చెవుల నక్క (ఆంగ్లం: Fennec Fox, ఫెనెక్ ఫాక్స్) యొక్క శాస్త్రీయనామం "వల్పీస్ జెర్డా". ఇదొక చిన్న రాత్రించర నక్క జాతికి చెందిన జంతువు. ఈ నక్క ఎక్కువగా ఉత్తర ఆఫ్రికా ప్రాంతపు పెద్దఎడారి యైన సహారా ఎడారిసీనై ద్వీపకల్పం మఱియు నైఋత్య ఇజ్రాయిల్లోని అరవా ఎడారి ప్రదేశాలలో కనిపిస్తాయి. వీటియొక్క విశిష్టమైన శరీరావయవాలు, చెవులు. అవి అంత పెద్దగావుండటానికి కారణం వీటి శరీర ఉష్ణోగ్రతను నియంత్రించడానికే. ఈ నక్క యొక్క ఆంగ్లనామం  బెర్బర్ భాషాపదమైన "ఫనాక్" (అనగా నక్క) మఱియు వీటి జాతినామమైన "జెర్డా"అనేది యవన భాషాపదమైన "క్సెరాస్" (అనగా పొడి లేదా తేమలేని) నుండి వచ్చాయి. కుక్కలునక్కలు మఱియు తోడేళ్ల కుటుంబమైన కానిడేకు చెందిన సభ్యులలో శరీర పరిమాణం అతిచిన్నదిగావున్నది ఈ చెవుల నక్కకే. దీని చర్మం, చెవులు మఱియు మూత్రపిండాలు ఉష్ణోగ్రతలు ఎక్కువ, నీరు తక్కువ గల ఎడారి వాతావరణానికి బాగా అలవాటుపడినవి. దీని చెవులు కూడా చిన్నచిన్న ప్రాణులైన పురుగులు, కుందేళ్లు మొదలైనవాటి కదలికలను వినేటంత సున్నితమైన నిశితశక్తిగలిగి ఉంటుంది.

చెవులనక్క జీవితకాలం పెంపకంలో పదునాలుగేళ్లు. దీని ముఖ్యమైన శత్రువులు గద్దలు, గుడ్లగూబలు మఱియు ఇతర పెద్ద నక్కలు. చెవులనక్క కుటుంబాలు కలిసి ఒకచోటనే పెద్దపెద్ద బొరియలను తవ్వుకొని వాటియందు రక్షణకొఱకు మఱియు సంతానంకొఱకు నివసిస్తాయి. వీటి సరియైన సంఖ్య ఎడారులలో ఎంతవుందో చెప్పటం కష్టం కాని ఇవి, ఇప్పుడప్పుడే అంతరించిపోవడానికి మాత్రం ఏం అవకాశాలు లేవని చెప్పగలము. ఇవి గుంపులుగా ఉన్నప్పుడు చేసే చేష్టల గుఱించి, వీటి జీవనశైలి గుఱించి అంత కచ్చితంగా చెప్పలేము. జూలలో పెంపకంలోనున్న చెవులనక్కలనుబట్టి, వాటి ప్రవర్తనను అంచనా వేయవచ్చుగాని, అదే వాటి అసలైన ప్రవర్తనా అని చెప్పలేము. ఈ నక్కలు ఇతర నక్కల జాతులవలె "వల్పీస్"జన్యువుకు సంబంధించినవి. వీటి సున్నితమైన వెంట్రుకలు గల చర్మం ఆఫ్రికాలోని ఇవి సంచరించే ప్రదేశాలలోని ఆటవికులకు బాగా ఇష్టం. ఈ నక్కలు ప్రపంచవ్యాప్తంగా మొదటి పది ముద్దులోలికే పెంపుడు జంతువుల జాబితాలో స్థానం సంపాదించుకొని ప్రసిద్ధి చెందాయి.

వర్ణనసవరించు

చెవులనక్క అరకిలో నుండి ఒకటిన్నర కిలోల బరువుతో, 24 నుండి 41 సెం.మీ||ల పొడవు(అడ్డం)తో మఱియు ఎనిమిది అంగుళాల పొడవుతో(నిలువు) చూడటానికి ముద్దుగా ఉంటుంది.

దీని 18 నుండి 31 సెం.మీ||ల పొడవున్న తోక చివర నల్లటిరంగులో గుజ్జులాంటి జుట్టు ఉంటుంది, దీని చెవులు 10 నుండి 15 సెం.మీ||ల పొడవుంటాయి.

