ఖైదీ 1983లో విడుదలైన ఒక తెలుగు సినిమా. తొలి చిత్రంతోనే చిత్రసీమలో పేరు శాశ్వతంచేసుకున్న కొన్ని పతాకాలున్నాయి. అడవి రాముడు తీసిన సత్యచిత్ర, వేటగాడు తీసిన రోజా మూవీస్ ఆ కోవకు చెందినవే. ఖైదీ చిత్రంతో సంయుక్త మూవీస్ అటువంటి కీర్తి సంపాదించుకుంది. చిరంజీవి, కోదండ రామిరెడ్డి కాంబినేషన్ ఈ చిత్రంతోనే మొదలయ్యింది. చిరంజీవిని అగ్రనటునిగా, కోదండరామిరెడ్డిని గురువుకి తగ్గ శిష్యునిగా, పరుచూరి సోదరులు ను ప్రముఖ రచయితలుగా నిలిపిన చిత్రం.

ఖైదీ
దర్శకత్వంఎ. కోదండరామిరెడ్డి
కథపరుచూరి సోదరులు
నిర్మాతఎమ్. తిరుపతి రెడ్డి,
ధనంజయరెడ్డి,
సుధాకర రెడ్డి
తారాగణంచిరంజీవి,
మాధవి
ఛాయాగ్రహణంవి.ఎస్.ఆర్. స్వామి
కూర్పువెల్లైస్వామి
సంగీతంచక్రవర్తి
నిర్మాణ
సంస్థ
సంయుక్త మూవీస్
సినిమా నిడివి
157 ని
భాషతెలుగు

చిత్రకథ

మార్చు

పొలీస్ ఆఫీసరు రంగనాధ్ కు అనుమానాస్పద పరిస్థితుల్లో సూర్యం ఒక అడ్డరోడ్డు వద్ద కనిపిస్తాడు. కొండపల్లి వెళ్తానని చెప్పి కోటి పల్లికి వెళుతున్న అతన్ని సోదా చేసి అతని దగ్గర ఒక కత్తిని చూసి అనుమానంతో స్టేషనుకు తీసుకెళ్తాడు. అక్కడ పోలీసులు అతనిపట్ల నిర్దయగా ఉంటారు. ఒక పోలీసు రేజరు తీసుకు వస్తుండటం చూసి గతాన్ని గుర్తుకు తెచ్చుకుని విచక్షణ కోల్పోయి పోలీసులతో తలపడి అక్కడనుండి పారిపోయి ఒక లేడీ డాక్టరు సుజాత ఆశ్రయం పొందుతాడు. ఆమెకు తన గతాన్ని వివరిస్తాడు. గతంలో సూర్యం ఒక చురుకైన విద్యార్థి. ఐ. ఎ. ఎస్. చదవాలని ఆశయం. తండ్రి చిన్న రైతు. విధవరాలైన ఒక అక్క. అదేవూరికి చెందిన వీరభద్రయ్య కూతురు మాధవి సూర్యంపట్ల ఆకర్షితమౌతుంది. వారిరువురిని మధ్య సాన్నిహిత్యాన్ని గమనించిన మునసబు వీరభద్రయ్యకు చెబుతాడు. వీరభద్రయ్య సూర్యం తండ్రి మరణానికి కారణమౌతాడు. తండ్రి చేసిన అప్పు తీర్చటానికి పొలాన్ని వీరభద్రయ్యకు ఇచ్చేసి, దానినే కౌలుకి సాగు చేస్తుంటాడు. అందులో పంటను వీరభద్రయ్య తీసుకు పోతాడు. తమ్ముడు అసహాయంగా ఉండటానికి తానే కారణమనుకుని సంగీత, మునసబును పెళ్ళి చేసుకుని, అతని చేతిలో మోసపోయి ఆత్మహత్య చేసుకుంటుంది. ఆ సంఘటనను హత్యగా చిత్రీకరించి, నేరాన్ని సూర్యంపై మోపుతారు. వారిపై పగ సాధిస్తానికి సూర్యం ప్రయత్నిస్తుంటాడు. రంగనాథ్ మేనకోడలి (సంయుక్త) సాయంతో సుమలత ఇంటినుండి పోలీసులదాడిని తప్పించుకున్న సూర్యం అడవి చేరుతాడు. తరువాత సుమలత హత్య, దానిని సూర్యంపై మోపడం, మాధవి సూర్యాన్ని కలవడం, సూర్యం వరసగా ప్రత్యర్ధులపై పగ తీర్చుకోవడం మిగతాకథ.

