జలప్రళయం కధలు - ఒకటవ భాగం

(జలప్రళయం కధలు - ఒకటవ భాగము నుండి దారిమార్పు చెందింది)

జలప్రళయం కథలు - ఒకటవ భాగం

2018 కేరళ రాష్ట్రంలో వచ్చిన జలప్రళయం దృశ్య చిత్రం

జలప్రళయం (Deluge / Great Flood) అనగా తుఫానుల వల్ల నేల కనుమరుగైపోయేలా భూభాగం అంతటా నీటిలో మునిగిపోవడం. జల ప్రళయం గురించి విభిన్న కథనాలు ప్రపంచమంతటా ఉన్నాయి. భగవంతుడు ఒక్క స్త్రీ పురుషుల జంటను, ప్రతి జంతు పక్షి జాతులలో ఒక జంటను, ప్రతి చెట్టు విత్తనాన్ని మాత్రమే ఉంచి, పాపంతో నిండిపోయిన మిగిలిన మానవాళిని ఒక ప్రణాళిక ప్రకారం జల ప్రళయంతో నాశనం చేసి, తరువాత మానవ జాతిని, జంతు పక్షి జాతులను, మొక్కలను జంతు పక్షి జాతులను, మొక్కలను సృష్టించడం ప్రపంచవ్యాప్తంగా అందరి నమ్మకాల్లో ఉన్న సారాంశం.

ప్రస్తావనలు మార్చు

  • బైబిల్ పాత నిబంధన ఆదికాండంలో యెహోవా (Jehovah) దేవుడి సలహాతో నోవాహు (Noah) అను వ్యక్తి ఓడను తయారుజేసి దానిలో తన కుటుంబం, జంతువులు, పక్షులతో సహా జలప్రళయం నుండి రక్షింపబడతాడు.
  • విజయవాడ నగరంలో ఇంద్రకీలాద్రి కొండ మీద కొలువైయున్న కనకదుర్గమ్మ ముక్కుపుడకను కృష్ణానది అలలు తాకుతాయని శ్రీ పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామి తన కాల జ్ఞానంలో చెప్పడం జరిగింది.
  • కిరాత ముందములో భాగమైన యహంగ్ ముందములో కూడా జల ప్రళయము ప్రస్తావించబడింది.
  • ఖుర్ ఆన్ లో అల్లాహ్ దేవుడు నోవాహును ప్రజల వద్దకు పంపి తనను (అల్లాహ్ ను) తప్ప ఇంకెవరినీ సేవించద్దని చెప్పమంటాడు. ప్రజలు వినకపోగా అల్లాహ్ చెప్పిన ప్రకారం ఓడను నిర్మించిన నోవాహును చూచి అవహేళన చేశారు. అంత భూమినుండియూ ఆకాశమునుండి జలము ఉద్భవించింది. నోవాహు తన కుటుంబాన్ని, సమస్త జీవరాశిని, అల్లాను నమ్మినవారును ఓడలో ఎక్కించాడు. నోవాహు కుమారుల్లో ఒకడు అల్లాను నమ్మక కొండలపై తలదాచుకొనగా వాడుకూడా మునిగిపోతాడు. నీళ్ళను త్రాగేయాలని భూమిని, తేటగా అవ్వాలని ఆకాశాన్ని అల్లా ఆదేశిస్తాడు. ఆ ఓడ అల్ జూడి అను కొండపై ఆగుతుంది.
  • గ్రీకు పురాణంలో జియూస్ (Zeus) అనే దేవుడు ఇత్తడి యుగపు మానవులందిరినీ నాశనం చేయడానికి జల ప్రళయాన్ని సృష్టిస్తాడు. డ్యుకాలియన్ (Deucalion) తన తండ్రి అయిన ప్రొమిథియస్ (Prometheus) సలహాతో చిన్న పడవను నిర్మించి జల ప్రళయ సమయంలో తన భార్యతో పాటూ తొమ్మిది రోజులు ఆ పడవలోనే ఉండి పర్నాసస్ అను కొండ పైకి చేరుకుంటాడు.[1]
  • అర్కాడియన్ (Arcadian) పురాణం ప్రకారం అర్కాడియన్ మొదటి రాజైన డర్డానస్ (Dardanus) జల ప్రళయం చేత తరమబడ్డాడు.[1]
  • రోమా (Roman) పురాణం ప్రకారం జ్యూపిటర్ (Jupiter) దేవుడు నెప్ట్యూన్ (Neptune) దేవుడు సాయంతో జల ప్రళయాన్ని సృష్టిస్తాడు.
  • స్కాండినేవియన్ (Scandinavian) పురాణం ప్రకారం వైమిర్ (Ymir) అను మంచు రాక్షసుడు చంపబడిన తర్వాత అతని గాయాలనుండి వాచిన మంచు నీరు ఇతర రాక్షసుల్ని ముంచివేస్తుంది. అయితే ఒక మంచు రాక్షసుడు మాత్రం తన భార్యా పిల్లలతో చెట్టు కాండంతో చేసిన పడవపై తప్పించుకుంటాడు. వైమిర్ శరీరం ప్రపంచంగా, రక్తం సముద్రాలుగా రూపాంతరం చెందినవి.[1]
  • జర్మన్ పురాణం ప్రకారం ఒక పేను (Louse), ఒక మిడినల్లి (Flea) రెండూ కలిసి ఒక గ్రుడ్డు పెంకులో సారాని తయారుచేస్తుండగా పేను మంటలో పడిపోయి కాలిపోయింది. అందుకు నల్లి ఏడిచింది, అందువల్ల పెంకు బ్రద్దలయ్యింది, అందువల్ల చీపురు తుడిచింది, అందువల్ల బండి కదిలింది, అందువల్ల బూడిద కుప్ప మండింది, అందువల్ల చెట్టు ఊగింది, అందువల్ల బాలిక యొక్క నీటి కుండ పగిలింది, అందువల్ల సెలయేరు పారింది, అందువల్ల సమస్తం అందులో మునిగిపోయింది.
