గుడిమల్లం పరశురామేశ్వరాలయం

చిత్తూరు జిల్లా, ఏర్పేడు మండలం, గుడిమల్లం లోని పురాతన శివాలయం

గుడిమల్లం లింగం పరశురామేశ్వరాలయం, ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రం, తిరుపతి జిల్లా, ఏర్పేడు మండలంలో తిరుపతి నగరానికి సమీపంలో ఉన్న గుడిమల్లం గ్రామంలో ఉంది.[1]ఈ ఆలయంలో ఉన్న పరశురామేశ్వర స్వామి పురాతన లింగం. ఇది తిరుపతి నగరానికి ఆగ్నేయంగా 13 కిలోమీటర్ల దూరంలో ఉంది.

గుడిమల్లం శివాలయం లోని శివుడు పరశురామేశ్వరుడుగా పూజలందుకుంటున్నాడు. ఇక్కడి శివలింగానికి ఎంతో విశిష్టత ఉంది.[2] ఈ ఆలయములో గర్భాలయము అంతరాలయము, ముఖ మండపముల కన్నా లోతులో ఉంటుంది . ఇక్కడ గర్భ గృహములో ప్రతిష్ఠించబడిన శివలింగము లింగ రూపములో కాకుండా శివుడు మానవ రూపములో మహావీరుడైన వేటగాని వలె ఉన్నాడు. ఈ లింగము ముదురు కాఫీరంగులో ఉన్న రాతితో చేయబడిన మానుష లింగము. లింగము సుమారుగా ఐదు అడుగుల పొడవు, ఒక అడుగు వెడల్పు కలిగి ఉంది. లింగముపైన ముందువైపు ఉబ్బెత్తుగానూ లింగము నుండి బయటకు పొడుచుకొని వచ్చినట్లుగా చెక్కబడిన శివుడు, అపస్మారక పురుషుని భుజాలపై నిలబడిన (స్థానకమూర్తి) రూపంలో ఉన్నాడు. స్వామి రెండు చేతులతో ఉన్నాడు. కుడిచేతితో ఒక గొర్రెపోతు (తలక్రిందుగా) యొక్క కాళ్ళు పట్టుకొనగా, ఎడమచేతిలో చిన్నగిన్నె (చిప్ప) ను పట్టుకొన్నాడు. ఎడమ భుజానికి ఒక గండ్రగొడ్డలి తగిలించుకొని ఉన్నాడు. స్వామి జటాభార (జటలన్నీ పైన ముడివేసినట్లు) తలకట్టుతో, చెవులకు అనేక రింగులు ఇంకా వివిధ ఆభరణాలు ధరించి, నడుంచుట్టూ చుట్టి, మధ్యలో క్రిందకు వ్రేలాడుతున్నట్లు ఉన్న అర్ధోరుకం (నడుం నుండి మోకాళ్ళ వరకూ ఉండే వస్త్రం) ధరించి ఉన్నాడు. ఆ వస్త్రం మధ్యలో వ్రేలాడుతున్న మడతలు అతి స్పష్టముగా కనుపిస్తున్నాయి. ఆ వస్త్రము అతి సున్నితమైనది అన్నట్లుగా అందుండి స్వామివారి శరీరభాగములు స్పష్టముగా కనుపిస్తున్నాయి. స్వామికి యగ్నోపవీతం లేకపోవడం ఒక విశేషం. లింగపు అగ్రభాగము, క్రింది పొడవైన స్తంభభాగములను విడదీస్తున్నట్లుగా ఒక లోతైన పల్లము పడిన గీత స్పష్టముగా ఉండి, మొత్తము లింగము, పురుషాంగమును పోలి ఉంది. ఈ లింగము, అతిప్రాచీనమైన లింగముగా గుర్తించబడింది. ఆకాలపు శైవారాధనకు ఒక ఉదాహరణగా కూడా గుర్తించబడింది. గుడిమల్లం 2009 వరకు వురావస్థు శాఖ వారి ఆధీనంలో ఉంది. పూజా పునస్కారాలు ఏవీ జరగలేదు. కనుక ప్రజలు ఎక్కువగా రాలేదు. పురావస్తు శాఖ వారి ఉద్యోగి