దీని చర్మం పాలమీగడ రంగులో ఉండి, పగలంతా సూర్యరశ్మిని విక్షేపించి, రాత్రివేళలలో నక్కకు వెచ్చదనాన్నిస్తుంది. ఈ నక్కలకు ఇతర నక్కలకన్నా పొడవాటి చెవులుంటాయి. ఆ చెవులలోనున్న రక్తనాళాలు దీని శరీర ఉష్ణోగ్రతను నియంత్రించడంలో తోడ్పడుతాయి. 

ఆ చెవులు భూమిలోపల దాక్కున్న ఆహారాన్ని కూడా వినడంలో నక్కకు సహాయం చేస్తాయి. వీటి అరికాళ్లలో ఉన్న బొచ్చు, ఎడారిలోని ఇసుకనుండి వేడి నక్కశరీరంలోకి ప్రవేశించకుండా రక్షిస్తుంది.

వర్గీకరణంసవరించు

 
జూలోనున్న ఒక చెవులనక్క

ఈ నక్కలు తొలిగా క్రొత్తజన్యువైన "ఫెనేఖస్"లోకి వర్గీకరించబడి, మరల వల్పీస్ జన్యువులోకి తరలించబడినవి. శాస్త్రవేత్తలు ఈ నక్కకు, సాధారణ నక్కలకు మధ్య జన్యుపరంగా ఎన్ని పోలికలున్నాయో, వీటి జీవనశైలి పరంగా అన్నే తేడాలు కూడా ఉన్నాయని భావించారు. అందువలన రెండు సంఘర్షణపూరితాలైన జన్యువులుగా వీటిని విభజించారు. మొదటిది- వల్పీస్ జెర్డా అనగా ఈ జన్యువు చెందిన చెవులనక్కలు నిజానికి సాధారణ నక్కలని. రెండవది- ఫెనేఖస్ జెర్డా అనగా ఈ జన్యువు చెందిన చెవులనక్కలు నిజమైన చెవుల నక్కలని తెలిపారు.

శారీరకంగా, ఆడ చెవులనక్కలకు ఇతర సాధారణ ఆడనక్కలకున్నట్లు కస్తూరి గ్రంథులను కలిగి ఉండదు. మఱియు చెవులనక్కలకు 32 వారసవాహికలనే కలిగి ఉంటాయి, అయితే సాధారణ నక్కలకు 35 నుండి 39 వారసవాహికలుంటాయి. పైగా చెవులనక్కలు సాధారణ నక్కలులాగ ఒంటరిగాకాక గుంపులుగా జీవిస్తాయి. అదొక అసాధారణమైన లక్షణం.

Arctic fox

Kit fox

Corsac fox

Rüppell's fox

Red fox

Cape fox

Blanford's fox

Fennec fox[1](Fig. 10)

Raccoon dog

Bat-eared fox

ప్రవర్తనసవరించు

సామాజిక ప్రవర్తనసవరించు

 
చెవులనక్కలు
 
చెవులనక్కల గుంపు- 1876నాటి రేఖాచిత్రం

పెంపకంలోనున్న చెవులనక్కలనుబట్టే వాటి సామాజిక ప్రవర్తనను నిర్ధారించడమైనది. ముఖ్యంగా వీటి గుంపులో ఒక చెవులనక్క జంట, వాటి పిల్లలూ ఉండగా, ముందు కాన్పులో పుట్టిన పిల్లలు కూడా రెండవ కాన్పులో పిల్లలు పుట్టేవరకు తల్లిదండ్రులతోనే ఉంటాయి. పిల్లలన్నీ కలిసి సరదాగా ఆడుకుంటాయి. చెవులనక్కలు సాధారణంగా రకరకాల శబ్దాలను చేస్తాయి. కుక్కలాగ మొఱగుతాయి, పిల్లులలాగ గుర్రుమంటాయి,  ఆపదవేళలలో కోఱలను చూపించి అరుస్తాయి. ఇవిగాక, సాధారణ నక్కలులాగ ఊళలు వేస్తాయి.

పెంపకాలలో ఇవి పెద్దగా గోల చేయకుండా ఎక్కువగా ఒకదానికొకటి దగ్గరగా తోకలను చుట్టుకుని పడుకుంటాయి. ఆడనక్కల ఉద్వేగకాలంలో(పిల్లలను కనగలిగే ఋతుకాలం), మగనక్కలు బాగా దూకుడుగా,

హడావుడిగా ప్రవర్తిస్తూ, మూత్రవిసర్జన చేస్తూ వాటిని అనుసరిస్తాయి.. పెంపకంలోనున్న చెవులనక్క గుంపులు మలవిసర్జన చేశాక దానిపైకి పాదాలతో, తోకతో ఇసుకను తోసి కప్పిపుచ్చుతాయి. 

