కళాధర్ (అక్టోబర్ 1, 1915 - మే 18, 2013) అసలు పేరు సూరపనేని వెంకట సుబ్బారావు. చిత్ర కళా దర్శకుడు.

సూరపనేని వెంకట సుబ్బారావు
కళాధర్
జననంసూరపనేని వెంకట సుబ్బారావు
అక్టోబర్ 1, 1915
మరణంమే 18, 2013
ఇతర పేర్లుకళాధర్
ప్రసిద్ధిశతాధిక చిత్రాలకు కళా దర్శకుడు
పాతాళభైరవి, మాయాబజార్ సినిమాలతో పేరు, ప్రఖ్యాతులు
మతంహిందూ మతము
భార్య / భర్తసుధాదేవి
పిల్లలుఇద్దరు కూతుళ్లు.
తండ్రివెంకటకృష్ణయ్య,
తల్లిబుల్లెమ్మ

1915, అక్టోబర్ 1 న వెంకటకృష్ణయ్య, బుల్లెమ్మ దంపతులకు జన్మించారు. స్వస్థలం ఆంధ్రప్రదేశ్ కృష్ణాజిల్లా, ఇందుపల్లి సమీపంలోని ఎలుకపాడు. చిన్నతనం నుంచి కళపై ఆసక్తి. దీంతో డ్రాయింగ్ పరీక్షలో ఉత్తీర్ణుడై 1934లో పామర్రు హైస్కూలులో డ్రాయింగ్ టీచర్‌గా వృత్తిని చేపట్టారు.మాయాబజార్ వంటి కళాఖండానికి కళలను చెక్కిన కళాదర్శకుడు కళాధర్ (98). ఎన్నో చారిత్రక చిత్రాలకు కళా శిల్పిగా పనిచేశారు.ఆయనకు ఇద్దరు కూతుళ్లు. 1936లో సుధాదేవిని జీవిత భాగస్వామిగా చేసుకున్నారు. 1945లో మద్రాసు చేరుకొని ‘గృహప్రవేశం’ చిత్రంతో సినీరంగ ప్రవేశం చేశారు. ఆ తరువాత విజయా సంస్థకు ఆస్థాన కళా దర్శకుడిగా పనిచేశారు. పాతాళభైరవి, మాయాబజార్ నుంచి ఉమా చండి గౌరి శంకరుల కథ వరకు అత్యధిక చిత్రాలకు పనిచేశారు. దివంగత మహానటుడు ఎన్‌టిరామారావు ‘మనదేశం’ చిత్రం ద్వారా పరిచయానికి కారకులైన వారిలో కళాధర్ ఒకరు.ఈయన డీవీఎస్ ప్రొడక్షన్‌లోను అధిక చిత్రాలకు పనిచేశారు.మా గోఖలేతో కలిసి ఆయన పలు చిత్రాలకు కళాదర్శకత్వం వహించారు.విజయా సంస్థ నుంచి విడుదలైన దాదాపు అన్ని చిత్రాలకు కళా దర్శకుడిగా పనిచేశారు. తెలుగు, తమిళం, కన్నడం, హిందీ మొదలగు భాషల్లో శతాధిక చిత్రాలకు కళా దర్శకుడిగా పనిచేసి కీర్తి గడించిన కళాధర్‌కు రాష్ట్ర ప్రభుత్వం నుంచి అవార్డులు మాత్రం లభించలేదు.చెన్నైలోని స్వగృహంలో 18.5.2013 న కన్నుమూశారు.