  • సెల్టులు (Celts) (బ్రిటన్, స్పెయిన్, గౌల్ లో నివసించేవారు) నమ్మకం ప్రకారం స్వర్గం భూమి ఇద్దరూ భారీ ఆకారాలు. వారి మధ్య చీకటిలో తల్లి పిల్లలు సంతోషంగా లేక, అందులో ధైర్యవంతులు ఆకాశాన్ని ముక్కలు ముక్కలుగా చేశారు. ఆకాశం యొక్క పుర్రెలొంచి గోళాన్ని చేశారు. అతడి రక్తం చిందటం వల్ల పెద్ద జల ప్రళయాం సంభవించింది. టైటాన్ దేవుడు రక్షించిన ఒక్క భార్యా భర్తల జంట తప్పించి మిగిలిన మానవాళి అంతా సమూలంగా నాశనమైనది. తరువాత ఆ నీరు సముద్రంగా మారింది.
  • వేల్స్ (Wales) వారి నమ్మకం ప్రకారం లియాన్ సరస్సు పొంగి భూభాగాన్ని ముంచేసింది. డ్వైఫాన్, డ్వైఫాచ్ అను ఇద్దరు జీవరాశుల్లో ప్రతి జాతికి ఒక జంటకు చొప్పున ఓడలోకి ఎక్కించి తప్పించుకొన్నారు. వారు బ్రిటన్లో ప్రీడైన్ అను ప్రదేశానికి చేరుకొని అక్కడ విస్తరించారు.
  • లిథూనియన్ (Lithuanian) నమ్మకం ప్రకారం ప్రంజిమాస్ (Pramzimas ) అను దేవుడు మానవుల మధ్య యుద్ధాలను అన్యాయాలను చూచి వారి పై వండు (Wandu) (జలము), వెజాస్ (Wejas) (గాలి) అను రాక్షసులను పంపాడు. 20 పగళ్ళు రాత్రుళ్ళు వేచి చూచాడు. అదే సమయంలో గింజలు చీరములు వలిచి తింటున్నాడు. ఆ చీరములే పడవలుగా చేసుకొని చాలామంది కొండపైకి చేరారు. దేవుడు శాంతించాడు. ఒక్క వృద్ధ దంపతుల జంట తప్ప మిగిలినవారంతా చెల్లాచెదరైపోయారు. వారిని ఆదరించడానికి ఇంద్ర ధనస్సును పంపి వారిని భూమి ఎముకల మీదుగా తొమ్మిది సార్లు దూకమంటాడు. ఆ దంపతులు అలా చేయగా వారినుండి ఇతర దంపతులు పుట్టుకొచ్చారు. వారి సంతతియే లిథూలియన్లని నమ్మకం.[1]
  • ట్రాన్సిల్వానియా (Transylvania ) జిప్సీల నమ్మకం ప్రకారం మానవులందరూ ఒకప్పుడు కష్టాలు తెలియకుండా శాశ్వతంగా బ్రతికేవారు. ఒక సారి ఎక్కడినుండియో వచ్చిన వృద్ధుడికి ఒక భార్యా భర్తల జంట ఆతిద్యమిచ్చారు. మర్నాడు ఆ వృద్ధుడు 9 రోజుల తర్వాత తిరిగి వస్తానని చెప్పి వెళుతూ ఆ దంపతులకు ఒక గిన్నెలో చిన్న చేపను ఇచ్చి దానిని తాను వచ్చే వరకూ తినకుండా భద్రపరచమని చెప్పి వెళిపోతాడు. రెండు రోజుల తర్వాత భార్యకు ఆశ కలిగి ఆ చేపను తినదలచి మండే బొగ్గులపై వేసింది. అంతే ఉరుములు మెరుపులతో వర్షం కురియడంతో నదులు పొంగి దేశమంతా పారాయి . 9వ రోజు ఆ వృద్ధుడు వచ్చి గృహస్తుడితో అన్ని జీవరాశులు మునిగిపోవునని, ఒక పడవను తయారు చేసి భార్యను, వంశస్తులను తోడ్కొని జంతువులను, చెట్లు విత్తనములను పోగుజేసి ఆ పడవలోకి ఎక్కించమని చెబుతాడు. ఆ గృహస్తుడు అంతా చేశాడు. సంవత్సరం పాటూ ఎడతెరపి లేకుండా వర్షం కురవడంతో భూమి అంతా మునిగిపోయింది. తరువాత వర్షం వెలిసిపోవడంతో నీటి మట్టం తగ్గిపోయింది. అప్పుడు అందరూ ఆ ఓడ నుండి బయటకొచ్చారు. అప్పటినుండి వారికి ప్రయాస, బలహీనత, మరణము వారిని ఆవరించాయి.
  • సుమేరియన్ల (Sumerian) నమ్మకం ప్రకారం ఎన్లిల్ (Enlil) దేవుడు చెప్పిన ప్రకారం రాజ ఋషి అయిన జుసుద్ర (Ziusudra) పెద్ద ఓడను నిర్మించి అందులోకి జంతువులను పక్షులను ఎక్కిస్తాడు. జలప్రళయం సంభవించి 7 రోజులపాటూ కొనసాగుతుంది. జుసుద్ర ఓడలో కిటికీ తలుపు తెరచి సూర్య కాంతి లోపలలికి ప్రసరించేలా చేసి యుతు (Utu) అను సూర్య భగవానుడికి మోకరిల్లి ప్రార్థన చేస్తాడు. గట్టుకి చేరిన తర్వాత జుసుద్ర అనూ (Anu), ఎన్లిల్ అను దేవుళ్ళకు ఒక గొర్రెను, ఆవును బలి ఇస్తాడు. ఫలితంగా జంతు జాతి, మానవ జాతి రక్షింపబడటానికి జుసుద్ర నిత్య జీవం పొందుతాడు, సూర్యుడు ఉదయించే దిల్మన్ అను దేశానికి ప్రయాణిస్తాడు.
  • ఈజిప్టు పురాణం ప్రకారం ఆటం (Atum) అను దేవుడు జల ప్రళయాన్ని సృష్టిస్తించి భూమికి పూర్వపు స్థితి తెప్పిస్తానని ప్రకటిస్తాడు.
