కిన్నెరసాని

దక్షిణ భారత దేశంలో ప్రవహించే నది
(కిన్నెరసాని నది నుండి దారిమార్పు చెందింది)

కిన్నెరసాని, గోదావరి నది యొక్క ఉపనది. కిన్నెరసాని ములుగు జిల్లాలోని మేడారం - తాడ్వాయి కొండసానువుల్లో పుట్టి ఆగ్నేయంగా ప్రవహించి భద్రాద్రి జిల్లాలో భద్రాచలానికి కాస్త దిగువన బూర్గంపాడు, ఏలూరు జిల్లా వేలేరు గ్రామాల మధ్యన గోదావరిలో కలుస్తుంది. 96 కిలోమీటర్లు ప్రవహిస్తున్న ఈ నది యొక్క ఆయకట్టు ప్రాంతం మొత్తం 1300 చదరపు కిలోమీటర్లు. కిన్నెరసాని ఉపనదైన మొర్రేడు, కొత్తగూడెం పట్టణం గుండా ప్రవహించి సంగం గ్రామం వద్ద కిన్నెరసానిలో కలుస్తుంది.[1]

కిన్నెరసాని చిత్రం

కిన్నెరసాని ప్రాజెక్టు

మార్చు
 
కిన్నెరసాని జలాశ్రయంలో ఒక చిన్న దీవి

కిన్నెరసాని నదిపై పాల్వంచ మండలంలోని యానంబైలు గ్రామం వద్ద విద్యుత్ ఉత్పాదనకై, కొత్తగూడెం థర్మల్ విద్యుత్ కేంద్రానికి నీరందించేందుకు కిన్నెరసాని ప్రాజెక్టు నిల్వ జలాశ్రయాన్ని నిర్మించారు. 1972లో నిర్మాణము పూర్తి చేసున్న ఈ ప్రాజెక్టుకు 558 లక్షల వ్యయమైనది. 1998 ఏప్రిల్ లో రాష్ట్ర నీటిపారుదల శాఖ ఈ ప్రాజెక్టును విద్యుచ్ఛక్తి శాఖకు బదిలీ చేసింది. ఈ ప్రాజెక్టు వ్యవసాయ భూములకు, విద్యుత్ ఉత్పత్తికే కాక పాల్వంచ, కొత్తగూడెం పట్టణ ప్రజలకు త్రాగునీరు కూడా అందిస్తుంది.

2005లో జలయజ్ఞం పథకం క్రింద పాల్వంచ, బూర్గంపాడు మండలాల్లో పదివేల ఎకరాలకు సాగునీటిని అందించేందుకు కిన్నెరసాని ప్రాజెక్టుకు కుడి, ఎడమ కాల్వల నిర్మాణాన్ని ఆమోదించారు. తొలి విడతలో భాగంగా నిర్మించిన కుడి ప్రధాన కాల్వను 2012లో ముఖ్యమంత్రి నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి ప్రారంభించాడు.[2] ఇక్కడ కిన్నెరసాని వన్యప్రాణుల అభయారణ్యం ఉంది. దీన్ని కిన్నెరసాని అభయారణ్యంలో నెలకొల్పారు.

సాహిత్యంలో

మార్చు

కిన్నెరసాని నది వృత్తాంతాన్ని వర్ణిస్తూ విశ్వనాథ సత్యనారాయణ కిన్నెరసాని పాటలు అనే కవితా సంపుటాన్ని వ్రాశాడు. ఇది 1925లో కోకిలమ్మ పెళ్లితో పాటు ఒకే సంచికలో ప్రచురితమైంది. విశ్వనాథ సత్యనారాయణ తండ్రి శోభనాద్రి కష్టదశలో కిన్నెరసాని వాగుకు ఆవల ఉన్న గ్రామంలో కౌలుకు భూమి తీసుకుని వ్యవసాయం చేశారు. ఆయనతో పాటుగా కుమారుడు విశ్వనాథ సత్యనారాయణ కూడా వెంటవెళ్ళేవారు. ఆ గ్రామానికి వెళ్ళే మార్గంలో వాగును దాటేప్పుడు కిన్నెరసాని వాగును భద్రాచలం అడవులలో చూచినప్పుడు ఆయన మనస్సు ఆ వాగుతో సంవదించింది. చుట్టూపులులూ పుట్రలూ ఏమీ పట్టలేదు, పాములు ప్రక్కగా పోయినాయి ఆయనకు పట్టలేదు. ఆ వాగు వలెనే తన భావప్రవాహం సాగిపోయింది. కులపాలికా ప్రణయపూతమైన తన హృదయంలో పడిన ఆ వాగు పవిత్రచారిత్రయైంది.[3]