తారాగణం

మార్చు

సినిమాకథ, కథనం, పోలికలు

మార్చు

1982లో సిల్వెస్టరు స్టాలోన్ చిత్రం "ఫస్ట్ బ్లడ్" విడుదలయ్యింది. చిత్రం ప్రారంభంలో రాంబో (స్టాలోన్) చిన్న పట్నం పొలిమేరల్లో బ్రిడ్జ్ పై వస్తుంటాడు. అతన్ని చూసిన పట్టణ షరీఫ్ వివరాలడుగుతాడు. తర్వాత వెనక్కి వచ్చి అతన్ని సోదా చేసి కత్తిని కనుగొంటాడు. అది ఎందుకుఅని అడిగితే రాంబో వేట కోసం అని చెబుతాడు. షరీఫ్ అతనిని పోలీసు స్టేషనుకు తీసుకెళతాడు. అక్కడ పోలీసులు అతనితో అమానుషంగా వ్యవహరిస్తారు. రేజరుతో అతన్ని సమీపిస్తున్న పోలీసుని చూసి గతంలో వియత్నాం యుద్ధంలో సంఘటనల్ని గుర్తుచేసుకుని తిరగబడతాడు. అతను గతంలో వియత్నాం యుద్ధంలో పాల్గొన్న సైనికుడు. అది పూర్తయిన తరువాత అతనికి సరైన గుర్తింపు లభించలేదు. స్నేహితుడు గురించి విచారించగా చనిపోయాడని విధవ ఐన అతని భార్యద్వారా తెలుసుకున్నాడు. ఈ చిత్రభాగాలు ఖైదీ చిత్రంలో కొద్దిమార్పులతో కనిపిస్తాయి. మిగతా చిత్రంలో కూడా కథానాయకుని ఆహార్యం, రెండవభాగంలో అడవిలో సంఘటనలు ఫస్ట్ బ్లడ్ ను పోలిఉంటాయి.[1]

మిగతాభాషల్లో

మార్చు

ఖైదీ చిత్ర విజయం[2] ఈ చిత్రాన్ని మిగతాభాషల్లో నిర్మాణానికి కారణమయ్యింది. కన్నడంలో విష్ణువర్ధన్ హీరో గానూ, హిందీలో జితేంద్ర హీరో గానూ నిర్మించబడింది. హిందీలో ఈ చిత్రాన్ని పద్మాలయా సంస్థ నిర్మించింది. మూడు భాషల్లోనూ కథానాయికగా మాధవి నటించడం విశేషం.

పాటలు

మార్చు
  1. రగులుతుంది మొగలిపొద, రచన: వేటూరి సుందర రామమూర్తి, గానం. ఎస్ పి బాలసుబ్రహ్మణ్యం, పి సుశీల
  2. ఇదేమిటబ్బా ఇది అదేను అబ్బా, రచన: వేటూరి సుందర రామమూర్తి, గానం. ఎస్ పి బాలసుబ్రహ్మణ్యం, పి సుశీల
  3. గోరంటా పూసింది గొరవంక కూసింది, రచన వేటూరి సుందర రామమూర్తి గానం. ఎస్ పి బాలసుబ్రహ్మణ్యం, పి సుశీల
  4. మెర మెరా మెరుపులా, రచన: వేటూరి సుందర రామమూర్తి గానం.ఎస్ పి బాలసుబ్రహ్మణ్యం, పి సుశీల
  5. తప్పించుకోలేవు నా చేతిలో, రచన: వేటూరి సుందర రామమూర్తి గానం.అనితారెడ్డి

మూలాలు

మార్చు
  1. "Khaidi First Blood - Superhit Telugu films which were inspired by International films". The Times of India. Retrieved 2020-08-21.
  2. "Chiranjeevi is back with Khaidi No 150: How the megastar came to rule the Telugu film industry - Entertainment News , Firstpost". Firstpost. 2017-01-06. Retrieved 2020-08-21.