కోదండ రామాలయం, ఒంటిమిట్ట

వైఎస్‌ఆర్ జిల్లా ఒంటిమిట్టలో ఉన్న రామాలయం

కోదండ రామాలయం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రములోని వైఎస్‌ఆర్ జిల్లాకు చెందిన ఒంటిమిట్ట లోని ప్రాచీన హిందూ దేవాలయము. ఇక్కడి మూలమూర్తులు కోదండరాముడు, సీతాదేవి, లక్ష్మణస్వామి. కడప నుంచి రాజంపేటకు వెళ్ళే మార్గంలో 27 కి.మీ. దూరంలో ఒంటిమిట్ట ఉంది. సీతారామ లక్ష్మణుల విగ్రహాలను ఏకశిలలో వున్నందున ఈ క్షేత్రము ఏకశిలానగరము అని ప్రసిద్ధి చెందినది. నవ్యాంధ్ర ఏర్పడిన తరువాత ఈ ఆలయమున్న ఒంటిమిట్టను ఆంధ్రా భద్రాచలం గా పేరుగాంచింది. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం శ్రీరామనవమి రోజున ఈ ఆలయంలోనే అధికారికంగా ప్రత్యేక కార్యక్రమాలను నిర్వహిస్తుంది. శ్రీరామనవమి రోజున ప్రభుత్వం తరపున పట్టువస్త్రాలు, తలంబ్రాలు సమర్పిస్తారు.[1]

కోదండ రామాలయం, ఒంటిమిట్ట
కోదండరామాలయ సముదాయము, ఒంటిమిట్ట
కోదండరామాలయ సముదాయము, ఒంటిమిట్ట
భౌగోళికాంశాలు :14°23′00″N 79°02′00″E / 14.3833°N 79.0333°E / 14.3833; 79.0333Coordinates: 14°23′00″N 79°02′00″E / 14.3833°N 79.0333°E / 14.3833; 79.0333
పేరు
ప్రధాన పేరు :కోదండ రామాలయం
ప్రదేశం
దేశం:భారతదేశం
రాష్ట్రం:ఆంధ్రప్రదేశ్
జిల్లా:కడప జిల్లా
ప్రదేశం:ఒంటిమిట్ట
ఆలయ వివరాలు
ప్రధాన దైవం:రాముడు
ప్రధాన దేవత:సీత
ఉత్సవ దైవం:రాముడు, లక్ష్మణుడు
ఉత్సవ దేవత:సీత
పుష్కరిణి:రామతీర్థం
కవులు:పోతన
ముఖ్య_ఉత్సవాలు:శ్రీరామనవమి
నిర్మాణ శైలి, సంస్కృతి
వాస్తు శిల్ప శైలి :చోళుల కాలం నాటిది
కట్టడాల సంఖ్య:3
ఇతిహాసం
నిర్మాణ తేదీ:16వ శతాబ్దం
సృష్టికర్త:చోళులు

భౌగోళికంసవరించు

 
Map
  • కడప-తిరుపతి రహదారిపై కడపనుంచి 26 కి.మీ.దూరం ప్రయాణిస్తే ఆలయానికి చేరుకోవచ్చు.
  • రైలులో రాజంపేట లేక కడప సమీప రైల్వేస్టేషన్లు.
  • తిరుపతి విమానాశ్రయం 100 కి.మీ.దూరంలోవుంది.

చరిత్రసవరించు

స్థల పురాణంసవరించు

రామ లక్ష్మణులు చిన్నపిల్లలుగా ఉన్నప్పుడు, విశ్వామిత్రుడు వారిని తమ యాగరక్షణకు తీసుకున్నాడని తెలిసిందే. కానీ సీతారామ కల్యాణం జరిగాక కూడా, అలాంటి సందర్భమే ఒకటి ఏర్పడింది. అప్పుడు మృకండు మహర్షి, శృంగి మహర్షి రాముని ప్రార్థించడంతో దుష్టశిక్షణ కోసం, ఆ స్వామి సీతా లక్ష్మణ సమేతుడై అంబుల పొది, పిడిబాకు, కోదండం, పట్టుకుని ఈ ప్రాంతానికి వచ్చి యాగ రక్షణ చేశాడని పురాణం చెబుతుంది. అందుకు ప్రతిగా ఆ మహర్షులు సీతారామ లక్ష్మణుల విగ్రహాలను ఏకశిలగా చెక్కించారనీ, తరువాత జాంబవంతుడు ఈ విగ్రహాలను ప్రాణప్రతిష్ఠ చేశారనీ ఇక్కడ ప్రజల విశ్వాసం. ఈ దేవాలయంలో శ్రీరామ తీర్థం ఉంది. సీత కోరికపై శ్రీ రాముడు రామ బాణంతో పాతాళ గంగను పైకి తెచ్చాడని అంటారు.