కిన్నెరసానీ! ఊహలోనైనా కాస్త నిలువమని ఆమె భర్త ప్రాధేయపడుతున్నాడు. తనప్రియురాలైన కిన్నెరసాని నిలువెల్ల కరిగిపోయి తన హృదయాన్ని, తన ప్రాణాన్ని హరించి అదృశ్యమైందని అతడు ఆవేదన చెందాడు. భర్తగా ఒకవేళ తప్పుచేసినా, ఏ స్త్రీలైనా ఇంత కఠినులుగా ఉంటారా! అని అతడు ఆమెను ప్రశ్నించాడు. స్త్రీలెవరైనా లోకంలో ఇంతకోపం,ఇంత పట్టుదల కలిగి ఇలా చేస్తారా! అని అతడు అడిగాడు. శోకమూర్తివైన నిన్ను కౌగిలించుకున్నాను అయినా ఇంతలో నీరైపోయావా! అంటే భర్తగా కిన్నెరసానిని ఓదార్చాలని ప్రయత్నించే లోపలే ఆమె జీవం కోల్పోయిందని అర్ధం. ఎంతో కోపం ఎంతోపగ ఉన్నా తనను శిక్షించడానికి వేరే మార్గం లేదా అని అతడు ఆవేదన చెందాడు. రాతి మీద కాలుపెట్టలేని సుకుమారి కిన్నెరసాని కరిగినీరై కొండల్లో గుట్టల్లో ఎలా ప్రవహించగలదని ఆమె భర్త అమే సౌకుమార్యన్ని గురించి ఆలోచించాడు. ఆమె పాతివ్రత్యాన్ని గురించి ప్రశించలేదు అలాంటి ఆలోచన తనకు ఉంటే తనకత్తితో గొంతుకోసుకుంటానని అతడు ఆమె పట్ల తన విశ్వాసాన్ని ప్రకటించాడు. కిన్నెరసాని ప్రవాహంలోని నురుగు వెన్నెలవలె తెల్లనై ఆమె సుందరమైన శరీరఛాయ వలె ఉందని అతడు భావించాడు. సెలయేటి రూపంలో మెలికలుగా ప్రవహిస్తుంటే ఆమె ఒయ్యారపు నడకలు అతనికి గుర్తుకు వచ్చాయి. సెలయేటి నురుగులు ఆమె నవ్వులుగా, అలలు ఆమె శరీరపు ముడతలుగా, చేపలు ఆమె కన్నులుగా అతడు వర్ణించాడు. ఆమె మడికట్టును ఇసుకతెన్నెగా జూచిన అతని కళ్ళు పరితపించాయి పూర్వం భగీరథుని వెంట పరుగెత్తిన ఆకాశగంగ వలె ఆమె ప్రవాహం ఉన్నదని అతడు ప్రశంసించాడు. ఆమె జడ పట్టుకోవాలని ప్రయత్నించిన అతని చేతికి నీటి ప్రవాహం తగిలింది. ఎడమ చేతితో కొంగుపట్టుకోవాలనుకుంటే అతని చేతికి తడి తగిలింది కాని కొంగు దొరకలేదు. అతని నుదుటి మీద చెమట ఇలా వాగుగా మారిన అమెపై ప్రేమను ప్రకటిస్తున్నది. ఆమె అతని జీవితానికి విలువైనది, ప్రాణాధారమైనది, శిరోరత్నం వంటిది అని అతడు పేర్కొన్నాడు. ఆమె ఆ విధంగా మారినపుడు అతని శరీరంలో ప్రాణాలు నిలువవని చెప్పి తాను కూడ ప్రవాహంలాగే మారుతానని చెప్పాడు. ఆమె రసహృదయ కాబట్టి ప్రవాహంలాగా మారింది కాని తాను కఠినహృదయుడు కాబట్టి ప్రవాహంలా మారలేనని తెలిపాడు. నది మనిషిగా మారినదేమో అని అతడు అమె కన్నులు జూచి అనుకున్నాడు. పరుగెత్తిపోతున్న కిన్నెరసాని అలలకదలికలో ఆమె యవ్వన సంపదను అతడు వీక్షించాడు. ఆమెను కౌగిలించుకున్నప్పుడు కలిగినపుకింత అతనిని వీడక ముందే ఆమె కరిగి నీరై కనిపించకుండా పోయింది. అడవులో ఏడుస్తూ తిరుగుతున్నా అతనికి నీదే నీదే తప్పని వాదించినట్లనిపించింది. చేతులు చాచి, గొంతెత్తి ఏడుస్తున్నా అమె వినిపించుకోవటంలేదని అతడు ఆవేదన చెందాడు. ఆమె కొరకు ఏడ్చి ఏడ్చి అతని గొంతు పూడుకొని పోయింది . కన్నీరు అడ్డంపడి