ఖజురహో నిర్మాణ సమూహాలు

(ఖజురాహో నుండి దారిమార్పు చెందింది)

ఖజురహో (ఆంగ్లం : Khajuraho) మధ్యప్రదేశ్ రాష్ట్రం, ఛత్తర్ పూర్ జిల్లాలోని ఒక గ్రామం. ఢిల్లీకు 620 కి.మీ. దూరంలో గల ప్రాంతం.

యునెస్కో ప్రపంచ వారసత్వ ప్రదేశం
ఖజురహో దేవాలయాల సమూహము
ప్రపంచ వారసత్వ ప్రదేశాల జాబితాలో సూచించబడిన పేరు
A typical temple at Khajuraho with divine couples. Note lace-like ornamentation on the major and the minor shikharas.
రకంసాంస్కృతిక
ఎంపిక ప్రమాణంi, iii
మూలం240
యునెస్కో ప్రాంతంఆసియా-పసిఫిక్ వారసత్వ ప్రాంతాలు
శిలాశాసన చరిత్ర
శాసనాలు1986 (10వ సమావేశం)

ఇక్కడి నిర్మాణ సమూహాలు యునెస్కో వారిచే ప్రపంచ వారసత్వ ప్రదేశంగా గుర్తింపబడ్డాయి.

ఈ దేవాలయాలు, హిందూ, జైన దేవాలయాల సమూహం. దీనికి ఆ పేరు సంస్కృతం భాషనుండి మూలంగా వచ్చింది. సంస్కృతంలో ఖజూర్ అనగా ఖర్జూరము.

ఇండియాలో  ఆగ్రా తర్వాత ఎక్కువ మంది సందర్శించే క్షేత్రం ఖజురాహో .’’ఇండో ఆర్యన్ కళకు’’ అద్దం పట్టే శిల్ప వైభవం ఇక్కడే చూస్తాం .దేవాలయ శిల్పకళకు అపూర్వ శిల్పాలకు ప్రపంచం లోనే గొప్ప ప్రదేశం ఖజురహో. తొమ్మిదో శతాబ్దం నుండి పదకొండవ శతాబ్ది లోపు నిర్మితమైన దేవాలయ సముదాయం. ఇది చండేలా రాజ వంశీకుల అద్వితీయ కళా తృష్ణ కు శిల్పుల  కళా సృష్టికి దర్పణం. 85దేవాలయాలలో ఇప్పుడు మిగిలింది కేవలం 25మాత్రమే. ఖజురహో సాగర్ ఒడ్డున ఖజురహో గ్రామం ఎనిమిది వేల జనాభా తో ఉంది. మధ్యప్రదేశ్ లో చత్తర్ పూర్ జిల్లాలో ఖజురహో ఉంది. నర్మదా, చంబల్ నదుల పరివాహక ప్రాంతం. ఉత్తర దక్షిణ భారత దేశాలను వేరు చేసే వింధ్య పర్వత శ్రేణులలో ఉన్న ఈ ప్రదేశం శిల్ప కళ కు కాణాచి గా వెలసిల్లింది. సాత్నా రైల్వే స్టేషన్ దీనికి దగ్గరగా ఉంటుంది. వాతావరణం ఉష్ణ మండల శీతోష్ణ స్తితి. పూర్వకాలంలో వర్షపు నీటిని నిలవ చేయటానికి 60 తటాకాలు వుండేవి. ఇప్పుడు మూడు తటాకాలు మాత్రమే ఉన్నాయి. అవే ఖజురహో సాగర్ ,శివ సాగర్ ,ప్రేమ సాగర్ లు .ఇక్కడ ఇప్పపూల చెట్లు విపరీతం. వీటిని సాగు చేసి పెంచుతారు. ఇవి సారా పరిశ్రమకు తోడ్పడి ఆదాయం పెంచేవి .

