చౌదరి సత్యనారాయణ

ఆంధ్ర రాజకీయ నాయకుడు
(జననాయక్ డా. చౌదరి సత్యనారాయణ నుండి దారిమార్పు చెందింది)

చౌదరి సత్యనారాయణ, భారత జాతీయ స్వాతంత్ర్యోద్యమ, భూస్వామ్య వ్యతిరేక పోరాట, పౌర హక్కుల ఉద్యమ నాయకుడు.

జననాయక్

చౌదరి సత్యనారాయణ
Chowdary Satyanarayana
జననం(1908-07-13)1908 జూలై 13
మరణం1981 జూలై 15(1981-07-15) (వయసు 73)
మరణ కారణంక్యాన్సర్
జాతీయతభారతీయుడు
విద్య4వ ఫారం
సుపరిచితుడు/
సుపరిచితురాలు
భారత జాతీయ స్వాతంత్ర్యోద్యమం, భూస్వామ్య వ్యతిరేక పోరాటం, మానవ హక్కుల ఉద్యమం
రాజకీయ పార్టీభారత జాతీయ కాంగ్రెస్ పార్టీ, కృషీకర్ లోక్ పార్టీ, స్వతంత్ర పార్టీ .
జీవిత భాగస్వామిసరస్వతమ్మ
పిల్లలుసరోజనమ్మ, తేజేశ్వరరావు, రామచంద్రరావు, విజయలక్ష్మీ, అరుణ, ఇందిర, హేమలత, మోహనరావు, నారాయణమూర్తి
తల్లిదండ్రులుచౌదరి పురుషోత్తమ నాయుడు, నారాయణమ్మ
పురస్కారాలుభారత ప్రభుత్వం ప్రధానం చేసిన 'తామ్రపత్రం'
సంతకం

జీవిత విశేషాలు

మార్చు

చౌదరి సత్యనారాయణ 1908 జూలై 13 లో చౌదరి పురుషోత్తమ నాయుడు, నారాయణమ్మలకు అప్పటి మద్రాసు ప్రావిన్స్‌లో గంజాం జిల్లా (ప్రస్తుత శ్రీకాకుళం జిల్లా), పొందూరు మండలం షేర్ మొహమ్మద్ పురం (ఎస్.ఎమ్.పురం) గ్రామంలో ద్వితియ సంతానంగా జన్మించాడు. ఆయనది కళింగ సామాజిక వర్గానికి చెందిన భూస్వామ్య కుటుంబం.[1] ప్రాథమిక విద్య స్వగ్రామం ఎస్.ఎమ్.పురంలోనే సాగింది. 1వ ఫార్మ నుండి 4వ ఫార్మ వరకు శ్రీకాకుళం లోని ప్రభుత్వ హైస్కూల్ (ప్రస్తుత ఎన్.టి.ఆర్. మునిసిపల్ హైస్కూల్) లో కొనసాగింది. శ్రీకాకుళం జిల్లా, ఆమదాలవలస మండలం, కనుగులవలస గ్రామానికి చెందిన బొడ్డేపల్లి రామ్మూర్తి నాయుడు, లక్ష్మమ్మల కుమార్తె సరస్వతమ్మతో తన 8వ ఏట బాల్య వివాహం జరిగింది. వీరికి తొమ్మిది మంది సంతానం.

స్వాతంత్ర్య సంగ్రామం

మార్చు

మహాత్మా గాంధీ, సుభాష్ చంద్రబోస్‌ వంటి వారి స్ఫూర్తితో దేశం కోసం సత్యాగ్రహాలు, పోరాటాలు అనేకం చేశారు.