  • బాబిలోనియన్ (Babylonian ) నమ్మకం ప్రకారం దేవుళ్ళు మానవలోకానికి కరువును, వ్యాధులను పంపారు. రెండుసార్లూ ఎంకి (Enki) అనే దైవం మానవులను తనను వేడుకోమని చెబుతాడు. 3వ సారి ఎన్లిల్ దేవుడు ప్రపంచాన్ని జలప్రళయంతో నాశనం చేయమని చెబుతాడు. అత్రహాసిస్ (Atrahasis) అనే వ్యక్తితో ఒక ఓడను నిర్మించుకొని దాని సాయంతో తప్పించుకోమని ఎంకి చెబుతాడు. అత్రహాసిస్ తన ఓడలో కుటుంబాన్ని, జంతువులను, పక్షులను ఎక్కించుకొంటాడు. తుఫాను దేవుడు జలప్రళయాన్ని 7 రోజులపాటూ కొనసాగించాడు. తరువాత దేవుళ్ళందరూ సృష్టికి జరిగిన నష్టానికి చింతించారు. అత్రహాసిస్ దేవుళ్ళకు బలులు సమర్పించాడు. భవిష్యత్తులో జనాభా సమస్యను అధికమించడానికి ఎంకి ఒక గొడ్రాలిని, మృత శిశువును ప్రత్యక్షపరుస్తాడు.
  • అస్సీరియన్ (Assyrian) నమ్మకం ప్రకారం దేవుళ్ళందరూ ఎన్లిల్ నాయకత్వంలో జనాభాలో పుచ్చిపోయిన మానవాళిని నాశనం చేయదలుస్తారు. ఉట్నాపిస్టిం (Utnapishtim) కు స్వప్నంలో ఎ (Ea) అనే దేవుడు జరుగబోయే వినాశనం గూర్చి హెచ్చరిక చేస్తాడు. దాని ప్రకారం ఉట్నాపిస్టిం వారం రోజుల్లోనే ఏడు అంతస్తుల భారీ ఓడను నిర్మిస్తాడు. ఆ ఓడలో తన కుటుంబాన్ని, పనివారిని, ప్రతి జీవరాశి విత్తనాన్ని ఎక్కిస్తాడు. 6 రోజులపాటూ భయంకరమైన తుఫాను కురిసింది. జలప్రళయంలో జరుగుతున్న నష్టాన్ని చూచిన దేవుళ్ళు చింతించారు. ఆ ఓడ నిలిచిన నిసుర్ (Nisur) అను కొండ తప్ప మిగిలిన భూభాగమంతా నీట మునిగిపోయింది. 7 రోజుల తర్వాత ఉట్నాపిష్టిం ఓడలోంచి ఒక ముందుగా ఒక పావురాన్ని, ఒక పిచ్చుకను విడిచిపెట్టాడు. అవి ఎగురుకుంటూపోయి ఎక్కడా వాలుటకు ప్రదేశం లేనందున తిరిగి వచ్చాయి. తరువాత బొంతకాకిని విడిచిపెట్టాడు. అది తిరిగి రాలేదు. దానితో జలప్రళయం ఆగిపోయిందని ఉట్నాపిష్టిం గ్రహించాడు. ఉట్నాపిష్టిం దేవుళ్ళకు కొన్ని బలులు అర్పించాడు. అతడు, అతని భార్య నిత్య జీవాన్ని పొంది భూమి అంతాల్లో నివసించారు.
  • చల్దీ (Chaldea) (దక్షిణ మెసొపటేమియాలో ప్రాంతం) వారి నమ్మకం ప్రకారం దేసియన్ (Daesius) నెలలో 15 వ రోజు రాబోయే జలప్రళయం గురించి క్రొనొస్ (Chronos) అను దేవుడు బాబిలోనియా పదవ రాజైన గ్జిసుత్రస్ (Xisuthrus) కు హెచ్చరిక చేస్తాడు. దాని ప్రకారం గ్జిసుత్రస్ 5x2 ఫర్లాంగుల పరిమాణంలో ఓడను తయారు చేసి అందులోకి తన కుటుంబాన్ని, బంధువులను, జంతువులను, పక్షులను, ఎక్కిస్తాడు. జలప్రళయం తీవ్రత కొద్దిగా తగ్గిన తర్వాత కొన్ని పక్షులను పంపగా అవి తిరిగి వచ్చాయి, రెండవసారి కాళ్ళకు మట్టితో తిరిగివచ్చాయి, మూడవసారి తిరిగి రాలేదు. దానిని బట్టి జలప్రళయం సమాప్తమైనదని తెలుసుకొని, నేలను కనుగొని చివరకు ఆర్మేనియాలో కార్సిరేనియా (Corcyraea) కొండలకు చేరుకొన్నాడు. అక్కట తన భార్యను, కుమార్తెను, ఓడ నడుపువాడిని దింపి, దేవుళ్ళకు జంతు బలులు సమర్పించాడు.
  • బెరోసస్ (Berosus) అను రచయిత ప్రకారం యాంటీ డిలువియన్ (antediluvian) ( బైబిలు ప్రకారం జల ప్రళయం సంభవించక ముందు కాలం) నాటి కాలపు మనుష్యులు రాక్షసులవంటివారు. చెడిపోయారు. వారిలో నోవాహు ఒక్కడే దేవుడిపై నమ్మకం కలిగినవాడుగా ఉన్నాడు. అతడు తన ముగ్గురు కొడుకులు, కోడళ్ళతో సహా సిరియా దేశంలో జీవిస్తుండేవాడు. నక్షత్రాలనుండి అతడు ముందుగానే జలప్రళయాన్ని పసిగట్టి ఓడను నిర్మించడం ప్రారంభించాడు. 78 సంవత్సరాలకి భయంకరమైన వానతో సముద్రాలు, నదులు చాలా రోజులవరకూ పొంగసాగాయి, కొండలు మునిగిపోయాయి. ఓడలో ఉన్న నోవాహు, అతని కుటుంబము తప్ప మానవాళి అంతా నాశనమైపోయింది. జల ప్రళయం సమయంలో ఆ ఓడ ఒక కొండపై నిలబండింది .
