కాకర్ల సుబ్బారావు

కాకర్ల సుబ్బారావు (1925 జనవరి 25 - 2021 ఏప్రిల్ 16) ఒక భారతీయ రేడియాలజిస్ట్. హైదరాబాదు లోని నిమ్స్ ఆసుపత్రి మొట్టమొదటి డైరెక్టర్.[1][2][3][4][5] వైద్యశాస్త్రంలో ఆయన చేసిన సేవలకుగాను 2000 సంవత్సరంలో భారత ప్రభుత్వం ఆయనకు పద్మశ్రీ పురస్కారాన్ని ఇచ్చింది. కృష్ణా జిల్లాలోని పెదముత్తేవి గ్రామంలో ఒక సాధారణ రైతు కుటుంబంలో జన్మించిన ఈయన విశాఖపట్నంలోని ఆంధ్ర వైద్య కళాశాలలో వైద్యశాస్త్రం చదివాడు. తర్వాత అమెరికా వెళ్ళి న్యూయార్క్ విశ్వవిద్యాలయంలో రేడియాలజీ విభాగంలో ఎం. ఎస్ చేశాడు. తర్వాత భారతదేశానికి తిరిగివచ్చాడు. ఎన్. టి. ఆర్ ప్రోత్సాహంతో నిమ్స్ ఆసుపత్రిలో పనిచేస్తూ దాన్ని ఆధునీకరించడంలో కృషి చేశాడు. అమెరికాలో తెలుగు వారి కోసం తానా సంఘాన్ని స్థాపించి దాని వ్యవస్థాపక అధ్యక్షుడిగా బాధ్యతలు నిర్వర్తించాడు. రేడియాలజీ మీద పలు పుస్తకాలు రాశాడు. పలు వైద్య పత్రికలకు సంపాదకత్వం వహించాడు. ఏప్రిల్ 16, 2021 న కిమ్స్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మరణించాడు.[6][7]

కాకర్ల సుబ్బారావు
జననం(1925-01-25)1925 జనవరి 25
భారతదేశంపెదముత్తేవి, కృష్ణా జిల్లా, మద్రాసు ప్రెసిడెన్సీ (ప్రస్తుత ఆంధ్రప్రదేశ్)
మరణం2021 ఏప్రిల్ 16(2021-04-16) (వయసు 96)
కిమ్స్ ఆసుపత్రి, హైదరాబాదు
ఇతర పేర్లుపద్మశ్రీ,డాక్టర్ కాకర్ల
విద్యఆంధ్ర మెడికల్ కాలేజ్ (ఎంబిబిఎస్)
వృత్తిరేడియాలజిస్ట్

బాల్యం, విద్యాభ్యాసం

మార్చు

ఈయన 1925 జనవరి 25 న, కృష్ణా జిల్లా పెదముత్తేవి గ్రామంలో ఒక మధ్యతరగతి వ్యవసాయ కుటుంబంలో జన్మించాడు. ఊర్లో పాఠశాల లేకపోవడంతో సుబ్బారావు తండ్రి తమ ఇంటి వరండాలోనే పాఠశాల ఏర్పాటు చేయించాడు. సుబ్బారావు అందులోనే ఏడవ తరగతి దాకా చదువుకున్నాడు. అనంతరం వారి గ్రామానికి ఐదు కిలోమీటర్ల దూరంలోనున్న చల్లపల్లిలో పాఠశాల చదువు పూర్తి చేశాడు. 1937-1944 మధ్యలో బందరు లోని హిందు కళాశాలలో పట్టభద్రుడయ్యాడు. ఈయన మొదట ఇంజనీరు కావాలనుకున్నాడు. కానీ అందులో సీటు రాలేదు. తర్వాత విశాఖపట్నం లో ఎంబిబిఎస్ కి దరఖాస్తు చేస్తే అందులో సీటు వచ్చింది. ఇంట్లో వాళ్ళకి చెబితే వద్దంటారేమోనని ఎవరికీ తెలియకుండా విశాఖపట్నం వెళ్ళి ఆంధ్ర వైద్య కళాశాలలో వైద్య విద్యలో ప్రవేశించాడు. 1950 సంవత్సరంలో ఉత్తీర్ణుడయ్యాడు. తర్వాత భారత సైన్యంలో పనిచేయాలనుకున్నాడు కానీ కొన్ని అనారోగ్య సమస్యల వలన అధికారులు అంగీకరించలేదు. 1951 సంవత్సరంలో హౌస్‌ సర్జన్సీ చేసిన తరువాత వైద్యంలో ఉన్నత విద్య కోసం ప్రత్యేక పారితోషికంతో అమెరికా వెళ్ళాడు. న్యూయార్క్ విశ్వవిద్యాలయంలో ఎం.ఎస్ పూర్తి చేశాడు. అమెరికన్ కాలేజ్ ఆఫ్ రేడియాలజీలో ఫెలోషిప్ కూడా పూర్తి చేశాడు. తర్వాత భారతదేశానికి తిరిగి వచ్చాడు.