స్వాతంత్ర్య సమరయోధుడు

మార్చు
  • 1921 - అప్పటి జాతీయ కాంగ్రేస్ పార్టీ సత్యాగ్రహ పిలుపు మేరకు 1921 లో శ్రీకాకుళంలో తరగతుల భహిష్కరణలో 3వ ఫారం చదువుతుండగా తన 13వ ఏటనే స్వాతంత్ర్య పోరాటంలో పాల్గొన్నారు. అందులకు గాను పోలీసుల లాఠీ దెబ్బలకు తీవ్రగాయాలపాలై కోలుకోవడానికి 6 నెలల సమయం పట్టింది. ఆ విధంగా తన చిన్నతనంలోనే స్వాతంత్ర్య సంగ్రామంలో అడుగు పెట్టారు.
  • 1929 - రామలింగం మాష్టారు ఆధ్వర్యంలో ఉప్పు సత్యాగ్రహం సందర్భంగా, నౌపడాలో జరిగిన "ఉప్పుకుప్పల దోపిడి"లో పాల్గొన్నారు.
  • 1934 - శ్రీకాకుళం జిల్లా బుడుమూరులోని తెన్నేటి విశ్వనాధం ఎస్టేట్ లో రెవెన్యూ ఇన్స్పెక్టర్ గా ఉద్యోగ బాధ్యతలు స్వీకరించారు.
  • 1935 - సంవత్సరం తిరగకముందరే బ్రిటీష్ పాలనకి వ్యతిరేకంగా తన ఉద్యోగానికి రాజీనామా చేశారు.
  • 1940 - వ్యక్తి సత్యాగ్రహం - ఆగస్టు ఆఫర్ విఫలమయ్యాక, ఏ ప్రజాస్వామ్య హక్కుల కోసం యుద్ధం జరుగుతుందో, అటువంటి హక్కులు భారత దేశానికి కల్పించనప్పుడు తామెందుకు బ్రిటన్‌కి అనుకూలంగ యుద్ధంలో పాల్గొనాలని మహాత్మా గాంధీ తలచారు. బ్రిటీష్‌ పాలనకి వ్యతిరేకంగా, యుద్ధానికి వ్యతిరేకంగా మాట్లాడే హక్కు మనకీ ఉందని తెలియజేయడానికే వ్యక్తి సత్యాగ్రహం (ఛలో ఢిల్లీ ఉద్యమం [2] అని కూడా అంటారు) ఉద్యమానికి నాంది పలికారు. అంతేకాకుండ హింసను నివారించడానికి సామూహిక ఉద్యమ ప్రతిపాదనను తిరస్కరించారు. మహాత్మా గాంధీ ఎంపిక చేసిన మొదటి సత్యాగ్రహి వినోబా భావే; తరువాత వరుసలో జవహర్ లాల్ నెహ్రూ, బ్రహ్మ దత్ ఉన్నారు. ముగ్గురినీ పోలీసులు అరెస్టు చేశారు. సత్యాగ్రహం చేయడానికి గాంధీజీ దేశంలోని ప్రతి ప్రాంతం నుండి తన అనుచరులను జాగ్రత్తగా ఎంపిక చేసుకున్నారు. అందులో చౌదరి సత్యనారాయణ ఒకరు. శ్రీకాకుళం పట్టణంలో 7 రోడ్ల జంక్షన్ వద్ద 'వ్యక్తి సత్యాగ్రహం' చేసిన సత్యనారాయణను బ్రిటీష్ పోలీసులు అరెస్టు చేయగా 6 నెలలు జైలు శిక్ష అనుభవించారు.[3]
  • 1942 - క్విట్ ఇండియా ఉద్యమ ప్రచార కార్యక్రమం సందర్భంగా వచ్చిన గాంధీని దూసి రైల్వేస్టేషన్ లో కలిసి పొందూరు ఖద్దరుతో నేచిన పంచెను బహుకరించారు.
  • 1942 - క్విట్ ఇండియా ఉద్యమంలో భాగంగా అనేక బ్రిటీష్ ఆస్తులను ధ్వంసం చేసే కార్యక్రమాలను నడిపించారు. దూసి రైల్వే స్టేషన్-బొడ్డేపల్లి మధ్య రైలు పట్టాల తొలగింపు, కళింగపట్నం పోస్టాఫిసుని కాల్చడం, బ్రిటీష్ వారి సమాచార వ్యవస్థలను లక్ష్యంచేసుకొని ధ్వంసం చేయడం వంటి అనేకానేక కార్యక్రమాలు చేబట్టారు. ఆ సమయంలో బ్రిటీష్ పోలీసుల నుండి తప్పించుకు తిరుగుతూ అధికభాగం అజ్ఞాతం లోనే జీవనం సాగించారు. కళింగపట్నం పోస్టాఫిసు ధ్వంసంలో మూడు నెలలు కారాగార శిక్ష అనుభవించారు.
  • 1946 - భారత స్వాతంత్ర్యం ఖరారు అయిన సందర్భంగా రాజకీయ ఖైదీలను జైలు నుండి విడుదల చేశారు. ఆ సందర్భంగా తొమ్మిది నెలల కారాగారం అనంతరం తన జైలు జీవితానికి విముక్తి కలిగింది.