  • పర్షియావారి నమ్మకం ప్రకారం మొడటిలో అహ్రిమాన్ (Ahriman) అను దెయ్యం వలన మానవాళి చెడిపోయింది. దేవ దూత అయిన తిస్టార్ (Tistar) మూడు సార్లు మనవ, అశ్వ,, వృషభ రూపాల్లో వచ్చి 10 రోజూలపాటూ వర్షం రప్పించింది. ప్రతి వర్షపు బిందువు పాత్రకంటే పెద్దగా ఉండి మనిషి ఎత్తున నీరు భూమి అంతా ప్రవహించింది. మొడటి ప్రళయం జీవరాశులను ముంచివేసింది, కాని చనిపోయిన విషపు జీవులు బొరియల్లోకి వెళ్ళిపోయాయి. రెండవ ప్రళయం సృష్టించే ముందు నల్లటి గుర్రం రూపంలో ఉన్న అపావోషా అను దెయ్యంతో తిష్టార్ పోరాడటం జరిగింది. ఆర్మజ్ (Ormuzd) అను దేవ దూత ఆ దెయ్యాన్ని మెరుపులతో హతం చేసింది, ఉరుముల శబ్దాలతో పాటూ వినిపించేలా ఆ దెయ్యం అరచింది. తిష్టార్ నదులను ప్రవహించే చేసింది. రెండవ వరద వల్ల భూమిపై విషం అంతా పోయి ఆ నీరు ఉప్పుమయం అయింది. తరువాత ఆ నీరు అంతా వెనక్కి వెళిపోయి వొరుకష (Vourukasha) అను సముద్రంగా మారింది.
  • జొరాస్త్ర మతం ప్రకారం యిమ (యముడు) ప్రపంచాన్ని 900 ఏళ్ళు పాలించాడు. మరణము, వ్యాధులు లేనందున 300 సంవత్సరాల తర్వాత భూమిని పెద్దది చేయాలన్నట్లుగా జనాభా పెరిగిపోవసాగింది. సృష్టికర్త అయిన అహురా మాజ్డా నుండి స్వీకరించిన బంగారపు ఉంగరం చేతను, బంగారంతో చేసిన బాకుతోను భూమిని పెద్దగా చేశాడు. 900 సంవత్సరాలకి భూమి మీద జనాభా విపరీతంగా పెరిగిపోవడంతో వినాశనం మంచు రూపంలో వస్తుందని అహురా మాజ్డా యిమకి హెచ్చరిస్తాడు. చతురస్రాకారంలో పెద్ద వరను నిర్మించమని, అందులోకి చిన్నా పెద్దా జంతు జాతులు, మానవజాతిని, పక్షులను రెండేసి చొప్పున ఎక్కించమంటాడు.
  • తూర్పు ఆఫ్రికాలో మసై (Masai) ప్రజల నమ్మకం ప్రకారం తంబైనాత్ (Tumbainot) అను నీతిమంతుడు దేవుడు చెప్పిన ప్రకారం ఒక ఓడ నిర్మించి, తన భార్యలను, కుమారులను, వారి భార్యలను, జీవరాశిని ఎక్కిస్తాడు. అప్పుడు దేవుడు ఎడతెరపిలేని వాన కురిపిస్తాడు. వరద నీరు ఇంకిపోయిన తరువాత ఓడ పీఠ భూమిపై ఆనింది. అప్పుడు తంబైనాత్ ఆకాశంలో దేవుడి ఉగ్రత సమాప్తి అయినట్లు సూచనగా నాలుగు ఇంద్ర ధనస్సులు చూచాడు.
  • పశ్చిమ ఆఫ్రికాలో కేమరూన్ (Cameroon ) ప్రజల నమ్మకం ప్రకారం ఒక బాలిక పిండిని రుబ్బుతుండగా ఎక్కడినుండియో ఒక మేక వచ్చి దానిని నాకింది. మొదటిసారిగా ఆమె దానిని తరిమింది. రెండవసారి అది తిరిగి రాగా ఆకలి తీరేలా పిండిని నాకనిచ్చింది. కృతజ్ఞతతో ఆమెకు రాబోవు ప్రళయం గురించి చెప్పి, ఆమె తన సోదరునితో పారిపోమని చెబుతుంది. అంతట ఆమె తన సోదరునితో పారిపోయి జల ప్రళయాన్ని వీక్షిస్తుంది. మానవజాతి విస్తరణ కోసం తోడు లేకపోవడం వలన వారిద్దరూ భార్యా భర్తలుగా కలిసి జీవనం సాగించారు.
  • కొమిలిలోనంది (Komililo Nandi) ప్రజల నమ్మకం ప్రకారం ఐలెత్ (Ilet) అను మెరుపుయొక్క ఆత్మ మానవ రూపంలో ఒక కొండపై గుహలో అడుగుపెట్టడం జరిగింది. అందువల్ల అడవిలో భారీ వర్షం కురియగా ఎందరో వేటగాళ్లు మరణించారు. ఆ వర్షం రాకడకు కారణం తెలుసుకోవాలని కొందరు వేటగాళ్ళు అడవి అంతా వెదకి ఐలెత్ ను విషపు బాణాలతో చంపేస్తారు. దానితో వర్షం ఆగుతుంది.
  • క్వాయ (విక్టోరియా సరస్సు) (Kwaya – Lake Victoria) వద్ద ప్రజల నమ్మకం ప్రకారం ఒక ఇంటిలో దంపతులు పెద్ద పాత్రలను నింపుకోవడానికి ఆ ఇంటి అటుకుపై మహా సముద్రాన్ని ఒక చిన్న కుండలో నిల్వచేసుకొన్నారు. ఆ ఇంటి యజమాని తన కోడలితో ఆ చిన్న కుండను ముట్టుకోవద్దని, అందులో పూజ్యనీయులైన పూర్వీకులు ఉన్నారని చెబుతాడు. అత్యుత్సాహంతో ఆమె ఆ చిన్న కుండను ముట్టుకోగా అది పగిలి సముద్రపు నీరు అంతా వరదలా మారి సమస్తాన్ని ముంచివేసింది.
