గజేంద్ర మోక్షం

(గజేంద్ర మోక్షము నుండి దారిమార్పు చెందింది)

స్వాయంభువ, స్వారోచిష, ఉత్తమ మనువుల కాలం గడిచి తామసుడు మనువుగా ఉన్న సమయంలో శ్రీమహావిష్ణువు గజేంద్రుడిని రక్షించడానికి భూలోకానికి దిగి వచ్చాడు అని శుక మహర్షి పరీక్షిత్తు మహారాజుకు పల్కుతాడు. అది విని పరీక్షిత్తు ఆ గజేంద్రుని కథను వివరంగా చెప్పుమని అడుగగా ఆ మహర్షి గజేంద్ర మోక్షం గాథను వివరిస్తాడు . ఇది పోతన రచించిన భాగవతం లోనిది.

విష్ణుమూర్తి గజేంద్రున్ని రక్షించడం.

త్రికూట పర్వత విశేషాలు

మార్చు

క్షీరసాగర మధ్యంలో త్రికూటం అనే పర్వతం ఉంది. ఆ పర్వతానికి మూడు శిఖరాలు ఉన్నాయి. ఒక శిఖరం బంగారంతో, ఇంకో శిఖరం ఇనుముతో, మరొకటి వెండితో అలరారుతూండేవి. ఆ కొండల మీద రకరకాలైన గగన చారులు కిన్నెరలు విహరిస్తూ ఉండేవారు. ఆ పర్వతం మీద ఉన్న అడవులలో అడవి దున్నలు, ఖడ్గమృగాలు, ఎలుగు బంట్లు మెదలైన క్రూర మృగాలతో పాటు ఏనుగులు కూడా ఉండేవి. ఆ ఏనుగులు గుంపులు గుంపులుగా తిరుగుతూ ఉంటే ఆ ప్రదేశంలో అంధకారం అలముకొనేది. ఒకరోజు ఆ గుంపులు ఆహారం గ్రహించి దాహ బాధతో తిరుగుతూ సరోవరానికి చేరుతూ ఉన్నపుడు ఒక ఏనుగుల గుంపు చీలిపోయింది. అందులోని ఆడ ఏనుగులు గజరాజును అనుసరించి ఇంకో సరోవరాన్ని చేరుకొన్నాయి.

గజరాజు జల క్రీడలు ఆడడం

మార్చు

అలా ఏనుగులు చేరుకొన్న ఆ సరోవరం అతి విశాలమైనది, ఆ సరోవరం నిండా వికసించిన కలువలు, తామరలు, ఇంకెన్నో జలచరాలు నివసిస్తూ ఉన్నాయి. వాటిలో కొన్ని మొసళ్ళు కూడా ఉన్నట్లు ఏనుగులకు తెలియదు. ఆడ ఏనుగులు దాహ బాధ తీర్చుకొని, జలక్రీడలు జరిపి బయటికి వచ్చిన తరువాత గజరాజు కూడా సరోవరం లోకి ప్రవేశించి నీళ్ళు తాగి, తొండం నిండా నీరు నింపి గగనవీధికి చిమ్ముతున్నాడు. అలా నీరు చిమ్ముతూ ఇంతే సరోవరంలోని కర్కాటక మీనాలు, రోదసిలోని మీన కర్కాటాకాలను చేరినట్లు కనిపించింది.

