కాకునూరి అప్పకవి

పరిచయంసవరించు

కాకునూరి అప్పకవి తెలుగు లాక్షణిక కవిగా సుప్రసిద్ధుడు. ఇతను మహబూబ్ నగర్ జిల్లా కల్వకుర్తి తాలుకాలోని కాకునూరి అగ్రహారానికి చెందినవాడు[1]. అప్పకవి నన్నయభట్టు రచించిన 'ఆంధ్రశబ్ద చింతామణి ' ఆధారంగా 'ఆంధ్రశబ్దచింతామణి ' అను ఛందో గ్రంథాన్ని రచించాడు. తెలుగుభాషలో లక్షణగ్రంథాలను వాటి రచయితల పేర్లతో పిలిచే రివాజుగా ఈ పుస్తకం తెలుగు సాహితీ లోకంలో ' అప్పకవీయం ' గానే స్థిరపడిపోయింది. ఈ గ్రంథాన్ని అప్పకవి ' సారపాదపం 'అని కూడా అన్నాడు. అప్పకవి పూర్వికులది కాకునూరికి సమీపంలోని ' లేమామిడి ' గ్రామం. వీరి తాత గారి తాత అక్కడే ఉండేవాడు. అప్పకవి తాతముత్తాతలంతా పండితులే. వీరి తాత పెద సోమయ్య పండితుడే కాక శ్రీమంతుడు కూడా. అప్పకవి తండ్రి వెంగన్న గొప్ప వేదపండితుడు. అప్పకవి పల్నాడుసీమలోని కామేపల్లిలో తనమేనమామల ఇంట పెరిగాడు. ప్రముఖ ఆధ్యాత్మిక వేత్త కాకునూరి సూర్యనారాయణ మూర్తి వీరి వంశానికి చెందిన వారు.

జననంసవరించు

కాకునూరి అప్పకవి మన్మథ నామ సంవత్సరం శ్రావణ బహుళ అష్టమి (1656 ఆగస్టు 03 వ తేది) నాడు జన్మించినట్లు తానే స్పష్టంగా తన అప్పకవీయంలో పేర్కొన్నాడట[2].

విద్యాభ్యాసంసవరించు

అప్పకవి విద్యాభ్యాసం తన మేనమామల ఇంట పల్నాడు సీమలో సాగింది. మూర్తి సర్వన్న దగ్గర యజుర్వేదం, కాండూరి గిరయ్య దగ్గర వ్యాకరణం, సూరభట్టు దగ్గర సకలసిద్ధాంతాలు, కొలిచెలమల్ల సింగన్న గారి దగ్గర స్మార్తకర్మలు, రాజయోగి దగ్గర ఆగమాలు, మంచికంటి ఓబన్న దగ్గర లక్షణగ్రంథాలు చదువుకున్నాడు.[3]. అప్పకవిని లక్షణ కవిగా తీర్చిదిద్దినది ఓబన్నగారే.

రచనలుసవరించు

విద్యాభ్యాసం పూర్తయ్యాక అప్పకవి శ్రీశైలం వెళ్ళాడు. అప్పటి ఆ ప్రాంత అధికారి అయిన భోగి విభూషణుడి ఆస్థాన కవిగా కొంతకాలం పనిచేశాడు. అక్కడే స్మార్తకర్మలకు సంబంధించి ' అపస్తంబ షట్కర్మ నిబంధనం ' అను సంస్కృత నిబంధన గ్రంథాన్ని రచించాడు. కాలబాలార్ణవ సంహిత అనే జ్యోతిష గ్రంథానికి శ్లోకరూప సంగ్రహాన్ని రాశాడు. స్త్రీలకు పనికి వచ్చే ' సాద్వీజన ధర్మం ' అనే ద్విపద కావ్యాన్ని, 'అనంతవ్రత కల్పం ' అను కావ్యాన్ని రచించాడు. శ్రీశైల మల్లికార్జుని మీద శ్లేష గర్భితమైన నిందా స్తుతి శతకాన్ని రాశాడు. 'అంబికావాదం ' అను యక్షగానాన్ని, 'కవికల్పం' అను లక్షణ గ్రంథాన్ని రచించాడు.[4].

ఉదాహరణసవరించు

క్షితి మ్లేచ్ఛభాష శ్రుతిగ
ర్హిత మగునట్లైన నాధరిత్రిని దానిన్
మతిరోసి విడువగూడదు
సతతము వ్యవహారహాని సంధిలు కతన్

[5]

కాకునూరి కవుల వంశ క్రమంసవరించు

కాకునూరి తిమ్మకవి[6].
(క్రీ.శ. 1500)
↓ ( కుమారుడు)
కాకునూరి సోమయ
(క్రీ.శ. 1530)
↓ (కుమారులు)
↓ ———————————————↓————————————↓—————————————↓ 
అమరేశ్వరుడు కొండలయ్య రంగన్న లక్ష్మణుడు
(క్రీ.శ. 1560)
↓ (కుమారులు)
↓———————————↓———————————↓——————————————↓
తిరుమలభట్టు గంగన్న పెదసోమన్న చిన్న సోమన్న
(క్రీ.శ. 1590)
↓ (కుమారులు)
↓——————————————↓—————————————————↓
వెంగన కన్నుభట్టు గంగయ్య
(క్రీ.శ. 1620)
↓ (కుమారులు)
↓———————————————————————↓———————————————————————↓
కాకునూరి అప్పకవి సోమన (.....)
(క్రీ.శ. 1656)మూలాలుసవరించు

  1. సమగ్ర ఆంధ్ర సాహిత్యం,11 వ సంపుటం, నాయకరాజుల యుగం-2, రచన: ఆరుద్ర, ఎమెస్కో, 1967, పుట-219
  2. సమగ్ర ఆంధ్ర సాహిత్యం, 6 వ సంపుటం, తొలిరాయల యుగం, రచన: ఆరుద్ర, ఎమెస్కో, సికింద్రాబాద్,1965, పుట-43
  3. సమగ్ర ఆంధ్ర సాహిత్యం,11 వ సంపుటం, నాయకరాజుల యుగం-2, రచన: ఆరుద్ర, ఎమెస్కో, 1967, పుట-220
  4. పై గ్రంథంలోనిదే... పుట-220
  5. సుబ్బారావు, వావిలికొలను (2011). "మాతృభాష". ఆంధ్రపత్రిక సంవత్సరాది సంచిక: 68. Retrieved 6 March 2015. CS1 maint: discouraged parameter (link)
  6. సమగ్ర ఆంధ్ర సాహిత్యం, 6 వ సంపుటం, తొలిరాయల యుగం, రచన: ఆరుద్ర, ఎమెస్కో, సికింద్రాబాద్,1965, పుట-44