ఖండూభాయి దేశాయి

(ఖందూభాయి కసాంజీ దేశాయి నుండి దారిమార్పు చెందింది)

ఖండూభాయ్ కసాంజీ దేశాయ్ (కె.కె.దేశాయ్) స్వాతంత్ర్య సమరయోధుడు, కార్మిక నాయకుడు, గాంధేయవాది, భారత జాతీయ ట్రేడ్ యూనియన్ కాంగ్రేస్ స్థాపకుల్లో ఒకడు. 1968 ఏప్రిల్ 11 నుండి 1975 జనవరి 25 వరకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర గవర్నరుగా పనిచేశాడు.[1]

ఖండూభాయ్ కసాంజీ దేశాయ్

పదవీ కాలం
1968, ఏప్రిల్ 11 – 1975, జనవరి 25
ముందు పీ.ఏ.థాను పిల్లై
తరువాత ఎస్.ఓబుల్‌రెడ్డి

వ్యక్తిగత వివరాలు

జననం 23 అక్టోబరు 1898
బుల్సార్, గుజరాత్
మరణం 1975 ఏప్రిల్ 17(1975-04-17) (వయసు 76)
జాతీయత భారతీయుడు
రాజకీయ పార్టీ భారత జాతీయ కాంగ్రేసు
జీవిత భాగస్వామి పార్వతీబెన్
సంతానం ఒక కుమారుడు, నలుగురు కుమార్తెలు
పూర్వ విద్యార్థి గుజరాత్ విద్యాపీఠం
వృత్తి రాజకీయవేత్త

ప్రారంభ జీవితం

మార్చు

ఖండూభాయ్ దేశాయ్, 1898 అక్టోబరు 23 న, గుజరాత్ రాష్ట్రంలోని బుల్సార్ లో ఒక మధ్యతరగతి కుటుంబంలో జన్మించాడు. ఈయన తండ్రి కసాంజీ దేశాయ్. బుల్సార్‌లోని బాయి అనాభాయ్ ఉన్నత పాఠశాలలో మెట్రిక్యులేషన్ దాకా చదివాడు.[2] మెట్రిక్యులేషన్ పరీక్ష పూర్తయిన తర్వాత బొంబాయిలోని విల్సన్ కళాశాలలో చేరాడు. ప్రతిభావంతమైన విద్యార్థి అయిన ఖందూబాయిపై అప్పటికే మహాత్మా గాంధీ సిద్ధాంతాలు, నాయకత్వం యొక్క ప్రభావం పడింది. 1920లో పాఠశాలలు, కళాశాల బహిష్కరణకు పిలుపు రాగానే కళాశాల విద్యకు స్వస్తి చెప్పి సహాయనిరాకరణోద్యమంలో పాల్గొన్నాడు. ఆ తరువాత అహమ్మదాబాదులోని గుజరాత్ విద్యాపీఠంలో చేరి అక్కడ పట్టభద్రుడైన తర్వాత బొంబాయిలోని ఒక జాతీయపాఠశాలకు ప్రధానోపాధ్యాయునిగా చేరాడు.

కార్మిక ఉద్యమం

మార్చు

అహ్మదాబాదులో మహాత్మా గాంధీ ఆధ్వర్యాన కార్మికోద్యమం ప్రారంభమైంది. ఆ ఉద్యమం సుస్థిరత చెందుతుండగానే గాంధీ ఆశీర్వాదంతో అహ్మదాబాదు వస్త్రపరిశ్రమ కార్మికుల సంఘం - మజ్దూర్ మహాజన్ ఏర్పాటైంది. ఈ సంఘాన్ని అనసూయా బెన్ సారాభాయ్ అనే ఆవిడ స్థాపించింది. మహాత్మా గాంధీకి సన్నిహితుడు, స్వాతంత్ర్యవాది అయిన శంకరలాల్ బంకర్ కూడా ఈ సంఘపు నిర్మాణము, అభివృద్ధికి కృషిచేశాడు. సహాయనిరాకరణోద్యమంలో శంకర్‌లాల్, ఖందూబాయ్ సామాన్య ప్రజలకు చేసిన సహాయాన్ని చూసి, ఆయన స్వభావసిద్ధంగా నాయకుడని, పేదప్రజలమధ్య పనిచేయటానికి తగిన వ్యక్తి అని గుర్తించి ప్రోత్సహించాడు. ఖందూబాయ్‌ని మజ్దూర్ మహాజన్లో పూర్తిస్థాయి కార్యకర్తగా చేరి పనిచేయవలసిందిగా కోరాడు. కార్మిక వర్గాలలో పనిచేస్తూ, ధనికవర్గాల దోపిడీని అరికట్టడానికి మహాత్మాగాంధీ అహింసా సిద్ధాంతాలపై ఆధారపడిన ఒక సంఘాన్ని దేశంలో స్థాపించాలని అనుకున్నాడు. ఈ భావన యువకుడైన ఖందూబాయ్ ని ఎంతగానో ఆకర్షించింది. అందుకే హృదయపూర్వకంగా కార్మిక ఉద్యమంలో పనిచేయటానికి ఒప్పుకున్నాడు. మజ్దూర్ మహాజన్‌ను మహాత్మా గాంధీ, కార్మిక పరిశోధనశాలగా అభివర్ణించాడు. గాంధీ నాయకత్వాన కార్మిక ఉద్యమంలో అనేక కొత్తపరిమాణాలను ఆయన చూడగలిగాడు. అనసూయా బెన్, శంకర్‌లాల్ నేతృత్వంలో అనేక విషయాలు నేర్చుకున్నాడు.

