విజయనగరం (కర్ణాటక)

కర్ణాటక లోని పురాతన సామ్రాజ్య శిథిలాలు

విజయనగర, (కన్నడ: ವಿಜಯನಗರ) ఈ నగరం 13-15 శతాబ్దముల మధ్య దక్షిణ భారత దేశాన్ని పరిపాలించిన మహాసామ్రాజ్యాలలో ఒకటైన విజయనగర సామ్రాజ్య పు రాజధాని, ఇప్పుడు ఒక చారిత్రాత్మక పట్టణం. ఈ విజయనగర అవశేషాలు కర్ణాటక రాష్ట్రంలోని బళ్ళారి జిల్లా లోని హంపి గ్రామంలో కనిపిస్తాయి. ఈ పురాతన నగరంలో ప్రసిద్ధమైన విరూపాక్ష దేవాలయం ఉంది. ఈ నగరానికి ప్రక్కన ఉన్నది హంపి అనే గ్రామం. హంపిని చరిత్రకారులు విజయనగర అవశేషాల సంగ్రహాలయంగా వర్ణిస్తారు.

  ?విజయనగర
కర్ణాటక • భారతదేశం
విరూపాక్ష దేవాలయ తూర్పు గాలి గోపురం
విరూపాక్ష దేవాలయ తూర్పు గాలి గోపురం
విరూపాక్ష దేవాలయ తూర్పు గాలి గోపురం
అక్షాంశరేఖాంశాలు: 15°11′N 76°17′E / 15.19°N 76.28°E / 15.19; 76.28
కాలాంశం భాప్రాకా (గ్రీ.కా+5:30)
విస్తీర్ణం
ఎత్తు

• 568 మీ (1,864 అడుగులు)
జిల్లా (లు) బళ్ళారిజిల్లా జిల్లా
జనాభా 0 (2001 నాటికి)

ఉనికి - భౌగోళిక స్వరూపం సవరించు

హంపి బెంగళూరు నుండి 343కి.మీ. దూరంలో, బీజాపుర నుండి 254కి.మీ.బళ్ళారి నుండి 74కి.మీ. దూరంలో బళ్ళారి జిల్లాలో ఉంది. హంపి దగ్గరలో ఉన్న తాలుకా హొసపేటే 13 కి.మి దూరంలో ఉంది. హంపి 15°11′24″N 76°16′48″E / 15.19°N 76.280°E / 15.19; 76.280 అక్షాంశ రేఖాంశ మధ్య విస్తరించి ఉంది. శిథిలమై అవశేషాలతో ఉన్న ఈ నగరానికి దగ్గరలో కమలాపుర అనే నూతన గ్రామం ఉంది. విజయనగరానికి దగ్గరలో ఉన్న రైలు సౌకర్యం గల ఊరు హొస్పేట్.

విజయనగరరాజులు విజయనగర సామ్రాజ్యాన్ని తుంగభద్రానదికి ఉత్తరతీరంలో ఉన్న అనేగొంది అనే ప్రదేశాన్ని రాజధానిగా చేసుకొని పరిపాలించేవారు. తరువాతి కాలములో విద్యారణ్య స్వామి తుంగభద్ర నదికి దక్షిణతీరాన ఉన్న ఈ ప్రదేశాన్ని "విజయనగరం" అనే పేరుతో విజయనగర సామ్రాజ్య రాజధానిగా చేశాడు. విజయ=జయాన్ని నగరం= ఇచ్చే నగరం అని అర్థం.

విజయనగరనగర నిర్మాణం హంపిలో ఉన్న ప్రాచీనమైన విరూపాక్షదేవాలయం చుట్టు జరిగింది. ఈ నగరం చుట్టు ప్రక్కల చాలా చిన్నచిన్న దేవాలయాలు ఉన్నాయి. ఈ ప్ర్రాంతమే రామాయణంలో సుగ్రీవుడు నివసించిన కిష్కింద అని తన సోదరుడైన వాలి నుండి తప్పించుకోవడానికి ఇక్కడే ఒక గుహలో నివసించేవాడని, రామచంద్రమూర్తి సుగ్రీవుడిని ఇక్కడే కలిసాడని చెబుతారు. హనుమంతుడి గుడి, హనుమంతుడి తల్లి, తండ్రి అయిన అంజనీదేవి, కేసరిల గుహ ఇక్కడ ఉన్నదని కూడా చెబుతారు. నగరానికి దగ్గరలోనే పంపాసరోవరం కూడా ఉంది.

శిథిలమైన ఈ నగరం ఇప్పుడు ప్రకృతి రమణీయమైన దృశ్యాలతో పర్వతశ్రేణుల మధ్య పెద్దపెద్ద గ్రానైటుశిలల మధ్య ఉంది. తుంగభద్ర నది ఈ నగరం గుండా ప్రవహిస్తున్నది. అప్పటి కాలంలో ఉత్తరాన ఉన్న ఈ తుంగభద్ర నది శత్రువులనుంది భద్రత కలిపించేది. దక్షిణం వైపు నగరం, ఆ తరువాత ఉన్న గ్రానైటుశిలలు కూడా దాటితే ఒక పెద్ద మైదానం వస్తుంది.

నగర వైభవం, నగర చరిత్ర సవరించు

విజయనగర సామ్రాజ్యాన్ని సంగమ వంశానికి చెందిన హక్క రాయలు (హరిహర రాయలు),బుక్క రాయలు స్థాపించారు. మొదటి హరిహర రాయలు రాజ్యాన్ని స్థాపించడంలో ప్రధాన పాత్ర చూపగా, తరువాత రాజ్యానికొచ్చిన ఈయన సోదరుడు మొదటి బుక్క రాయలు రాజ్యాన్ని విస్తరించాడు. రాజ్యం ముందు తుంగభద్ర నది ఉత్తర తీరాన ఆనెగొందిని రాజధానిగా చేసి స్థాపించగా విద్యారణ్య స్వామి అధ్వర్యంలో రాజధానిని తుంగభద్ర దక్షిణ తీరానికి తరలించి విజయనగరం అనే పేరుతో ఈ నగరాన్ని శత్రుదుర్భేద్యమైన రీతిలో నిర్మించారు. విజయనగరం అంటే విజయాన్ని ఇచ్చే నగరం అని అర్థం.

 
శిథిలావస్థలో ఉన్న ఒక తటాకం

తైమూర్ దండయాత్రల తరువాత ఉత్తరభారత దేశ రాజకీయ ఆర్థిక పరిస్థితులు బాగా క్షీణించాయి, ఉత్తర భారతంలో రాజ్యాలన్నీ విచ్ఛిన్నమయ్యాయి. సరిగా అదే సమయంలో దక్షిణ భారత దేశం లో శత్రుదుర్భేధ్యమైన విజయనగర సామ్రాజ్య స్థాపన జరిగింది. కళలు సంస్కృతి వెల్లువిరిసిన ఈ సామ్రాజ్యం ఉత్తర భారత దేశం లోని చాలా మంది హిందువులను ఆకర్షించి, దక్షిణ భారతానికి వలస పోయేటట్లు చేసింది. మధ్య ఆసియా పర్యాటకుడైన అబ్ధుర్ రజాక్ విజయనగరాన్ని సందర్శించినప్పుడు ఈ విధంగా అన్నాడు "చారిత్రక అధారాల ప్రకారం విజయనగర సామ్రాజ్యం ఉచ్చస్థితిలో ఉన్నప్పుడు ఆ విజయనగర నిర్మాణం, శోభ ఈ భువిలోనే కనివిని ఎరగనట్లు ఉండేది". ఆ తరువాత 1420 సంవత్సరం లో విజయనగరాన్ని సందర్శించడానికి వచ్చిన నికొలొ కాంటి అనే ఇటలీ పర్యాటకుడు విజయనగర వీధులను చూసి ఆశ్చర్యం చెంది వీధులు అత్యంత రమణీయంగా సౌందర్యంగా ఉన్నాయని, రాజభవంతుల చుట్టు నీటి సెలయేళ్ళు ప్రవహిస్తూ ఉండేవని, అలా ప్రవహిస్తున్నప్పుడు నీటితో రాపిడి వల్ల ఆ రాళ్ళు బాగా నునుపెక్కి మెరుస్తూ ఉండేవని పేర్కొన్నాడు. అంతేకాక నగరం అంతా ఉద్యానవనాలతోను పూల తోటలతోను ఉండడం వల్ల నగర విస్తీర్ణం 60 మైళ్ల వరకు ఉండేదన్నాడు. ఆ తరువాత 1552 సంవత్సరం లో వచ్చిన పేయస్ అనే పోర్చుగీసు చరిత్రకారుడు ఈ విజయనగారాన్ని మధ్య యుగములో పునరుద్ధరణ జరిగిన తరువాత నిర్మించబడిన రోమ్‌ నగరం తో పోల్చి, రోమ్‌ నగరం తో సమానంగా దృశ్యసుందరంగా ఉన్నదన్నాడు. విజయనగరం అంతా సరస్సులతో, నది నుండి వచ్చిన పాయలతోను, పూల, పళ్ళ ఉద్యానవనాలతో అత్యంత సుందరం గా ఉండేదని, ప్రపంచం లోనే ఇంత మనోహరమైన నగరం మరొకటి ఉండదని పేర్కొన్నాడు. రాజభవనాలలోని గదులు ఏనుగు దంతముల పై చెక్కబడిన వస్తువులతో ఉండేవని, భవనాల గదులలో పైకప్పు పై కమలాలు, గులాబీ పూలు చెక్కబడినవి అని కూడా వ్రాసుకొన్నాడు.

