించి ఉండవచ్చు.[2] ఐరోపా వర్తకులు కూడా ఇలాంటి వస్త్రాలపై చిత్రించే కళను వేరే పేర్లతో పిలుస్తుంటారు. ఉదాహరణకు పోర్చుగీసు వారు దీనిని పింటాడో అని అంటారు. డచ్చి వారు సిట్జ్ అనీ బ్రిటీష్ వారు షింజ్ అనీ పిలుస్తారు. కృష్ణా జిల్లా పెడనలో దీన్ని బ్లాక్ ప్రింటింగ్ పిలుస్తారు. ప్రస్తుతం మనం చూసే బ్లాక్ ప్రింటింగ్సు పెడన నుండి వస్తుంటే దేవతా చిత్రాలు (హస్త కళలు) అన్నీ కాళహస్తి నుండి వస్తున్నాయి. అయితే తూర్పుగోదావరి జిల్లాలో ఆర్యవటంలో కూడా కొంతమంది పెడన తరహాలోన బ్లాక్ ప్రింటింగ్ చేస్తున్నారు.

గీతోపదేశం బాగా జనప్రియమైన చిత్రం. ఇది కలంకారీ శైలిలో వస్త్రంపై అద్దిన చిత్రం.

చరిత్ర

మార్చు

ఈ కళ శ్రీకాళహస్తిలో కచ్చితంగా ఎప్పుడు ప్రారంభమైందో తెలియజేయడానికి కచ్చితమైన ఆధారాలు లేవు. ఉన్న ఆధారాలను బట్టి, 13, 19వ శతాబ్దాల్లో కోరమాండల్ తీరం వెంబడి వస్త్ర వ్యాపారం బాగా జరిగేది. కాబట్టి దక్కను పీఠభూమికి చెందిన అన్ని ప్రదేశాలలోనూ ఈ కళ విలసిల్లిందని తెలుస్తుంది. పట్టణాన్ని ఆనుకుని ఎల్లప్పుడూ ప్రవహించే సువర్ణముఖీ నదిలో ఈ కళకు ముఖ్యంగా అవసరమైన స్వచ్ఛమైన పారే నీరు లభించటం వలన ఇది ఇక్కడ బాగా ప్రాచుర్యం పొంది ఉండవచ్చు. ప్రసిద్ధి గాంచిన శ్రీకాళహస్తేశ్వరాలయం పర్యాటకులను, యాత్రికులను ఆకర్షించడం కూడా ఇందుకు కారణం కావచ్చు. ఈ కళ ఎక్కువగా హిందూ సంప్రదాయాన్నే ప్రతిబింబిస్తుంది. ఇక్కడగల కళాకారులు ఇప్పటికీ రామాయణము, మహాభారతం, శివ పురాణం మొదలైన వాటిని నుంచి పాత్రలను చిత్రిస్తూ సంప్రదాయాన్ని కొనసాగిస్తున్నారు.

కోరమాండల్ తీరం వెంబడి ఉన్న ముఖ్యమైన మచిలీపట్నం ఓడరేవు ద్వారా ఈ కళంకారీ ఉత్పత్తులు ప్రపంచం నలుమూలలకూ వ్యాపించి ఉండవచ్చు. మచిలీపట్నం ఓడరేవుకు సౌకర్యాలు సరిగా లేకపోయినా గోల్కొండ ప్రభువులతో సంబంధాలు ఉండటంవలన అది ముఖ్యమైన ఓడరేవుగా విలసిల్లింది. గోల్కొండ ప్రభువులైన కుతుబ్ షాలు కళంకారీ ఉత్పత్తులను ఎక్కువగా కోరే పర్షియన్ వర్తకులతో వ్యాపార సంబంధాలపై ప్రత్యేక శ్రద్ధ వహించేవారు. ఈజిప్టులో కైరో వద్దగల ఫోస్టాట్ అనే ప్రదేశం వద్ద పురాతత్వ శాఖ తవ్వకాలు జరిపే వరకూ భారతదేశంలో వస్త్రాలపై కళాఖండాలను చిత్రించే సంస్కృతి పెద్దగా ఎవరికీ తెలియదు. ఈ తవ్వకాల్లో వివిధ చిత్రాలతో కూడిన్ భారతదేశ నూలు వస్త్రాలు కనిపించాయి. ఈ వస్త్రాలను 18వ శతాబ్దంలో పశ్చిమ తీరం ద్వారా ఆ దేశాలను ఎగుమతి అయిఉండవచ్చునని చరిత్రకారులు భావిస్తున్నారు.