ఒకరు దానికి సంరక్షకుడిగా వుండి అరుదుగా వచ్చే సందర్శకులకు చూపిస్తూ ఉంటారు. గుడిమల్లం చిన్న పల్లెటూరు. తిరుపతికి సుమారు ఇరవై రెండు కిలోమీటర్ల దూరంలో ఉంది. ఈ ఆలయాన్ని పరశురామేశ్వారాలయం అని కూడా అంటారు. అంత దూరం వెళ్ళి చూడ లేని వారికి ఈ ఆలయంలోని మూల విరాట్టును అన్ని విధాల పోలిన ప్రతి రూపాన్ని చంద్రగిరి కోటలోని ప్రదర్శన శాలలో ప్రదర్శనకు పెట్టారు. అక్కడ దీన్ని చూడవచ్చు.ప్రపంచంలో అత్యంత పురాతన శివలింగం చిత్తూరు జిల్లాలోని గుడిమల్లం గ్రామంలో ఉన్ందే.[ఆధారం చూపాలి]

ఇది క్రీస్తుపూర్వం 2వ శతాబ్దపు కాలం నాటిదని చరిత్రకారులంటున్నారు. 1911లో గోపీనాధరావు అనే పురాతన శాస్త్రవేత్త సంవత్సరం పాటు పరిశోధించి ఈ శివలింగం ఉనికిని ప్రపంచానికి చాటాడు. ప్రపంచంలో ఎక్కడా లేని విధంగా పురుష అంగాన్ని పోలి ఉండే ఏడు అడుగుల ఈ శివ లింగం పై ఒక చేత్తో పశువును, మరో చేత్తో గొర్రెను పట్టుకుని యక్షుని భుజాలపై నిలబడిన రుద్రుని ప్రతిరూపాన్ని చెక్కారు. తలపాగా, దోవతి ధరించిన ఈ రుద్రుని వస్త్రధారణ రుగ్వేద కాలం నాటిదని శాస్త్రకారుల అంచనా. ప్రాచీన శైవపూజా విధానం సవివరంగా తెలిపే ఈ లింగాన్ని చెక్కేందుకు వాడిన రాయి గురించి ఎలాంటి సమాచారం లేదు. ఆలయ గర్భగుడి సైతం గజ పుష్పాకారంలో గంభీరంగా ఉంటుంది.ఆలయంలో దొరికిన శాసనాలలో దీనిని పరమేశ్వరాలయంగా పేర్కొన్నారు. ఈ లింగం చుట్టూ జరిపిన తవ్వకాలలో క్రీస్తు శకం రెండవ శతాబ్దానికి చెందిన ప్రాచీన గుడి అవశేషాలు బయట పడ్డాయి. చోళ, పల్లవ, గంగపల్లవ, రాయల కాలంలో నిత్యం ధూప, దీప, నైవేద్యాలతో కళకళలాడిన ఈ ఆలయాన్ని 1954లో గుడిమల్లం గ్రామస్తుల నుండి ఆర్కియాలజీ సొసైటీ ఆఫ్‌ ఇండియా స్వాధీనం చేసుకుంది. ఆనాటి నుండి గుడిలో పూజలు ఆగిపోయాయి. చాలా విగ్రహాలు చోరికి గురయ్యాయి. ఆర్కియాలజీ వెబ్‌సైట్‌లో ఇంత ప్రముఖమైన శివలింగం గురించి కనీస సమాచారం లేదు. గుడి చుట్టూ పచ్చిక పెంచడం మినహా ఆ శాఖ సాధించిన మార్పు ఏమీ లేదు.ఏ ఎస్‌ ఐ ధర్మాన కనీసం పూజలు కూడా చేసుకోలేక పోతున్నామని……వాపోతున్న గుడిమల్ల గ్రామస్తుల్లో ఒకరైన వున్నం గుణశేఖర నాయుడు 2006 నుండి 2008 వరకు డైరెక్టర్‌ జనరల్‌ ఆర్కియాలిజీతో సమాచార చట్టం ఆయుధంగా యుద్ధం చేసి వారిని కేంద్ర సమాచార చట్టం ముందు నిలబెట్టాడు.