ఆహారము మఱియు వేటసవరించు

 
చెవులనక్క పుర్రె

చెవులనక్క సర్వాహారి. కృంతకాలు, పురుగులు, పక్షులు, పక్షిగ్రుడ్లు మఱియు కుందేళ్లు  వీటి ప్రముఖ ఆహారము .ఈ నక్కలు నాలుగడుగులు ముందుకు దూకగలవు, మఱియు రెండడుగులు పైకి గెంతగలవు. కొన్ని ఆధారాల ప్రకారం చెవులనక్కలు ఎడారిలో పెరిగే ఖర్జూరం చెట్లను ఎక్కి పండ్లను తినగలవు. కాని ఖర్జూర చెట్లకు కొమ్మలు క్రిందకు ఉండవు కాబట్టి, ఈ చిన్ననక్కలకు చెట్టెక్కడం అసాధ్యమని కొందఱు భావిస్తారు.

వీటి మూత్రపిండాలు నీటిని ఎక్కువగా శరీరంలోనుండి బయటకు పంపివేయవు గనుక ఇవి ఎక్కువ రోజులు నీరు త్రాగకుండా బ్రతుకగలవు. పైగా ఎడారిలో రాత్రివేళన ఉన్న చల్లదనానికి ఈ నక్కల బొరియలలో నీటిబిందువులు ఏర్పడతాయి. అవసరమైనప్పుడు ఇవి ఆ నీటిని త్రాగుతాయి. ఇవి తాము తిన్న ఆహారంలోని నీటిని తమ శరీరాలలోకి మార్చుకోగలవు కాబట్టి నీటిని ఎక్కువగా త్రాగకపోయినా వీటికి ప్రాణహాని ఏమి ఉండదు.

సంతానోత్పత్తిసవరించు

 
సంభోగంలోనున్న చెవులనక్కలు

చెవులనక్కలు చాలా సామాజిక లక్షణంగల జంతువులు. ఇవి జీవితాంతం ఒకేవొక భాగస్వామితోనే ఉంటాయి. వీటి సంతానంతో కలిసి ఇవి తమ నివాసస్థల పరిధిని పరిరక్షించుకుంటాయి. ఇవి పుట్టిన తొమ్మిది నెలలకే పిల్లలను కనే యోగ్యతను సంతరించుకుంటాయి. అడవులలో జనవరి-ఫిబ్రవరి మధ్యకాలంలో ప్రతియేటా ఇవి తమ జీవితభాగస్వాములతో శారీరకంగా కలుస్తాయి. పిల్లలు మార్చి-ఏప్రిల్ నెలలలో జన్మిస్తాయి. పెంపకంలోనున్న నక్కలు ఈ పద్ధతిని పాటించవు. ఇవి సంవత్సరం పొడవునా పిల్లలను కనగలిగే సామర్థ్యము కలిగివున్నప్పటికీ కేవలం యేడాదికొకసారి మాత్రమే పిల్లలను కంటాయి. ఆడ చెవులనక్క ఒకసారి ఒక మగచెవులనక్కకు భార్య అయ్యాకా, మగ చెవులనక్క దానిని అమితంగా ప్రేమిస్తుందంట! అది గర్భాన్ని ధరించివున్నప్పుడూ, పిల్లలను కని బాలెంతగావున్నప్పుడూ కావాలసిన ఆహారాన్ని సేకరించడం, బొరియ బయట రక్షణకై ఉండటం మగ నక్క చేస్తుంది.

సాధారణ గర్భదారణ కాలం 50-52 రోజులుండగా, పెంపకంలోనున్న నక్కలు మాత్రం కాస్త ఎక్కువ కాలమే(అఱవై రోజులకు పైగా) పిల్లలను కడుపులో మోస్తాయి. ఒక కాన్పుకు నాలుగైదు పిల్లలు పుట్టడం సహజం. మఱియు పుట్టిన డెబ్భై రోజుల వరకూ తల్లి కేవలం తన పాలనే ఆహారంగా ఇస్తుంది. పుట్టినప్పుడు పిల్లల చెవులు ముడుచుకొని, కన్నులు మూసుకుపోయి ఉంటాయి. కన్నులు పుట్టిన పదిరోజుల వరకు తెరుచుకోవు, చెవులు కూడా పదిహేను రోజుల తర్వాతనే పైకి నిక్కబొడుచుకుంటాయి.  అడవులలో వీటి జీవితకాలం 12 ఏళ్లుండగా, పెంపకంలో 14 ఏళ్ల వరకు ఇవి బ్రతుకగలవు.

