గుంటూరు బాపనయ్య
గుంటూరు బాపనయ్య ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి మూడుసార్లు శాసనసభ్యునిగానూ, ఒకసారి శాసన మండలి సభ్యునిగాను పనిచేసారు. ప్రజలు తనకు కట్టబెట్టిన పదవిని వారి సంక్షేమానికి, ప్రజా సేవకు మాత్రమే ఉపయోగించి స్ఫూర్తిగా నిలిచారు. దివిసీమకు ఆయన సిపిఎం అగ్రనేత మాకినేని బసవ పున్నయ్య స్ఫూర్తితో ఉద్యమంలోకి వచ్చి తుదిశ్వాస వరకూ దానికే అంకితమయ్యారు.[1] ఆయన 1952 మద్రాసు లెజిస్లేటివ్ అసెంబ్లీ ఎన్నికలలో దివి నియోజకవర్గం నుండి శాసనసభ్యులుగా ఎన్నికైనారు.[2] ఆయన 1962 శాసనసభ ఎన్నికలలో నిడుమోలు శాసనసభ నియోజకవర్గం నుండి గెలుపొందారు.[3]
జీవిత విశేషాలు
మార్చుఆయన కృష్ణా జిల్లా మోపిదేవి మండలం నాగాయతిప్పలోని ఓ నిరుపేద దళిత వ్యవసాయ కార్మిక కుటుంబంలో సోమమ్మ, రామస్వామి దంపతులకు 1919 లో జన్మించారు. ఆరోజుల్లో నాగాయతిప్ప నుంచి అవనిగడ్డ వెళ్లి చదువుకోవాల్సి వచ్చేది. అవనిగడ్డలో చదువుకునేందుకు బాపనయ్య పడవ మీద వెళ్తుండేవారు. దళితుడు పాఠశాల విద్యనభ్యసించుటను అగ్రవర్ణాలవారు సహించలేకపోయారు. పడవెక్కడానికి వీల్లేదంటూ ఓ రోజున బాపనయ్యను అడ్డగించారు. తన అమ్మమ్మ గారింటికి వచ్చి అదే పడవపై తిరిగి వెళ్తున్న కమ్యూనిస్టు నేత మాకినేని బసవపున్నయ్య దీన్ని గమనించి అప్పటికే కమ్యూనిస్టుపార్టీలో చేరి పనిచేస్తున్న స్థానికులు కంఠంనేని పెద అచ్యుతరామయ్య, కంఠంనేని చిన అచ్యుతరామయ్య, గరికిపాటి మల్లయ్య తదితర యువకులను పోగుచేసి బసవపున్నయ్య ఆ అగ్రవర్ణ దురహంకారాన్ని ఎదిరించి పోరాడారు. ఫలితంగా బాపనయ్యతోపాటు దళితులందరికీ రేవులో పడవ ఎక్కే హక్కువచ్చింది. ఈ ఘటన బాపనయ్యను ఎంతగానో ఆలోచింపజేసింది. కమ్యూనిస్టు పార్టీవైపు ఆకర్షింపజేసింది. దళితుల సామాజిక, ఆర్థిక, సమానత్వం 'మార్క్సిస్టు-లెనినిస్టు' సిద్ధాంతం ద్వారానే సాధ్యమని ఆచరణలో అర్థం చేసుకున్నారు.[4]
ఆయన కాకినాడ లోని పి ఆర్ కళాశాలలో ఇంటర్మీడియట్ చదివారు. చదువుతున్న కాలంలో 1938 లో విద్యార్థి ఉద్యమంలో పనిచేసారు. 1939లో రైతు కూలీ ఉద్యమంలో చేరారు.[5] తరువాత 1940లో కమ్యూనిస్టు పార్టీ సభ్యత్వం తీసుకున్నారు. ఆయన దివి తాలూకాలో వ్యవసాయ కార్మిక సంఘం ఏర్పాటు చేసారు. 1941 జూన్‌లో వెంట్రప్రగడలో జరిగిన వ్యవసాయ కార్మిక సంఘం కృష్ణా జిల్లా ప్రథమ మహాసభలో కార్యదర్శిగా ఎన్నికయ్యారు.