1999 సంవత్సరములో హంపి యునెస్కో సంరక్షిస్తున్న చారిత్రక ప్రదేశాల జాబితాలో, ప్రపంచ వారసత్వపు‌ స్థలాలో ఒకటిగా చేర్చారు[1]. ఈ నగరాన్ని హంపి అవశేషాల నగరంగా అభివర్ణించారు. ఈ మధ్యకాలములో ఇక్కడ భారీ వాహనాలు పోవడానికి ఒక వంతెన కట్టే ప్రయత్నం జరిగింది.

నగర కేంద్రము సవరించు

చారిత్రకులు, హంపి గ్రామం నుండి మాతంగపర్వతము వరకు తూర్పునకు విస్తరించి ఉన్న ప్రదేశాన్ని నగర కేంద్రంగా పవిత్ర కేంద్రంగా వ్యవహరిస్తారు. ఈ ప్రాంతం కొన్నిచోట్ల ఆగ్నేయ దిశలో విఠల దేవాలయం వరకు విస్తరిస్తుంది. తుంగభద్రానదికి దక్షిణపు ఒడ్డున కొండ ప్రాంతమంతా పవిత్ర కేంద్రము క్రిందికే వస్తుంది.

విరూపాక్ష దేవాలయం సవరించు

హంపి వీధికి పశ్చిమ చివర విరూపాక్ష దేవాలయం ఉంది. 50 మీటర్ల ఎత్తు ఉన్న తూర్పు గాలి గోపురం విరూపాక్ష దేవాలయం లోనికి స్వాగతం పలుకుతుంది.దేవాలయంలో ప్రధాన దైవం విరూపాక్షుడు (శివుడు). ప్రధాన దైవానికి అనుసంధానంగా పంపాదేవి గుడి, భువనేశ్వరీ దేవి గుడి ఉంటుంది. ఈ దేవాలయానికి 7 వ శతాబ్దం[2] నుండి నిర్విఘ్నమైన చరిత్ర ఉంది. విరూపాక్ష-పంపా ఆలయం విజయనగర సామ్రాజ్యం కంటే ముందు నుండి ఉన్నదని శిలాశాసనాలు చెబుతున్నాయి. 10-12 శతాబ్దానికి చెందినవి అయి ఉండవచ్చని చరిత్రకారుల అంచనా.[3] చరిత్ర ఆధారాల ప్రకారం ప్రధాన దేవాలయానికి చాళుక్యుల, హోయ్సళ పరిపాలన మార్పులు చేర్పుల జరిగాయని అయితే ప్రధాన ఆలయం మాత్రం విజయనగ రాజు లే నిర్మించారని అంటారు.విజయనగర రాజులు పతనమయ్యాక, దండయాత్రల వల్ల 16 వ శతాబ్ధానికి హంపి నగరం లోని అత్యద్భుత శిల్ప సౌందర్యం నాశమైపోయింది. విరూపాక్ష-పంపా ప్రాకారం మాత్రం 1565 దండయాత్రల బారిన పడలేదు.విరూపాక్ష దేవాలయంలో దేవునికి ధూప,దీప నైవేద్యాలు నిర్విఘ్నంగా కొనసాగాయి. 19 వ శతాబ్దం మొదలులో ఈ ఆలయం పైకప్పు పై చిత్రాల కు, తూర్పు, ఉత్తర గోపురాలకు జీర్ణోద్ధరణ జరిగింది.[4]