నివాస ప్రదేశాలుసవరించు

ఈ నక్కలు ఉత్తర ఆఫ్రికా మఱియు ఆసియా ఖండాలలో ఎక్కువగా కనిపిస్తాయి. వీటి పరిధి మొరాకో నుండిఈజిప్టు వరకు విస్తరించగా, దక్షిణ దిశగా నైజర్  మఱియు తూర్పున సీనై ద్వీపకల్పం, నైఋత్య ఇజ్రాయిల్ మఱియు కువైట్ వరకు వ్యాప్తించించి.

చెవులనక్క బొరియలు ఎక్కువగా విస్తరించివున్న ఖాళీ ఇసుకనేలలలోగాని, గుబులుగా పొదలు, ఎడారి ముళ్లమొక్కలు ఉన్న ఇసుక నేలలలోగాని తవ్వబడతాయి. ఇవి కుటుంబ సమేతంగా నివసించే ఆ నేలగుహలు 120 చదరపు అడుగులు కలిగి 15కు పైగా ముఖద్వారాలు లేదా గుమ్మాలు కలిగివుంటాయి. కొన్ని సందర్భాలలో, వివిధ కుటుంబాలు ఒకేచోట ఎక్కువగా బొరియలను తవ్వుకొని ఉండడంలో, వాటి ఇళ్లను అవే సరిగా గుర్తుపట్టలేక వేఱొక బొరియలోకి వెళ్ళిపోతుంటాయి. ఇసుకనేలలు బాగా గుల్లగానున్న చోట ఈ నక్కలు తక్కువ ద్వారాలున్న కొంచెం చిన్న బొరియలను ఏర్పఱుచుకుంటాయి.

సంఖ్యా-పరిరక్షణసవరించు

ఈ చెవులనక్క అంతరించిపోవడానికి దూరంగానే ఉందని ప్రపంచ ప్రకృతి పరిరక్షణ సంఘం స్పష్టం చేసింది. కాకపోతే వీటి ప్రశాంత ఎడారి జీవితంలోకి జోక్యం చేసుకొని, అపహరించి పెంపుడు జంతువులుగా ఉంచుకోవడం మాత్రం తగ్గించాలని భావించింది. ఇది సాధారణ నక్కలాగ ఊర్లలోకి చొరబడి ఎటువంటి పశునష్టం చేయదు కాబట్టి దీనిని సరదాకో, లేదా పెంచుకోవడానికో వేటాడటం న్యాయం కాదు. సహారా మఱియు సీనై ఎడారులలో నివసించే వారు, జీవనాధారం కోసం వీటిని పట్టి పెంపుడు జంతువులుగా అమ్మడమో, ఇతర దేశాలకు ఎగుమతి చేయడమో, లేదా వీటి మెత్తటి చర్మముకోసం చంపడమో చేస్తున్నారు. 

ప్రస్తుతం వీటి జనాభా ఎంతవుందో తెలియదుగాని వీటిని అమ్మి వ్యాపారం చేయడాన్ని బట్టి చూస్తే ఇవి ఎడారులలో సమృద్ధిగానే ఉన్నట్లు కనిపిస్తోంది. దక్షిణ మొరాకో ప్రాంతాలలో ఈ నక్కలు ఊరి చివరలో కనిపిస్తుంటాయి. 

శత్రువులుసవరించు

వీటికి ప్రాణాపాయం కలిగించే ముఖ్య శత్రువులు మనుషులు కాకుండా, ఆఫ్రికా దేశపు వివిధ రకాల గద్దలు మఱియు గుడ్లగూబలు. ఇతర శత్రువులు- కాఱువీను పిల్లిగుంటనక్క, చారల దుమ్ములగొండి, సాలుకి అనబడే ఒక స్థానిక వేటకుక్క. కాకపోతే, చెవులనక్కలు అంత సులువుగా శత్రువులకు చిక్కవు. కాబట్టి, గద్దలు మఱియు గుడ్లగూబలు తప్ప పైనచెప్పబడిన ఇతర జంతువులు, వాటిని పట్టి తినడం చాలా అరుదు.