  • నైరుతి టాంజానియా (రుక్వా ప్రాంతం) (South-west Tanzania, Rukwa region) వారి నమ్మకం ప్రకారం నదులు పొంగి పొర్లుతుండగా దేవుడు కనిపించిన ఇద్దరు మనుషులను సమస్త జీవికోటి యొక్క విత్తనాలను తీసుకొని ఓడలోకి వెళిపోమ్మని చెప్పాడు. నీరు కొండలను ముంచేస్తుండగా వారు అలాగ చేశారు. తరువాత వారు ఒక పావురమును పంపగా అది వెళ్ళి తిరిగి వచ్చింది. ఒక డేగను పంపించగా అది వెళ్ళి తిరిగి రాకపోవడం వలన జల ప్రళయం సమాప్తమైనదని తెలుసుకొన్నారు. తర్వాత అంతా ఓడలోంచి నేల మీద అడుగుపెట్టారు.
  • పిగ్మీల నమ్మకం ప్రకారం సృష్టి ఆరంభంలో భూమి పై నీరు లేదు. ఒక ఊసరవెల్లి (Chameleon) ఒక రకమైన చెట్టు వద్దకు వెళ్ళి అందులో నుండి విచిత్రంగా నీటి శబ్దం విన్నది. అది ఆ చెట్టు కొమ్మను విరగొట్టగా అందులోనుండి నీరు అంతా బయటకొచ్చి భూమండలమంతా ప్రవహించింది. మొదటి స్త్రీ పురుష జంట ఈ నీటిలోంచి ఆవిర్భవించింది.
  • అబాబువా (ఉత్తర కాంగో) (Ababua – North Congo) వారి నమ్మకం ప్రకారం ఒకరోజు ఒక వృద్ధ స్త్రీ అవసరం కోసం ఇద్దరు మగవాళ్ళను చంపి నీటిని దొంగిలించింది. అప్పుడు Mba అను వ్యక్తి ఆ స్త్రీని చంపి నీటిని దక్కించుకొన్నాడు. ఆ స్త్రీ మరణం తరువాత ఆ నీరు అంతా వరదవలే ప్రవహించి సమస్తాన్ని ముంచివేసింది. ఆ నీటిలో అతడు కొట్టుకొనిపోయి చివరకు ఒక చెట్టుకు చిక్కుకొన్నాడు.
  • కికుయు, కెన్యా (Kikuyu, Kenya) వారి నమ్మకం ప్రకారం ఒక అందమైన యువతి ఒక యువకుడిని పెండ్లాడటానికి ఒప్పుకొన్నది. తన కుటుంబ వ్యక్తుల గురించి ఎప్పుడూ అడుగకూడదనే నిబంధనతో ఒప్పుకొన్నది. వారిద్దరూ వివాహం చేసుకొని వారి పెద్ద కుమారుడి సున్నతి వేడుక (circumcision ceremony) ముందు వరకూ హాయిగా జీవించారు. ఆ వేడుకకు భార్య యొక్క బంధువులు రాలేకపోయారని భర్త అనడంతో, భార్య వెంటనే పైకెగిరి భూమిలోకి 7 మైళ్ళ లోతుకి చొచ్చుకు వెళ్ళి ఆమె పూర్వీకులను పిలిచింది. వారు ఆత్మల రూపంలో కెన్యా పర్వతం నుండి వస్తూ ఉరుములు, వడగళ్ళ వాన తెప్పించారు. వారు వస్తూ ఆహారము, పశువులను, బీరును (మధ్యం), తెచ్చారు. ప్రజలు గుహల్లో తలదాచుకొనుచుండగా దేశాన్ని బీరుతో నింపేశారు. అది సరస్సులా మారింది. ఆత్మలు ఆ దంపతులను, వారి పిల్లలను తిరిగి కెన్యా పర్వతానికి తీసుకువెళ్ళిపోయారు.
  • బకోంగో (వెస్ట్ జైర్) (Bakongo, West Zaire) ప్రజల నమ్మకం ప్రకారం ఒక వృద్ధ స్త్రీ (జాంబి (Nzambi) దేవుడి మారువేషం) తప సుదీర్ఘ యాత్రలో అలసి కాలు పుండ్లతో సినాజెజి (Sinauzezi) అనే గ్రామం వచ్చి గ్రామస్తుల ఇళ్ళకు వెళ్ళి ఆథిద్యమిమ్మని వేడుకొన్నది. వారెవ్వరూ అంగీకరించలేదు. చివరకు ఒక ఇంట్లోకి వెళ్ళగా ఆ ఇంటివారు ఆమెను ప్రేమతో చేరదీసి, సేదదీర్చి, ఆమె గాయాలను తగ్గింపచేశారు. ఆమె బాగుపడిన తరువాత ఆ గ్రామం జాంబి చేత శపించబడినదని, జలప్రళయంలో చిక్కుకొనబోతున్నదని తనతో వారిని వెంబడించమని చెప్పింది. ఆ రాత్రి వారందరూ వృద్ధ స్త్రీని వెంబడించడంతో భయంకరమైన తుఫాను వచ్చి, మిగిలిన గ్రామస్తులందరినీ నాశనం చేసి లోయలో ఉన్న ఆ గ్రామాన్ని సరస్సుగా మార్చేసింది.
  • సౌత్ జైర్ (South Zaire) ప్రజల నమ్మకం ప్రకారం మోనా మొనెంగా (Moena Monenga) అను మంత్రగత్తె ఒకానొక గ్రామంలో ఆహారం, ఆతిధ్యం కొరకు వేడుకొన్నది. స్వార్ధపు గ్రామస్థులు ఆమెకు ఆహారం, ఆతిధ్యం ఇవ్వడానికి ముందుకు రాలేదు. అంతటితో ఆమె మెల్లగా అభిచారము (Magical chants) చేయగా గ్రామమంతా జలమయమైపోయి దిలోలో సరస్సు (Lake Dilolo) గా మారిపోయింది. గ్రామ దొర వేట నుండి తిరిగి వచ్చి తన కుటుంబం ఏమైపోయిందో అని వెదుకుతూ ఆ నీటిలో దూకాడు.