ఈ గుడికి సంబంధించిన ఆస్తుల వివరాలు అటుంచితే కనీసం గుడికి సంబంధించిన సాహిత్యం కూడా వారి దగ్గర లేదనే నగ్నసత్యం బయట పడింది. ఈ క్రమంలో గుణశేఖర నాయుడు చేసిన కృషి ఫలితంగా 2009లో గుడిలో పూజలు జరిపేందుకు గ్రామస్తులకు అనుమతి సాధించాడు. గతంలో ఎపుడో ఉజ్జయినిలో దొరికిన రాగి నాణాలపై ఈ అంగాన్ని పోలిన బొమ్మ ఉంది. మధుర మ్యూజియంలో ఇట్లాంటి శిల్పం ఉంది. ఇక ఇంగువ కార్తికేయ శర్మ రాసిన ‘పరమేశ్వర టెంపుల్‌ ఎట్‌ గుడిమల్లం’ ‘డెవలప్‌ మెంట్‌ ఆఫ్‌ ఎర్లీ శైవ ఆర్ట్‌ అండ్‌ అర్కిటెక్చర్‌ ‘ అనే రెండు పుస్తకాలు, మరి కొన్ని శిల్ప, కళా చరిత్ర పరిశోధన పత్రాలు మినహా ఈ గుడి గురించి మరే ఇతర సమాచారం లేదు. ఇపుడిపుడే ఈ ఆలయం మార్కెట్‌ దేముడి మాయలో పడబోతుంది. కోట్లరూపాయల హెరిటేజ్‌ ప్రాజెక్టులో ఇదీ భాగం అయింది. అంబికా సోనీ ఇటీవలే ఇక్కడ అంగపూజలు జరిపారు. ఒక ఎంపీ ఇక్కడ గెస్ట్‌హౌస్‌ కట్టే ప్లాన్‌లో ఉన్నారు.ఉజ్జయినిలో లభించిన కొన్ని రాగినాణాలపై ఈ లింగమును పోలిన బొమ్మలు ఉన్నాయి. ఈ నాణాలు సా.పూ. 3వ శతాబ్ధానికి చెందినవిగా గుర్తించబడ్డాయి.

పురాణాలలోని కథ తన తండ్రి ప్రోద్బలంతో అతని తల్లి శిరఛ్చేదం పరశురాముడు చెబుతుంది. ఆవేదన నుంచి కోలుకోవడానికి గాను ఋషులు ఒక శివ లింగం వెతికి దానికి పూజించవలసిందిగా సూచిస్తారు. చాలాసార్లు శోధించిన తరువాత, పరశురాముడు ఈఅడవి మధ్యలో ఒక లింగాన్ని గుర్తించి అటుపై ఆలయ సమీపంలోని ఒక చెరువు తవ్వి పూజించుచుండెను.ప్రతి రోజు ఆచెరువు ఒక దైవిక పుష్పం పెరుగుతూ ఉండగా, దానితో ఆతను శివునికి పూజిస్తూ ఉండేవాడు. ఆ పువ్వును అడవి జంతువుల నుండి కాపాడటం కొరకు ఆతను ఒక యక్షుడుని (చిత్రసేనుడు) కాపలాగా ఉంచుతాడు. అందుకు గాను పరశురాముడు రోజూ ఆతనికి ఒక జీవి, ఆటబొమ్మలను తీసుకొని ఇచ్చేవాడు.ఒకమారు పరశురాముడు లేని సమయంలో చిత్రసేనుడు (బ్రహ్మ భక్తుడు) ఆ పుష్పంతో శివునికి పూజ చేస్తాడు. పరశురాముడు వచ్చేసరికి పుష్పం లేకపోవడం చూచి కోపోధ్రిక్తుడై చిత్రసేనుడు మీద దెండెత్తుతాడు. ఆ యుద్ధం 14 సంవత్సరాల పాటు కొనసాగింది, అందువల్ల ఆప్రదేశం ఒక పెద్ద గొయ్య, లేదా పల్లం లా తయారి అయింది. అందుకే ఈ ప్రదేశానికి గుడిపల్లం అని పేరు వచ్చింది అంటారు. ఆయుధ్ధం ఎంతకీ ముగియక పోవడంతో పరమశివుడు వారిరువురికి ప్రత్యక్ష్యమై వారిరువురిని శాంతపరిచి, వారి భక్తికి మెచ్చి తాను రెండుగా విచ్ఛిన్నమై వారిలో ఏకమవుతాడు. అందుకు గాని ఇక్కడి లింగము ఒక ఆకారము పరశురాముడు (విష్ణు రూపం) ఒక చేతిలో వేటాడిన మృగముతోటి, రెండవ చేతిలో ఒక కల్లుకుండ ఉండినట్లు,, చిత్రసేనుడు (బ్రహ్మ) ముఖముతో, శివడు లింగ రూపముతో మలచబడెనని ఒక కథ ప్రాచుర్యంలో ఉంది. ఈ ఆలయానికి సమబంధించి మరియొక రహస్యమైన సన్నివేశం ప్రాచుర్యంలో ఉంది. అది ఈ ప్రధాన గదిలో ప్రతి అరవై సంవత్సరాలకు వరదలు వచ్చి లోపలభాగం మొత్తం వరద నీటితో మునుగి పోతుంది.. ఒక చిన్న భూగర్భ తొట్టి, దానిని కలుపబడి ఒక వాహిక శివలింగం ప్రక్కన నేటికీ కూడా చూడవచ్చు. ఈ వరద నీరు అకస్మాత్తుగా, శివలింగం పైభాగానికి తాకి అటుపై ఒక్కసారిగా క్రిందికి ప్రవహిస్తుంది. ఈ భూగర్భ ట్యాంక్ తరువాత ఎండి పోతుంది. ఇది 2005 డిసెంబరు 4 లో జరిగినట్లు ఆలయ సర్వే అటెండంతు పి.సీనప్ప ఆలయ జాబితా పుస్తకంలో వ్రాసినట్లు తెలుపబడింది. ఆ వరద నీదు అలానే ఒక 4 గంటలు ఉండి అటుపై మరల ఆలయంలో ఏమీ జరుగనట్లు అదృశ్యమైనదని వ్రాసినారు. రామయ్య అనే 75 ఏళ్ళ గ్రామస్థుడు దీనిని తాను 1945 సం.లో చూచినట్లు తెలిపినట్లు పలువురు వివరించిరి. ఆలయ మరో అధ్బుత ఉంది. పెరుగుతున్న సూర్యుని కిరణాలు ఉత్తరాయణము, దక్షిణాయనములో రెండుసార్లు ఈ రాతి గోడలపై చెక్కిన గ్రిల్ గుండా ప్రధాన శివలింగం యొక్క నుదిటి నేరుగా వస్తాయి.

మరికొన్ని ఆలయ విశేషాలు మార్చు

విశాలమైన ఈ దేవాలయ ప్రాంగణమున యెన్నియో చిన్న గుళ్ళున్నవి. అన్నింటిని చుట్టునూ, ఆవలి ఇటుక ప్రాకారగోడ, నలువైపుల ఉంది.ఈ ప్రాకారమునకు పడమటివైపున పెద్ద గోపుర ద్వారము ఉంది. ఈ గోపురద్వారము,, స్వామివారి అభిషేకజలమునకూ కట్టిన బావి యాదవదేవరాయలు కాలానికి (సా.శ.13-14 శతాబ్దం) చెందింది. ముఖ్య దేవాలయము- పరశురామేశ్వరస్వామి పేరున పలువబడు చున్నది. ఈ ఆలయమునకు వాయవ్య దిశన అమ్మవారి దేవాలయము ఉంది. దానిని ఆనుకొని దక్షిణమున వల్లీ-దేవసేనా సమేత కార్తికేయస్వామి గుడి ఉంది. పై రెండును తూర్పు ద్వారమును కల్గిఉన్నవి. తూర్పు చివర ఆనుకొని సూర్యనారాయణుని దేవాలయము ఉంది. ఈ చిన్ని ఆలయమును బహుసా మరికొన్ని శిథిలములై ఉండవచ్చును. మరికొన్ని పరివార దేవతల గుళ్ళు ఉన్నాయి. ఇవన్నీ బాణ చోళరాజుల (క్రీ. శ. 9-12 శతాబ్దులు) కాలమున చెందినట్టివి. ముఖ్య దేవాలయము గోడలపైని, రాతిపలకలపైని పెక్కు శాసనములు ఉన్నాయి. ఇవి తరువాతి పల్లవులు, వారి సామంతులు గంగ పల్లవులు (సా.శ. 897-905), బాణ చోళులు, చోళరాజు విక్రమచోళుడు, రాజరాజు కాలమునకు చెందినవి. యాదవ దేవరాయల కాలమునాటికి చెందిన మరికొన్ని శాసనములు ఉన్నాయి. విక్రమ చోళుడు కాలమున (సా.