ఓ సాధారణ డ్రాయింగ్ టీచర్ అసాధారణ నైపుణ్యంతో తెలుగు చలనచిత్రాలకు అపురూప కళాకాంతులద్ది ‘ఔరా’ అన్పించారు. ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం లేని అలనాటి రోజుల్లో అద్భుతాలను ఆవిష్కరించి, ఆయన ‘కళ’ను కొత్తపుంతలు తొక్కించారు. సినీ పరిశ్రమలో ‘గృహ ప్రవేశం’ చేసిన ఆయన- తెలుగు ప్రేక్షకులకు ‘మాయాబజారు’ వింతల్ని, ‘పాతాళభైరవి’ రూపాన్ని చూపించి మంత్రముగ్ధులను చేశారు. ఆయనే- ‘కుంచె’తో విన్యాసాలు చేసిన ఆర్టు డైరెక్టర్ కళాధర్ (98). కొంతకాలంగా అనారోగ్యంతో ఉన్న ఆయన శనివారం చెన్నైలోని తన స్వగృహంలో తుది శ్వాస విడిచారు. ఆదివారం అంత్యక్రియలు నిర్వహించగా, పలువరు సినీ ప్రముఖులు ఆయన మృతికి సంతాపం వ్యక్తం చేశారు. అసలు పేరు సూరపనేని వెంకట సుబ్బారావు అయినప్పటికీ ఆయన ‘కళాధర్’గానే దక్షిణాది చలన చిత్రసీమలో అఖండ కీర్తిని ఆర్జించారు. చిన్నతనం నుంచే చిత్రలేఖనంపై ఆసక్తి, అనురక్తి ఉండడంతో ఆయన మద్రాసు వెళ్లి తన ‘కుంచె’ సత్తాను నిరూపించుకున్నారు. సాంకేతిక పరిజ్ఞానం పెరిగిన కొద్దీ సినిమా రం గంలో పద్ధతులు మారిపోతున్నాయని, మున్ముందు ఇంకా మారతాయని కళాధర్ తన సన్నిహితుల వద్ద చెప్పేవారు. ‘మాయాబజారు’, ‘పాతాళభైరవి’, ‘గుండమ్మ కథ’ వంటి సినిమాలు అద్భుత కళాఖండాలుగా నిలిచిపోయాయంటే ఆ రోజుల్లో ఏడాదికి ఒక సినిమాను అతి శ్రద్ధగా, మంచి సాంకేతిక నైపుణ్యంతో తీయాలన్న తపన ఉండేదని గుర్తుచేసేవారు. ‘రోజుకు ఎన్ని సీన్లు, ఎన్ని షాట్లు తీశామన్నది ప్రశ్న కాదు, అవసరమైన సమయం తీసుకుని అనుకున్న ‘ఎఫెక్టు’ వచ్చేలా తక్కువ పనైనా ఎంతో శ్రద్ధగా ముగించేవారు. నలుపు-తెలుపు సినిమాల కాలంలో లైటింగ్ వంటి అంశాలకు చాలా శ్రమ, సమయం వెచ్చించాల్సి వచ్చేది’- అని ఆయన చెబుతుండేవారు. సరైన ప్రణాళిక, సమష్టి కృషి, అంకిత భావం తోడైతేనే సినిమాల్లో కళాకారుల నైపుణ్యం బయట పడుతుందని కళాధర్ అనేవారు. నలుపు-తెలుపు సినిమాల్లో వెనె్నల దృశ్యాలను చిత్రీకరించేందుకు ఎంతో నైపుణ్యం, సహనం చూపించాల్సి వచ్చేదని, నేటి ఆధునిక యుగంలో ఒక సినిమాకు నెలల తరబడి కాలాన్ని వెచ్చిస్తే అంతా అపహాస్యం చేస్తారని కళాధర్ తన జ్ఞాపకాలను నెమరువేసుకునేవారు. అరుదైన ప్రతిభ చూపిస్తేనే సాంకేతిక నిపుణులకు గుర్తింపు, నిర్మాతలకు లాభాలు దక్కుతాయని ఆయన అభిప్రాయపడేవారు.