కలంకారీ ఉత్పత్తులు మార్కెట్ అవసరాలను బట్టి వివిధ రూపాలలో తయారవుతుంటాయి. ప్రార్థనా వస్త్రాలు, దుప్పట్లు, దిండు గలీబులు, ప్రవేశ ద్వారా వస్త్రాలు జంతురూపాలు, వివిధ పుష్పాలతో కూడిన డిజైన్లు మొదలైనవి మధ్య ఆసియా మార్కెట్ కోసం తయారు చేస్తే, కుట్టుపనిని పోలి ఉండే జీవమున్న చెట్లు లాంటి డిజైన్లు ఐరోపా మార్కెట్ ను దృష్టిలో ఉంచుకుని తయారు చేస్తారు. దుస్తులకు అవసరమైన అంచులు,, గోడలకు వేలాడదీయగలిగే చిత్ర పటాలు ఆగ్నేయ ఆసియా దేశాలకు ఎగుమతి అవుతుంటాయి. ధరించే వస్త్రాలకు అవసరమయ్యే డిజైన్లు తూర్పు ఆసియాకు ఎగుమతి అవుతుంటాయి.

సుగంధ ద్రవ్యాల వ్యాపారస్థులు వస్తుమార్పిడి పద్దతి ప్రకారం తమ వ్యాపారం కోసం భారతీయ వస్త్రాలను ముఖ్యంగా కళంకారీ వస్త్రాలను వాడేవారు. ముఖ్యంగా ఈ కళంకారిలో చెప్పుకోవలసింది ఏమిటి అంటే ఈ విధానంలో వాడే రంగులు అన్నీ సహజసిద్ధమైన రంగులే (కూరగాయల నుంచి సేకరించినవి). ఇవి శరీరానికి ఏ విధమైన హానీ చేయవు. నిజాంల కాలంలో విదేశస్థులు కలంకారీ చేసిన గుడ్డకు సరితూగే బంగారాన్ని ఇచ్చి కొనుక్కొని మచిలీపట్నం (బందరు) ఓడరేవు ద్వారా తమ దేశాలకు తీసుకొని వెళ్ళేవారు.

19వ శతాబ్దపు ఈ కళాకారుల్లో ఎక్కువగా బలిజ కులస్తులే ఉండేవారు. వీరు సాంప్రదాయంగా వ్యవసాయంపై, కుటీర పరిశ్రమలపై ఆధారపడి నివసించేవారు. ప్రస్తుతం కాళహస్తి చుట్టు పక్కలా సుమారు మూడు వందలమంది కళాకారులు వస్త్రాలను, రంగులను తయారు చేయడం, మొదలైన కళంకారీకి సంబంధించిన వివిధ పనులపై ఆధారపడి జీవిస్తున్నారు. 20 వ శతాబ్దం మధ్యకు వచ్చేసరికి చాలామంది కళాకారులు వ్యవసాయం వైపు లేదా ఇతర పనుల వైపు మళ్ళడంతో శ్రీకాళహస్తిలో ఈ కళ చివరకు అదృశ్యమయ్యే స్థాయికి చేరుకుంది. 1950లలో కమలాదేవి ఛటోపాధ్యాయ అనే కళా ఉద్యమకారిణి కృషితో ప్రభుత్వం ఈ కళ యొక్క ప్రాముఖ్యతను గుర్తించి శ్రద్ధ తీసుకోవడంతో పునరుజ్జీవనం పొందింది.