  • లోయర్ కాంగో (Lower Congo) ప్రజల నమ్మకం ప్రకారం ఒకసారి సూర్యుడు చంద్రుడిని కలిసాడు. చంద్రుడిపై మట్టి విసిరి వెలుగును మసకగా చేశాడు. ఇది జరిగినప్పుడు జలప్రళయం సంభవించింది. అప్పుడు మనుష్యులు పాల కర్రలను తమ వెనుక తగిలించుకోగా వారు కోతులుగా మారిపోయారు.
  • బేసంజ్ (Basonge) ప్రజల నమ్మకం ప్రకారం దేవుని మనుమరాలైన Ngolle జెబ్రా (Zebra) ను వివాహమాడింది. జెబ్రా Ngolle చేత పని చేయించననే వాగ్దానం తప్పాడు. అప్పుడు Ngolle తన కాళ్ళు చాచగా అందులోచి నీరు వచ్చి నేలను అంతా ముంచెత్తింది, అందులో ఆమె కూడా మునిగిపోయింది.
  • బెనా లువా (ఆగ్నేయపు జైర్) (Bena-Lulua) ప్రజల నమ్మకం ప్రకారం నీటి స్త్రీ ఆమె గాయాలను నాకినవారికే నీరు ఇవ్వసాగింది. ఒక వ్యక్తి ఆమె గాయాలను నాకగా, ఆమెలో నుండి నీరు బయటకు ప్రవహించి సమస్తాన్ని ముంచివేసింది. అతడు నాకడం కొనసాగించగా జలప్రళయం ఆగిపోయింది.
  • యొరుబ (నైరుతి నైజీరియా) ప్రజల నమ్మకం ప్రకారం ఇఫా (Ifa) అను దేవుడు భూమిపై నివసించడంలో విసుగెత్తి ఆకాశంలో నివస్తిస్తున్న ఒబటాల (Obatala) అను మరో దేవుడి వద్దకు వెళ్ళాడు. అతడి సాయం లేకుండా మానవులు ఏమీ చేయలేకపోవడంతో ఆగ్రహించిన ఓలోకన్ (Olokun) అను దేవుడు అందరినీ జలప్రళయంలో ముంచేశాడు.
  • ఇఫిక్ ఇబిబో, నైజీరియా (Ifik Ibibo, Nigeria) వారి నమ్మకం ప్రకారం సూర్య చంద్రులిద్దరూ భార్యా భర్తలు. స్నేహితుడు ప్రవాహం (flood) వారిద్దరివద్దకు అప్పుడప్పుడు విచ్చేసేవాడు. సూర్య చంద్రుల ఇల్లు చాలా చిన్నదని ప్రవాహం కాలంజరిపేవాడు. ఇది గమనించి సూర్య చంద్రులు మరింత పెద్ద గృహం నిర్మించుకొన్నారు. వారి ఆహ్వానాన్ని కాదనలేక నేను రావొచ్చా? అని అన్నాడు ప్రవాహం. ఇంటిలోకి వచ్చి మోకాలు లోతు నింపాడు. వారు ఇంకా ఆహ్వానించగా ఇంటిని మరింత నీటితో నింపాడు. ఆ నీటిలో చేపలు, సముద్ర జీవులు చేరాయి.. కొద్దిసేపటిలోనే ఇంటి పైకప్పు ఎత్తు వరకూ చేరాడు. సూర్య చంద్రులు ఇంటి పైకప్పుకి చేరిపోయారు. ప్రవాహం ఇంటిని మొత్తం ముంచేశాడు. సూర్య చంద్రులు మరో ఇంటిని కట్టుకొన్నారు.
  • ఎకోయ్, నైజీరియా (Ekoi, Nigeria) వారి నమ్మకం ప్రకారం మొదటి మానవుడైన ఏటిం'నే (Etim 'Ne), అతని భార్య ఎజా (Ejaw) ఆకాశం నుండి భూమికి వచ్చారు. భూమిపై నీరు లేనందున ఒబస్సి ఒసా (Obassi Osaw) అను దేవుడు ఎటిం'నేకు సొరకాయ బుర్రలో 7 గుళక రాళ్ళు ఇచ్చాడు. ఎటిం'నే ఒక రాయిని తీసుకొని భూమి పై చిన్న గొయ్యిలో పెట్టగా, భూమిలోంచి నీరు వచ్చి సరస్సుగా మారింది. తరువాత ఎటిం'నేకు ఏడుగురు కుమారు ఏడుగురు కుమార్తెలు పుట్టారు. వారిలో వారు వివాహం చేసుకొన్నారు. వారందిరికీ సరస్సులు పంచిపెట్టాడు. మునములు, మనవరాళ్ళు కూడా పుట్టి పెద్దవారై క్రొత్త ఇళ్ళు కట్టుకొన్నారు. సరస్సులనుండి ఒక్కొక్కరినీ 7 రాళ్లు సేకరించి, వాటిని సమాన దూరంలో గొయ్యలు తీసి పూడ్చిపెట్టమన్నాడు. అందరూ అలాగే చేశారు. అయితే ఒక కుమారుడు మాత్రం బుట్టనిండా రాళ్ళను సేకరించి అన్నిటినీ ఒకే చోట గుమ్మరించాడు. అంతే నీరు వచ్చి వరదగా మారి అతని పొలాన్ని ముంచేసింది, భూమిని అంతా ముంచబోయింది. అందరూ వెళ్ళి ఎటిం'నే వద్దకు పరుగెత్తారు. ఎటిం'నే ఒబస్సీకి మొరపెట్టుకోగా వరద తగ్గింది.
