గుల్బర్గా కోట
'గుల్బర్గా కోట' ఉత్తరకర్ణాటకలోని ఒక జిల్లా కేంద్రమైన గుల్బర్గాలో ఉంది. ఈ గుల్బర్గా సా.శ 1347 నుండి 1424 మధ్యకాలంలో బాహమనీ రాజ్యానికి రాజధాని. ఈ కాలానికి ముందే ఇక్కడ ఈ కోటను తెలంగాణరాష్ట్రంలోని ఓరుగల్లు కాకతీయులకు చెందిన రాజా గుల్‌చంద్ నిర్మించాడు[1]. ఆ తరువాత భాహమనీ సుల్తాన్‌ల పరమైన పిదప ఈ కోట విస్తరించబడి, పటిష్ఠపరుచబడింది. బాహమనీ సుల్తాన్ అల్లావుద్దీన్ బహమన్ షా 74 ఎకరాల్లో ఈ కోటను విస్తరింపచేసాడు. కోటలో మసీదులు, అంతఃపుర భవనాలు, గుమ్మటాలు లాంటి అనేక నిర్మాణాలు ఉన్నాయి. ఇవన్నీ ఇండో-ఫర్షియన్ శైలిలో నిర్మించారని ప్రొఫెసర్ దేశాయ్ అభిప్రాయపడ్డారు. వాటిలో జామై మసీదు, బలా హిస్సార్ తప్ప మిగిలినవి చాలా మటుకు నేడు శిథిలమైపోయాయి. కోటలో కొందరు పుర ప్రజలు నేడు ఆవాసాలు ఏర్పాటుచేసుకొని జీవిస్తున్నారు.
కోట నిర్మాణం
మార్చుఈ కోట మూడు కిలోమీటర్ల చుట్టు కొలత కలిగి ఉంది. చుట్టూ రెండు గోడలు ఉన్నాయి. వెలుపలి గోడ ఎత్తు తక్కువగానూ, లోపలి గోడ ఎత్తు చాలా ఎక్కువగానూ ఉంది. కోట చుట్టూ 30 అడుగుల లోతైన కందకం ఏర్పాటుచేయబడింది. ఒకటి తూర్పువైపు, మరొకటి పశ్చిమం వైపుగా కోటకు రెండు ద్వారాలు ఉన్నాయి. ఈ రెండు ద్వారాల ద్వారా కోటలోకి ప్రవేశించడానికి కందకంపై వంతెనలు ఉన్నాయి. రెండు ద్వారాలు కూడా ఇరుకైన మార్గాలే. కోటలో అత్యంత ఆకర్షణీయమైన నిర్మాణంతో కూడిన అతిపెద్ద జామై మసీద్ ఉంది. కోట ప్రవేశ ద్వారానికి దగ్గరలోని అతిపెద్ద బురుజును తలపించే బాలా హిస్సార్ అను నిర్మాణం ఉంది. కోటగోడలో 15 బురుజులు, వాటిపై 26 ఫిరంగులు ఉన్నాయి. ఈ కోటలో ప్రతి 8 మీటర్లకు ఒక ఫిరంగిని ఏర్పాటు చేశారు. మసీదుకు దగ్గరలో ఉన్న ఎత్తైన బురుజుపై 29 అడుగుల పొడువున్న ఫిరంగి ఒకటి ఉంది. వలయాకారంలో ఫిరంగిని అన్ని వైపులకు తిప్పగలిగే వీలుగా బురుజు పైభాగం ఉంది. అలాగే ఫిరంగిని అతి సులువుగా అన్ని వైపులకు తిప్పగలిగేలా ఫిరంగికి అడుగు భాగంలో ఉక్కు పీఠం ఏర్పాటు చేశారు. అది ఇప్పటికీ చెక్కుచెదరలేదు. అనేక కోటల మీద ఫిరంగులు కనిపించడం మామూలే అయినా ఫిరంగి పీఠాలు కనిపించడం మాత్రం బహు అరుదు. అది ఇక్క్కడ చూడవచ్చు.
జామై మస్జీద్
మార్చుసా.శ1367లో ఫర్షియన్ నిర్మాణ శైలిలో జామై మస్జీద్ నిర్మించారు. భారతదేశంలో ఏ మస్జీద్‌ను పోలని విధంగా, మస్జీద్‌లో స్తంభాలు, పైన గుమ్మటాలతో అత్యంత ఆకర్షణీయంగా నిర్మించారు. గుల్బర్గాలో బహమనీ రాజ్యస్థాపనకు ప్రతీకగా ఈ మసీదును నిర్మించినట్లు తెలుస్తుంది. దక్షిణాదిలో నిర్మించబడిన అతిపెద్ద తొలినాటి మజీదులలో ఇది ఒకటి. ఈ మసీదును క్వాజవిన్ మన్సూర్ మనుమడైన రఫి 1367లో నిర్మిచాడని అంటారు. మరికొందరు ఫిరొజ్ షా నిర్మిఛాడంటారు. ఈ మసీదు కోట మధ్యలో నిర్మించారు. ఒకప్పుడు ఈ మసీదు చుట్టూ పాలనాపరమైన భవనాలు ఉండేవని తెలుస్తుంది. ఈ మసీదు 216 అడుగుల పొడువు (తూర్పు-పడమర దిశలో), 176 అడుగుల వెడల్పులో (ఉత్తర-దక్షిణ) విస్తరించి ఉంది. 5000 మంది వసతికి వీలుగా దీనిని నిర్మింఛారు. ఈ మసీదు నిర్మాణంలో 140 స్తంభాలు, 250 అర్చీలు, 5 పొడవైన గుమ్మటాలు, 63 చిన్న గుమ్మటాలు ఉన్నాయి.
బాలా హిస్సార్
మార్చుబాలహిస్సార్ను రణమండలం అని కూడా అంటారు. ఇది అతి పెద్ద బురుజును పోలి ఉంది. ఇది దుర్భేధ్యమైన కోటలాంటి నిర్మాణం. కోటకు ఉత్తరం వైపు ఉంటుంది. బజారు వీధికి వెళ్ళే ప్రవేశద్వారానికి ఎదురుగా అతి సమీపంలో ఈ నిర్మాణం కనిపిస్తుంది. మొదట్లో ఈ నిర్మాణం సభా ప్రాంగణం. తరువాత కోట రక్షణార్థం ఉపయోగించినట్లు తెలుస్తుంది. చాలా ఎత్తుగా ఉండే ఈ కట్టడంపై మూడు ఫిరంగులను ఏర్పాటు చేశారు. ప్రవేశద్వారం గుండా లోపలికి శత్రువులు అడుగుపెడితే మూకుమ్మడి దాడికి వీలుగా ఈ నిర్మాణం, దీనిపై ఫిరంగులను ఏర్పాటు చేశారు. ఇప్పటికీ ఫిరంగులు అలాగే ఉన్నాయి. ఈ ఫిరంగులు అన్ని వైపుల తిప్పగలిగేలా వర్తులాకార వలయాలు ఏర్పాటు చేసి ఉంచారు.
చిత్రమాలిక
మార్చు-
బాలహిస్సార్
-
ఫిరంగి
-
కోటలో ఒక దృశ్యం
-
కోట గోడలు
-
జామై మస్జీద్ లోపలి దృశ్యం