కార్మిక సమస్యల పరిష్కారానికి కొత్త పద్ధతులు అవలంబించాలని ఆయన వాదించాడు. సంయుక్త చర్చలు, ఒడంబడికలద్వారా తగాదాల పరిష్కారం లేదా సరాసరి చర్చలు, అవి విఫలమైతే మధ్యవర్తి పరిష్కారం. ఈ పద్ధతులను ఖందూబాయ్ దేశాయ్ ప్రవేశపెట్టి, ప్రోత్సహించాడు. కార్మికుల జీవనస్థాయి అభివృద్ధిపరచడానికి గల అవకాశాలన్నీ ఉపయోగించుకొని, గాంధీ సిద్ధాంతాలు, విధానాలు అమలుచేస్తూ గుల్జారీలాల్ నందాతో కలిసి విశేషంగా కృషిచేశాడు. కార్మికునిక మంచి వేతనం మాత్రం ఉంటే సరిపోదని, అన్నివిధాలా కార్మికుడు అభివృద్ధిచెందాలని వీరిరువురూ కృషి చేశారు. కార్మికుల సాంఘిక పౌరజీవన అభివృద్ధికి విశేష ప్రాధాన్యత ఇచ్చారు. సంఘంలో కార్మికుల శక్తిసామర్ధ్యాలకు గుర్తింపు తేవటానికి పాటుపడ్డారు. ఈ విధంగా ఖందూబాయ్ దేశాయ్ శక్తివంతమైన ట్రేడ్ యూనియన్ ఉద్యమాన్ని నిర్మించారు. అహ్మదాబాదు కార్మికులకు ట్రేడ్ యూనియన్ పద్ధతులతో పాటు సాంఘిక విషయాలు కూడా బోధించి వస్త్రపరిశ్రమ కార్మికుల సంఘాన్ని దేశంలోనే ప్రముఖమైన కార్మిక సంఘంగా తీర్చిదిద్దారు.

 
ఖండూభాయి దేశాయి

రాజకీయాల్లో

మార్చు

ఖండూభాయ్ 1937లో బొంబాయి శాసనసభకు కార్మిక సంఘాల ప్రతినిధిగా ఎన్నికయ్యాడు. పారిశ్రామిక తగాదాలు శాంతియుతంగా పరిస్కారం కావటానికి వీలుకలిగించే శాసనం ఆమోదించబడటానికి ఆయన ఆ సమయంలో తోడ్పడ్డాడు. అలాంటి శాసనం దేశంలో ప్రవేశపెట్టడం అదే ప్రథమం. 1939లో స్వాతంత్ర్యోద్యమంలో బొంబాయి రాష్ట్ర కాంగ్రేసు నాయకులంతా తమ పదవులకు రాజీనామాచేయడంతో, బొంబాయి శాసనసభ రద్దై నేరుగా ప్రభుత్వపాలనలోకి వెళ్ళింది. 1942లో క్విట్ ఇండియా ఉద్యమంలో పాల్గొని రెండోసారి జైలుకెళ్ళాడు. 1946లో తిరిగి బొంబాయి శాసనసభకు ఎన్నికలు జరిగినప్పుడు ఖందూబాయి కూడా శాసనసభ్యుడిగా ఎన్నికై, 1950లో ప్రొవిజనల్ పార్లమెంటుకు ఎన్నికయ్యేదాకా కొనసాగాడు. స్వాతంత్ర్యం తర్వాత బొంబాయి శాసనసభనుండి రాజ్యాంగ పరిషత్తుకు ఎన్నికయ్యాడు. రాజ్యాంగ పరిషత్తులో ఆయన కార్మిక, పరిశ్రమలు, రైల్వేలు, ఆర్ధిక వ్యవహారాలపై జరిగిన చర్చలలో విశేషంగా పాల్గొన్నాడు. మేనేజింగ్ ఏజెన్సీ పద్ధతిని వ్యతిరేకించాడు. కాంగ్రేస్ కార్యకలాపాల్లో ప్రముఖపాత్ర పోషించాడు. ఎన్నో ఏళ్లు గుజరాత్ ప్రదేశ్ కాంగ్రేస్ కమిటీకి ఉపాధ్యక్షుడుగా, అఖిలభారత కాంగ్రేసు కమిటీ, కాంగ్రేసు కార్యవర్గాలలో సభ్యుడిగా పనిచేశాడు.