16వ శతాబ్దికి ఖజురహో వైభవం అంతా హారతి కర్పూరం అయి పోయింది .1838వరకు దీని గురించి బయటి ప్రపంచానికి తెలియ లేదు. బ్రిటిష్ సర్వేయర్ టి. ఎస్. బర్ట్ పల్లకీ లో వెలుతూ వుంటే అది ఒరిగి పడిపోతే బాగు చేయిస్తూ ఈ కళా ఖండాలను చూసి ఆశ్చర్య పడ్డాడు. "భారత దేశం లోని అన్ని దేవాలయాల వైభవం ఇక్కడే దర్శించ వచ్చు" అని రిపోర్టు రాశాడు. దంగాకు చెందిన 1002 నాటి  శిలా శాసనాన్ని కాపీ చేసి పెట్టుకొన్నాడు. ఇది విశ్వనాధ దేవాలయంలో ఉంది .

అలెగ్జాండర్ కన్నింగ్ హాం ఖజురాహో అంటే ‘’ఖర్జూర వనం’’ అని అర్ధం చెప్పాడు .’’ఖర్జూర వాటిక ‘’అనే వారు ఆనాడు. అది ఉచ్చస్తితి లో ఉన్నప్పుడు ఇక్కడ ఖర్జూరం విపరీతం గా పండేది .దీనికి సాక్ష్యం గా రెండు బంగారు ఖర్జూరాలు సిటీ గేట్ల వద్ద త్రవ్వకాలలో లభించాయి. ఈ ఆలయాలపై బూతు బొమ్మలు అధికం. వాటిని విడిగా చూడకుండా మొత్తం శిల్పాలను కలిపి ఒకే దృష్టి తో చూడాలని చరిత్రకారులన్నారు. 1864లో కన్నింగ్ హాం దర్శించి 872 విగ్రహాలున్నాయని, అందులో గోడలకు వెలుపల 646 ఉన్నాయని రిపోర్ట్ రాశాడు. అవన్నీ చెల్లా చెదరుగా పడి కుప్పలు గా ఉండిపోయాయని ఆ శిలాశిల్ప నిధి అపూర్వమనీ చెప్పాడు .

మహాత్మా గాంధి ఈ ఆలయాలను చూసి ‘’చాలా జుగుప్సా కరమైన శిల్పాలనీ వీటిని వెంటనే తొలగించేయాలని ‘’హితవు పలికాడు. దానికి స్పందించిన గురుదేవులు రవీంద్ర నాథ్ ఠాగూర్ ‘’ఖజురహో జాతీయ నిధి అని దాన్ని కూల్చేయ మనటం అవివేకమని అలా చేస్తే మన పూర్వీకులు మరీ శృంగార జీవులు అనే అభిప్రాయం ఏర్పడుతుంది ‘’అని గాంధీకే ‘’క్లాస్ ‘’పీకాడు. ఖజురహో పద్నాలుగో శతాబ్దపు చండేలా వంశ రాజుల మతాత్మక రాజధాని అన్నారు ఆరబ్ యాత్రికుడు’’ ఐబాన్ బుటూటా’’దీన్ని1335 లో చూసి దీన్ని ‘’కజర్రా ‘’అనే వారని ఇక్కడ యోగులు బారు గడ్డాలతో జటాజూటాలతో ఉండేవారని నిరాహారం  వలన వారి శరీరాలు పాలిపోయి పసుపు రంగులోకి మారాయని రాశాడు .ఇప్పుడున్న ఖజురహో సాగర్ 800మీటర్లు పడమటి దేవాలయాలకు దూరంగా ఉండేది. అప్పుడిది ఖజురహో నగరానికి గుండె కాయగా వర్ధిల్లిందని చెప్పాడు. ఇప్పటికీ శివరాత్రి నాడు వేలాది  భక్తులు వచ్చి దర్శించి తరిస్తారు. అప్పుడు గొప్ప ఉత్సవాన్ని నిర్వహిస్తారు. ఖజురహో వచ్చిన వారు ఇక్కడ ప్రభుత్వం ఏర్పాటు చేసిన ‘’లైట్ అండ్ సౌండ్ ప్రోగ్రాం" తప్పక చూసి అనుభూతి పొందాలి. ఇక్కడ సాంస్కృతిక ఉత్సవాలు జరిగేవి. భారతీయ సర్వకళా ప్రదర్శన నిర్వహిస్తారు. ఖజురహో సంప్రదాయాన్ని ఇప్పటికీ గౌరవించి కొనసాగిస్తారు. ఎన్నో రకాల సెమినార్లు జరుగుతాయి. స్థానికంగా తయారైన అనేక కళాత్మక వస్తువులను విశాలమైన ప్రాంతంలో ప్రదర్శించి అమ్ముతారు. ఈ ఉత్సవం భారత దేశానికే కాదు ప్రపంచమంతటికీ ఆకర్షణీయమే.