 
1952లో కళాధర్

తెలుగు, తమిళ, కన్నడ, హిందీ భాషల్లో శతాధిక చిత్రాలకు కళా దర్శకుడిగా పనిచేసిన ఆయన అనితర సాధ్యమైన ‘మినియేచర్ల’ను సృష్టించి ఎనె్నన్నో అద్భుతాలను ఆవిష్కరించారు. అపురూప దృశ్యాలను మనకు సాక్షాత్కరింపజేశారు. కృష్ణా జిల్లా గుడివాడ సమీపంలోని ఎలకపాడులో 1915 అక్టోబర్ 1న సూపరనేని వెంకట కృష్ణయ్య, బుల్లెమ్మ దంపతులకు జన్మించిన కళాధర్ చిత్రలేఖనంపై మమకారంతో డ్రాయింగ్ పరీక్షల్లో ఉత్తీర్ణత సాధించి, 1934లో పామర్రు హైస్కూల్‌లో డ్రాయింగ్ టీచర్‌గా చేరారు. చిన్న వయసులోనే డ్రాయింగ్ టీచర్ అవతారమెత్తిన ఆయనను అంతా వింతగా చూసేవారు. ఆ రోజుల్లో డ్రాయింగ్ క్లాసు అంటే విద్యార్థుల్లో సైతం అలక్ష్య భావం ఉండేది. అయినా ఏ మాత్రం అధైర్యపడక విద్యార్థులను దారిలోకి తెచ్చి డ్రాయింగ్ పట్ల వారిలో ఆసక్తి కలిగేలా తన శక్తియుక్తులను ప్రయోగించి కళాధర్ తాను అనుకున్నది సాధించారు. గుడివాడలో డ్రాయింగ్ టీచర్‌గా పనిచేస్తున్న కె.వేణుగోపాలం వద్ద శిష్యరికం చేసి, చిత్రలేఖనంలో డిప్లమో సాధించారు. 1936లో సుధాదేవితో కళాధర్‌కు వివాహం జరిగింది. వివాహం జరిగాక సూరపనేని వెంకట సుబ్బారావు పేరు ‘కళాధర్’గా మారింది. ఆ పేరును సార్థకం చేసుకోవాలని, మంచి ఆర్టిస్టుగా గుర్తింపు పొందాలని కళాధర్ పరితపిస్తూ ఆ దిశగా నిరంతరం కృషి చేసేవారు. ఆర్టిస్టుగా, నిలువెత్తు చిత్రాల పెయింటర్‌గా మంచి పేరు, ఆదాయం దక్కినా ఇంకా ఏదో చేయాలన్న తపన కారణంగా తన మిత్రుల సూచనలపై సినిమా రంగంపై దృష్టి సారించారు. భార్యాపిల్లలను అత్తవారింట వదిలిపెట్టి, 1945లో కళాధర్ మద్రాసు చేరుకున్నారు. అదే సంవత్సరం ‘గృహప్రవేశం’తో సినీరంగ ప్రవేశం చేశారు. ఆ సినిమాకు ఆర్టు డైరెక్టర్‌గా పనిచేసిన వాలి కళాధర్‌లోని నైపుణ్యాన్ని గుర్తించి ఎంతగానో ప్రోత్సహించి కీలక బాధ్యతలను అప్పగించారు. ఎల్‌వి ప్రసాద్, కెఎస్ ప్రకాశరావుతదితరుల ప్రోత్సాహంతో మరిన్ని అవకాశాలు దక్కడంతో 1946లో కళాధర్ తన కుటుంబాన్ని మద్రాసుకు తీసుకువచ్చారు. ఆ తర్వాత విజయా పిక్చర్స్‌కు ఆస్థాన కళాదర్శకుడిగా పనిచేశారు. మాయాబజారు, పాతాళభైరవి, గుండమ్మకథ,మిస్సమ్మ వంటి కళాఖండాలకు కళాకాంతులు సమకూర్చిన ఆయన పేరు చిత్రసీమలో మార్మోగింది. మిగతా భాషల చిత్రాల్లో పనిచేసేందుకు కూడా ఎన్నో అవకాశాలు వచ్చాయి. సాంకేతిక విలువలతో కొత్తదనాన్ని చూపడం వల్లే ‘పాతాళభైరవి’ అఖండ విజయం సాధించి విజయా పిక్చర్స్‌కు కనకవర్షం కురిసిందని కళాధర్ చెప్పేవారు. ఇక, మాయాబజరు సాధించిన విజయం తెలుగు చిత్రసీమకే గర్వకారణం అని అభివర్ణించేవారు. తాను, మా గోఖలే కలిసి సుదీర్ఘ కాలం పాటు ఆర్టు డైరెక్టర్లుగా పనిచేసేందుకు దర్శక, నిర్మాతలు ఎంతగానో తోడ్పాటు అందించారని చెప్పేవారు. పరిశ్రమలో లభించిన స్వేచ్ఛ, సహకారం వల్లే ‘గోఖలే’, ‘కళాధర్’ పేర్లకు ప్రత్యేకత వచ్చిందని ఆయన గుర్తు చేసుకునేవారు. విజయా సంస్థలో సినిమాల నిర్మాణం తగ్గిపోయాక డివిఎస్ రాజు తీసిన అనేక సినిమాలకు కళాధర్ ఆర్టు డైరెక్టర్‌గా పనిచేశారు. ఎంతోమంది ప్రముఖ దర్శక, నిర్మాతలు కూడా ఆర్టు డైరెక్టర్‌గా కళాధర్‌నే ఎంపిక చేసుకునేవారు. కాలక్రమంలో తెలుగు సినీ పరిశ్రమ మద్రాసు నుంచి హైదరాబాదు‌కు తరలిపోయింది. కుటుంబ పరిస్థితుల కారణంగా కళాధర్ మద్రాసులోనే ఉండిపోయారు. రానురానూ ఔట్‌డోర్ షూటింగ్‌లే ఎక్కువ కావడంతో కళాదర్శకులకు డిమాండ్ తగ్గుతూ వచ్చింది. అయినప్పటికీ కొంతమంది నిర్మాతల వత్తిడితో దాదాపు దశాబ్దం పాటు ఆయన ఎనె్నన్నో ఊళ్లు తిరుగుతూ అవస్థలు పడుతూ సినిమాలకు పనిచేసేవారు. ‘నటరత్న’ ఎన్‌టి రామారావు ‘మనదేశం’ సినిమా ద్వారా సినీ పరిశ్రమకు పరిచయం కావడానికి దోహదపడిన వారిలో కళాధర్ కూడా ఒకరు. నిరంతర శ్రమ, తగిన నైపుణ్యం వల్లే గుర్తింపు వస్తుందనే కళాధర్ మాటలు కళాకారులందరికీ ఎప్పటికీ శిరోధార్యం.

యితర లింకులు

మార్చు
"https://te.wikipedia.org/w/index.php?title=కళాధర్&oldid=3267418" నుండి వెలికితీశారు