చిత్రించే విధానం

మార్చు

మిక్కిలి ఓర్పుతో కలంకారీ అద్దకపు పరిశ్రమలో కళాకారులు ప్రదర్శించే అభిలాషలో, ఉత్సాహంలో వారి అర్పణభావం ప్రకటితమవుతుంది. మొట్టమొదట బట్టను కలంకారీ కళాకారుడు చిత్రించదలచిన కాన్వాసుగా తయారుచేసుకుంటాడు. దళసరిపాటి గాడా చేనేత బట్టను శుభ్రంగా ప్రవహిస్తున్న నీటిలో బట్టకు పెట్టిన గంజి, పిండి పోయేదాకా నాలుగైదుసార్లు శుభ్రం చేస్తారు. దీనిని శుభ్రం చేయడానికి సబ్బుగానీ, ఇతర డిటర్జెంట్లుగానీ ఉపయోగించరు. ఈవిధంగా శుభ్రం చేసిన బట్టను గేదె పాలు, కరక్కాయల రసంకలిపిన మిశ్రమంలో ముంచి ఎండలో ఆరబెడతారు. ఈవిధంగా ఆరబెట్టిన బట్ట ఇప్పుడు కలంకారీ అద్దకానికి సిద్ధమైంది. చింతబొగ్గుతో తయారైన బొగ్గు కణికెలతో ఈ బట్ట మీద భావానుగుణ్యంగా హస్తకళానైపుణ్యంతో చిత్రాలను చిత్రిస్తారు. ఈ చిత్రాలను అన్నభేది ద్రావణంతో సుడిచి చిత్రాలను చెరగని నల్లరంగుగా తయరుచేస్తారు. సుదీర్ఘమైన ఈ కలంకారీ విధానంలో ఇది మొదటిమెట్టు. ఈవిధంగా ఉతికి ఉడకబెట్టి చిత్రాలు గీసి పెయింటింగ్ వేసి ఎండబెట్టి కలంకారీ అద్దకపు బట్టను పూర్తిచేస్తారు.

కలంకారీ చిత్రకారుల హస్తకళా కౌశలాన్ని చూడడం కనులకు విందు. కలాన్ని వ్రేళ్ళతో పట్టుకుంటాడు. కావలసిన రంగులో ముంచిన చిన్న గుడ్డనుగానీ, దూదినిగానీ, కలంలో పెట్టి వ్రేలితో నొక్కుతూ కావలసినంత రంగు ద్రవాన్ని కలం గుండా ప్రవహింపజేస్తూ పై రేఖా చిత్రాల మీద వర్ణం వేస్తాడు. నిపుణుల చేతిలో సంపూర్ణంగా చిత్రించిన చిత్రాలు చైతన్యవంతంగా తయారవుతాయి. రంగులు కన్నులకు కొట్టవు. నాజూకైన వర్ణాలు అరిమృదువుగా, కంటికి ఇంపుగా, సమరస భావంతో చల్లగా ఉంటాయి. దిజైన్లలో, రంగులో మచిలీపట్టణం అద్దకాలను మించినవి లేవు. పురాతన కాలం నుంచీ ఇవి ఎంతో ప్రసిద్ధిని పొందాయి. 1658-1664 సంవత్సరాల మధ్య ఒక ఫ్రెంచి యాత్రికుడు ఫ్రాంకాయిన్స్ బెర్నీర్ మొగలాయి చక్రవర్తులు టెంటులకు ఉపయోగించే బట్ట గురించి వ్రాస్తూ పైల ఎర్ర రంగు గలిగి లోతట్టు మచిలీపట్టణం పెన్‌తో చిత్రింపబడిన అందమైన అద్దకపు బట్టలను జోదిస్తారు అని వర్ణించాడు. ఆంధ్ర దేశంలో కలంకారీ కళ అంత ఖ్యాతిని గడించి ప్రపంచ కలంకారీ చరిత్రలో ఓ విశిష్ట స్థానాన్ని పొందింది.[3]

ప్రముఖ కలంకారీ కళాకారులు

మార్చు
  1. జొన్నలగడ్డ గుర్రపశెట్టి (పద్మశ్రీ ఆవార్డ్ గ్రహీత)
  2. కసిరెడ్డి శివప్రసాద రెడ్డి
  3. తలిశెట్టి మోహన్
  4. మునిరత్నం పూజారి
  5. గాంగాధర్
  6. పిచ్చుక శ్రీనివాస్
  7. డా. బాలాజీ తీర్థం

ఇవి కూడా చూడండి

మార్చు

మూలాలు

మార్చు
  1. "ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ అధికారిక వెబ్ సైటు నుంచి". Archived from the original on 2008-05-12. Retrieved 2008-05-01.
  2. "కలంకారీ ఆర్ట్.ఆర్గ్ వెబ్ సైటు నుంచి". Archived from the original on 2008-05-13. Retrieved 2008-04-12.
  3. "ఆర్కైవ్ నకలు". Archived from the original on 2016-03-10. Retrieved 2009-07-02.
"https://te.wikipedia.org/w/index.php?title=కలంకారీ&oldid=4341272" నుండి వెలికితీశారు