ఖండూభాయ్ 1951లో తొలి సార్వత్రిక ఎన్నికలలో బొంబాయి రాష్ట్రంలోని మెహసానా పశ్చిమ లోక్‌సభ నియోజకవర్గం నుండి పోటీచేసి స్వతంత్ర అభ్యర్థి తులసీదాస్ కిలాచంద్ చేతిలో నాలుగువేల ఓట్ల తేడాతో ఓడిపోయాడు.[3] 1952లో సౌరాష్ట్ర రాష్ట్రంలోని హలర్ లోక్‌సభ నియోజకవర్గానికి జరిగిన మధ్యంతర ఎన్నికలలో పోటీచేసి లోక్‌సభకు ఎన్నికయ్యాడు.[2][4] 1954, సెప్టెంబరు 4న జవహర్ లాల్ నెహ్రూ మంత్రివర్గంలో, వి.వి.గిరి రాజీనామా చేసిన స్థానంలో కేంద్ర కార్మిక శాఖామంత్రిగా నియమించబడ్డాడు.[5] కార్మిక మంత్రిగా, కార్మికులకు అధిక ప్రాధాన్యం ఇచ్చే చర్యలను ఈయన అమలు జరిపాడు. ఈయన హయాంలోనే వ్యవసాయ కూలీల స్థితిగతుల విచారణసంఘం ఏర్పాటై, నివేదిక సమర్పించింది. ఇది ఆగ్నేయాసియాలేని ఇలాంటి తొలి నివేదికగా పేర్కొనబడింది. కనీసవేతనాల నిర్ణయం, జాతీయ వేతన విధానం అమలుజరపడానికి ఖండూభాయ్ "ఫెయిర్ వేజెస్" కమిటీ సభ్యుడిగా కృషిచేశాడు. ఈ కమిటీ నివేదిక, ఆ తరువాతి కాలంలో యజమానులకు, కార్మికులకు, ట్రిబ్యునల్లకు ఒక సూచికగా ఉపయోగపడింది.

1957లో అహమ్మదాబాదు నియోజకవర్గం నుండి లోక్‌సభకు పోటీచేసి ఓడిపోయాడు. ఈ ఎన్నికల్లో ఆయన ప్రత్యర్థి మహాగుజరాత్ జనతా పరిషత్ అధ్యక్షుడు ఇందూలాల్ యాజ్నిక్ 1,27,500 ఓట్ల ఆధిక్యతతో గెలిచాడు.[6][7] ఎన్నికలలో ఓడిపోవటంతో పాటు మంత్రి పదవిని కోల్ఫోయాడు. ఈయనను రాజ్యసభ సభ్యుడిగా నియమించి, మంత్రివర్గంలో కొనసాగించి ఉండవచ్చు కానీ, ప్రధానమంత్రి జవహర్ లాల్ నెహ్రూ అందుకు సమ్మతించలేదు.[8]

భారత జాతీయ ట్రేడ్ యూనియన్ కాంగ్రేస్ ఆధ్యక్షుడిగా, దేశాయ్ భారతీయ కార్మిక ప్రతినిధివర్గం నాయకుడిగా 1950లో జెనీవా పర్యటించాడు. 1953లో టోక్యోలో జరిగిన ఆసియా ప్రాంతీయ ప్రపంచ కార్మిక సంస్థ సమావేశంలో పాల్గొన్నాడు. 1962లో బెర్లిన్ లో జరిగిన కార్మిక సమావేశంలో పాల్గొన్నాడు.

1961 నుండి ఆయిల్ ఇండియా లిమిటెడ్‌కు ఛైర్మన్ గా ఉన్నాడు. సహజవాయువు, పెట్రోలు ఉత్పత్తులు తయారుచేసే ప్రభుత్వరంగసంస్థలో అది పెద్దది. అక్కడ దేశాయి సంస్థను సమర్ధవంతంగా నిర్వహించి, వృద్ధి చేసి మంచి ఫలితాలు సాధించాడు.[9]

1959లో రాజ్యసభకు ఎన్నికయ్యాడు.[10] 1968 వరకు రాజ్యసభ సభ్యుడు ఉన్నాడు.