శ.1126) దేవాలమును పూర్తిగా తిరుగ కట్టినట్లు, రాతితో కట్టడములు చేసినట్లు తెలియుచున్నది. దేవాలయములో విశాలమైన మహామండపము గర్భగుడి ఆవలివైపు దాని ఆనుకొని ఎత్తైన రాతి ప్రాకారమును కలుపుచున్న అరుగు, నలుప్రక్కల ప్రదక్షిణమునకు వీలుగా స్తంభములపై శాల నిర్మింపబడెను.ఈ కాలమున మహామండపమునకు దక్షిణముగా ముఖద్వారము, దానికి నేరుగా ప్రాకారమును కూడా కుడ్యస్తంభములతో చక్కని ద్వారశాలను ఏర్పరచిరి. గర్భగుడి మాత్రము గజపృష్ఠాకారము కలిగి ఉంది. అందున అర్ధ మండపము మహామండపములు ఉన్నాయి. అన్నియు తూర్పు ముఖద్వారములు కలిగి ఉన్నాయి. గర్భగుడి, అర్ధ-మహామండపముల కన్న, చాలా పల్లములో ఉంది. అందువల్లనే కాబోలు ఈ గ్రామనామము గుడిపల్లము అని వాడుకలో ఉంది. శివుని ప్రతిమ, యవ్వనుడైన మల్లునిబోలి ఉన్నందున గ్రామనామము గుడిమల్లము అని ప్రతీతి. కాని శాసనములలో ఎక్కడా ఈనామము కానరాదు. ఈ గ్రామమును విప్రపీఠముగా పేర్కొనబడెను. గుడిపేరు పరశురామేశ్వరాలయముగా చెప్పబడింది. చిత్రమేన ఈ ఆలయము నెవ్వరు ప్రతిష్ఠించిరో, ఎప్పుడు జరిగినో శాసనములు తెలుపుటలేవు. శాసనములు స్వామి వారి నిత్య సేవల కొరకు దానములు తెలుపుచున్నవి. ఇటీవలి పరిశోధనల ఫలితముగా ఇది క్రీ.పూ 1-2 శతాబ్దము. సంబంధించిన లింగముగా భావింపవచ్చును.ముఖ్య దేవాలయములోని మూలవిరాట్టు గుండ్రని రాతి పీఠములోని (యోని), లింగము (అడుగు భాగమున చతురస్రాకమైన స్తంభము) అమర్చబడెను. ఈ పీఠములు చాలా నునుపుగా లింగ మెంత సుందరముగా నున్నదో అట్లున్నవి. కాని రాయి వేరు- ఇసుకరాయి. ఈ యోని నిర్మాణము కేవలము స్త్రీ యోని నిర్మాణము బోలి యుండుట చాల చిత్రముగ ఉంది.పీఠము చుట్టును 1.35 మీటర్లు పొడవుతో నలుప్రక్కల చతురస్రాకారం నిర్మించబడెను.దీని చుట్టును స్తంభము శైలి, అమరావతి-మధురల స్తూపవేదిక స్తంభములను బోలియుండుట గమనార్హము. ఈ స్తంభ పలకములపైన వివిధ రీతుల పద్మములు, పూలు, చక్రములు మలచిఉన్నవి.ఈ కాలమున దేవాలయ కట్టడము లేదు.కేవలము లింగముపై ఆరుబయట పూజించబడునట్లు తెలియుచున్నది. ఈ లింగముపై, దానిపైన శివుని ప్రతిమ అతి ప్రాచీనమైన శైవపూజా విధానమును తెలుపుటయే కాక దక్షిణమున శైవ మత్యంత పురాతన మైనట్టిదని తెలియుచున్నది.ఉజ్జయినిలో లభించిన కొన్ని రాగినాణాలపై ఈ లింగమును పోలిన బొమ్మలు ఉన్నాయి. ఈ నాణాలు క్రీ.పూ. 3వ శతాబ్ధానికి చెందినవిగా గుర్తించబడ్డాయి. అట్లే మధుర మ్యూజియంలో క్రీ.