10 నుండి 12వ శతాబ్ద కాలం వరకు భారతదేశములో ఈ ప్రాంతాన్ని పరిపాలించిన చండేలా అనే హిందూ రాజపుత్ర వంశస్థుల రాజధానిగా వర్థిల్లినది. ఈ దేవాలయాల సమూహాలు 950 నుండి 1050 మధ్య సుమారు నూరు సంవత్సరాల మధ్య కాలంలో నిర్మింపబడినవి. తరువాతి కాలంలో చందేల రాజధాని మహోబాకు మార్చబడింది. అయినా మరి కొంత కాలం పాటు ఖజురాహో వెలుగొందినది.

దీని చుట్టూ 8 ద్వారాలతో కూడిన కుడ్యం ఉంది. ప్రతి ద్వారము రెండు బంగారు కొబ్బరి కాండముల మధ్య ఉంది. సుమారు 8 చదరపు మైళ్ళ అంటే 21 చదరపు కిలో మీటర్ల విస్తీర్ణంలో 80 కి పైగా హిందూ దేవాలయాలు పరుచుకొని ఉన్నాయి. కాని ప్రస్తుతం 22 మాత్రమే చెప్పుకోదగినంత వరకు పునరుద్ధరించబడినాయి.

ఉత్తర భారతంలో ఇతర సాంస్కృతిక స్థానాల వలె ఖజురాహో దేవాలయాలు సా.శ.1100-1400 ల మధ్య ముస్లిం చొరబాటు దారుల చేత నేలమట్టం కాలేదు. చాలా కాలపు నిర్లక్ష్యం తరువాత 19 వ శతాబ్దంలో బ్రిటీష్ వారు వీటిలో కొన్నింటిని కనిపెట్టారు. తవ్వకాలు మొదలు పెట్టారు.

ఖజురహో వృత్తాంతం

చండేలా రాజులు రాజపుత్ర వంశానికి చెందిన చంద్ర వంశ రాజులు. చండేలా రాజుల మధ్య భారతాన్ని చాలా కాలం ఏలారు .తొమ్మిదో శతాబ్ది నుండి పద్నాలుగో శతాబ్ది వరకు వీరి పాలన సాగింది .వీరిని ‘’జేజక భుక్తి’’రాజులనే వారు ఇప్పుడు’’ బుందేల్ ఖండ్ ‘’రాజులంటారు .చాంద్ బర్డాయి అనే ప్రాచీన కవి ధిల్లీ అజ్మీర్ ల పాలకుడైన పృధ్వీరాజుచౌహాన్ ఆస్థాన కవి గా ఉండేవాడు .ఆయన రాసిన దాని ప్రకారం కాశీకి చెందిన గాహద్వారా రాజు ఇంద్ర జిత్ ఆస్థాన పురోహితుడి కూతురు   హేమవతి.హేమావతి గొప్ప అంద గత్తే .ఇంద్రుడే ఆమె సౌందర్యానికి నీరైపోయాడు. అతన్ని పెళ్లి చేసుకొనంది. ఇంద్రుడి శాపం వలన విధవ రాలైంది .అప్పటికి ఆమె వయసు పదహారే .ఒక రాత్రి విరహ వేదన భరించలేక ‘’రతి తాలిబ్ ‘’అనే సరస్సులో నగ్నం గా స్నానం చేస్తుంటే చంద్రుడు ఆమెను మోహించి ఆమెను చేరి సల్లాపాలాడాడు .ఆమె కన్యత్వం కోల్పోయింది .ఈ పరాభవాన్ని దాచుకోవటానికి ఎంతో ప్రయత్నించింది .చంద్రుడు ఆమెనుకర్ణావతి నదీ తీరం లోని ఖజూర వాటిక లో తల దాచుకోమని సలహా ఇచ్చాడు .ఆమెకు పుట్టబోయే కుమారుడు అద్వితీయ బల సంపన్నుడై పదహారవ ఏట రాజు అవుతాడని రాజ్య విస్తరణ చేస్తాడని అనునయింఛి అదృశ్యమైనాడు  చంద్రుడు .