గవర్నరుగా

మార్చు

ఖండూభాయి దేశాయి 1968 ఏప్రిల్ 11 నుండి 1975 జనవరి 25 వరకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఐదవ గవర్నరుగా దాదాపు ఏడేళ్ళ పాటు పనిచేశాడు. ఈయన హాయంలో ముగ్గురు ముఖ్యమంత్రులతో పనిచేశాడు. 1969లో ప్రత్యేక తెలంగాణా ఉద్యమం, దానికి ప్రత్యుత్తరంగా జై ఆంధ్ర ఉద్యమం ప్రారంభమయ్యాయి. ఖండూభాయి దేశాయి గవర్నరుగా ఉన్న కాలంలోనే జైఆంధ్రా ఉద్యమం హింసాయుతంగా మారటంలో ముఖ్యమంత్రి పి.వి.నరసింహారావు రాజీనామ చేశాడు. ఆందోళనలు అదుపుతప్పడంతో ఆంధ్రప్రదేశ్ లో 1973, జనవరి 11 నుండి 1973, డిసెంబరు 10 దాకా రాష్ట్రపతి పాలన విధించారు. ఈ సమయంలో ఖండూభాయి ఐ.సి.ఎస్ అధికారులు వి.కె.రావు, హెచ్.సి.సరిన్‌లు సలహాదారులుగా పాలనాబాధ్యతలు నిర్వహించాడు.[1] రెండు పెద్ద ఉద్యమాల సందర్భంలో నిగ్రహంగా, సామరస్యంగా ప్రవర్తించిన గవర్నరుగా నిలచిపోయాడు.[11] అనారోగ్య కారణాలవళ్ళ ఆంధ్రప్రదేశ్ గవర్నరుగా రాజీనామా చేసి స్వస్థలం వెళ్ళగానే తిరిగి అహ్మదాబాదు జౌళిమిల్లుల కార్మిక సంఘపు అధ్యక్ష పదవిచేపట్టాడు.

ఖండూభాయి దేశాయి 1975, ఏప్రిల్ 17న అహ్మదాబాదులోని తన నివాసంలో గుండెపోటుతో మరణించాడు.[12] భార్య పార్వతీబెన్. ఈయనకు ఒక కుమారుడు యశ్వంత్ భాయ్, నలుగురు కుమార్తెలు.[10]

మూలాలు

మార్చు
  1. 1.0 1.1 M.L.Melly, Maitreyi. "History repeats itself". The Hindu. No. March 01, 2014. Retrieved 25 October 2017.
  2. 2.0 2.1 "Loksabha Members Bioprofile". Lok Sabha. Retrieved 25 October 2017.[permanent dead link]
  3. "Statistical Report on Lok Sabha Elections 1951-52" (PDF). Election Commission of India. Archived from the original (PDF) on 2012-01-11. Retrieved 2017-10-26.
  4. "First Lok Sabha State wise Details - Saurashtra". Lok Sabha. Retrieved 26 October 2017.[permanent dead link]
  5. "dated September 09, 1954: New Labour Minister". The Hindu. No. Sep 09, 2004. Retrieved 26 October 2017.
  6. "dated March 17, 1957: Labour Minister defeated". The Hindu. No. మార్చి 17, 2007. Retrieved 23 October 2017.
  7. "Verdict of the People" (PDF). The Economic Weekly. No. Volume IX - No.1 2. March 23, 1957. Retrieved 26 October 2017. {{cite news}}: |issue= has extra text (help)[permanent dead link]
  8. "The Economic Weekly" (PDF). No. Volume IX - No.16. April 20, 1957. Retrieved 25 October 2017. {{cite news}}: |issue= has extra text (help)[permanent dead link]
  9. "Oil India Limited Speech of the Chairman, Shri Khandubhai K Desai" (PDF). The Economic Weekly. No. June 30, 1962. pp. 1023–1024. Retrieved 26 October 2017.[permanent dead link]
  10. 10.0 10.1 "Rajya Sabha Members (1952-2003)" (PDF). rajyasabha.nic.in. Retrieved 26 October 2017.
  11. "శ్రీ ఖండూభాయ్ దేశాయ్ గారు" (PDF). ఆంధ్రపత్రిక. No. 1975, ఏప్రిల్ 18. Retrieved 26 October 2017.[permanent dead link]
  12. "శ్రీ ఖండూబాయిదేశాయి కాలధర్మం" (PDF). ఆంధ్రప్రభ. No. 1975 ఏప్రిల్ 18. Retrieved 26 October 2017.[permanent dead link]