1942 నుంచి చల్లపల్లి జమీందారుకు వ్యతిరేకంగా మంగళాపురంలో ముదిరాజులకే బంజరు చెందేటట్లు సాగిన పోరాటానికి చండ్ర రాజేశ్వరరావు, చల్లపల్లి నారాయణరావులతోపాటు నాయకత్వం వహించారు. ఆ పోరాటంలో లాఠీ దెబ్బలు తిన్నారు. గుర్రాలతో తొక్కించబడ్డారు. 1946లో 17 వేల ఎకరాల చల్లపల్లి జమీందారీ భూముల్లో 'గట్ల ఉద్యమానికి' కృషి చేశారు. 1947లో రాష్ట్రవ్యాప్తంగా పాలేర్ల జీతాల పెంపుదలకూ, పనిగంటల తగ్గింపుకూ జరిగిన పోరాటానికీ నాయకత్వం వహించారు. 1948లో జమీందారీ విధానం రద్దు, దున్నేవారికే భూమి కోసం ఉవ్వెత్తున సాగిన పోరాటాల సందర్భంగా ప్రభుత్వం బాపనయ్యను అరెస్టు చేసి రాజమండ్రి, కడలూరు జైళ్లలో 1951 వరకూ నిర్బంధించింది.
1962లో చైనా-భారత సరిహద్దు సంఘర్షణ సమయంలో అరెస్టు చేయబడి ఏడాదిపాటు డిటెయిన్ చేయబడ్డారు. 1964లో కమ్యూనిస్టు ఉద్యమంలో చీలిక సందర్భంగా మితవాదాన్ని ఎదిరించి సిపిఎం వైపుకు వచ్చిన 32 మంది జాతీయ కౌన్సిల్ సభ్యుల్లో బాపనయ్య కూడా ఉన్నారు. సిపిఎం ఆవిర్భావాన్ని అడ్డుకునేందుకు ప్రభుత్వం వారిని 1964 నుంచి 1966 వరకూ హైదరాబాద్ సెంట్రల్ జైలులో ఉంచింది. 1967లో పార్టీలో నక్సలైట్ విచ్ఛినాన్ని ఎదురించారు. కష్టజీవులను సిపిఎం వెనుక నిలిపారు. తన శత్రువుకు సైతం సాయం చేసే సహృదయుడైన బాపనయ్య సిద్ధాంతం విషయంలో ఏనాడూ రాజీపడలేదు.[4]
అందించిన సేవలు
మార్చుఆయన సి.పి.ఎం. పార్టీలో ఆయన పలు బాధ్యతలు నిర్వహించారు. 1943 నుండి 1945 వరకూ పార్టీ జిల్లా కమిటీ సభ్యుడుగా, 1945 నుంచి 1962 వరకూ రాష్ట్ర కమిటీ సభ్యుడిగా, 1958 నుంచి 1964 వరకూ జాతీయ కౌన్సిల్ సభ్యుడిగా ఉన్నారు. 1964 నుంచి సిపిఎం రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులుగా పనిచేశారు. వ్యవసాయ కార్మిక సంఘం రాష్ట్ర అధ్యక్షులుగానూ, కార్యదర్శిగానూ చివరి వరకూ పనిచేశారు. 1952, 1962, 1978లలో శాసనసభ్యునిగా ఎన్నికయ్యారు. 1968-1972 వరకూ శాసనమండలి సభ్యునిగా వచ్చిన జీతాలను పార్టీకి ఇచ్చివేశారు. పార్టీ ఇచ్చే కొద్దిపాటి అలవెన్సుతోనే జీవితాన్ని గడిపారు.
అస్తమయం
మార్చుఆయన తన 58వ ఏట 1978 మార్చి 25వ తేదీ రాత్రి హైదరాబాద్‌లో వైద్య చికిత్స పొందుతూ కన్నుమూశారు.
మూలాలు
మార్చు- ↑ ఆదర్శనేత గుంటూరు బాపనయ్య
- ↑ STATISTICAL REPORT ON GENERAL ELECTION, 1951 TO THE LEGISLATIVE ASSEMBLY OF MADRAS
- ↑ "List of Successful Candidates in Andhra Pradesh Assembly Election in 1962". Archived from the original on 2018-04-14. Retrieved 2016-06-08.
- ↑ 4.0 4.1 నిబద్ధతకూ, నిజాయితీకి మారుపేరు గుంటూరు బాపనయ్య
- ↑ THE ROLE OF COMMUNISTS IN THE KISAN STRUGGLES AGAINST THE CHALLAPALLI ZAMINDAR