గురు అమర్ దాస్
గురు అమర్ దాస్ సిక్ఖు మతంలోని పదిమంది గురు పరంపరలో మూడవవారు. 73 సంవత్సరాల వయసులో 1552లో ఆయన మూడవ సిక్ఖు గురువయ్యారు. గోయింద్వాల్ గురు అమర్ దాస్ గురుత్వం నెరపిన కాలంలో సిక్ఖు మతానికి ప్రధాన కేంద్రంగా వెలుగొందింది. స్త్రీ పురుష సమానత్వం, సతీ సహగమనం పట్ల వ్యతిరేకత, సిక్ఖుమతంలో లాంగర్ నిర్వహణల గురించి జీవితాంతం ప్రబోధిస్తూనే సాగారు.[1] 1567లో అక్బర్ పంజాబ్ లో తన హయాంలో ఉన్న పేదసాదలు, సాధారణ ప్రజలతో కలసి లాంగర్ చేశారు. గురు అమర్ దాస్ 140 మంది అపోస్తుల (వారిలో 52 మంది స్త్రీలు) కు శిక్షణ నిచ్చి మతాన్ని వేగంగా విస్తరించేందుకు కృషిచేశారు.[2] 1574లో 95 సంవత్సరాల వయసులో మరణించారు. దానికి ముందు అమర్ దాస్ తన అల్లుడు జేతాను నాలుగవ సిక్ఖు గురువుగా నియమించారు.
గురు అమర్ దాస్ జీ ਗੁਰੂ ਅਮਰ ਦਾਸ | |
---|---|
జననం | 5 May 1479 |
మరణం | 1 September 1574 | (aged 95)
ఇతర పేర్లు | మూడవ గురువు |
క్రియాశీల సంవత్సరాలు | 1552–1574 |
సుపరిచితుడు/ సుపరిచితురాలు |
|
అంతకు ముందు వారు | గురు అంగద్ |
తరువాతివారు | గురు రాందాస్ |
జీవిత భాగస్వామి | మాతా మానసా దేవి |
పిల్లలు | భాయ్ మోహన్, భాయ్ మోహ్రీ, బీబీ దాని, బీబీ భానీ |
తల్లిదండ్రులు | తేజ్ భాన్ & మాతా లచ్మీ |
సిక్ఖు గురువు కావడానికి ముందు భాయ్ అమర్ దాస్ చాలా మతాభిమానం కలిగిన వైష్ణవ హిందువు అని తెలుస్తోంది. ఆయన జీవితాన్ని హిందూ భక్తునిగా అన్ని మతపరమైన యాత్రలు చేస్తూ, ఉపవాసాలు ఆచరిస్తూ యమనియమాలతో గడిపారు. సిక్ఖుల రెండవ గురువు గురు అంగద్ దేవ్ కుమార్తె బీబీ అమ్రో కొన్ని గురునానక్ గీతాలు ఆలపిస్తూండగా విన్నారు. ఆ బీబీ అమ్రో భాయ్ సాహెబ్ అమర్ దాస్ తమ్ముని (భాయ్ మానక్ చంద్) కుమారుడైన భాయ్ జస్సో భార్య. శబద్లు అని పిలిచే వీటిని విని చాలా కదిలిపోయిన అమర్ దాస్ వెంటనే బయలుదేరి ఖదూర్ సాహిబ్ వెళ్ళి గురు అంగద్ను కలిశారు. ఈ సంఘటన జరిగేనాటికి భాయ్ సాహిబ్ వయసు 61 సంవత్సరాలు.
1635లో గురు అంగద్ ను కలిశాకా భాయ్ సాహిబ్ గురు నానక్ సందేశాన్ని అందుకుని సిక్ఖుగా మారారు. క్రమంగా ఆయన సముదాయానికి, గురువులకు సేవ చేయసాగారు. గురు అంగద్ ప్రభావంతోనూ, గురువుల బోధలతోనూ భాయ్ అమర్ దాస్ కు సిక్ఖు బోధలపై విశ్వాసం స్థిరపడింది. గురు అంగద్ ను తన ఆధ్యాత్మిక గురువుగా స్వీకరించారు. గురు అమర్ దాస్ ఆపైన ఖదూర్ సాహిబ్ లోనే నివసించసాగారు. ఉదయాన్నే లేచి బియాస్ నది నుంచి గురువు స్నానానికి నీరు తీసుకురావడంతో ఆయన రోజు ప్రారంభమయ్యేది. ఆపైన గురువు వస్త్రాలు ఉతకడం, ఆయన గురు కా లాంగర్ చేసేందుకు అవసరమైన కట్టెలు అడవి నుంచి తెచ్చియ్యడం వంటి సేవలు చేసేవారు. తన స్వంతాన్ని అంతా వదులుకుని పూర్తిగా సేవకు, గురువుకు అంకితమయ్యారు. జీవితం మీద వేరే ఏ ఇతర ఆసక్తులు లేని ముసలాయనగా ఆయనను లెక్కించేవారు.