తన స్వాతంత్ర్య పోరాట సమయమలో కడలూరు, కన్ననూరు, రాజమహేంద్రవరం మొదలగు సెంట్రల్ జైల్లలో వివిధ సందర్భాలలో శిక్షలు అనుభవించారు.

రైతు, రైతు కూలీ నాయకుడు

మార్చు

ఒక జమిందారి కుటంబంలో జన్మించినప్పటికి, అదే జమిందారి వ్యవస్థకు వ్యతిరేకంగా పోరాటం గావించి, రైతులు రైతు కూలీల కోసం పాటుపడ్డారు.

  • 1936 - ఎన్‌.జి రంగా నాయకత్వంలో ఇచ్ఛాపురం నుండి మద్రాసు వరకు జరిగిన రైతు రక్షణ యాత్రలో కిల్లి అప్పలనాయుడు మొదలగు వారితో కలిసి పాల్గొన్నారు.
  • 1945 - శ్రీకాకుళం జిల్లా మందసలో చెలరేగిన జమిందారీ వ్యతిరేక ఉద్యమానికి పూర్తి మద్దతు తెలిపి రైతుల హక్కులకోసం పోరాటం చేశారు.
  • 1947 - మాజీ భారత రాష్ట్రపతి వి.వి.గిరి & ప్రొఫెసర్ ఎన్.జి.రంగా గార్లను ఆహ్వానించి తన స్వగ్రామమైన ఎస్.ఎమ్.పురంలో "ఉభయ విశాఖ మండల ద్వితీయ కిసాన్ కాంగ్రెస్ మహా సభ"ను నిర్వహించారు.[4]

స్వాతంత్ర్యానంతర రాజకీయ జీవితం

మార్చు

భారత స్వాతంత్ర్యానంతరం రెండు పర్యాయాలు శాసనసభ్యునిగా, మొత్తం పన్నెండేళ్ళు, సేవలందించారు.[5]

  • 1951 - జాతీయ కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసి కృషికర్ లోక్ పార్టీలో సభ్యత్వం తీసుకున్నారు.[6]
  • 1955 - ఆంధ్రప్రదేశ్ కు జరిగిన అసెంబ్లీ ఎన్నికలలో షేర్ మహమ్మద్‌పురం శాసనసభ నియోజకవర్గం నుండి కృషికర్ లోక్ పార్టీ తరుపున మొదటసారి శాసనసభ్యునిగా ఎన్నికైనారు.[7] [6]
  • 1967 - ఆంధ్రప్రదేశ్ కు జరిగిన అసెంబ్లీ ఎన్నికలలో పొందూరు నియోజకవర్గం నుండి స్వతంత్ర పార్టీ తరుపున రెండసారి శాసనసభ్యునిగా ఎన్నికైనారు.[8]
  • 1972 - వ్యక్తుల మధ్య, పార్టీల మధ్య అధికారం కోసం జరుగుతున్న సంఘటనలకు వ్యతిరేకంగా తను సాంప్రదాయ రాజకీయాల నుండి విరమించుకున్నారు.
  • 1974 - తరిమెళ్ళ నాగిరెడ్డి, శ్రీశ్రీ లతో కలిసి పౌర హక్కుల ఉద్యమంలో భాగమయ్యారు.
  • 1975 - ఓ.పి.డి.ఆర్. ఆంధ్రప్రదేశ్ వ్యవస్థాపక ఉపాధ్యక్షుడిగా బాధ్యతలు స్వీకరణ.
  • 1975 - శ్రీకాకుళం జిల్లాలో ఓ.పి.డి.ఆర్. తలపెట్టిన హక్కుల ఉద్యమానికి నాయకత్వం.