ఈ దేవాలయానికి 3 ప్రాకారాలు ఉన్నాయి. 9 ఖానాలతో 50 మీటర్ల ఎత్తు ఉన్న తూర్పు గోపురములోని రెండు ఖానాలు రాతితో నిర్మించబడ్డాయి. మిగతా 7 ఖానాలు ఇటుకలతో నిర్మించబడ్డాయి. ఈ తూర్పు గోపురం నుండి లోపలికి ప్రవేశిస్తే బయటి నుండి ఆలయంలోకి వెళ్ళే మొదటి ప్రాకారం స్తంభాలు లేకుండా ఆకాశం కనిపించేటట్లు ఉంటుంది. ఈ ప్రాకారాన్ని దాటి లోపలికి వెళ్తే స్తంభాలతో కూడి కప్పబడిన వసారా ఉంటుంది. స్తంభాలతో కూడి ఉన్న వసారాలో చిన్న చిన్న దేవాలయాలు ఉంటాయి. దీనిని కూడా దాటి లోపలి ప్రాకారంలోకి వెళ్ళితే గర్భ గుడి వస్తుంది.[5]

తుంగభద్రా నది నుండి ఒక చిన్న నీటి ప్రవాహం ఆలయంలోకి ప్రవేశించి గుడి వంట గదికి నీరు అందించి బయటి ప్రాకారం ద్వారా బయటకు వెడుతుంది. ఈ ఆలయ అభివృద్ధిలో శ్రీ కృష్ణదేవరాయల పాత్ర ఎంతో ఉన్నదని లోపలి ప్రాకారం ఉన్న స్తంభాల వసారాలోని శిలాశాసనాలు చెబుతున్నాయి. ఈ లోపలి ప్రాకారంలోని స్తంభాల వసారాని 1510 సంవత్సరములో కృష్ణదేవరాయలు కట్టించాడని కూడా శిలాశాసనాలు చెబుతున్నాయి.[6] విరూపాక్ష దేవాలయంలోని బయటి ప్రాకారంలో ఏకశిలలో చెక్క బడిన నంది ఒక కి.మీ. దూరం వరకు కనిపిస్తుంది.

హేమకూట పర్వతం సవరించు

ఈ పర్వతం హంపి గ్రామానికి దక్షిణం వైపు ఉంది. ఈ కొండ పై చిన్న చిన్న దేవాలయాలు విజయనగర సామ్రాజ్యం స్థాపనకు పూర్వం నిర్మించబడిన దేవాలయాలు. వాటి చరిత్ర 10వ శతాబ్దమునకు చెందినది. విజయనగర సామ్రాజ్య స్థాపన జరిగినప్పుడు ఈ దేవాలయాలను పరిరక్షిస్తూ విజయనగర నిర్మాణం జరిగింది. ఇక్కడ ఉన్న కొన్ని దేవాలయాలు అసంపూర్ణముగా ఉన్నాయి. వాటి నిర్మాణం ఎప్పటికీ పూర్తి కాలేదు. ఈ కొండపై గోపురాలు, నీరు నిలువచేసుకొనే తటాకాలు, ఉన్నాయి.