ఏదేమైనా భాయ్ సాహిబ్ సిక్ఖు సిద్ధాంతాలకు నిబద్ధుడై సేవకు, సిక్ఖు ఉద్యమానికి అంకితం కావడంతో గురు అంగద్ సాహిబ్ మూడవ నానక్ గా గురు అమర్ దాస్ ను మార్చి 1552లో 73వ యేట నియమించారు. కొత్తగా గోయింద్వాల్ అన్న పట్టణాన్ని స్థాపించి, ఆ కొత్తగా నిర్మితమైన పట్టణాన్నే తన ప్రధాన కేంద్రంగా ఏర్పరిచారు.
కొత్త గురువును చూసేందుకు పెద్ద ఎత్తును సిక్ఖులు గోయింద్వాల్ కు చేరుకోవడం ప్రారంభించారు. ఇక్కడ గురు అమర్ దాస్ సిక్ఖు విశ్వాసాన్ని తీవ్రంగా, పద్ధతిగా, ప్రణాళిక ప్రకారం విస్తరించడం ప్రారంభించారు. సిక్ఖు సంగత్ ప్రాంతాన్ని 22 బోధనా కేంద్రాలు లేదా మంజీలుగా విభజించి ఒక్కో ప్రాంతానికి ఒక్కొక్క మతానికి అంకితమైన సిక్ఖును కార్యకలాపాల నిర్వహణ నేతృత్వం వహించడానికి నియమించారు. తనంత తానుగా భారతదేశ వ్యాప్తంగా పర్యటించి, ఆపైన సిక్ఖు మత ప్రచారకుల్ని దేశంలోని వివిధ భాగాల్లో సిక్ఖు మతాన్ని విస్తరించేందుకు పంపారు.
గురు అమర్ దాస్ భాయ్ గుర్ దాస్ హిందీ, సంస్కృతం భాషల్లోనూ, హిందూ మత గ్రంథాల్లోనూ ఉన్న విస్తృత విజ్ఞానానికి అభిమానం పెంచుకున్నారు. దేశంలోని అన్ని ప్రాంతాలకు మసంద్ లను పంపే సంప్రదాయాన్ని అనుసరించి భాయ్ గుర్ దాస్ ను సిక్ఖు సిద్ధాంతాలను వ్యాప్తిచేయమని ఆగ్రాకు పంపారు. ఆయన ఆగ్రాకు బయలుదేరే ముందు సిక్ఖుల కోసం పాంటిచాల్సిన నిత్య కృత్యాలను గురు అమర్ దాస్ ఇలా చెప్పారు:
“ | నిజమైన గురువుకు సిక్ఖునని చెప్పుకునే వారు ఉదయాన్నే లేచి ప్రార్థనలు చేయాలి. ఉదయం త్వరగా లేచి, పవిత్రమైన తటాకంలో స్నానం చేయాలి. గురువు సూచించిన దాని ప్రకారం దేవుని ధ్యానించాలి. తద్వారా పాపాలు, చెడుల బాధలను వదిలించుకోవాలి. రోజు ప్రారంభమవుతూండగా పవిత్ర గ్రంథాలను మననం చేస్తూ, చేసే ప్రతి పనిలోనూ దేవుని నామం తలుస్తూండాలి. గురువు కరుణ వల్ల మార్గం దర్శించవచ్చు. నానక్! తాను దేవుని స్మృతిలో ఉంటూ, ఇతరులను ఉండేలా చేసే సిక్ఖు పాద ధూళిని ఆశిస్తున్నాను. (గౌరీ) | ” |
గురు కా లాంగర్ అన్న సంప్రదాయాన్ని గురు అమర్ దాస్ చాలా బలపరిచారు, గురువును దర్శించవచ్చే ప్రతీ సందర్శకుడూ ముందు పెహ్లే పంగత్ ఫిర్ సంగత్ (మొదట లాంగర్ ని దర్శించు తర్వాతే గురువు వద్దకు వెళ్ళు) అన్న మాట పలికి తినేలా నియమించారు. ఒకసారి అక్బర్ పాదుషా గురు సాహిబ్ ను సందర్శించేందుకు వచ్చారు, ఐతే ఆయనను కూడా లాంగర్ లో అన్నం స్వీకరించేలా చేశారు, ఆపైనే గురు సాహిబ్ మాట్లాడారు. దాంతో ఈ పద్ధతులకు విపరీతంగా ఆకర్షితుడయిన అక్బర్ ఈ ఏర్పాట్లకు కొంత భూమిని కేటాయిస్తానని అన్నారు, కానీ గురువు గౌరవప్రదంగా తిరస్కరించారు.