హేమావతి కాశీ లో తండ్రి ఇంటికి చేరింది .మళ్ళీ కలన్జార్ కు తిరిగొచ్చింది .కొడుకును కన్నది .చంద్ర వర్మ అనే పేరు పెట్టింది .అతడు పెరిగి పెద్దవాడై బల పరాక్రమ సంపన్నుడైనాడు .పదహారో ఏట ఒక సింహాన్ని పులిని సునాయాసం గా పోరాడి చంపాడు .సంతోషించిన తల్లి హేమావతి చంద్రుని ప్రార్ధించింది .చంద్రుడు దిగి వచ్చి కొడుక్కి ‘’ఒక పరుస వేది’’నిచ్చాడు అది దేన్నీ తాకితే అది బంగారం అవుతుంది .క్రమంగా ధనమూ పెరిగి ‘’మహోబా ‘’కు రాజై  రాజ్య విస్తరణ చేశాడు .కాశీ లోని గాహద్వారా రాజును ఓడించి కాశీని కూడా తన రాజ్యం లో కలిపేశాడు హేమావతి కొడుకు చంద్ర వర్మ రాజు .వివాహం చేసుకొని రాణీ తో ఖజురాహో చేరి ‘’భంద్య యజ్ఞం ‘’చేసి తల్లి పై పడిన మచ్చను అవమానాన్ని తొలగించాడు .తల్లి కోరిన వన్నీ తీర్చాడు .విశ్వ కర్మ ను ఆహ్వానించి ఖజురహో లో 85దేవాలయాలను నిర్మించి తల్లి హేమావతికి కానుక గా సమర్పించాడు .అందుకే ఇక్కడ ఏ దేవాలయం లో చూసినా ఆలయం ముందు సింహం తో పోరాడే బాలుడి శిల్పం కని  పిస్తుంది .ఆ బాలుడే చంద్ర వర్మ .

ర్.వి రసెల్ పండితుని దృష్టిలో మధ్య భారతం లో సుప్రసిద్ధులైన ‘’భారులు ‘’అనే శిల్ప వంశానికి చెందినవారే  చండేలా రాజ వంశ మూల పురుషులు .954కాలపు శిలా శాసనం ప్రకారం ఈ వంశ మూల పురుషుడు ‘’చంద్రాత్రేయ మహర్షి ‘’.కనుక చంద్రాత్రేయుడు లేక చంద్ర వర్మ ఈ వంశానికి మూలపురుషుడు .చంద్రవర్మ ఖజురహో లో రాజదానినేర్పరచి పాలించాడు .కన్నింగ్ హాం ఊహించిన దాని ప్రకారం కాశీ కి చెందిన ఘద్వారా రాజు ఇంద్రజిత్ పురోహితుడు హేమరాజే చంద్ర వర్మ గా సా.శ.168లో ఖజురహో రాజు గా అభిషిక్తుడయ్యాడు .చరిత్ర లోతుల్లోకి వెడితే తొమ్మిదో శతాబ్ది పూర్వభాగం లో పాలించిన ‘’నన్నూకుడు ‘’ఈ వంశానికి మొదటి రాజు .ప్రతీహార రాజులు బలహీన పాలకులుగాతయారై విచ్చిత్తి చెందే సమయం లో    చందేలీ రాజులు స్వాతంత్ర్యాన్ని ప్రకటించుకొన్నారు .నన్నూకుడే మొదట స్వాతంత్ర చండేలా రాజు .అతని తర్వాత కొడుకు’’ వాక్ పతి’’ రాజు అయి తొమ్మిదో శతాబ్దం ఉత్తరార్ధం అంతా పాలించాడు .సామ్రాజ్యాన్ని క్రమం గా విస్తరిస్తూ వింధ్య పర్వత భాగాలలో కొన్ని స్వాధీన పరచుకొన్నాడు వాక్ పతి ..అతని ఇద్దరుకోడుకులు జయ శక్తి ,విజయ శక్తి తండ్రి తరువాత చందేలా రాజులై పాలించారు .అన్నదమ్ములిద్దరూ  ధైర్య సాహస వంతులై నందున అనేక రాజ్యాలను జయించి సామ్రాజ్యాన్ని విస్తరించారు .మొదట జైశక్తి రాజై  రాజ్యం చేశాడు .ఇతనినే ‘’జైజక్ ‘’లేక ‘’జేజకా ‘’అనే వారు .తను పాలించిన ప్రాంతాన్ని అంతటిని ‘’’’జైజక భుక్తి ‘’గా ప్రకటించుకొన్నాడు .కొడుకులు లేనందున వారసుడిగా తమ్ముడు విజయ శక్తిని ప్రకటించి రాజ్య పాలన చేయించాడు .