  • మేండిగో, ఐవరీ కోస్ట్ (Mandigo, Ivory Coast) వారి నమ్మకం ప్రకారం ఒక దానకర్ణుడు తనకున్నది అంతా జీవరాశులకు పెట్టాడు. అంతట తన భార్యా పిల్లలు అతడిని వదిలేశారు. ఆ దానకర్ణుడు ఒక అపరిచిత దేవుడికి కూడా ఆఖరి భోజనం పెట్టాడు. ఆ దేవుడు మెచ్చి అతనికి అంతులేని సంపదను ఇచ్చి, స్వార్ధపరులైన మానవుల్ని నాశనం చేయడానికి దేవుడు ఆ దానకర్ణుడుని అక్కడనుండి వెళ్ళిపోమంటాడు. దేవుడు చెప్పిన ప్రకారం అతడు వెళ్ళిపోగానే మిగిలిన మానవజాతి జలప్రళయంలో నాశనమైనది. ఇప్పటి మానవ జాతి ఇతడి సంతతి.
  • వోగల్ (Vogul) పర్వతశ్రేణిలో ఉన్న తెగలవారి నమ్మకం ప్రకారం ఏడు సంవత్సరాల కరువు తరువాత ఒక రక్కసురాలు తన భర్తతో ఎక్కడొ వర్షాలు వచ్చాయని, తమకు తాము కాపాడుకోవడం ఎలా అని చెబుతుంది. ఆపుడు భర్త ఇతర రాక్షసులను పిలిచి పోప్లార్ (poplar) అను చెట్టు చెక్కతో పడవలను తయారు చేసి వాటిని విల్లో (willow) అనే చెట్టు నారతో లంగరు వేయమని, పడవల్లో 7 రోజులకు సరిపడా ఆహారం ఎక్కించమని, విల్లో త్రాళ్లకోసం కరిగించిన వెన్న నుండి ఘృతాన్ని తీయమని చెబుతాడు. అలా చెప్పినట్టు చేయనివారందరూ 7 రోజులపాటూ సంభవించిన జలప్రళయంలో మునిగిపోయారు. జల ప్రళయం సమాప్తి అయిన తర్వాత బ్రతికినవారు నుమి-తరోం (Numi-târom) అను దేవుడికి మొరపెట్టగా, ఆ దేవుడు మళ్ళీ జీవరాశిని సృష్టించాడు.
  • ఉత్తర సైబీరియా (North Siberia) ప్రాంతపు ప్రజల నమ్మకం ప్రకారం ఏడుగురు మనుష్యులు పడవలో జలప్రళయం నుండి బయటపడ్డారు. తర్వాత చాలా దారుణమైన కరువు రావడంతో ఒక్క భార్యా భర్తల జంట తప్పించి అందరూ ఆకలితో చనిపోయారు. మిగిలిన భార్యా భర్తలు ఒక చోట గొయ్యి తీయగా అందులోనుండి వచ్చిన ఎలుకలను తిని బ్రతికారు. ఈ దంపతులనుండి ఇప్పటి మానవజాతి పుట్టింది.
  • ఉత్తర మధ్య సైబీరియా (North-Central Siberia) లో ఒక నమ్మకం ప్రకారం ఏడు రోజుల పాటూ సంభవించిన జలప్రళయంలో కొంత మంది మానవులు జంతువులు నీటిలో తేలుతున్న వృక్ష దూలాల పై, తెప్పలపై దూకి ప్రాణాలు కాపాడుకున్నారు. 7 రోజులపాటూ బలమైన ఉత్తర గాలులు గాలి వీచి మనుష్యులందరినీ చెల్లాచెదరు చేసింది. అందువల్ల నేడు ఎన్నో జాతుల ప్రజలున్నారు, పలు భాషలు మాట్లాడుతున్నారు.
  • ఈశాన్య సైబీరియా (North-east Siberia) నమ్మకం ప్రకారం ప్రపంచం ఆదిలో జల ప్రళయం సంభవించింది. కొంతమంది కలసిపోయిఉన్న చెట్ల కాండాలతో తయారుచేయబడిన తెప్పల్లోకి ఎక్కి రక్షించుకొన్నారు.
  • ఆల్టెక్ (Altaic, Central Asia) ప్రజల నమ్మకం ప్రకారం టెంగిస్ (Tengys) (సముద్రం) ఒకప్పుడు భూమిని పాలించే రాజు. ఇతడి పాలనలో నమ (Nama) అను వ్యక్తి తన ముగ్గురు కుమారులతో జీవించేవాడు. అల్జెన్ (Ülgen) అను దేవుడు నమాను ఒక ఓడ నిర్మించమంటాడు. కంటిచూపు మందగించడంతో ఆబాధ్యతను తన కుమారులకి అప్పగించాడు. ఆ ప్రకారంగా ఓడను ఒక కొండపై నిర్మించారు. నమ తన కుటుంబాన్ని, పక్షి జంతు జాతులను ఓడలో ఎక్కించాడు. జల ప్రళయం సంభవించింది. ఏడు రోజుల తరువాత నమ యొక్క జ్యేష్ట కుమారుడు తలుపు తీసి చూడగా పర్వత శిఖారాలు మాత్రమే కనిపించాయి. ఆ తరువాత నీరు, ఆకాశం మాత్రమే కనిపించాయి. ఆఖరికి ఓడ ఎనిమిది కొండల శ్రేణి వద్ద ఆగింది. తరువాత నమ ఒక కాకిని, బొంత కాకిని, మరొక రకమైన కాకిని పంపగా అవి తిరిగి రాలేదు. తరువాత ఒక పావురమును పంపగా అది వెళ్ళి భూర్జపత్ర (Birch) చెట్టు కొమ్మను తీసుకొచ్చింది.

నమా వృద్ధుడైపోయాడు. రక్షింపబడిన మనుష్యులను, జంతువులను చంపేస్తే అవి మరో లోకానికి తరలివెళ్ళి అక్కడ నమ పాలనలో ఉంటాయని భార్య చెబుతుంది. నమకు ఏం చేయాలో తోచలేదు. తల్లి మాట కాదనని కుమారుడు నీల-నల్లని ఆవు ఒక మనుష్యులు కాళ్ళు మాత్రమే కనబడేవిధంగా మ్రింగివేసిన కథను తండ్రితో చెప్పగా, అది అర్ధం చేసుకొన్న నమ తన భార్యను నిలువునా కత్తితో చీల్చాడు. చివరికి నమ అతని జ్యేష్ట కుమారుడితో సహా స్వర్గం చేరి ఆకాశంలో తారావళి (constellation) గా మారిపోయారు.