పెంపుడు జంతువులుగాసవరించు

దీనిని ఎక్కువగా ఇళ్లలో పెంచుకోవడానికి జనాలు ఇష్టపడతారు. వీటిని పంపిణీ చేసేవారు, శిశు చెవులనక్కలను తల్లులనుండి వేఱుచేసి కొంతకాలం తాము పెంచి, మనుషులకు అలవాటు పడేలాగ చేస్తారు. పిమ్మట వీటిని అమ్మకానికి పెడతారు.  అందువలన వీటి ఖరీదు కొంచెమెక్కువే.

ఈ జాతి నక్క, డింగోకుక్క, గుంటనక్క,మంచునక్క, గుంటతోడేలుల వలె ఇళ్లలో పెంచుకోవడానికి యోగ్యమైనదే అని అమెరికా ఐక్యరాష్ట్ర వ్యవసాయ విభాగం స్పష్టంచేసింది.  పిల్లులూ, కుక్కలూ మనకు మచ్చికైనట్లు ఇవి మచ్చికగావు కాని, ఇళ్లలో పెంచుకోవడంలో ఎటువంటి ఇబ్బంది ఉండదు. ఒక చెవులనక్కను సొంతం చేసుకునే చట్టబద్ధత, ఇతర అన్యదేశ పెంపుడు జంతువులకున్నట్లే, అధికార పరిధిలో ఉంటుంది. 

సాంస్కృతిక చిత్రణలుసవరించు

చెవులనక్క అల్జీరియా జాతీయమృగం. అల్జీరియా దేశ ఫుట్-బాల్ జట్టుకు ముద్దుపేరు(లెస్ ఫెన్నెక్స్) కూడా ఈ జంతువుతో ముడిపడి ఉంది. 

దీని ఆంగ్లనామమైన 'ఫెన్నెక్స్ ' ప్రముఖ అంతర్జాల శోధనా ఇంజన్ అయిన మొజిల్లా వారి చరవాణీ ఫైర్ఫాక్స్ పరియోజనకు క్రోడికా పదము.

జంతువుల జీవనశైలి ఆధారంగా తెరకెక్కిన జూటోపియా కార్టూన్ చిత్రంలో 'ఫిన్నిక్' అనబడే ఒక చెవులనక్క పాత్ర కారణంగా, ఈ జంతువు గుఱించి ప్రపంచవ్యాప్తంగా తెలిసింది. పైగా "లాసేంజెలస్ టైంస్ " అనే పత్రికలో ఆ సినిమాను చూసినప్పటినుండి  చీనాదేశంలో పిల్లలు చాలామంది, తమ తల్లిదండ్రులను ఈ నక్కను పెంపుడు జంతువుగా కొనిపెట్టమని మారం చేస్తున్నారంట.

పోకేమాన్ ఎక్స్ మఱియు వై టీ.వీ సిరీస్లలో "ఫెన్నెకిన్" అనబడే పోకేమాన్ ఈ చెవులనక్క ఆధారంగానే చిత్రీకరించబడింది. 

2018 నెట్ ఫ్లిక్స్ సిరీస్ ఎగ్రెత్సుకో లోని ఫెన్నెకో అనే ఒక పాత్ర  చెవులనక్క .

లిటిల్ ప్రిన్స్ అనబడే పుస్తకంలోని సెయింట్ ఎక్సుపెరీ అనే వ్యక్తి వద్దనున్న పెంపుడు నక్క ఈ చెవులనక్కే.

ఉల్లేఖలుసవరించు

  1. Lindblad-Toh, K.; Wade, CM; Mikkelsen, TS; Karlsson, EK; Jaffe, DB; Kamal, M; Clamp, M; Chang, JL; et al. (2005). "Genome sequence, comparative analysis and haplotype structure of the domestic dog" (PDF). Nature. 438 (7069): 803–819. doi:10.1038/nature04338. PMID 16341006.

గ్రంథసూచికసవరించు

  • ఆల్డెర్టన్ డేవిడ్ రచించిన "ప్రపంచపు నక్కలు, తోడేళ్లు మఱియు వేటకుక్కలు". లండన్, బ్లాన్ఫర్డ్ 1998లో తొలిసారి ప్రచురితమైనది. పుస్తక క్రోడిక: ఐ.ఎస్.బీ.ఎన్ISBN 081605715X081605715ఎక్స్.

బాహ్య లంకెలుసవరించు