           శిలా శాసనాదారాలను బట్టి విజయ శక్తి అనేక యుద్ధాలు చేసి చాలా రాజ్యాలను వశపరచుకొని రాజ్య విస్తరణ చేసి విజేత అయ్యాడు .అన్నదమ్ములైన జయ ,విజయుల వీరగాదలను కధలుగా గేయాలుగా పాడుకొనే వారు .ఇద్దరూ కలిసి పాలించినట్లే భావించేవారు ప్రజలు .విజయశక్తి తర్వాత కొడుకు రాహిల్ రాజయ్యాడు .రెండేళ్ళు పాలించాడు మహోబా కు దగ్గరలో రహీలా గ్రామం అతని పేర ఏర్పడింది .’’రహీల్ సాగర్’’ సరస్సు నిర్మించాడు .అతని తర్వాత కొడుకు హర్షదేవుడు సా.శ.900లోరాజై, 25 ఏళ్ళు సుదీర్ఘ రాజ్య పాలన చేశాడు .అతనికాలమే మహోన్నతమైన్డిగా చరిత్రాకారులు భావిస్తారు .’’ఓద్’’ కు  చెందిన కనోజ రాజ్యానికి ప్రతీహార రాజు మొదటి మహీ పాలుడిని రాజు గా చేయటానికి  హర్ష దేవుడు కృషి చేశాడు .అంతకు ముందు రాష్ట్ర కూటులు మహీపాల్ ను ఓడించి రాజ్యాన్ని లోబరచుకొన్నారు .ఇది 915లో జరిగింది .ఈ వరుస విజయాలతో హర్ష దేవ రాజు ఖజురాహో లో ‘’మాతం గేశ్వరాలయం ‘’నిర్మించి శివుడికి కానుకగా సమర్పించాడు .

          అతని కుమారుడు యశోవర్మ హర్షదేవుని తర్వాత రాజయ్యాడు . అతన్ని లక్షవర్మ అనీ అంటారు .యశోవర్మనే చండేలా రాజ్య పాలకులలో మహా శ్రేస్టూడని అంటారు .ధీర ,వీర శూరుడైన యశో వర్మదక్కన్ పాలకులు  రాష్ట్ర కూటుల్ని జయించి ,దక్షిణాన మాల్వా వరకు తూర్పున గండా ,మిధిల వరకూ రాజ్య విస్తరణ చేశాడు .తానే సర్వ స్వతంత్ర రాజు గా ప్రకటించుకొన్న ధీశాలి యశోవర్మ .ఇతని కాలం లో చండేలా రాజులు మధ్య భారతం లోనే  మహా శక్తి వంతులుగా సమర్ధులుగా గణన కెక్కారు .యశోవర్మ సర్వ సమర్దుడే కాక కళా పిపాసి .అందువల్లనే ఖజురాహో లో ఇంత విశేష దేవాలయ సముదాయ నిర్మాణం జరిగింది .’’లక్ష్మణ దేవాలయాన్ని’’ యశోవర్మ నిర్మించాడిక్కడ .దీన్ని  శ్రీ మహా విష్ణువుకు అంకితమిచ్చాడు .