ప్రత్యేకాంధ్ర రాష్ట్ర ఉద్యమం

మార్చు

తెలుగు మాట్లాడే ప్రజలు మద్రాస్ రాష్ట్రం నుండి విభజన ద్వారా ప్రత్యేక రాష్ట్రాన్ని డిమాండ్ చేశారు. పొట్టి శ్రీరాములు ఆంధ్ర రాష్ట్రం ఏర్పాటు కోసం ఆమరణ నిరాహారదీక్ష ప్రారంభించారు. చౌదరి సత్యనారాయణ శ్రీకాకుళంలో ప్రత్యేక రాష్ట్రం కోసం ఆందోళనలను నిర్వహించి పాల్గొన్నారు. శ్రీకాకుళంలో రిలే నిరాహార దీక్షలు, ర్యాలీలు, ధర్నాలు మొదలైనవి నిర్వహించారు.

గీతా సత్యాగ్రహం

మార్చు

1954 లో అప్పటి రాష్ట్ర ప్రభుత్వం మద్య నిషేధం అమలు చేసింది. కల్లు గీత కార్మికులు వారి కుటుంబాలు ప్రభుత్వ నిర్ణయంతో వీధిన పడ్డారు. కల్లుతీతకి అనుమతివ్వాలని, వారిని ప్రత్యేకంగా గుర్తించాలని వివిధ సంఘాల కార్మికులు మొదలైనవారితో కలిసి సంఘటితంగా "గీతాసత్యాగ్రహం" ఉద్యమంలో పాలుపంచుకున్నారు. అప్పటి ప్రభుత్వానికి వ్యతిరేకంగా పోరాటం చేసినందుకుగాను 7 నెలలు కారాగారనిర్బంధంలో గడిపారు.

విశాఖ ఉక్కు కర్మాగార సాధన ఉద్యమం

మార్చు

విశాఖపట్నంలో ఉక్కు కర్మాగారాన్ని ప్రారంభించాలని 1966 అక్టోబరు 15న గుంటూరు జిల్లా తాడికొండకు చెందిన అమృతరావు అనే నేత విశాఖ కలెక్టరేట్‌ వద్ద ఆమరణ దీక్ష చేపట్టారు.. "విశాఖ ఉక్కు- ఆంధ్రుల హక్కు"నినాదంతో ఆంధ్రదేశాన్ని కుదిపేసింది. ఆ ఉద్యమంలో 32 మంది ప్రాణాలను కోల్పోయారు. విద్యార్థులు బందులు నిర్వహించారు. ఈ దీక్ష రాష్ట్రంలోని నిరుద్యోగ యువత, విద్యార్థులను కదిలించింది. వామపక్షాలు ఉద్యమం వైపు అడుగులు వేయించింది. అన్ని రాజకీయ పక్షాలతో ఏర్పాటుచేసిన బహిరంగ సభలో తెన్నేటి విశ్వనాథం, యం.వి.భద్రం, రావిశాస్త్రి, చౌదరి సత్యనారాయణ తదితరులు ప్రసంగించారు. అమృతరావు దీక్షకు సత్యనారాయణ సంఘీభావం ప్రకటించారు.

తనదైన శైలిలో శ్రీకాకుళం, విశాఖపట్నం కేంద్రాలుగా విశాఖ ఉక్కు కర్మాగారం సాధన కోసం ఆందోళనలు నిర్వహించారు. ఉద్యమంతో కదిలిన అప్పటి ఇందిరా గాంధీ ప్రభుత్వం విశాఖలో 1971లో ఉక్కు కర్మాగారం ఏర్పాటు చేశారు.

తరువాత రోజులలో విశాఖ ఉక్కు కర్మాగార కార్మిక సంఘం జాయింట్‌ సెక్రటరీగా తన కనిష్ఠ కుమారుడు చౌదరి నారాయణ మూర్తి (బాబ్జి) సేవలందించారు.

