కాలాపానీ

1996 మలయాళం అనువాద చిత్రం

కాలాపానీ 1996లో ప్రియదర్శన్ దర్శకత్వంలో విడుదలైన ఒక దేశభక్తి చిత్రం. 1915లో స్వాతంత్ర్య పోరాట సమయంలో ఆంగ్లేయుల చేతిలో బంధీలైన కొంతమంది దేశభక్తుల జైలు జీవితాల ఆధారంగా ఈ సినిమా తీశారు. దర్శకుడు ప్రియదర్శన్ ఈ సినిమాకు కథా రచయిత కూడా. మోహన్ లాల్, ప్రభు, టబు, అమ్రిష్ పురి, నెడుముడి వేణు, శ్రీనివాసన్, టిను ఆనంద్, వినీత్ తదితరులు ప్రధాన పాత్రధారులు. ఈ సినిమాకు మలయాళ సినిమా చరిత్రలో ఒక ప్రత్యేకమైన స్థానం ఉంది.[2] ఈ సినిమాను మలయాళంలోనే తీసినా హిందీలో సజా-ఏ-కాలా పానీగానూ, తమిళంలో సిరైచలై, తెలుగులో అదే పేరుతో అనువాదం అయ్యింది. హిందీ అనువాదం అమితాబ్ బచ్చన్ కొనుగోలు చేయడమే కాకుండా సినిమా మొదట్లో వచ్చే వ్యాఖ్యానం కూడా చెప్పాడు.[3]

కాలాపానీ
దర్శకత్వంప్రియదర్శన్
రచన
 • టి. దామోదరన్
 • ప్రియదర్శన్
(స్క్రీన్ ప్లే)
కథప్రియదర్శన్
నిర్మాత
 • మోహన్ లాల్
 • ఆర్. మోహన్
తారాగణంమోహన్ లాల్
ప్రభు
టబు
అమ్రిష్ పురి
జాన్ కోల్వెంబాచ్
నెడుమూడి వేణు
శ్రీనివాసన్
అలెక్స్ వోల్ఫ్
ఛాయాగ్రహణంసంతోష్ శివన్
కూర్పుఎన్. గోపాలకృష్ణన్
సంగీతంఇళయరాజా
నిర్మాణ
సంస్థలు
ప్రణవం ఆర్ట్స్
షోగన్ ఫిల్మ్స్ లిమిటెడ్
పంపిణీదార్లుషోగన్ ఫిల్మ్స్
అమితాబ్ బచ్చన్ కార్పొరేషన్(హిందీ అనువాదం)
విడుదల తేదీ
12 ఏప్రిల్ 1996 (1996-04-12)
సినిమా నిడివి
178 నిమిషాలు
దేశంభారతదేశం
భాషమలయాళం
బడ్జెట్2.5 crore (US$3,10,000)[1]

అండమాన్ నికోబార్ దీవుల రాజధాని పోర్టు బ్లెయిర్లోని, సెల్యులార్ జైల్ (కాలాపానీ) అనే జైలులో బంధించ బడిన బంధీల స్థితిగతులకు అద్దం పట్టిన చిత్రం ఇది. ప్రముఖ సంగీత దర్శకుడు ఇళయరాజా సంగీతాన్నిందించగా, సంతోష్ శివన్ సినిమాటోగ్రఫీ, ఎన్. గోపాలకృష్ణన్ ఎడిటింగ్ విభాగాలు చూసుకున్నారు. మలయాళ సినిమాల్లో డాల్బీ స్టీరియోను పరిచయం చేసిన సినిమా కూడా ఇదే. ఈ సినిమాకు అప్పట్లో 2.5 కోట్ల రూపాయల వ్యయం అయ్యింది. అప్పట్లో అత్యంత ఖరీదైన మలయాళ చిత్రం కూడా ఇదే.[1]

ఈ సినిమా మూడు జాతీయ పురస్కారాలు అందుకుంది. ఉత్తమ ఆర్ట్ డైరెక్టరుగా సాబు సిరిల్, ఉత్తమ స్పెషల్ ఎఫెక్ట్స్ గా ఎస్. టి. వెంకీ, ఉత్తమ సినిమాటోగ్రాఫరుగా సంతోష్ శివన్ ఎంపికయ్యారు. అంతే కాకుండా 6 కేరళ రాష్ట్ర పురస్కారాలు కూడా సొంతం చేసుకున్నది. ప్రపంచ వ్యాప్తంగా 450 థియేటర్లలో విడుదలైన అప్పటిదాకా భారతదేశంలో విడుదలైన అత్యంత భారీ చిత్రంగా నమోదయ్యింది.

1965 లో భారత సైన్యానికి చెందిన జి. ఎస్. సేతు (వినీత్) తన అత్త పార్వతి (టబు) భర్త గోవర్ధన్ మేనన్ (మోహన్ లాల్) ను వెతుక్కుంటూ అండమాన్ నికోబార్ దీవుల్లో ఒకటైన, రాస్ ఐలాండ్లో గల కాలాపానీ జైలుకు వెళతాడు. గోవర్ధన్ ను బ్రిటిష్ ప్రభుత్వం 1915లో ఈ జైలుకు పంపించి ఉంటుంది. అప్పటి దాకా జైల్లో బంధించి బడిన ఖైదీ వివరాలున్న ఓ పాత గదిలో గోవర్ధన్ కు సంబంధించిన ఫైలు అతనికి దొరుకుతుంది. అది చదివిన సేతుకు గోవర్ధన్ కథ తెలుస్తుంది. గోవర్ధన్ ఒక వైద్యుడు, జాతీయవాది. స్వాతంత్ర్యోద్యమ సమయంలో 55 మంది ప్రయాణిస్తున్న ఓ రైలును బాంబుతో పేల్చివేశాడని అతనిమీద అపవాదు వేసి అతన్ని జైలుకు పంపించేస్తారు. పార్వతితో అతని వివాహం జరిగిన రోజే అతన్ని అండమాన్ జైలుకు తీసుకెళ్ళిపోతారు. పార్వతి మాత్రం భర్త మళ్ళీ తిరిగి వస్తాడని ఎదురు చూస్తూనే ఉంటుంది.