    యశోవర్మ కొడుకు ‘’దంగా ‘’తరువాత రాజై 954-1002కాలం లో రాజ్యం చేశాడు .ప్రతీహారులకు తండ్రి లాగే కప్పం కట్టకుండా కనోజ్ రాజులకు విదేయుడైనాడు .చాలా రాజ్యాలు జయించి రాజ్య విస్తరణ చేశాడు .’’మహా రాజాది రాజు ‘’అని పించుకొన్నాడు .యుద్ధ నిపుణుడేకాక కళా సంస్కృతులపై అపారమైన అభినివేశం ఉన్నవాడు దంగా రాజు .అతనికాలం లోనే మహోత్రుస్టమైన ‘’విశ్వనాధ దేవాలయం’’ ,’’పార్శ్వనాధ దేవాలయం ‘’నిర్మించాడు .పదవ శతాబ్దం లో ఉత్తర భారత దేశం లో దంగా మహా శక్తి వంతమైన మహా రాజు గా వెలిగి పోయాడు .దంగా తర్వాతా కొడుకు ‘’గండ ‘’రాజయ్యాడు .ఇతను(1108-1017) కాలం లో రాజ్య పాలన చేశాడు .తొమ్మిదేళ్ళు మాత్రమె పాలించి రాజా గండ ‘’చిత్ర గుప్త ‘’దేవాలయం ‘’ శ్రీ జగదాంబా దేవాలయాల’’ను నిర్మించాడు .

  రాజా గండ మరణం తర్వాత కుమారుడు ‘’విద్యాధరుడు ‘’రాజై1017-1029పాలించాడు .యుద్ధ వీరుడు ,శక్తి వంతుడు అయిన విద్యాధరుడు మహమ్మద్ గజనీ తో రెండు సార్లు యుద్ధం చేసి (1019,1022)కల్చారీలను ,పాలమారులను ఓడించి మధ్యభారతం లో విశిస్టస్తానాన్ని సంపాదించాడు ఇతనికాలం లో చండేలా రాజ్యపాలన ప్రఖ్యాతమైంది .యుద్ధ వీరుడేగాక కళాభిమాని సంస్కృతీ గౌరవం ఉన్న మహారాజు .ఖజురాహో లో ‘’కందారియా మహా దేవా ‘’ఆలయాన్ని అత్యద్భుత శిల్ప కళా నికేతనం గా నిర్మించాడు .ఇతని కొడుకు ‘’విజయపాలుడు ‘’తండ్రి రాజాన్ని సుస్తిరం చేసి దేవాలయ నిర్మాణాలను కొనసాగించాడు .యితడు నిర్మించినదే ‘’వామన దేవాలయం ‘’.ఇతని పెద్దకొడుకు దేవవర్మ తండ్రి మరణానంతరం రాజయ్యాడు .రాజ్యాన్ని కల్చూరీల వరకు వ్యాపింప జేశాడు .ఇతను చనిపోయిన తర్వాతా 1060లో తమ్ముడు ‘’కీర్తివర్మ’’ రాజయ్యాడు .అనేక యుద్ధాలు గెలిచి కల్చూరియాలు ఆక్రమించిన భాగాలన్నితిని కైవశం చేసుకొన్నాడు .

   చండేలా రాజు కీర్తి వర్మ 40ఏళ్ళు ఖజురహో ను పరిపాలించాడు .కళలను సాహిత్యాన్ని సంస్కృతినీ అభివృద్ధి చేశాడు ఇతని కాలం లోనే ‘’ప్రబోధ చంద్రోదయం ‘’రచింప బడి కీర్తి వర్మ ఎదుట ప్రదర్శింప బడింది .’’ఆదినాధ దేవాలయం’’ ,’’జవేరి అంటే బలరామ దేవాలయం’’ ‘’,చతుర్భుజ కృష్ణ దేవాలయం ‘’మొదలైన వాటిని నిర్మించాడు .కీర్తివర్మ పాలన 1100తో పూర్తీ అయింది .అతని తర్వాతి రాజులు అనేక క్లిష్ట పరిస్థితుల నెదుర్కొన్నారు .వారి పాలన అంతా యుద్దాలతోనే గడిచి పోయింది .ఉత్తర ,మధ్య భారతాలలో ఈ యుద్ధ వాతావరణం పరమ భీభత్సం గా ఉండేది .చాళుక్యులు కల్చూరియలు ఎప్పుడూ ఖజురహో పై దండ యాత్ర చేస్తూనే ఉండేవారు .కీర్తివర్మ తర్వాతి రాజు’’ సల్లక్షన్ ‘’లేక హోల్లక్షన్ వర్మ రాజై ,తర్వాత జైవర్మ కు పాలన అప్పగించాడు .జయవర్మ గాహర్వార్ రాజుగోవింద వర్మ చేతిలో  చేతిలో1120లో  ఓడిపోయాడు .రాజ్యం వదిలి అరణ్యాలకు చేరాడు .

    పృధ్వీ వర్మ అనే ఇతని పిన తండ్రి రాజయ్యాడు .ఏదో విధం గా ఖజురహో రాజ్యాన్ని కాపాడాడు .తర్వాత పృధ్వీ వర్మ కొడుకు’’ మండన వర్మ’1130 లో సింహాసనం ఎక్కిపోయిన రాజ్యాన్ని కీర్తిని మళ్ళీ సంపాదించి పునర్వైభవం కల్పించాడు కలిన్జార్ ,మహోబా ,అజైగర్ లను లోబరచుకొని పరాక్రమోన్నతుడు అయ్యాడు .’’దులాదేవ ‘’ఆలయాన్ని ఖజురాహో లో నిర్మించాడు . 1163వరకు మండన వర్మ పాలన సాగింది .తర్వాత కొడుకు’’ యశోవర్మ’’ రాజయ్యాడు .రెండేళ్ళు మాత్రమె  పాలన చేశాడు. తండ్రి హతాన్మరణం వలన కొడుకు ‘’పరమార్ధ దేవుడు’’ రాజ్యానికి వచ్చాడు .చండేలా రాజ వంశానికి పారమార్ధి దేవుడే చివరి రాజు .35ఏళ్ళు సమర్ధ వంతం గా రాజ్యం ఎలాడు .డిల్లీరాజ పుత్రారాజు   పృధ్వీరాజ చౌహాన్ పారమార్ధి దేవుడిపై దాడి చేశాడు .పారమార్ధి కుమారులు అలహా ,ఉదాల్ లు వీరోచిత యుద్ధం చేశారు .వారి సాహసోపేత ధైర్య సాహస పోరాటాలను ఈ నాటికే పాటలుగా పాడి కీ ర్తిస్తూనే ఉంటారుజనం .’అలహా ఉదాల్ ‘’అనే జాన పద గీతం ఇందులో బాగా ప్రసిద్ది, ప్రచారం పొందింది .ముఖ్యం గా ఉత్తరభారతం లోను బుందేల్ ఖండ్ ప్రాంతం లోను .1182లో ప్రుద్వీ రాజు  పరమార్ధ దేవ మహా రాజును యుద్ధం లో జయించాడు .మహోబా ,ను కోల్పోయాడు .1202లో కుతుబుద్దీన్ ఐబక్ అనే మహమ్మద్ ఘోరి బానిస కలన్జార్ పై దాడి చేసి ఓడించాడు .పారమార్ధి దేవుడు లొంగి పోయాడు .అతని మంత్రి ఈ పిరికి తనానికి ఇతన్ని చంపేశాడు .అప్పటి నుంచి చండేలా రాజ్యం సుల్తానుల పాలన లోకి వచ్చింది .ఇంతకాలం ఖజురహో ను కాపాడుకుంటూ కళా సాంస్కృతిక విస్తరణ చేస్తూ దేవాలయ నిర్మాణాలకు కొత్త జవం జీవం ఇస్తూ సాగిన చండేలా రాజ్య పాలన ఇలా అర్దాంతరం గా ముగిసింది .

ఖజురహో ఆలయ శిల్ప కళావైభవం

ఖజురహో దేవాలయ సముదాయ శిల్పకళ ఇండో ఆర్యన్ సంస్కృతికి చెందింది .మధ్యయుగ శిల్పకళా వైభవానికి నిలు వెత్తు నీరాజనాలివి .శిల్పకళ పరి పూర్ణం గా వర్ధిల్లి నేటికీ భద్రం గా రక్షింపబడిన సమూహం ఇది .బెంజమిన్ రోలాండ్ అనే ప్రఖ్యాత శిల్ప శాస్త్ర వేత్త దీన్ని ‘’ The Khajuraho artist seems to be thoroughly versed in the mnemonic traditions and textual canons ,the grammar and syntax of architecture and iconography’’అని కీర్తి కిరీటం పెట్టాడు .ఇండో ఆర్యనుల కళా మేళవింపు మేధావితనం ఈ సముదాయాన్ని సర్వోత్క్రుస్త స్తితికి తెచ్చిందని మెచ్చుకున్నాడాయన .