జై ఆంధ్ర ఉద్యమం

మార్చు

ముల్కీ నిబంధనలపై సుప్రీం కోర్టు ఇచ్చిన తీర్పునకు పర్యవసానం జై ఆంధ్ర పేరుతో ప్రత్యేక ఆంధ్ర రాష్ట్ర ఉద్యమానికి దారితీసింది. శాసనసభ్యునిగా తన వాణిని శాసనసభలో గట్టిగా నినదించారు. అసెంబ్లీలో ప్రజల గొంతును పలికిన ఆయన సమస్యను త్వరగా పరిష్కరించాలని డిమాండ్ చేశారు. ఉద్యమానికి మద్దతుగా ఆయన అనేక ఆందోళనలలో పాల్గొన్నారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా నిరసనలు నిర్వహించినందుకు అతన్ని అనేక సార్లు గృహనిర్బంధించడమే కాకుండా అరెస్టు కూడా చేశారు.[9]

పౌరు హక్కుల పోరాటం

మార్చు

1974 లో, గొప్ప ప్రగతిశీల కవి అయిన శ్రీశ్రీగా ప్రసిద్ధి చెందిన శ్రీరంగం శ్రీనివాస్ రావు, తరిమెల్ల నాగిరెడ్డిలతో కలిసి ఓ.పి.డి.ఆర్. (ఆర్గనైజేషన్ ఫర్ ప్రోగ్రెసివ్ & డెమోక్రటిక్ రైట్స్ ఆఫ్ పీపుల్) ని స్థాపించి వ్వవస్థాపక రాష్ట్ర ఉపాధ్యక్షులుగా సేవలందించారు. చౌదరి సత్యనారాయణ 1981 లో మరణించే వరకు ఓ.పి.డి.ఆర్. ఆంధ్రప్రదేశ్ విభాగానికి ఉపాధ్యక్షుడిగా, శ్రీకాకుళం జిల్లా అధ్యక్షుడిగా పనిచేశారు. శ్రీకాకుళం జిల్లాలో మానవ హక్కుల క్రియాశీలతకు మార్గదర్శకుడు. ముఖ్యంగా గిరిజనుల హక్కుల కోసం పోరాటం చేయడమే కాకుండ కేంద్ర & రాష్ట్ర ప్రభుత్వాల దృష్టికి గిరిజనుల స్థితిగతులను నివేదించి వారి సామాజిక ఆర్థిక అభివృద్ధి కోసం కృషి చేశారు. గిరిజనులపై పోలీసుల దౌర్జన్యానికి వ్యతిరేకంగా ఓ.పి.డి.ఆర్. ఏర్పాటు చేసిన నిజ నిర్ధారణ కమిటీకి మార్గనిర్దేశకుడిగా వ్యవహరించారు.[10]

గౌరవాలు, అవార్డులు

మార్చు
  • 1972 లో, భారతదేశ స్వాతంత్ర్యం సిద్ధించి 25 సంవత్సరాలు నిండిన సందర్భంగా, భారత స్వాతంత్ర్య ఉద్యమకర్తగా చేసిన దేశ సేవకి గాను భారత ప్రభుత్వం చౌదరి సత్యనారాయణను “తామ్రపత్రం”తో సత్కరించింది.[11]
  • శ్రీకాకుళం మునిసిపాలిటీ పరిధిలో 45వ వార్డులో ఉన్న ఒక కాలనీకి “చౌదరి సత్యనారాయణ కాలనీ” అని పేరు పెట్టారు.[12]
  • ఎస్.ఎమ్. పురం గ్రామంలో షెడ్యూల్డ్ కులాల కాలనీకి అతని పేరు పెట్టబడింది.[13]
  • సి.ఎస్.ఎన్. విగ్రహం [14] శ్రీకాకుళం పట్టణ ప్రవేశద్వారం వద్ద ప్రభుత్వం వారు ప్రతిష్ఠించారు.
  • 'జననాయక్ డాక్టర్ చౌదరి సత్యనారాయణ' స్పోర్ట్స్ మ్యాన్ ఆఫ్ ది ఇయర్ అవార్డు [15]ని ప్రతి సంవత్సరం శ్రీకాకుళంలోని స్పోర్ట్స్ ట్రస్ట్ ఒకటి ఆయన పెరు మీద ప్రధానం చేస్తున్నారు.
  • పీపుల్స్ యూనివర్సటీ ఆఫ్ మిలాన్ వారి గౌరవ డాక్టరేట్ గ్రహీత (మరణానంతరం) [16]