చారిత్రక విశేషాలుసవరించు

గోపురనిర్మాణం చోళ శిల్ప సాంప్రదాయంలో అత్యద్భుతంగా ఉంటుంది. ఫ్రెంచి యాత్రికుడు ట్రావెర్నియర్ 16వ శతాబ్దంలో ఈ రామాలయాన్ని దర్శించి "భారతదేశంలోని పెద్ద గోపురాలలో ఈ రామాలయ గోపురం ఒకటి" అని కీర్తించాడు. ఆంధ్ర మహాభాగవతాన్ని రచించిన పోతన తాను ఏకశిలపురి వాసినని చెప్పుకున్నాడు. అంతే గాక తన భాగవతాన్ని ఈ కోదండ రామునికి అంకితం గావించాడు. దాన్ని బట్టి, భాగవతంలో ఈ ప్రాంతానికి చెందిన వాడుక మాటలు కొన్ని ఉండడాన్ని బట్టి, ఆయన కొంతకాలం ఇక్కడ నివసించాడని భావిస్తున్నారు.[2]

ఆలయ విశేషాలుసవరించు

ఈ ఆలయంలోని ప్రధాన విగ్రహం యొక్క ఒకే శిలలో రాముడు, సీత, లక్ష్మణుడు విగ్రహాలు చెక్కబడ్డాయి. దేవాలయాలలోని మూల విగ్రహాలలో రాముని విగ్రహం పక్కన హనుమంతుడు విగ్రహం లేని రామాలయం భారతదేశంలో ఇదొక్కటే. శ్రీరామహనుమంతుల కలయికకు ముందే ఒంటిమిట్టలో సీతారామలక్ష్మణుల ఏకశీలా విగ్రహం స్థాపించినట్లు కథనం.

ఈ కోదండ రామాలయానికి మూడు గోపురద్వారాలున్నాయి. విశాలమైన ఆవరణముంది. ఆలయ ముఖద్వారం ఎత్తు సుమారు 160 అడుగులు. 32 శిలాస్తంభాలతో రంగమంటపం నిర్మించబడింది. గోపురాలు చోళ పద్ధతిలో నిర్మించబడినాయి. రంగమంటపం విజయనగర శిల్పాలను పోలి ఉంది. పొత్తపి చోళులు, విజయనగర రాజులు, మట్లి రాజులు ఈ ఆలయాన్ని మూడు దశలుగా నిర్మించారు.[3] ఒంటిమిట్ట నివాసి, ఆంధ్రవాల్మీకి అని పేరొందిన వావిలికొలను సుబ్బారావు (1863 - 1936) ఈ రామాలయాన్ని పునరుద్ధరించాడు. స్వామికి ఆభరణాలను చేయించడంతో బాటు రామసేవా కుటీరాన్ని నిర్మించాడు. ఈయన టెంకాయ చిప్ప చేతపట్టి భిక్షాటన చేసి వచ్చిన సొమ్ముతో సుమారు పది లక్షల రూపాయల విలువైన ఆభరణాలను చేయించగలిగాడు. పోతన, అయ్యలరాజు రామభద్రుడు, ఉప్పుగుండూరు వేంకటకవి, వరకవి మరెందరో ఈ స్వామికి కవితార్చన చేశారు. వావిలికొలను సుబ్బారావు వాల్మీకి రామాయణాన్ని తెలుగులో రచించి, దానికి మందరం అను పేర వ్యాఖ్యానం కూడా వ్రాశాడు. గుడికి ఎదురుగా సంజీవరాయ దేవాలయం ఉంది. ఈ దేవాలయం ప్రక్కగా రథశాల - రథం ఉన్నాయి.

 
ఒంటిమిట్ట కోదండరామాలయ సముదాయము

చోళ, విజయనగర వాస్తుశైలులు కనిపించే ఈ ఆలయ స్తంభాలపైన రామాయణ భాగవత కథలను చూడవచ్చు. ప్రౌఢ దేవరాయల ఆస్థానంలోని అయ్యల తిప్పరాజు ఈ ప్రాంతవాసి. ఈయన స్వామిపైన ”శ్రీ రఘువీర శతకాన్ని” రచించాడు. ఇతని మనవడే అష్ట దిగ్గజాల్లో ఒకడైన అయ్యలరాజు రామభద్రుడు. ఇక తెలుగు వారు అమితంగా ఇష్టపడే మందార మకరందం లాంటి సహజ, సరళ కవి బమ్మెర పోతన, జన్మస్థలాన్ని గురించి ఎన్నో రకాలైన వివాదాలున్నప్పటికీ, ఆయన రచించిన భాగవతాన్ని అంకితమిచ్చింది మాత్రం కోదండరాముడికే. ఈ సహజకవి విగ్రహాన్ని ఆలయంలో దర్శించవచ్చు.