పూ.1 వ శతాబ్దమునకు చెందిన శిల్పము ఈ లింగమును పోలియున్నది. ఇది చెట్టు క్రింద ఎత్తైన ఆరు బయట వేదికలోనుంచి, పూజించబడు లింగముగా గోచరించును. ఈ లింగము ఊర్ధ్వరేతయైన మానవుని లింగమెట్లుండునో అట్లు చెక్కబడింది. నరముల వెలే కనిపించును లింగమధ్యభాగము.శివుని రూపము, లింగ ముఖభాగమున, చాల చక్కని యవ్వనుడిగా చూపడం జరిగింది. స్వామి రెండు కన్నులు, నాసికాగ్రమును చూచుటనుబట్టి విరూపాక్షుడగను, యోగ లేక ధ్యాన పురుషుడగను చెప్పుకొనవచ్చును. యెడమ భుజమ నానుకొని పరశు ఉంది. చేతిలో కుండ, కుండ మరొక చేతిలో పొట్టేలు (మృగము-బహుశ చర్మమే కాబోలు), తల క్రిందులుగా పట్టుకొని ఉన్నాడు. ఇచ్చట శివుని భిక్షాటన మూర్తిగా పోల్చుకొనవచ్చును. చక్కని ధోవతి మేఖలతో బంధించి యున్నను పురుషుని లింగము వెలికి యున్నట్లు చూపబడియుండుట చిత్రముగా ఉంది. ఇతడిని మనము రుద్రుడుగా శిశ్నిన దేవుడుగా ఊహించుట సమ్ంజసము. ఋగ్వేద రుద్రుడుకి జంధ్యము లేదు. ఈ ప్రతిమలో యజ్ఞపవీతము కానరాదు. పైగా స్వామి చలమూర్తి. అపస్మార పురుషుని భుజ స్కంధములపై ఉన్నాడు కావున, లింగము వ్రేలాడు చున్నట్లు చాలా సాధారణంగా చూపబడెను. కానీ గమనించినచో, శివలింగ మంతయు తీసికొన్నచో ఊర్ధ్వ రేతమనే చెప్పక తప్పదు. శివుని తలపాగా చిత్రముగా ఉన్నది, పట్టబంధముతో నొసలు పైకిగా కట్టబడింది. లేతతాటి ఆకు అల్లి చుట్టినట్లున్నది. దీనిని బట్టి దక్షిణామూర్తిగానో లేక కపర్దిగనో ఉద్దేంశింపబడినాడు. ఇట్టి సంయుక్త ప్రతిమయే తరువాత వివిధ రూపములలో ప్రత్యేకముగా శివుని చూపుటకు దోహదమై ఉండునని పలువురి అభిప్రాయము. యేల అనగా ఈ దేవాలయమును పూర్తిగా కట్టించి, పెద్దదిగా చేసిన తరువాత- పల్లవులు, చోళులు, బాణులు వివిధ రూపములలో శివుని ప్రతిమలను విడివిడిగా (దక్షిణామూర్తి, కంకాలమూర్తి, పశుపతమూర్తి, వీణాధారి, ఉమాసహితమూర్తి) దేవకోషములలో ఉంచిరి. ఈ వేదిక లింగము చుట్టునుమ చేసిన త్రవ్వకములలో సా.శ.2-3 శతాబ్దములకు చెందినట్టి, ఇటుకలతో కట్టిన అర్ధగోళాకారపు గుడి-గోడకూడా బయల్పడినది. దీనిని బట్టి సా.శ.2-3 శతాబ్దములలో బహుశ శాతవాహనులు- ఇక్ష్వాకులు కాలమున ఈ లింగము చుట్టును దేవాలయము కట్టిఉండవచ్చును. ఈ ఆలయము శిథిలమగుటచే పల్లవులు- బాణ- చోళులు దీనిని రాతితో, అదే ఆకృతిలో విశాలముగా కట్టి, కొన్ని మార్పులు, కూర్పులు గావించిరి.అప్పటి వాస్తునుబట్టి లింగము చుట్టునున్న వేదికను, గుండ్రని యోని పీఠమును, పూడ్చి వేయటం జరిగింది. చతురస్రమైన చిన్న పీఠికను మాత్రము చేసి అభిషేకజలము పోవుటకు ప్రణాళిని గావించిరి.