ఫోటో గ్యాలరీ

మార్చు

ప్రస్తావనలు

మార్చు
  • “చౌదరి సత్యనారాయణ చాలా మందికి ప్రేరణ. అతను 'జననాయక్', నిజమైన ప్రజల నాయకుడు”. - వి.వి.గిరి, భారత మాజీ రాష్ట్రపతి - 1947 ఏప్రిల్
  • "సిఎస్ఎన్ లేకపోతే, ఉత్తరాంధ్ర లో క్రియాశీల మానవ హక్కుల ఉద్యమం రూపుదిద్దుకోలేదు". - ఒపిడిఆర్ వ్యవస్థాపకుడు తరిమెల్ల నాగిరెడ్డి, ఆంధ్రప్రదేశ్‌లోని హక్కుల ఉద్యమానికి మార్గదర్శకుడు - 1981 ఆగస్టు
  • "టార్చ్ బేరర్ ఆఫ్ ట్రూత్ & ఇంటెగ్రిటీ; అణగారిన కుటుంబాల సంక్షేమం కోసం చివరి శ్వాస వరకు జీవించిన ప్రజల మనిషి." - శ్రీశ్రీ, ప్రగతిశీల కవి, ఓ.పి.డి.ఆర్ సహ వ్యవస్థాపకుడు - 1981 ఆగస్టు
  • ఆర్గనైజేషన్ ఫర్ ప్రోగ్రెసివ్ అండ్ డెమోక్రటిక్ రైట్స్ (ఓ.పి.డి.ఆర్) తీర్మానం 1981 జూలై 19 | ఓ.పి.డి.ఆర్. తీర్మాన పత్రం

మూలాలు

మార్చు
  1. పబ్లిక్ డొమైన్‌ లో చౌదరి సత్యనారాయణ వివరములు
  2. ఛలో ఢిల్లీ ఉద్యమం
  3. ఆంధ్ర శాసనసభ్యులు పుస్తకంలో చౌదరి సత్యనారాయణ వివరాలు[permanent dead link]
  4. జనపథం పేపర్‌ లో చౌదరి సత్యనారాయణ వివరములు
  5. సి.ఎస్‌.ఎన్‌. ట్రస్ట్ వెబ్‌సైట్‌ లో పొందుపరిచిన వివరములు
  6. 6.0 6.1 ఆంధ్ర శాసనసభ్యులు పుస్తకంలో చౌదరి సత్యనారాయణ వివరాలు.
  7. భారత ఎలక్షన్‌ కమిషన్‌ వెబ్‌సైట్‌ లో పొందుపరిచిన వివరములు(1955)
  8. భారత ఎలక్షన్‌ కమిషన్‌ వెబ్‌సైట్‌ లో పొందుపరిచిన వివరములు(1967)
  9. పత్రికలో చౌదరి సత్యనారాయణ వివరములు
  10. జనపథం పేపర్‌ లో చౌదరి సత్యనారాయణ వివరాలు
  11. తామ్రపత్రం
  12. చౌదరి సత్యనారాయణ కాలనీ, 45వ వార్డు, శ్రీకాకుళం
  13. చౌదరి సత్యనారాయణ నగర్‌ కాలనీ, ఎస్.ఎమ్. పురం
  14. సి.ఎస్.ఎన్. విగ్రహం
  15. "చౌదరి సత్యనారాయణ పేరున అవార్డు". Archived from the original on 2020-10-15. Retrieved 2020-11-14.
  16. గౌరవ డాక్టరేట్

వెలుపలి లంకెలు

మార్చు