కాలాపానీ జైలులో బంధించబడీన వందలమంది ఖైదీలు అక్కడ కనీస సౌకర్యాలు కూడా లేని దుర్భర జీవితం గడుపుతుంటారు. వారిలో పేరు పొందిన స్వాతంత్ర్య సమరయోధులు కూడా ఉంటారు. డేవిడ్ బెర్రీ (అలెక్స్ వోల్ఫ్) ఐరిష్ జాతికి చెందిన ఒక కిరాతమైన జైలరు. లెన్ హట్టన్ (జాన్ కోల్వెంబాచ్) ఉదార హృదయుడైన ఓ వైద్యుడు. ప్రముఖ దేశభక్తుడు వీర సావర్కార్ని కూడా అదే జైలులో బంధించి చిత్ర హింసలు పెడుతుంటారు. కానీ ఆయన మాత్రం బంధీలను ఉత్తేజపరచడానికి తనవంతు కృషి చేస్తుంటాడు. డాక్టర్ లెన్ చర్యల వల్ల అక్కడి ఖైదీలు ఎదుర్కొంటున్న హింస ప్రభుత్వానికి తెలిసి విచారణకు ఆదేశిస్తుంది. 14 మందిని విడుదల చేస్తున్నట్లుగా ఉత్తర్వులు పంపిస్తుంది. వారిలో ఒకడు ముకుందన్ (ప్రభు). డేవిడ్ బెర్రీ,, జైలు వార్డెన్ మీర్జా ఖాన్ (అమ్రిష్ పురి) తో కలిసి విడుదల చేసిన ఖైదీలకు విషయం చెప్పకుండా వారిని పారిపోమని చెప్పి 13 మందిని కాల్చి చంపేస్తారు. ముకుందన్ మాత్రం పారిపోవడానికి సిద్ధంగా ఉండడు. అతన్ని చీఫ్ కమీషనర్ రమ్మంటున్నాడనే నెపంతో బలవంతంగా బయటకు తీసుకువచ్చి కాల్చేస్తారు. అతను గోవర్ధన్ కు స్నేహితుడు. స్నేహితుడి శవాన్ని చూసి ఉండబట్టలేని గోవర్ధన్ డేవిడ్ ను ఓ టవర్ పై నుంచి కిందికి తోసేస్తాడు. మీర్జా ఖాన్ ను గొంతు నులిమి చంపేస్తాడు. చివర్లో గోవర్ధన్ ను ఉరి తీస్తారు.

తారాగణం

మార్చు
 • గోవర్ధన్ మేనన్ గా మోహన్ లాల్
 • ముకుంద అయ్యంగార్ గా ప్రభు
 • పార్వతిగా టబు
 • మీర్జా ఖాన్ గా అమ్రిష్ పురి
 • జి. ఎస్. సేతుగా వినీత్
 • డేవిడ్ బెర్రీగా అలెక్స్ వోల్ఫ్
 • లెన్ హట్టన్ గా జాన్ కోల్వెంబాచ్
 • వీర్ సావర్కార్ గా అను కపూర్
 • శ్రీకండన్ నాయర్ గా  నెడుముడి వేణు
 • పాండియన్ గా ఢిల్లీ గణేష్
 • మూసాగా శ్రీనివాసన్
 • అహ్మద్ కుట్టిగా కొచ్చిన్ హనీఫా

పాటలు

మార్చు

ఈ సినిమాకు ఇళయరాజా సంగీత దర్శకత్వం వహించగా తెలుగులో పాటలన్నీ బాలు, చిత్ర గానం చేశారు.[4]

క్రమసంఖ్య పేరుగాయకులు నిడివి
1. "చామంతీ పువ్వే విరబూశాను"  బాలు, చిత్ర 4:59
2. "కన్నెకొమ్మన తుమ్మెదా"  బాలు, చిత్ర 5:01
3. "మోజుల్లోనా తుళ్ళి పూసే బంగరు ప్రాయం"  చిత్ర 5:07
4. "వందేమాతరం" (జావెద్ అఖ్తర్ రచన)బృందం 6:06
5. "యక్ష కన్యవోలె"  బాలు, చిత్ర, , బృందం 5:43

మూలాలు

మార్చు
 1. 1.0 1.1 M. G. Radhakrishnan (15 June 1995). "An epic gamble". Indiascope. India Today. Retrieved 30 May 2015.
 2. Roktim Rajpal (14 August 2015). "Mohanlal's 'Kaalapani' to Mammootty's 'Pazhassi Raja': Southern films that reminisce about the battle for free India". New Delhi. IBN Live. Retrieved 14 August 2015.
 3. https://www.youtube.com/watch?v=6Fm3Lvoz7pU
 4. "Kaalapaani Songs - Raaga"
"https://te.wikipedia.org/w/index.php?title=కాలాపానీ&oldid=3377990" నుండి వెలికితీశారు