ప్రత్యేకత మార్చు

గుడిమల్లం శివాలయం లోని శివుడు పరశురామేశ్వరుడుగా పూజలందుకుంటున్నాడు. ఇక్కడి శివలింగానికి ఎంతో విశిష్టత ఉంది. ఈ ఆలయములో గర్భాలయము అంతరాలయము, ముఖమండపముల కన్నా లోతులో ఉంటుంది. ఇక్కడ గర్భగృహములో ప్రతిష్ఠించబడిన శివలింగము లింగ రూపములో కాకుండా శివుడు మానవ రూపములో మహావీరుడైన వేటగాని వలె ఉన్నాడు. ఈ లింగము ముదురు కాఫీరంగులో ఉన్న రాతితో చేయబడిన మానుష లింగము. లింగము సుమారుగా ఐదు అడుగుల పొడవు, ఒక అడుగు వెడల్పు కలిగి ఉంది. లింగముపైన ముందువైపు ఉబ్బెత్తుగానూ లింగము నుండి బయటకు పొడుచుకొని వచ్చినట్లుగా చెక్కబడిన శివుడు, అపస్మారక పురుషుని భుజాలపై నిలబడిన (స్థానకమూర్తి) రూపంలో ఉన్నాడు. స్వామి రెండు చేతులతో ఉన్నాడు. కుడిచేతితో ఒక గొర్రెపోతు (తలక్రిందుగా) యొక్క కాళ్ళు పట్టుకొనగా, ఎడమచేతిలో చిన్నగిన్నె (చిప్ప) ను పట్టుకొన్నాడు. ఎడమ భుజానికి ఒక గండ్రగొడ్డలి తగిలించుకొని ఉన్నాడు. స్వామి జటాభార (జటలన్నీ పైన ముడివేసినట్లు) తలకట్టుతో, చెవులకు అనేక రింగులు ఇంకా వివిధ ఆభరణాలు ధరించి, నడుముచుట్టూ చుట్టి, మధ్యలో క్రిందకు వ్రేలాడుతున్నట్లు ఉన్న అర్ధోరుకము (నడుము నుండి మోకాళ్ళ వరకూ ఉండే వస్త్రము) ధరించి ఉన్నాడు. ఆ వస్త్రము మధ్యలో వ్రేలాడుతున్న మడతలు అతి స్పష్టముగా కనుపిస్తున్నాయి. ఆ వస్త్రము అతి సున్నితమైనది అన్నట్లుగా అందుండి స్వామివారి శరీరభాగములు స్పష్టముగా కనుపిస్తున్నాయి. స్వామికి యగ్నోపవీతం లేకపోవడం ఒక విశేషం. లింగపు అగ్రభాగము, క్రింది పొడవైన స్తంభభాగములను విడదీస్తున్నట్లుగా ఒక లోతైన పల్లము పడిన గీత స్పష్టముగా ఉండి, మొత్తము లింగము, పురుషాంగమును పోలి ఉంది. ఈ లింగము, అతిప్రాచీనమైన లింగముగా గుర్తించబడింది. ఆకాలపు శైవారాధనకు ఒక ఉదాహరణగా కూడా గుర్తించబడింది.

మూలాలు మార్చు

  1. "Alphabetical List of Monuments – Andhra Pradesh « Archaeological Survey of India". web.archive.org. 2022-11-30. Archived from the original on 2022-11-30. Retrieved 2022-11-30.{{cite web}}: CS1 maint: bot: original URL status unknown (link)
  2. "మహాశివరాత్రి: విశిష్ట లింగాకారానికి పూజలు చేసే ప్రాచీన ఆలయం.. గుడిమల్లం". BBC News తెలుగు. 2021-03-11. Retrieved 2022-03-04.