గోడే నారాయణ గజపతిరావు

సర్ గోడే నారాయణ గజపతిరావు కెసిఐఇ (1828 డిసెంబరు 1 -1903 మే) 1868 నుండి 1884 వరకు మద్రాసు లెజిస్లేటివ్ కౌన్సిల్ సభ్యుడిగా పనిచేసిన భారతీయ కులీన వంశీకుడు, రాజకీయవేత్త.[1]

జీవితం

మార్చు

మహారాజా సర్ గోడే నారాయణ గజపతిరావు, ప్రాచీన గోడే కుటుంబానికి చెందిన ప్రత్యక్ష పురుష సంతతి. ఆయన 1828 డిసెంబరు 1 న జన్మించాడు. ఆయన పరవస్తు శ్రీనివాసచార్యుల వద్ద ఇంట్లోనే విద్యను అభ్యసించారు. పదమూడు సంవత్సరాల వయస్సులో తదుపరి విద్య కోసం 1841 జనవరిలో కలకత్తా వెళ్ళాడు. కలకత్తాలో తొమ్మిదేళ్ల పాటు గడిపిన తరువాత గోడే నారాయణ గజపతిరావు 1849 ఏప్రిల్లో విశాఖపట్నానికి తిరిగి వచ్చి, వారి సంస్థానపు రెవెన్యూ వ్యవహారాల నిర్వహణలో తన సోదరుడికి తోడుగా చేరాడు. విశాఖపట్నంలో హిందూ కళాశాల స్థాపనలో ఆయన కీలక పాత్ర పోషించాడు.

1875 కరువు సమయంలో సర్ గోడే నారాయణ గజపతిరావు తన సంస్థానంలో సహాయక గృహాలను ప్రారంభించి, అక్కడ పేదలు, నిరాశ్రయులకు రోజువారీ ఆహారం అందించేవారు. ఈయన మద్రాసు విశ్వవిద్యాలయం సంస్కృత బహుమతిని స్థాపించాడు. దీనిని 'గోడేవారి సంస్కృత పురస్కారం' అని పిలుస్తారు.

ఈయన జీవితంలో రెండు అత్యంత బాధాకరమైన సంఘటనలు జరిగాయి. మొదటిది ఈయన పెద్ద కుమార్తె వాధ్వాన్ రాణి సాహిబా అనూహ్యంగా, అకాల వితంతువు అవడం. రెండవది ఈయన చిన్న కుమార్తె కురుపాం రాణి అకాల మరణం చెందడం. ఈ సంఘటనల తరువాత మహారాజుగా తన విధులను సాధారణ శక్తితోగానీ ఆసక్తితోగానీ నిర్వర్తించలేకపోయాడు. మహారాజా సర్ గోడే నారాయణ గజపతిరావు 1903 మే నెలలో మరణించాడు.

కుటుంబం

మార్చు

గోడే కుటుంబం ఉత్తరాంధ్రలో అత్యంత ప్రభావవంతమైన ప్రాచీన కుటుంబాలలో ఒకటిగా ప్రసిద్ధి చెందింది. ఈ కుటుంబానికి చెందిన గోడే అక్కమ్మ, గోడే భూపతి, గోడే పెద్ద సూర్యరావు, గోడే చిన్న సూర్యరావు వారివారి కాలాల్లో ప్రముఖులుగా వెలుగొందారు. 

నిజాం ప్రభుత్వం గోడే భూపతి సేవలకు గుర్తింపుగా పెద్ద మొత్తంలో ఆయనకు భూమిని మంజూరు చేసింది. ఈయన శివకేశవులకు దేవాలయాలను నిర్మించాడు. ఈయన వారసుడు, గోడేపెద్ద సూర్యరావు, యుద్ధభూమిలో చేసిన సేవకు గాను నిజాం నుండి బహుమతిగా ఒక కత్తిని అందుకున్నాడు. 17వ శతాబ్దంలో బ్రిటిషు వారు సర్కారు ప్రాంతాలపై వాస్తవాధికారాన్ని స్వాధీనం చేసుకున్నారు.

ఈస్టిండియా కంపెనీ చీఫ్ ఇన్ సర్వీస్ అయిన ఆండ్రూస్ అత్యవసర పరిస్థితుల్లో సహాయం చేసిన గోడే జగ్గారావుకు అప్పు పడ్డాడు. ఈస్టిండియా కంపెనీ ఆయనకు 'షైబాన్ పాల్కీ', ఒక గొడుగు, ఇతర రాజరిక చిహ్నాలను అందజేసింది. గోడే జగ్గారావు సనాతన హిందువు, తెలుగు సాహిత్య అభిమాని, పోషకుడు. ఆయన 'సప్త సంతాన' అనే ఏడు శాశ్వత మంచి కర్మలను అభ్యసించేవాడు. ఈయన కాశీలో ఒక సత్రాన్ని కూడా స్థాపించాడు. ఆయన 1805 లో మరణించాడు. ఈయనకు సూర్యప్రకాశరావు, సూర్యనారాయణరావు అనే ఇద్దరు కుమారులు, సుభద్రాయమ్మ, బంగారమ్మ, లక్ష్మీనరసమ్మ అనే ముగ్గురు కుమార్తెలు ఉన్నారు. స్త్రీ విద్య లేని రోజుల్లో ఈయన తన కుమార్తెలకు మంచి విద్యను అందించాడు. ఆయన కుమార్తె సుభద్రాయమ్మ (మదిన కుటుంబంలో వివాహం చేసుకొని, మదిన సుభద్రయమ్మ అని మారింది) తెలుగు కవిత్వంపై గొప్ప ఆసక్తిని కనబరిచి, కవయిత్రిగా ఖ్యాతి సంపాదించింది.

గొడే సూర్యప్రకాశరావు అత్యంత నిష్ణాత పండితుడు. అనకాపల్లిలో ఆయనకు ఒక పెద్ద ఉద్యానవనం ఉండేది. 1841 లో ఈయన మరణించిన తరువాత, ఈయన విస్తృతమైన భూములు ఈయన వితంతువు గొడే జానకమ్మకు, ఆమె తరువాత, ఆమె చిన్న కుమార్తెకూ బదిలీ అయ్యాయి. ఆమె మరణం తరువాత, ఆమె పినతండ్రి కుమారుడు మహారాజా సర్ గోడే నారాయణ గజపతిరావు వారసుడు అయ్యాడు.

గోడే సూర్యనారాయణరావుకు వెంకట జగ్గారావు, నారాయణ గజపతిరావు అనే ఇద్దరు కుమారులు ఉన్నారు. ఆయన తన పెద్ద కుమారుడు వెంకట జగ్గారావును మద్రాసుకు, చిన్న కుమారుడు నారాయణ గజపతిరావును చదువుల కోసం కలకత్తాకు పంపాడు. ఆ రోజుల్లో రైళ్లు లేదా సురక్షితమైన రోడ్లు లేనందున ఈ ప్రదేశాలకు ప్రయాణం చాలా కష్టంగా ఉండేది. అయినప్పటికీ ఈ యువకులు సరైన సంరక్షకుల ఆధ్వర్యంలో తమ గమ్యస్థానాలకు ప్రయాణించారు.

బయటి లింకులు

మార్చు
  • Vadivelu, A. (24 August 2016). The Aristocracy of Southern India. pp. 1–36. Retrieved 17 June 2019.

మూలాలు

మార్చు
  1. K. C. Markandan (1964). Madras Legislative Council; Its constitution and working between 1861 and 1909. S. Chand & CO. pp. 148–188.