 
కృష్ణ ఆలయం

శ్రీ కృష్ణ దేవాలయం సవరించు

శిథిలావస్థలో ఉన్న ఈ దేవాలయం హేమకూట పర్వతంపై ఉంది. కళింగ దేశం పై విజయ చిహ్నంగా ఈ దేవాలయాన్ని శ్రీ కృష్ణదేవరాయలు నిర్మించాడు. ఈ గుడికి రెండు ప్రాకారాలు ఉన్నాయి. బయటి ప్రాకారంలోని కొంత భాగం పూర్తిగా శిథిలమైపోయింది. కొంత జీర్ణోద్ధారణ జరిగిన ఈ దేవాలయం ఇంకా శిథిలావస్థలో ఉన్నదనే చెప్పాలి. గర్భగుడిలో మూర్తి (విగ్రహం)లేదు.

ఉగ్రనరసింహ మూర్తి సవరించు

  • హంపి వీధికి దగ్గరలొనే 6.7 మీటర్ల ఎత్తున్న ఉగ్ర నరసింహమూర్తి విగ్రహం ఉంది. అక్కడ లభించిన శాసనాల ప్రకారం ఈ విగ్రహాన్ని శ్రీ కృష్ణదేవరాయలు 1528 సంవత్సరంలో ఏకశిలపై చెక్కించాడు.
  • ఈ విగ్రహము మోకాలిపై చిన్న లక్ష్మీ దేవి విగ్రహము ఉండేది. అయితే ఈ లక్ష్మీ విగ్రహము ప్రధాన విగ్రహము నుండి వేరుపడినది. బహుశా ఇది విధ్వంసకాండ వల్ల జరిగి ఉండవచ్చని భావిస్తున్నారు. ప్రస్తుతం ఈ లక్ష్మీ విగ్రహాం కమలాపురలోని మ్యూజియంలో ఉంది.
 
ఏకశిలా ఉగ్రనరసింహ విగ్రహం
  • ఈ విగ్రహములో నరసింహుడు శేషతల్పముపై కూర్చుని ఉన్నట్టు చెక్కబడింది. ఆదిశేషువు ఏడు తలలతో నరసింహునికి పడగవిప్పి తలపై నీడపడుతున్నాడు. ఈ విగ్రహాన్ని ఇటీవల కొంత పునరుద్ధరించారు. మోకాళ్లను కలుపుతూ ఉన్న గానైటు పట్టీ విగ్రహాన్ని స్థిరపరచడానికి ఇటీవలే చేర్చారు.

సుగ్రీవుడి గుహ సవరించు

ఈ గుహ సహజసిద్ధంగా ఏర్పడిన గుహ అని వాలి బారి నుండి తప్పించుకొవడానికి సుగ్రీవుడు ఇక్కడే విడిది చేశాడని శ్రీ రామచంద్ర మూర్తిని ఇక్కడే హనుమంతుడి ద్వారా కలిసాడని చెబుతారు. ఈ గుహ అంతా పర్యాటకులు వ్రాసిన పిచ్చి వ్రాతలతో ఉంది.

కోదండరామ దేవాలయం సవరించు

హంపిలో విరుపాక్ష దేవాలయం నుండి కొలన్నాదెడ్ వీధి తూర్పు వైపుగా వెడితే కోదండరామ దేవాలయం వస్తుంది. నగరంలో ఈ ప్రదేశం గుండా తుంగభద్రా నది చిన్న సెలయేరుగా ప్రవహించడం వల్ల ఈ ప్రదేశం చాలా పవిత్రమైనది. ఇతిహాసం ప్రకారం శ్రీ రాముడు సుగ్రీవుడికి ఈ ప్రదేశం లోనే పట్టాభిషేకం చేశాడు. దేవాలయంలో ఇప్పటికీ ధూపదీపవైవేద్యాలు ఇస్తారు. గర్భగుడిలో సీత, రామ, లక్ష్మణ విగ్రహాలు ఒకే శిలపై చెక్కబడ్డాయి.

 
విఠలేశ్వరుడి ఆలయ సముదాయం ఉన్న ఏకశిలా రథం

విఠలేశ్వర దేవాలయ సముదాయం సవరించు

హంపికి ఈశాన్య భాగంలో ఆనెగొంది గ్రామానికి ఎదురుగా ఉన్న విఠల దేవాలయ సముదాయం అప్పటి శిల్ప కళా సంపత్తికి ఒక నిదర్శనం. ఈ దేవాలయం మరాఠీలు విష్ణుమూర్తిగా ప్రార్థించే విఠలుడిది. ఈ ఆలయం 16 వ శతాబ్ధానికి చెందినది. విఠలేశ్వర దేవాలయంలో ఆకర్షణీయమైన విశేషం సప్త స్వరాలు పలికే ఏడు సంగీత స్తంభాలు. ఈ దేవాలయం లోనే పురందరదాస ఆరాధనోత్సవాలు జరుతాయి.

