చండ్ర రాజేశ్వరరావు

కమ్యూనిస్టు రాజకియవేత్త

చండ్ర రాజేశ్వరరావు (జూన్ 6, 1915 - ఏప్రిల్ 9, 1994) భారత స్వాతంత్ర్య సమరయోధుడు,[1] సామ్యవాది, తెలంగాణా సాయుధ పోరాటంలో నాయకుడు. రాజేశ్వరరావు తీరాంధ్ర ప్రాంతపు సంపన్న కమ్మ[2] రైతు కుటుంబంలో జన్మించాడు. 28 సంవత్సరాలకు పైగా భారతీయ కమ్యూనిస్టు పార్టీ (సి.పి.ఐ.) కి జాతీయ ప్రధాన కార్యదర్శిగా ఉండి 1992లో ఆనారోగ్యకారణాల వల్ల విరమించుకున్నాడు.[3][4] అంతర్జాతీయ కమ్యూనిస్టు దృక్పథంతో సామ్రాజ్యవాద వ్యతిరేక ఉద్యమాలను, శాంతి ఉద్యమాలను ముందుకు తీసుకెళ్ళినందుకు రాజేశ్వరరావును `ఆర్డర్‌ ఆఫ్‌ లెనిన్‌' అవార్డు తో సోవియట్‌ యూనియన్‌, `ఆర్డర్‌ ఆఫ్‌ డెమిట్రోవ్‌' అవార్డుతో బల్గేరియా, అలాగే చెకోస్లోవేకియా, మంగోలియా దేశాలు అవార్డులతో సత్కరించాయి. దేశ సమైక్యతను కాపాడడం కోసం బాబ్రీ మసీదు ను మ్యూజియంగా కాపాడాలని, రాజీ ఫార్ములా ప్రతిపాదించాడు

చండ్ర రాజేశ్వరరావు
Chandra rajeswararao.jpg
చండ్ర రాజేశ్వరరావు
జననంచండ్ర రాజేశ్వరరావు
జూన్ 6, 1915
మరణంఏప్రిల్ 9, 1994
మరణ కారణముఅనారోగ్యం
ప్రసిద్ధిభారత స్వాతంత్ర్య సమరయోధుడు,సామ్యవాది,
తెలంగాణా సాయుధ పోరాటం లో నాయకుడు

మానవతా వాది అయిన రాజేశ్వరరావు పార్టీ కార్యాలయాలలో పనిచేసే చిన్న కార్యకర్తలను సైతం ఆప్యాయంగా పలకరించేవాడు. కారుగానీ, కార్యదర్శిగాని లేకుండానే పని నిర్వహించారు ఢిల్లీ లో వేసవిలో ఉష్ణోగ్రత భరించరానంత ఉన్నప్పటికీ కూలర్‌ కాని, ఎముకలు కొరికే చలి ఉన్నా హీటర్‌ కానీ వాడలేదు. పార్టీ క్యాంటీన్‌లో వాలంటీర్లతో కలిసే భోజనం చేసేవాడు. "నాకు ఆస్తిపాస్తులు లేవు. నేను ఎవరికీ ఏమీ ఇవ్వవలసిన అవసరం లేదు. ఎవరి నుంచీ ఏమీ తీసుకోలేదు" అనేవాడు. పంచె కాలిపైకి కట్టి, నెత్తికి తలగుడ్డ చుట్టి గ్రామీణ ప్రజలతో కలిసిపోవడం ఆయన నైజం. గ్రాంథిక భాష వాడడు. ఎదుటివారు తన వైఖరిని, విధానాలను విమర్శించినా చాలా ఓపికతో వినేవాడు. మహిళలు సభలకు హాజరయ్యేందుకు వీలుగా రాత్రి వేళల్లో సమావేశాలు పెట్టవద్దని సూచించేవాడు. హరిజన, గిరిజన, మైనారిటీ వర్గాలపై దాడులు జరిగితే వెంటనే స్పందించి స్వయంగా వెళ్ళేవాడు. ఉభయ కమ్యూనిస్టు పార్టీల ఐక్య కార్యాచరణ ముందుకు సాగాలని కోరుకునేవాడు. రాజేశ్వరరావు అనారోగ్యంతో బాధపడుతూ 1994 ఏప్రిల్ 9న మరణించాడు. ఆయన స్మారకార్ధం హైదరాబాదు శివార్లలోని కొండాపూర్‌లో ఉన్న చండ్ర రాజేశ్వరరావు‌ ఫౌండేషన్‌లో కాంశ్య విగ్రహాన్ని ఆవిష్కరించారు. శ్రీశ్రీ 1947లో భారత కమ్యూనిస్టు పార్టీ కార్యదర్శిగా పనిచేస్తున్న చండ్రరాజేశ్వరరావును అనుసరించి ఎన్నికల సభల్లో పాల్గొనేవారు. ఈ సమయంలో చండ్ర రాజేశ్వరరావు నంద్యాల రాజకీయ సభలో శ్రీశ్రీని మొట్టమొదటి సారి మహాకవి అన్నారు, ఆ తర్వాత సాహిత్యలోకంలోనూ, సాధారణ ప్రజల్లోనూ కూడా శ్రీశ్రీకి మహాకవి అన్న బిరుదు స్థిరపడిపోయింది.[5]

1969-73లలో జరిగిన వేర్పాటువాద ఉద్యమాల గురించి ఆయన రాసిన వ్యాసలను చండ్ర రాజేశ్వరరావు వ్యాసావళి-1969-73 వేర్పాటువాద ఉద్యమాలు పుస్తకం రూపంలో తెచ్చారు.[6]

మూలాలుసవరించు

  1. Eminent Telugu Personalities
  2. The weapon of the other: Dalitbahujan writings and the remaking of Indian ... By Kancha Ilaiah
  3. "Chandra Rajeswara Rao's kin to join Congress". The Hindu. Sep 09, 2008. Check date values in: |date= (help)
  4. "CPI in search of a new leader in city". The Hindu. May 05, 2007. Check date values in: |date= (help)
  5. రాధాకృష్ణ, బూదరాజు (1999). మహాకవి శ్రీశ్రీ (ప్రథమ ముద్రణ ed.). న్యూఢిల్లీ: కేంద్ర సాహిత్య అకాడమీ. ISBN 81-260-0719-2.
  6. రాజేశ్వరరావు, చండ్ర. చండ్ర రాజేశ్వరరావు వ్యాసావళి-1969-73 వేర్పాటువాద ఉద్యమాలు. విశాలాంధ్ర.