కాంతి శాస్త్రం అంటే కాంతి లక్షణాలను, ప్రవర్తనను వివరించే భౌతిక శాస్త్ర విభాగం. ఈ శాస్త్రంలో కాంతిని గుర్తించే పరికరాలు, కాంతిని వాడుకునే పరికరాలు, వివిధ రకాలైన పదార్థాల మీద కాంతి ప్రభావం లాంటి అంశాలు ఉంటాయి. ప్రధానంగా మానవులు చూడగలిగే కాంతి, అతినీలలోహిత కిరణాలు, పరారుణ కిరణాలు గురించి ఇందులో వివరణ ఉంటుంది. కాంతిని విద్యుదయస్కాంత తరంగాలుగా కూడా అభివర్ణిస్తారు కాబట్టి ఆ తరంగాల ఇతర రూపాలైన ఎక్స్-రే, మైక్రోవేవ్, రేడియో తరంగాలను అధ్యయనం చేయడం కూడా ఇందులో భాగమే.[1] [2]

కాంతి విక్షేపణం

కాంతి చాలా ధర్మాలను కాంతిని విద్యుదయస్కాంత తరంగాలుగా భావించి వివరించవచ్చు. అయితే ఈ భావన ద్వారా కాంతి అన్ని ధర్మాలను ప్రయోగపూర్వకంగా నిరూపించడం కష్టసాధ్యం. అందుకోసం సరళమైన నమూనాల ద్వారా కాంతి మీద ప్రయోగాలు సాగించారు. కాంతి జ్యామితి ఇందులో ప్రధానమైనది. ఇందులో కాంతిని ఋజువుగా (నేరుగా) ప్రయాణించే కిరణాల సముదాయంగా అభివర్ణించారు. అవి ఏదైనా ఉపరితలాన్ని తాకినప్పుడు వంగడమో లేదా ఆ వస్తువుల గుండా చొచ్చుకుని ప్రయాణించడమో చేస్తాయి. కాంతి భౌతిక శాస్త్ర నమూనా కాంతి ధర్మాలను మరింత విపులంగా వివరిస్తుంది. 19వ శతాబ్దంలో విద్యుదయస్కాంత సిద్ధాంతం అభివృద్ధి సాధించడంతో కాంతిని విద్యుదయస్కాంత తరంగాలుగా ఉంటుందని నిర్ధారణకు వచ్చారు.[3]

కొన్ని కాంతి ధర్మాలు వివరించాలంటే కాంతిని తరంగాలు గానూ,, కణాలుగా కూడా ఊహించాలి. క్వాంటమ్ మెకానిక్స్ ద్వారా వీటిని వివరిస్తారు. కాంతిని కణధర్మాలను వివరించడానికి దానిని ఫోటాన్ల సముదాయంగా భావిస్తారు.

కాంతి శాస్త్రాన్ని దాని అనుబంధ రంగాలైన ఖగోళ శాస్త్రం, వివిధ ఇంజనీరింగ్ రంగాలు, ఫోటోగ్రఫీ, వైద్యరంగాలలో విరివిగా వాడుతున్నారు. నిత్యజీవితంలో మనం వాడే వస్తువులైన అద్దాలు, కటకాలు, టెలిస్కోపు, మైక్రోస్కోపు, లేజర్లు, ఫైబర్ ఆప్టిక్స్ మొదలైనవి కాంతి సూత్రాల ఆధారంగా తయారుచేయబడ్డవే.

మూలాలు

మార్చు
  1. Hoad, T. F.; Oxford University Press (2002). The concise Oxford dictionary of English etymology [electronic resource]. Internet Archive. [Oxford] : Oxford University Press. ISBN 978-0-19-283098-2.
  2. McGraw-Hill (1993). McGraw-Hill Encyclopedia of Science and Technology (5th ed.).
  3. "BBC News | Sci/Tech | World's oldest telescope?". news.bbc.co.uk. Retrieved 2021-07-01.