  • సొయొత్, ఉత్తర మంగోలియావారి విశ్వాసం ప్రకారం భూమిని మోస్తున్న ఒక తాబేలు (లేక కప్ప) కదిలింది, అందువల్ల ఆకాశంలోంచి సముద్రం వచ్చి భూమిని ముంచేసింది. దీనిని ముందే పసిగట్టిన ఒక వృద్ధుడు ఇనుముతో చేసిన పడవలో తన కుటుంబాన్ని ఎక్కించాడు, రక్షింపబడ్డాడు. నీరు ఆరిపోయిన తరువాత ఆ పడవ చెట్లు ఉన్న కొండపైకి చేరింది.
  • మంగోలియా (Mongolia) ప్రజల విశ్వాసం ప్రకారం హైలిబు (Hailibu) అనే వేటగాడు కొంగ వేటాడుతున్న ఒక తెల్ల సర్పాన్ని రక్షించాడు. మర్నాడు ఆ సర్పాన్ని ఇతర సర్పాలతో వెళుతుండగా చాశాడు. హైలుబుతో ఆమె తాను ఒక డ్రాగన్ రాజు (Dragon King) కుమార్తెనని, తన తండ్రి వద్ద ఒక విలువైన రత్నం ఉన్నదని, ఆ రత్నాన్ని సాధించగలిగితే జంతువుల భాష నేర్చుకోవచ్చని, ఆ రహస్యాన్ని ఇతరులకు చెబితే శిలగా మారిపోతావని చెబుతుంది. హైలిబు ఆ ప్రకారంగా డ్రాగన్ రాజునుండి రత్నాన్ని సాధిస్తాడు. కొన్ని సంవత్సరాల తర్వాత కొన్ని పక్షులు కొండలు బ్రద్దలై నేల అంతా జలమయమైపోతుందని మాట్లాడుకొనుచుండగా హైలిబు విని ఇంటికెళ్ళి బంధువులను జరుగబోయే విపత్తు గురించి హెచ్చరిస్తాడు. ఎవరూ హైలిబును నమ్మలేదు. వారిని నమ్మించడానికి రత్నం గురించిన రహస్యం చెప్పగా అతడు శిలగా మారిపోయాడు. ఇది కళ్ళారా చూచిన ప్రజలు పరుగెత్తారు. ఆ రాత్రి అంతా ఎడతెరుపు లేకుండా వర్షం కురవడంతో కొండలు బ్రద్దలై, నేల అంతా నీటిలో మునిగిపోయింది. జలప్రళయం సమాప్తమైన తరువాత ప్రజలు వెనక్కి వచ్చి హైలిబు శిలను కొండపై ప్రతిష్ఠించారు.
  • బుర్యాత్, తూర్పు సైబీరియా (Buryat, East Siberia) వారి విశ్వాసం ప్రకారం బుర్కాన్ (Burkhan) అనే దేవుడి సలహా ప్రకారం ఒక వ్యక్తి అడవిలో ఎన్నో రోజులు శ్రమించి, ఇంట్లో భార్యకు కూడా చెప్పకుండా రహస్యంగా ఓడను నిర్మించాడు. శిత్కర్ (Shitkur) అనే దెయ్యం ఆ వ్యక్తి అడవిలో ఓడను నిర్మిస్తున్నాడని, ఆ ఓడలోకి ఎక్కవద్దని, భర్త కొడితే "ఎందుకు కొట్టావ్?" అని అడుగమని భార్యతో రహస్యం చెబుతాడు. భర్త ఆజ్ఞతో భార్య ఓడ ఎక్కింది. కాని ఆమెతో పాటూ శిత్కర్ కూడా ఎక్కాడు. బుర్కాన్ సాయంతో జీవరాశులన్నిటినీ (ఏనుగులలో ఒక జాతియైన మమ్మోతులను తప్ప) ఓడ ఎక్కించాడు. జల ప్రళయం సంభవించడంతో భూమ్మీద అన్ని జంతువులు కొట్టుకుపోయాయి. ఒకసారి దెయ్యం ఎలుకలా మారి ఓడలో రంధ్రాలు పెట్టసాగింది. దేవుడు దానిని చంపడానికి పిల్లిని పంపాడు.
  • సగైయె, తూర్పు సైబీరియా (Sagaiye, East Siberia) వారి విశ్వాసం ప్రకారం దేవుడి సలహాతో నొజ్ (Noj) అనే వ్యక్తి అడవిలో ఓడను నిర్మించడానికి సిద్దమౌతాడు. దెయ్యం అడ్డగించడంతో జలప్రళయం సంభవించేనాటికి ఓడను నిర్మించలేకపోతాడు. అప్పుడు దేవుడు ఒక ఇనుప నావ (Boat) ను ప్రసాదిస్తాడు. అందులో ఆ వ్యక్తి, కుటుంబంతో పాటూ జీవరాశులు అన్నీ రక్షింపబడతాయి.
  • రష్యా (Russia) వారి విశ్వాసం ప్రకారం నోవాహు ఎందుకు ఓడను నిర్మిస్తున్నాడో తెలుసుకోవడానికి దెయ్యం నోవాహు భార్య వద్దకు వెళ్ళి, ఆమెతో ఒక ఘాటైన మధువు తయారుచేయిస్తాడు. నోవాహు దాన్ని త్రాగి జలప్రళయం గురించి దేవుడు తనతో చెప్పిన రహస్యాన్ని చెబుతాడు. దెయ్యం ఎంత అడ్డగించినా నోవాహు ఓడ నిర్మాణం పూర్తిచేస్తాడు. దెయ్యం నోవాహు భార్యతో కూడి ఆమె నోటితో తన (దెయ్యం) పేరు చెప్పిస్తాడు. ఒకసారి ఓడలో దెయ్యం ఎలుక రూపం ఎత్తి క్రింది భాగానికి రంధ్రాలు చేస్తాడు.
  • హిందూ గ్రంథాల్లో ఐదు జల ప్రళయ కథలు ప్రచారంలో ఉన్నాయి.

ఒక కథ ప్రకారం ