పరవస్తు చిన్నయ సూరి
పరవస్తు చిన్నయ సూరి (1809-1861) తెలుగు రచయిత, పండితుడు. ఆయన రచించిన బాలవ్యాకరణం, నీతిచంద్రిక చాలా ప్రసిద్ధి గాంచాయి. పద్యమునకు నన్నయ, గద్యమునకు చిన్నయ అనే లోకోక్తి ఉంది. ఆయన భాషా సేవ వెనుక బ్రౌను దొర, గాజుల లక్ష్మీనరసింహశ్రేష్టి, జస్టిస్ రంగనాథశాస్త్రి, కుమారస్వామిశాస్త్రి వంటి ప్రముఖుల ప్రోత్సాహం ఉన్నాయి. మొట్టమొదటగా సూరిని గ్రంథ రచనోద్యమమునకు పురికొల్పినవాడు లక్ష్మీనృసింహము శ్రేష్ఠి. ఆంధ్రశబ్దశాసనము, ఆంధ్రనిఘంటువు, ఆయన ప్రోద్భలంతోనే సూరి వ్రాయనారంభించెను. కాని యవి రెండూ పూర్తి కాలేదు. చిన్నయకు పేరుపొందిన శిష్యులెందరో కలరు. శబ్దరత్నాకర కర్త, ప్రౌఢవ్యాకర్తయైన బహుజనపల్లి సీతారామాచార్యులు, ఆంధ్ర విశ్వగుణాదర్శకర్త పంచాంగము తేవప్పెరుమాళ్ళయ్య ఆయన శిష్యులే. మద్రాసు పచ్చయప్ప కళాశాలలో తెలుగు పండితుడిగా పనిచేశాడు.
పరవస్తు చిన్నయసూరి | |
---|---|
జననం | చిన్నయ 20 డిసెంబర్ 1809 (ప్రభవ నామ సంవత్సరం) పెరంబుదూరు, చెంగల్పట్టు జిల్లా, మదరాసు రాష్ట్రం |
మరణం | 1861 |
తల్లిదండ్రులు |
|
బాల్యం
మార్చుచిన్నయ సూరి తమిళనాడులోని చెంగల్‌పట్టు జిల్లాలోని పెరంబుదూరులో జన్మించాడు. వారిది సాతాని శ్రీవైష్ణవుల కుటుంబం. ఆయన తల్లిదండ్రులు శ్రీనివాసాంబ, వేంకటరంగయ్య. జన్మనామం చిన్నయ. చిన్నయ చాలా తరాలకు పూర్వం ఉత్తర ఆంధ్రప్రదేశ్ నుండి మద్రాసు వలసవెళ్ళిన వైష్ణవ కుటుంబములో జన్మించాడు. వీరి పూర్వీకులు పరవస్తు మఠం శిష్యులు. వీరు సాతాని కులానికి చెందినా బ్రాహ్మణ ఆచారవ్యవహారాలు పాటించేవారు. తాము ఆపస్తంబ సూత్రానికి, గార్గేయ గోత్రానికి చెందిన యజుశ్శాఖాధ్యాయులమని చెప్పుకున్నారు. చిన్నయ 1809 (ప్రభవ) లో జన్మించాడు. కానీ కొందరు పండితులు ఈయన 1806లో జన్మించాడని భావిస్తున్నారు.
చిన్నయ తండ్రి వెంకటరంగ రామానుజాచార్యులు తిరువల్లిక్కేని (ట్రిప్లికేన్) లోని రామానుజమఠంలో మతాధికారి. చిన్నయ తండ్రి సంస్కృత, ప్రాకృత, తెలుగు, తమిళాలలో మంచి పండితుడు. అక్కడే ఈయన్ను ప్రతివాదభయంకరం శ్రీనివాసాచార్యులనే వైష్ణవ పండితుడు చూసి రామానుజాచార్యుల జన్మస్థానమైన శ్రీపెరంబుదూరులోని ఆలయంలో వైష్ణవ తత్వాన్ని ప్రచారం చేసేందుకు ఆహ్వానించాడు. పండు ముదుసలి వయసు వరకు ద్రవిడవేదాన్ని పారాయణం చేస్తూ, మతాధికారిగా కార్యాలు నిర్వహిస్తూ ఇక్కడే నివసించాడు. ఈయన 1836లో నూటపదేళ్ళ వయసులో మరణించాడు.
(శ్రీ చిన్నయ సూరిగారు 1862 సం. మున నిర్యాణము జెందగా వారి శిష్యులైన శ్రీ బహుజనపల్లి సీతారామాచార్యులవారు, తమ గురువుగారు ప్రారంభించిన గొప్పనిఘంటు నిర్మాణపద్ధతి అసాధ్యమని తలంచి ఒకపాటివిధమున శబ్దరత్నాకరమను నిఘంటువును 1885 లో ప్రకటించిరి.[1])
వెంకటరంగ రామానుజాచార్యులుకు ఒక చిన్న వయసులోనే విధవరాలైన కూతురు, ఆమె కంటే చిన్నవాడైన చిన్నయ, ఇరువురు సంతానము. చిన్నయను గారాబంగా పెంచటం వలన 16 యేళ్ళ వయసు వరకు చదువుసంధ్యలను పట్టించుకోలేదు.
ఉద్యోగం, రచనా ప్రస్థానం
మార్చుచిన్నయ మద్రాసు ప్రభుత్వ (పచ్చాయప్ప) కళాశాలలో తెలుగు బోధకుడు. తను జీవితాంతం తెలుగు భాషాభ్యుదయానికి, తెలుగు సాహిత్యానికి పాటుబడ్డాడు. "పద్యమునకు నన్నయ, గద్యమునకు చిన్నయ" అనే లోకోక్తి ఉంది. అప్పటి విశ్వవిద్యాలయ కార్యదర్శి ఎ. జె. ఆర్బత్నాట్ కాశీ నుండి తర్కమీమాంస పండితులను రప్పించి, చిన్నయను పరీక్ష చేయించి, సమర్థుడని గుర్తించి, "చిన్నయసూరి" అనే అక్షరాలతో స్వర్ణకంకణాన్ని సీమ నుండి తెప్పించి బహుమతిగా ఇచ్చాడు.[2] సూరి అనగా పండితుడు అని అర్థం.
సూరి బిరుదు
మార్చుఈస్ట్ ఇండియా కంపెనీ పరిపాలనా కాలంలో కంపెనీ వారు మద్రాస్ లోని సెయింట్ జార్జి కోటలో ఏర్పరిచిన కళాశాలలో ఇంగ్లీషువారికి తెలుగు పాఠాలు నేర్పించడానికి ట్యూటర్ ఉద్యోగంలో ఒక తెలుగు పండితుడిని నియమించేవారు. ట్యూటర్ గా పుదూరి సీతారామశాస్త్రిగారు రిటైరు అయిన తరువాత ఆ తెలుగు ఉద్యోగానికి కేవలం తెలుగు చదివిన వారే కాకుండా కొంత ఇంగ్లీషు కూడా వచ్చిన వాళ్ళకోసం కళాశాల వారు 1847లో ఒక ప్రకటన చేశారు. దానికి చిన్నయ అర్జీ పెట్టుకున్నాడు. ఆ రోజుల్లో ఆ కళాశాలకు అధ్యక్షుడు ఎ.జె. అర్బత్‌నాట్. అర్జీ పెట్టుకున్న చిన్నయని ఒక పండిత సభవారు పరీక్షించాలి. ఆ పరీక్షలో నెగ్గినవాళ్లకే ఆ ఉద్యోగం వస్తుంది. ఆ ఉద్యోగానికి అర్జీలు పంపిన చిన్నయని, పురాణం హయగ్రీవశాస్త్రిని పండితులు పరీక్షించి ఆ ఇద్దరిలో చిన్నయే సమర్ధుడు అని పండిత సభ వారు నిర్ణయించారు. అప్పట్లో పండితులలో కులభేదాలు చాలా ఎక్కువగా ఉండేవి. అందులోను, బ్రాహ్మణ కులంలో పుట్టని చిన్నయ మీద చిన్నచూపు ఉండేది. వైదికులే కాక నియోగులై నప్పటికీ పండితులందరూ శాస్త్రి అనే బిరుదు పెట్టుకునేవారు. చిన్నయకి శాస్త్రి అనే బిరుదు ఎందుకు లేదు అని అర్బత్‌నాట్ అడిగాడట. తాను బ్రాహ్మణుడు కాకపోవడం చేత ఆ బిరుదుకి తను అర్హుణ్ణి కానని చిన్నయ అన్నాడట. అయితే ఏ బిరుదు పెట్టుకుంటావు అని అడిగితే సూరి అనే బిరుదైతే తనకి నప్పుతుంది అన్నాట్ట. అర్బత్‌నాట్ ఆ ప్రకారమే అప్పటి వారి ఆచారం ప్రకారం “సూరి” అనే అక్షరాలతో చెక్కిన బంగారపు కడియం ఒక్కటి ఇంగ్లండు నుంచి తెప్పించి చిన్నయకి బహుమతిగా ఇచ్చాడట. చిన్నయ అప్పటినుంచీ చిన్నయ సూరి అనే పేరుతో ప్రచారం లోకి వచ్చాడు.
రచనలు
మార్చు- అక్షర గుచ్ఛము
- ఆంధ్రకాదంబరి
- ఆంధ్రకౌముది
- ఆంధ్రధాతుమాల
- ఆంధ్రశబ్ద శాసనము
- అకారాది నిఘంటువు
- ఆదిపర్వవచనము - 1847
- ఇంగ్లీషు లా చట్టముల భాషాంతరీకరణము
- చాటు పద్యములు
- చింతామణివృత్తి - 1840
- పచ్చయప్ప నృపయశోమండనము - 1845
- పద్యాంధ్ర వ్యాకరణము - 1840
- బాల వ్యాకరణము - 1855
- బాలవ్యాకరణ శేషము
- నీతిచంద్రిక - 1853
- నీతిసంగ్రహము - 1855
- యాదవాభ్యుదయము
- విభక్తి బోధిని - 1859
- విశ్వ నిఘంటువు
- శబ్దలక్షణ సంగ్రహము - 1853
- సుజనరంజనీ పత్రిక
- సంస్కృత బాలబోధ
- సంస్కృత సూత్రాంధ్ర వ్యాకరణము - 1844
మూలాలు
మార్చు- ↑ " 9-ప్రకరణము". వేదము_వేంకటరాయ_శాస్త్రులవారి_జీవితచరిత్ర_సంగ్రహము. వికీసోర్స్.
- ↑ ఆంధ్ర రచయితలు - మధునాపంతుల సత్యనారాయణ శాస్త్రి, అద్దేపల్లి అండ్ కొ, రాజమహేంద్రవరం, 1950.
- శ్రీ పరవస్తు చిన్నయసూరి జీవితము - నిడుదవోలు వేంకటరావు, వావిళ్ల రామస్వామి శాస్త్రులు అండ్ సన్స్, చెన్నపురి, 1953.
- పరవస్తు చిన్నయసూరి - బూదరాజు రాధాకృష్ణ (ఆంగ్లములో) (1995) సాహిత్య ఆకాడెమీ.
- సమగ్ర ఆంధ్ర సాహిత్యం – ఆరుద్ర, 1990 ( పు:28-29 సం.10)
బయటి లింకులు
మార్చు- తెలుగువరల్డ్.ఆర్గ్
- పంచతంత్ర.ఆర్గ్
- 'చిన్నయ సూరి – గిడుగు రామమూర్తి' [1] వెల్చేరు నారాయణరావు, పరుచూరి శ్రీనివాస్ ఈమాట తెలుగు పత్రిక సెప్టెంబరు 2016