 
సంగీత స్తంభాలు

ఏక శిలా రథం సవరించు

ఏక శిలా రథం విఠల దేవాలయ సముదాయంలో తూర్పు భాగంలో ఉంది. ఇంకో విశేషం ఏమంటే ఈ రథం చక్రాలు కదులుతాయి, తిరుగుతాయి కూడాను. ఈ రథం అంతా ఒకే శిల. ఈ దేవాలయ ప్రాంగణంలో ఒక మహా మండపం ఉంది. దీని పునాది శిల్పకళా శోభితమై ఉంది. దీని శిఖరం 15 అడుగులు ఎత్తైన నల్లరాతి స్తంభాలపై నిలచి ఉంది. వీటిలో ప్రతిదాని మధ్య భాగం చుట్టు విడివిడి కొమ్మలు ఉన్నాయి; ఇవి అన్నీ ఏకశిలనుంచి చెక్కినవే. శిల్పాలతో ఉండే ఈ స్తంభాలను శత్రువులు భారీగా నష్టపరిచారు; శిల్పకళను నష్టపరచి ఇంచుమించుగా రాతిముక్కలుగా మిగిల్చారు. మధ్య భాగం చాలా మట్టుకు మరీ భారీగా నాశనమైనది.

రాజ తులాభారం సవరించు

విఠలేశ్వర స్వామి గుడికి నైరుతి దిశలో తులాభారం ఉంది. ఈ తులాభారం రెండు గ్రానైటు స్తంభాలు వాటి మధ్య భూమికి సమాంతరంగా ఒక గ్రానైటు కమ్మి ఉంది. విశేష దినాలలో ఈ రెండు స్తంభాల మధ్య కమ్మిని నిలిపి రాజు (చక్రవర్తి) వస్తువులను తులాభారం మీద తూచి బంగారం మణులు రత్నాలుబ్రాహ్మణులకు సాధువులకు దానం ఇచ్చేవాడు.

కోట గోడ సవరించు

 
వెయ్యి శివలింగాలు

హంపికి 2కి.మీ. ఆగ్నేయంగా ప్రారంభమైన ఈ కోట గోడ లోపల ఒక చిన్న పీఠభూమి ఉంది. ఇది నైరుతిగా ఇంచుమించు కమలాపుర గ్రామం వరకు విస్తరించి ఉంది. దీనిని పవిత్ర కేంద్రంనుంచి ఒక చిన్న లోయ విడదీస్తోంది. ఈ లోయలో ఇప్పుడు వ్యవసాయ క్షేత్రాలు, వాటిలో పంట కాలువలు,సెలయేళ్లు, ఆనెగొందికి ఎదురుగా నదిని కలుపుతూ ఉన్నాయి. మహారాజ నివాసాన్ని వీక్షిస్తూ ఒక పెద్ద నల్లరాతి వేదిక కూడా ఉంది. రాచనగరు లోపల ఇప్పుడు రాచ భవనాల, పాలనాభవంతుల, రాచవారికి మాత్రమే పరిమితమైన దేవాలయాల శిథిలాలు మాత్రం ఉన్నాయి. రాజ భవనాల పునాదులు తప్ప పైభాగాలేమీ లేవు ( సౌకర్యం కోసం పైభాగాలను ఎక్కువగా కలపతో కట్టారు, అందుచేత పూర్తిగా శిథిలమయ్యాయి).అయితే,రాయితో కట్టిన గుడులు, నగరం చుట్టూ ఉన్న గోడలు మాత్రం కొంతవరకు నిలబడి ఉన్నాయి. కోటగోడ చుట్టూ నీటితో పారే అగడ్త పెద్ద వ్యవసాయపు చెరువుతో అనుసంధానించబడి ఉంది. ప్రత్యేక సందర్భాలలో దీని లోనికి నీరు వదులుతారు. ఈ చెరువుకు పడమటివైపు భాగం దేవాలయాన్ని వీక్షిస్తూ ఉంటుంది. ఈ చెరువుకు పెద్దపెద్దపావంచాలు (మెట్లు)పచ్చ రాళ్లతో చేసిన రేఖా రూపాలతో, ఏ రకమైన మరమ్మతుల అవసరము లేనట్లుగా, నిర్మించబడ్డాయి.