కంటిచూపు మందగించింది. శరీరం గట్టిపడింది. ఏడ్చే రోదనలో తనను తాను మర్చిపోయిన అతని దేహం రాయిగా మారిపోయింది. కిన్నెర వరదగా ప్రవహించింది. అలలతో పరుగులు పెట్టింది. కిన్నెరసాని ఉధృతమై, సుళ్ళు తిరుగుతూ నురుగులు కక్కింది. రాళ్ళ మీద పచ్చిక మీద, పయనించిన కిన్నెరసాని సుడులతో మోగింది. ఒడ్డులను వొరుసుకుంటూ ప్రవహించి సుళ్ళుతిరిగిన ఆ ప్రవాహం మెలికలు తిరిగింది. కిన్నెరసాని అలల వరుసలతో మెరిసింది . సుడుల ముడులతో వేగంగా నడిచింది. ఇసుకనేలపైన బుసబుస పొంగింది. కిన్నెరసాని లేళ్ళ సమూహంలాగా, పూలనదిలాగ, పడగవిప్పిన తెల్లత్రాచులాగా కనిపించింది. తొడిమవూడిన పూవులాగ, సిగ్గుపడిన రాకుమార్తె లాగ, అందం కోల్పోయిన రత్నపేటికలాగ కనిపించింది. కిన్నెరసాని తనభర్త రాయిగా మారిన బోటనే అతనిని విడిచిపెట్టలేక దిగులుగా తిరిగింది. కిన్నెర తాను నదిగా మారినందుకు ఎంతో బాధపడింది. ముక్తగీతం వలె ఆమె బాధ మోగింది. ఆమె ఒకచోట నిలువలేక పరుగులు పెట్టింది. ఏ ఉపాయంతోనైనా మళ్ళీ మనిషిగా మారితే బాగుండుననే కోరికను ఆపుకోలేక విలపించింది కిన్నెరసాని . అంటే ఆమె తన భర్తప్రేమకు చలించిపోయి తన తొందరపాటుకు పశ్చాత్తపడిందని అర్ధం. తనను విడిచి ఆమెభర్త జీవీంచలేడని ఆమె బ్రతికుండగా గ్రహించలేకపోయింది. అది తెలిసి ఉంటే అతనితో ఎంతో ప్రేమగా ఉండే దాన్నని కిన్నెరసాని ఎంతో వెలపించింది. అటువంటి భర్తతో కాపురాన్ని ఇలా నాశనం చేసుకున్నానని కిన్నెర ఎంతో దిగులుపడింది. చివరికి ఏమీ చేయలేక కిన్నెరసాని రాయిగా మారిన భర్తను తన అల్లలు అనే చేతులతో చుట్టి ఎంతో వ్యధచెందింది. కొండగా మారిన భర్తను మాటిమాటికి కిన్నెర చేతులతో కౌగిలించి అలలమోతతో పలుకరించింది. తన భర్తను కూడా నదిగా మారిపొమ్మని కిన్నెర కోరింది. జలరూపంలో ఇద్దరం కలిసి పోదామని కెరటాలతో కౌగలించుకుందామని పేర్కొన్నది. ఓ నాథ! ఇలాంటి తప్పు ఇంక చేయను . నీవు ఆఙ్ఞాపిస్తే అడుగుదాటను. మరుజన్మలో ఇంతకోపం తెచ్చుకోను అని కిన్నెరసాని భర్తతో చెప్పింది. తాను కలత చెందానని, శ్రమతో అలసిపోయానని కిన్నెరసాని చెప్పింది. చేసిన తప్పు తెలుసుకున్నానని చెప్పి కిన్నెరసాని రాయిగా మారిన తనభర్తను విడిచివెళ్ళిపోయింది.

మూలాలు

మార్చు
  1. నమస్తే తెలంగాణ, జిందగీ వార్తలు (27 July 2018). "పచ్చని చేలా.. పావడ గట్టిన కిన్నెరసాని". మధుకర్ వైద్యుల. Archived from the original on 15 జూన్ 2019. Retrieved 15 June 2019.
  2. http://www.thehindu.com/todays-paper/tp-national/tp-andhrapradesh/article3740522.ece
  3. భరతశర్మ, పేరాల (సెప్టెంబరు 1982). విశ్వనాథ శారద (విశ్వనాథలోని నేను వ్యాసం) (మొదటి ప్రచురణ ed.). హైదరాబాద్: విశ్వనాథ సత్యనారాయణ స్మారక సమితి. p. 17.

బయటి లింకులు

మార్చు