కరిమకర సంగ్రామం

మార్చు

ఇలా ఆ గజరాజు జలక్రీడ జరుపుతూ ఉన్న సమయంలో ఆ చెరువులో ఉన్న ఒక మొసలి ఆ గజరాజు కాలు పట్టుకొంది. పట్టు విడిపించుకొని తొండంతో దెబ్బ తీయాలని ఆ ఏనుగు చూసింది. వేంటనే ఆ మొసలి ఏనుగు ముందు కాళ్ళు పట్టింది. ఆ ఏనుగు తన దంతాలతో మొసలిని కుమ్మి విడిచింది. అప్పుడు మొసలి వెనుకవైపు వచ్చి ఏనుగు తోకను కుమ్మి చీల్చింది. అలా ఆ కరి, మకరం ఒక దానిని ఒకటి కుమ్మి చీల్చుకొంటుండగా కరి బలం సన్నగిల్లుతోంది. జలమే తన నివాసస్థానం అవడం వల్ల మకరం బలం అంతకంతకు పెరుగుతూ ఉండడంతో గజరాజు నీరసిస్తోంది. ఈ సందర్భాన్ని పోతన తన గజేంద్ర మోక్షం కావ్యంలో ఇలా వర్ణించాడు.

కరి దిగుచు మకరి సరసికి
గరి దరికిని మకరి దిగుచు గరకరి బెరయన్
గరికి మకరి మకరికి గరి
భర మనుచును నతల కుతల భటు దరుదు పడన్.

మొసలితో పోరు సాగించలేక దీనావస్థలో పడిన ఆ గజరాజు, మకరాన్ని గెలవడం తనవల్ల కాదు అని నిశ్చయించి తనను రక్షించమంటూ సర్వేశ్వరుడైన నారాయణుడుకి ఈ విధంగా మ్రెక్కింది.

కలఁ డందురు దీనులయెడఁ,
గలఁ డందురు పరమయోగి గణములపాలం
గలఁ డందు రన్ని దిశలను,
గలఁడు గలం డనెడువాఁడు గలఁడో లేఁడో

లా వొక్కింతయు లేదు; ధైర్యము విలోలంబయ్యె; బ్రాణంబులున్
ఠావుల్ దప్పెను; మూర్ఛ వచ్చె; దనువున్ డస్సెన్; శ్రమంబయ్యెడిన్;
నీవె తప్ప నిత:పరం బెఱుగ; మన్నింపందగున్ దీనునిన్;
రావే ఈశ్వర; కావవే వరద; సంరక్షింపు భద్రాత్మకా;

కరి మొర విని శ్రీమహావిష్ణువు భూలోకానికి రావడం

మార్చు
 
వైకుంఠం తరలి వచ్చే చిత్రం

అల వైకుంఠపురంబులో నగరిలో నా మూల సౌధంబు దా

పల మందారవనాంతరామృత సరః ప్రాంతేందు కాంతోపలో

త్పల పర్యంక రమావినోది యగు నాపన్న ప్రసన్నుండు వి

హ్వల నాగేంద్రము "పాహిపాహి" యనఁ గుయ్యాలించి సంరంభియై

అక్కడెక్కడో వైకుంఠపురంలోని ఓ మూల సౌధం ( మేడ). ఆమేడ పరిసరాల్లో మందార వనం, అందులో అమృత సరస్సు. అక్కడ పర్యంకము ( మంచం) పై లక్ష్మిదేవితో వినోదించు శ్రీమన్నారాయణుడునికి ఏనుగు ‘పాహీ! పాహీ! ( రక్షించు,రక్షించు) అని పెట్టిన కేక వినిపించగనే వెంటనే బయలుదేరాడు. భక్తుని రక్షించడానికి భగవంతుడు బయలుదేరిన తీరు అమోఘం[1]

సిరికిం జెప్పడు; శంఖ చక్ర యుగముంజేదోయి సంధింపడే
పరివారంబును జీర డభ్రగపతిం బన్నింప డాకర్ణికాం
తర ధమ్మిల్లము జక్క నొత్తడు వివాదప్రోత్థిత శ్రీ కుచో
పరిచేలాంచలమైన వీడడు గజ ప్రాణావనోత్సాహియై.