అమెరికాలో సుబ్బారావు జీవితం

మార్చు

అమెరికాలో వైద్య పరీక్షలైన అమెరికా రేడియాలజి బోర్డు పరీక్షలలో 1955 సంవత్సరంలో ఉత్తీర్ణులై న్యూయార్క్, బాల్టిమోర్ నగరాలలోని ఆసుపత్రులలో 1954-1956 సంవత్సరం వరకు పనిచేశాడు. సుబ్బారావు 1956 సంవత్సరంలో ఇండియా తిరిగి వచ్చి హైదరాబాదు నగరంలో ఉన్న ఉస్మానియా వైద్య కళాశాలలో అసిస్టెంట్ ప్రొఫెసర్ గా చేరాడు. ఆ తరువాత ఉస్మానియా కళాశాలలోనే ప్రధాన రేడియాలజిస్టుగా కుడా పదోన్నతి పొందాడు. 1970 సంవత్సరంలో సుబ్బారావు మళ్ళీ అమెరికా ప్రయాణం కట్టాడు. యునైటెడ్ కింగ్‌డమ్ వారి ఫెల్లో ఆఫ్ రాయల్ కాలేజి ఆఫ్ రేడియాలజిస్టు ('Fellow of Royal College of Radiologists (UK) అనే పట్టా సంపాదించుకొన్నాడు.అమెరికా లోని అనేక ఆసుపత్రులలో పనిచేశాడు. సుబ్బారావు తెలుగు అసోసియేషన్ ఆఫ్ నార్త్ అమెరికా మెట్టమెదటి అధ్యక్షుడు, వ్యవస్థాపకుడు.[8]

భారతదేశానికి తిరిగి రాక

మార్చు

1986 సంవత్సరంలో నందమూరి తారక రామారావు ప్రవాస ఆంధ్రులకు చేసిన విజ్ఞప్తి మేరపు సుబ్బారావు భారతదేశానికి తిరిగి వచ్చి హైదరాబాదు లోని నిజామ్స్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ (నిమ్స్) లో చేరాడు. నిమ్స్ ఆసుపత్రి సుబ్బారావు చేరక మునుపు వరకు ఎముకల ఆసుపత్రిగా ప్రసిద్ధి చెందింది. సుబ్బారావు అక్కడ చేరాక అన్ని విభాగాలనూ అభివృద్ధి చేసి ప్రైవేటు కార్పోరేటు ఆసుపత్రులకు నమూనాగా ఉండే స్థాయికి తీసుకొని వచ్చాడు.[4] ఇప్పుడు నిమ్స్ సంస్థ రాష్ట్ర, దేశ వ్యాప్తంగా రోగుల చికిత్సా పరంగా, వైద్య వృత్తి శిక్షణా పరంగా, వైద్య పరిశోధన పరంగా, పేరెన్నిక కలిగిన వైద్య సంస్థ.

సుబ్బారావు రేడియాలజిలో అనేక పుస్తకాలు, జర్నల్స్ లో పరిశోధనా వ్యాసాలు రాశాడు. దేశ విదేశాలలో వైద్య ఉపన్యాసాలు ఇచ్చాడు. యాభై ఏళ్ల అనుభవంలో అనేక బహుమతులు, సన్మానాలు పొందాడు.

పురస్కారాలు

మార్చు

సుబ్బారావు వైద్యశాఖకు, మానవాళికి చేసిన సేవకు గుర్తింపుగా భారత ప్రభుత్వం 2000 సంవత్సరంలో పద్మశ్రీ అవార్డు ప్రదానం చేసి సత్కరించింది. ఇండియా రేడియాలాజికల్ అండ్ ఇమేజింగ్ అసోసియేషన్ వారి అనుబంధ ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర చార్టరు సుబ్బారావుకు 2001 మార్చి 17న జీవితకాల సాఫల్య పురస్కారాన్ని ప్రదానం చేశారు. ఆయన ఆంగ్లంలో పలికిన పలుకులు "I pass through this life only once, let me do the maximum good to the largest number of people."

పుస్తకాలు

మార్చు
  • Subba Rao, Dr Karkala (2013). A Doctors Story of Life & Death. Prabhat Prakashan. ISBN 8184301804.
  • Subba Rao, Dr Karkala (2003). Diagnostic radiology and imaging. New Delhi: Jaypee Bros. Medical Publishers. ISBN 81-8061-069-1. OCLC 601059826.

మూలాలు

మార్చు
  1. "అనితరసాధ్యుడు కాకర్ల." www.eenadu.net. Retrieved 2021-04-16.
  2. "Dr. Kakarla's profile". Archived from the original on 2007-09-08. Retrieved 2007-08-22.
  3. "Dr. Kakarla Subba Rao - a Profile". Radiology World. Retrieved 2021-04-21.
  4. 4.0 4.1 "Dr. Rao formally hands over charge of Director, NIMS". The Hindu. Archived from the original on 2004-08-04.
  5. "Tele-Radiology set up of Kakarla Subba Rao Radiological and Imaging Educational Sciences Trust(KREST), Hyderabad". Archived from the original on 2015-09-25. Retrieved 2007-08-22.
  6. "కాకర్ల సుబ్బారావు కన్నుమూత". www.eenadu.net. ఈనాడు. Retrieved 2021-04-16.
  7. "Renowned radiologist and first Director of NIMS, Kakarla Subba Rao passes away". The New Indian Express. Retrieved 2021-04-16.
  8. "Past Presidents of TANA". Telugu Association of North America. Archived from the original on 2007-09-27. Retrieved 2007-08-22.