నగర్ ఆలయ నిర్మాణ శైలి భూమి,పై శిఖరం లోను ,సూచీ అగ్రం గాను చుట్టూ విస్తరించి ఉండటం లోను జ్యోతకమవుతుంది .చౌన్స్ నాద దేవాలయం తప్ప మిగిలిన ఖజురహో ఆలయాలన్నీ అత్యంత నాణ్యమైన  శుద్ధి చేసిన ఇసుక రాయి తో నిర్మితమైనాయి .లేత పసుపు రంగు కొద్ది పాటి ఊదారంగు రాయి తూర్పు తాటాక తీరం లోని  ‘’పన్నా ‘’నుండి తెచ్చారు .పెద్ద రాళ్ళను క్వారీల వద్దనే శిల్పాలుగా మలిచి ఇక్కడికి రవాణా చేశారు .వాటిని దేవాలయ ప్రాంతం లో ఒకదానితో ఒకటి అంటించి ఆలయాలన్నిటినీ నిర్మించారు .చౌశాత్ యోగిని దేవాలయాన్ని మాత్రం గ్రానైట్ రాయితో కట్టారు .స్థానికం గా దొరికే గ్రానైట్ ముతకగా ఉండటం తో పన్నా వెళ్లిఇసుక రాతిని  తేవాల్సివచ్చింది

లక్ష్మణ ,కందరీయ ,విశ్వనాధ దేవాలయాలను ‘’పంచాయతన దేవాలయాలు ‘’అంటారు .పంచాయతన దేవాలయం అంటే గర్భ గుడిలో ఆ దేవాలయానికి చెందినా పెద్దదేవతా  విగ్రహంతో బాటు నాలుగు చిన్న విగ్రహాలు నాలుగు మూలలా ఉండటం .దేవాలయ నిర్మాణం అయిదు సోపానాల్లో ఉంటుంది .అర్ధమండపం ,మండపం అనే హాలు ,అంతరాలయం లేక గర్భాలయం ,మహా మండపం ,ప్రదక్షిణ సౌకర్యం కల దారి కలిగి ఉంటాయి .ఇందులో ప్రతి దాని శైలి భిన్నం గా నేఉండి శిల్ప శోభగల పైకప్పు ఉంటుంది .ప్రతి ఆలయం సంపూర్ణ కళా విలాసమై ఒకే తరహాలో కని  పిస్తుంది తప్ప దేనికది ప్రత్యేకం 

భౌగోళిక స్థానము

మార్చు

ఖజురహో 24.85° N 79.93° E స్థానములో ఉంది. సరాసరి ఎత్తు 283 మీటర్లు (928 అడుగులు) .

ప్రస్తుత ప్రజానీకము

మార్చు

2001 జనాభా లెక్కల ప్రకారం ఖజురాహో జనాభా 19, 232. ఇందులో 52 శాతం పురుషులు, 48 శాతం స్త్రీలు. ఇక్కడ అక్షరాస్యత శాతం జాతీయ సగటు 59.5% కంటే తక్కువగా 53% ఉంది. పురుషుల్లో అక్షరాస్యతా శాతం 62%, స్త్రీలలో అక్షరాస్యతా శాతం 43% ఉంది. ఖజురాహోలో 6 సంవత్సరాల కంటే తక్కువ వయసు గలవారు 19 శాతము ఉన్నారు.

ఖజురహో లోని శిల్పాలు, శిల్పకళ

మార్చు

ఇక్కడి శిల్పాలు ప్రపంచ ప్రసిద్ధి చెందాయి. ఇవి వాత్సాయన కామసూత్ర గ్రంథములోని వివిధ భంగిమలలో చెక్కబడ్డాయి.

ఇవీ చూడండి

మార్చు

మూలాలు

మార్చు

ఇతర పఠనాలు

మార్చు
  • Phani Kant Mishra, Khajuraho: With Latest Discoveries, Sundeep Prakashan (2001) ISBN 81-7574-101-5

బయటి లింకులు

మార్చు
 
వికీమీడియా కామన్స్‌లో కి సంబంధించిన మీడియా ఉంది.