గజేంద్రుని ప్రాణాలు కాపాడలనే ఉత్సాహంతో నిండిపోయిన విష్ణుమూర్తి లక్ష్మీదేవికీ చెప్పలేదు; శంఖచక్రాలను రెండు చేతుల్లోకీ తీసుకోలేదు; సేవకుల నెవరినీ పిలువలేదు; గరుడవాహనాన్నీ సిద్దపరచకోలేదు; చెవి దుద్దు వరకు జారిన జుట్టూ చక్కదిద్దుకోలేదు; ప్రణయ కలహంలో ఎత్తిపట్టిన లక్ష్మీదేవి కొం గైనా వదల్లేదు.

అలా వెళ్తున్న నారాయణుడుని చూసి మహాలక్ష్మి తన మనస్సులొ ఈ విధంగా ఆలోచించింది. ఏ దుష్ట దుశ్శాసనుడు కబంధ హస్తాలలోనైన చిక్కుకొని ద్రౌపది దేవి వంటి ఇల్లాలు మెర పెట్టుకొంటోందా! మళ్ళి పరమ మూర్ఖుడైన సోమకాసురుడు వేదాలు దొంగిలించడానికి వచ్చాడా! అసురులు అమరావతి పైకి దండెత్తి వస్తున్నారా! ప్రహ్లాదుని వంటి భక్తులను హింసించే హిరణ్యాక్షుడు మళ్ళీ బయలుదేరాడా అని సంశయించి ఆయన వెంట బయలుదేరింది.

శ్రీమహావిష్ణువు సుదర్శనాన్ని విడవడం

మార్చు
 
గజేంద్రుడిని మహావిష్ణువు రక్షించుట

ఆ విధంగా గజరాజు ఉన్న సరోవరాన్ని చేరీచేరుతూనే తన సుదర్శన చక్రాన్ని విడిచి పెట్టగానే విస్ఫులింగాలు చిమ్ముతూ ఆ సుదర్శనం మరుక్షణంలో సరోవరంలోకి ప్రవేశించి ఆ మొసలి తలను ఖండించింది. అప్పుడు గజేంద్రుడు ఊపిరి పీల్చుకొని కొలను నుండి వెలువడి కరిణీ బృందాన్ని చేరి సంతోషంతో తొండం ఎత్తి పలకరిస్తాడు. అప్పుడు శ్రీహరి తన పాంచజన్యాన్ని (శంఖం) పూరిస్తాడు. ఆ పాంచజన్యం ధ్వని శత్రు జనానికి హృదయవిదారకం, సజ్జనులకు ఉల్లాస భరితం కలిగిస్తుంది. నారాయణుడు తన కర స్పర్శతో ఆ కరిని అనుగ్రహిస్తాడు. ఆ అనుగ్రహంతో ఆ గజరాజు వైకుంఠాన్ని చేరుకొంటాడు. నిరంతరం ఎవరైతే శ్రీహరిని స్మరిస్తారో వారిని ఎప్పుడు నేను విస్మరించను అని శ్రీదేవికి చెప్పగా, ఆ లక్ష్మి దేవి దీనుల మొర విని వారిని రక్షించే శ్రీమహావిష్ణువుతో రావడం కంటే భాగ్యం ఎమి ఉంటుందని అంటుంది.

గజరాజు మకరం జన్మ వృత్తాంతం

మార్చు

దేవలుడు అనే ముని శాపం వల్ల హూహూ అనే గంధర్వుడు "మొసలి" రూపం ఎత్తి పరమేశ్వరుని కరుణతో శాపవిమౌచనం పోంది తన పూర్వ గంధర్వరూపాన్ని పోందాడు. ఇంద్రజ్ఞమునుడు అనే రాజు అగస్త్యమహర్షిని ఉదాసీనంగా చూసిన కారణంగా ఏనుగు జన్మ ఎత్తి నానాబాధలు పోంది శ్రీహరి అనుగ్రహంతో శాపవిముక్తుడై వైకుంఠం చేరుకొన్నాడు.

బయటి లింకులు

మార్చు

మూలాలు

మార్చు
  1. "Sujanaranjani Monthly Telugu E-Magazine". www.siliconandhra.org. Archived from the original on 2019-12-25. Retrieved 2020-01-18.