గోపగారి రాములు
గోపగారి రాములు, (1926, జూన్ 6 - 2000, అక్టోబరు 25) తెలంగాణకు చెందిన కథా రచయిత, కవి, అనువాదకుడు. ఉమ్మడి కరీంనగర్ జిల్లా తొలి కథా రచయితగా నిలిచాడు.[1] ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం కోసం జరిగిన తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్నాడు.
గోపగారి రాములు | |
---|---|
జననం | గోపగారి రాములు 1926, జూన్ 6 |
మరణం | 2000, అక్టోబరు 25 |
వృత్తి | తెలుగు ఉపాధ్యాయుడు |
సుపరిచితుడు/ సుపరిచితురాలు | కథా రచయిత, కవి, అనువాదకుడు |
జీవిత విశేషాలు
మార్చురాములు 1926 జూన్ 6న తెలంగాణ రాష్ట్రం, రాజన్న సిరిసిల్ల జిల్లా, సిరిసిల్ల పట్టణంలోని మధ్యతరగతి చేనేత కుటుంబంలో జన్మించాడు. విద్యార్థి దశలోనే అభ్యుదయ భావాలకు ఆకర్షితుడై, ఆర్య సమాజ కార్యకర్తగా వివిధ ఉద్యమాల్లో పాల్గొన్నాడు. స్కూలు విద్యను పూర్తిచేసి తెలుగు ఉపాధ్యాయుడిగా పనిచేశాడు. ఆ సమయంలోనే జ్ఞానపీఠ పురస్కార గ్రహీత డా. సి. నారాయణరెడ్డికి లెక్కలు బోధించేందుకు నియమించబడ్డాడు. పద్యం పట్ల ఆకర్షితుడైన రాములు పద్యరచన చేసి గోలుకొండ పత్రికలో ప్రచురించాడు.[1]
రచనారంగం
మార్చుతంబాకుకు ఆకర్షితులై అనారోగ్యాలకు గురైన వారిని చూసి స్పందించి 1945లో ‘బ్రహ్మపత్ర భక్త సమాజం’ అనే కథను రాశాడు. 1946, ఆగస్టు సంచికలో షోలాపూరు నుండి వెలువడ్డ ‘పద్మశాలి’ మాస పత్రికలో ఈ కథ ప్రచురితమైంది. మద్య మాంసాలకు పూర్తిగా దూరంగా ఉన్న రాములు బంధువర్గంతో అవమానాలనూ, ఇబ్బందులను ఎదుర్కొని అవన్నీ ప్రతిబింబించేలా 1943లో ‘ఆత్మఘోష’ అనే కథను రాశాడు. సినారె, దాశరథి నేతృత్త్వంలోన ఆనాటి తెలంగాణ రచయితల సంఘం (సిరిసిల్ల) నుండి చెందా నారాయణ శ్రేష్ఠిగారి బాలా త్రిపుర సుందరి ముద్రాక్షరశాలలో 1945లో అచ్చువేయబడింది. ఈ పుస్తకంపై గోల్కొండ పత్రికలో సమీక్ష కూడా వచ్చింది. ప్రజల్లో ఉన్న మూఢనమ్మకాలను ఇతివృత్తంగా తీసుకొని సినిమా నేపథ్యంలో 1952లో ‘పిచ్చి శాయన్న’ అనే నవల రాశాడు. గౌడుల సాధక బాధకాలు, సమస్యలు, కల్తీకల్లు, అబ్కారీ అధికారులతో ఇబ్బందుల నేపథ్యంలో ‘గీసే వాడిదే చెట్టు’ అన్న నినాదంతో 1954లో ‘పెరటి చెట్టు’ రాశాడు.[1]
రచనలు
మార్చు- బ్రహ్మపత్ర భక్త సమాజం (కథ, 1945)
- ఆత్మఘోష (కథ, 1943)
- పిచ్చి శాయన్న (నవల, 1952)
- పెరటి చెట్టు (నవల, 1954)
- గాంధీ సూక్తులు (అనువాదం, 1948)
- శాంతిపథం (గేయ నాటికలు, 1960)
- బాల నీతి (అర్థ శతకం, 1973)
- మురికి బాటలు (‘గందే రాహ్’ అనే హిందీ నవల అనువాదం)[2]
గుర్తింపు
మార్చు- 1990 నుంచి మరణించే వరకు మానేరు రచయితల సంఘానికి గౌరవ అధ్యక్షుడు
- ఉమ్మడి కరీంనగర్ జిల్లా తొలి కథా రచయిత (డా. మలయశ్రీ సిద్ధాంత గ్రంథంలో నిరూపణ)
- ‘తెలంగాణ నవలా వైతాళికుడు’ బిరుదు (రాములు సాహితీ జీవిత షష్టిపూర్తి 1940-2000 సందర్భంగా మానేరు రచయితల సంఘం సత్కారం)
మూలాలు
మార్చు- ↑ 1.0 1.1 1.2 పత్తిపాక, మోహన్ (2017-05-22). "చరిత్రకెక్కని కథల 'పెరటి చెట్టు' జి. రాములు". www.andhrajyothy.com. Archived from the original on 2022-05-23. Retrieved 2022-05-23.
- ↑ చరిత్రకెక్కని కథల ‘పెరటి చెట్టు’ జి. రాములు, 2017 మే 22, పత్తిపాక మోహన్, తెలంగాణ ఎడిషన్, వివిధ-పుట 4.