పూజలు, ఉత్సవాలుసవరించు

ప్రతి సంవత్సరం చైత్ర శుద్ధ నవమి నుండి బహుళ విదియ దాకా బ్రహ్మోత్సవాలు జరుగుతాయి. చతుర్దశి నాడు కళ్యాణం, పౌర్ణమి నాడు రథోత్సవం ఉంటాయి. నవమి నాడు పోతన జయంతి నిర్వహిస్తారు. కవి పండితులను సత్కరిస్తారు. 2002 బ్రహ్మోత్సవాల సందర్భంగా ఆలయ సమీపంలో మహాకవి పోతన విగ్రహాన్ని ఆవిష్కరించారు.

బ్రహ్మోత్సవాలుసవరించు

చంద్రుని వెలుగుల్లో స్వామివారి బ్రహ్మోత్సవాలను ఇక్కడ నిర్వహించడం ఈ ఆలయ ప్రత్యేకత. దీని వెనుక ఒక పురాణగాథవుంది. క్షీరసాగర మథనం తరువాత మహాలక్ష్మీదేవి అమ్మవారిని నారాయణుడు తన సతీమణిగా స్వీకరించాడు. పగలు జరిగే స్వామివారి వివాహాన్ని తాను చూడలేకపోతున్నానని ఆమె సోదరుడు చంద్రుడు స్వామివారికి విన్నవించగా ఒంటిమిట్టలో వెన్నెల వెలుగుల్లో తన కల్యాణాన్ని వీక్షించవచ్చని వరమిచ్చాడు. దాని ప్రకారమే రాత్రిళ్లు ఇక్కడ స్వామివారి బ్రహ్మోత్సవాలను నిర్వహిస్తారు. ప్రతి యేటా శ్రీరామనవమి ఉత్సవాలు తొమ్మిది రోజుల పాటు ఘనంగా నిర్వహిస్తారు. ప్రశాంత వాతావరణానికి నెలవైన ఈ ఆలయంలో పర్యాటక శాఖ వారు ఏర్పాటు చేసిన విద్యుద్దీపాల వెలుగులు ఎంతో శోభనిస్తున్నాయి.

ఇమాంబేగ్ బావిసవరించు

ఒంటిమిట్ట రామాలయం సందర్శకులను ఆకర్షించే అంశాల్లో ఇమాంబేగ్ బావి ఒకటి. ఇమాంబేగ్ 1640 సంవత్సరంలో కడపను పరిపాలించిన అబ్దుల్ నభీకాన్ ప్రతినిథి. ఒకసారి ఆయన ఈ ఆలయానికి వచ్చిన భక్తులను మీ దేవుడు పిలిస్తే పలుకుతాడా? అని ప్రశ్నించాడు. చిత్తశుద్ధితో పిలిస్తే కచ్చితంగా పలుకుతాడని వారు సమాధానమివ్వగా, ఆయన మూడు సార్లు రాముని పిలిచాడు. అందుకు ప్రతిగా మూడు సార్లు ఓ అని సమాధానం వచ్చింది. ఆయన చాలా ఆశ్చర్యచకితుడయ్యాడు. స్వామి భక్తుడిగా మారిపోయాడు. అక్కడి నీటి అవసరాలకోసం ఒక బావిని తవ్వించడం జరిగింది. ఆయనపేరు మీదుగానే ఈ బావిని ఇమాంబేగ్ బావిగా వ్యవహరించడం జరుగుతుంది. అందువలన ముస్లింలు కూడా ఈ ఆలయాన్ని దర్శించుకుంటారు.

పరిపాలనసవరించు

ఈ ఆలయ నిర్వహణను ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తిరుమల తిరుపతి దేవస్థానములు కు అప్పగించింది[4]

చిత్రమాలికసవరించు

మూలాలుసవరించు

  1. "vontimitta: కన్నుల పండువగా ఒంటిమిట్ట కోదండరాముడి కల్యాణం". EENADU. Retrieved 2022-04-16.
  2. కట్టా, నరసింహులు (2015-02-22). "ఒంటిమిట్టకు ఆ పేరెలా వచ్చింది". Retrieved 2021-06-20.
  3. కట్టా, నరసింహులు. "పౌరాణిక భౌగోళిక చారిత్రక ప్రాధాన్యాన్ని నింపుకొన్న ఒంటిమిట్ట". Archived from the original on 2015-06-03. Retrieved 2020-05-19.
  4. "Ontimitta temple brought under TTD fold". The Hindu. 29 July 2015.

వెలుపలి లంకెలుసవరించు