జనన, వివాహ, మరణ సందర్భాల్లో చేసే శుభాశుభ కార్యకలపాలకు కొత్త విధానాలు ప్రారంభించారు. స్త్రీల సాంఘిక స్థితిగతులను మెరుగుపరిచి, ఏ హక్కూ లేదని భావిస్తూ చంపబడే స్త్రీ శిశువులకు జీవించే హక్కును ఇచ్చారు. తీవ్ర సంప్రదాయ వాదుల నుంచి ఈ బోధలకు గట్టి వ్యతిరేకత వచ్చింది. ఆయన సిక్ఖులు వేడుకగా జరుపుకునేందుకు మూడు పండుగలను నిర్ణయించారు, అవి: దీపావళి, వైశాఖి, మాఘి.
గురు అమర్ దాస్ కేవలం కులపరమైన సమానత్వాన్నే కాక స్త్రీ పురుష సమానత్వమనే ఆలోచనను కూడా గట్టిగా రూపొందించారు. భర్త మరణించాకా అతనితో పాటుగా ఆయన భార్య మంటల్లో సజీవ దహనం కావడమనే సాంఘిక దురాచారం సతిని ఆయన తీవ్రంగా వ్యతిరేకించారు. చిన్నతనంలో భర్త చనిపోయిన విధవలు జీవితాంతం పునర్వివాహం లేకుండా ఉండిపోవడమన్న ఆలోచనను కూడా ఆయన ఆమోదించలేదు.
సిక్ఖు మత చరిత్రలో మొట్టమొదటి పుణ్యక్షేత్రాన్ని గురు అమర్ దాస్ గోయింద్వాల్ సాహిబ్ వద్ద బోలీ అన్న పేరుతో 84 మెట్లతో నిర్మించారు. గురు నానక్, గురు అంగద్ లు చేసిన కీర్తనలు మరిన్ని కాపీలుగా రాయించి ప్రచురించారు. ఆయన కూడా 869 (కొన్ని కథనాల ప్రకారం 709) కృతులు రాశారు. ఆ తర్వత గురు అర్జున్ వీటన్నిటినీ గురు గ్రంథ్ సాహిబ్ లో చేర్చారు.
గురు అమర్ దాస్ కుమార్తె బీబీ భాని వివాహ సమయం ఆసన్నమైనప్పుడు ఆయన లాహోర్ కు చెందిన వ్యక్తి, ఆరాధనా భావం, శ్రద్ధ కలిగిన యువ సిక్కు అయిన జాతాను ఎంపిక చేసుకున్నారు. జేతా ఒకసారి గురు అమర్ దాస్ ని కలుసుకోవడానికి తీర్థయాత్రికులతో కలిసి లాహోర్ నుంచి వచ్చి గురువు బోధనలకు ఎంతగానో ఆకర్షితులై గోయింద్వాల్ ప్రాంతంలో స్థిరపడ్డారు. గోధుమలు అమ్మి జీవనం సాగిస్తూ, గురు అమర్ దాస్ ఖాళీ సమయాన్ని గురు అమర్ దాస్ సేవల్లో వెచ్చించేవారు.
గురు అమర్ దాస్ తన కొడుకుల్లో ఎవరూ గురువు పదవికి సరైనవారని భావించలేదు. అందుకు బదులు తన అల్లుడు రాందాస్ ని వారసునిగా ఎంచుకున్నారు. గురు అమర్ దాస్ సాహిబ్ 95 సంవత్సరాల వయసులో 1 సెప్టెంబరు 1574న అమృత్ సర్ జిల్లాలోని గోయింద్వాల్ గ్రామంలో తన బాధ్యతలు నాలుగవ నానక్ గురు రాందాస్కు అప్పగించి మరణించారు.
మూలాలు
మార్చు- ↑ Duggal, Kartar Singh (1988). Philosophy and Faith of Sikhism. Himalayan Institute Press. p. 15. ISBN 0-89389-109-6.
- ↑ Brar, Sandeep Singh (1998). "The Sikhism Homepage: Guru Amar Das". Archived from the original on 2006-05-04. Retrieved 2006-05-26.