హజారా రామాలయం సవరించు

రామచంద్రుడి దేవాలయం దీర్ఘచతురస్రకారపు ప్ర్రాంగణంలో ఉంది. దేవాలయం తూర్పు వైపు అభిముఖంగా ఉంది. ప్రతి రోజు గుడిలో జరిగే సేవలు, ప్రత్యేక సేవల చిత్రాలు ఆలయం బయటి ప్రాంగణంలో చిత్రించబడి ఉన్నాయి. అలయం లోపలి ప్రాంగణంలో గోడల మీద, ఆలయంలో రామాయణం కథను తెలిపే చిత్రాలు చిత్రించబడి ఉన్నాయి. చిన్నికృష్ణుడి లీలలు గోడలపై చిత్రించబడి ఉన్నాయి.

ఈ దేవాలయములోనికి ప్రవేశము, దేవతార్చన చేసే అవకాశం రాచ ప్రతినిధులకు మాత్రమే ఉండేదిట. ఈ గుడి శ్రీ రాముడు వాలిని వధించిన ప్రదేశములోనే నిర్మించారని చెబుతారు. ఇప్పుడు ఈ

దేవాలయం లోపల గోడలపై శ్రీ రాముడి చిత్రాలు అనేకం చిత్రించడం వల్ల, ఆ సంఖ్య లెక్క పెట్టడానికి వీలు లేకుండా ఉండడంతో ఈ దేవాలయాన్ని హజారా (సహస్ర)రామాలయం అని కూడా పిలుస్తారు.

భూగర్భం లో ఉన్న విరూపాక్షుని దేవాలయం సవరించు

భూగర్భంలో ఉన్న ఈ దేవాలయం చరిత్రకారుల త్రవ్వకాలలో బయట పడింది. ఈ అత్యంత విశాలమైన గుడి ఇప్పుడు పైకి కనిపిస్తున్నది. (ఊరి మధ్యలో ఉన్న హంపి లోని విరూపాక్షుని దేవాలయం కాదు). అప్పుడప్పుడు వర్షాలతో ఈ గుడి వరదల పాలై సందర్శకులు చూడడానికి అవకాశాన్ని కల్పించదు. సందర్శకులు చూడడానికి అవకాశం ఉన్న రోజులలో గబ్బిలాలతోను, కీటకాలతోను నిండి ఉంటుంది.[ఆధారం చూపాలి]

 
కమల భవనం

కమల భవనం సవరించు

 
కళ్యాణి-హొయ్సళ శైలిలో నిర్మించబడ్డ తటాకం

కమల భవనం పట్టపు రాణుల కొరకు నిర్మించబడి, నీటి గొట్టాల ద్వారా నీరు ప్రవహించే ఏర్పాటు ఉండేది. విజయనగర రాజుల కాలములోని ఈ నిర్మాణాలు ముస్లిముల కట్టడ శైలిని ప్రదర్శిస్తున్నవి. పెద్ద పెద్ద ప్రాకారపు గుమ్మాలు, శంఖు ఆకారంలో ఉన్న పైకప్పు విజయనగర రాజుల కట్టడాల శైలి నుండి విభేదించి ముస్లిముల కట్టడ శైలిని వ్యక్త పరుస్తున్నది. ఈ భవన నిర్మాణములో వేదికలు నిర్మించడానికి కొయ్య కూడా వినియోగించబడింది.

పుష్కరిణి సవరించు

పట్టపు రాణి స్నాన మందిరాన్ని మెట్ల స్నానమందిరంగా మలిచారు. ఇది ఒక దిగుడుబావి; లోపలికి దిగడానికి మెట్లతో స్నానంచెయ్యడానికి అనువుగా నిర్మించబడింది. ఈ రకమైన దిగుడుబావులు పగటిపూట వేడిమి నుంచి ఉపశమనం కలిగిస్తాయి.జన సంచార సమయాల్లో వీటిని మూసివేస్తారు.

 
గజశాలలు

గజ శాల సవరించు

పట్టపు ఏనుగుల నివాసం కొరకు, వాటి దైనందిన కార్యకలాపాల కొరకు, రాజ ప్రసాదానికి దగ్గర లోనే గజశాల ఉంది. ఏనుగులు కవాతు చేయడానికి వీలుగా ఈ గజశాలకు ఎదురుగా ఖాళీ ప్రదేశం ఉంది. ఈ గజశాల గుమ్మాలు కొప్పు ఆకారంలో ఉండి ముస్లిం కట్టడ శైలి చూపుతున్నాయి. మావటి వారు సైనికులు ఉండడానికి గజశాలకు ప్రక్కన సైనిక స్థావరాలు ఉన్నాయి.

ఇతర చారిత్రిక ప్రదేశాలు సవరించు

  • హంపి-విజయనగరానికి సమీపంలో క్రింది చారిత్రిక ప్రదేశాలు చూడవచ్చు.

ఈ నగర పరిసరాలలో నూతన గ్రామాలు పట్టణాలు అభివృద్ధి చెందుతున్నాయి.

  • ఆనెగొంది,తుంగభద్ర నదికి ఉత్తరాన ఉంది. ఇది విజయనగరరాజుల మొదటి రాజధాని (వలస స్థలం).
  • హంపి, విజయనగర శిథిలాల మధ్యలో ఉన్న గ్రామం .[7]
  • హొసపేటె, విజయనగరానికి నైరుతి దిక్కున ఉన్న తాలుకా, పట్టణం - రైలు సౌకర్యాలు ఇక్కడ నుండి ఉన్నాయి.
  • కమలాపుర, విజయనగరానికి ఆగ్నేయంలో ఉన్న రాజప్రాసాదం, ఇప్పటి పురాతన వస్తుసంగ్రహాలయం (మ్యుజియం)

పైన పేర్కొన్నవి అన్నీ బళ్ళారి జిల్లాలో ఉన్నాయి. ఆనెగొంది మాత్రం కొప్పళ‌ జిల్లాలో ఉంది.

ఇది కూడా చూడండి సవరించు

వనరులు సవరించు

  • T.S. Satyan, Hampi: The fabled capital of the Vijayanagara Empire, (Directorate of Archaeology and Museums), Govt. of Karnataka, 1995
  • J.M. Fritz et al, New Light on Hampi: Recent Research at Vijayanagara, (Performing Arts Mumbai, 2001) ISBN 81-85026-53-X
  • A.N. Longhurst, Hampi Ruins Described and Illustrated, (Laurier Books Ltd., 1998) ISBN 81-206-0159-9
  • The Ruins of Hampi:Travel Guide ISBN 81-7525-766-0

మూలాలు సవరించు

  1. హంపి శిధిలాలపై అధునాతన వంతెలను నిర్మిస్తున్నప్పుడు యునెస్కో వెలువరించిన సందేశం. సేకరించిన తేదీ: నవంబరు 2, 2007. Archived 2007-07-08 at the Wayback Machine
  2. "విరూపాక్ష పరిశోధన ప్రాజెక్టు". Archived from the original on 2007-07-13. Retrieved 2006-09-13.
  3. "శ్రీ విరూపాక్ష దేవాలయం". Retrieved 2006-09-13.
  4. "విరూపాక్ష దేవాలయ పరిశోధన ప్రాజెక్టు". Archived from the original on 2007-07-13. Retrieved 2006-09-13.
  5. "శ్రీ విరూపాక్ష". Retrieved 2006-09-13.
  6. "Details of Virupaksha Temple". హంపి.ఇన్‌. Archived from the original on 2007-06-21. Retrieved 2007-03-08.
  7. "విజయనగర "హంపి శిధిలాల సంగ్రహస్థలం"". Archived from the original on 2006-09-08. Retrieved 2006-09-09.

బయటి లింకులు సవరించు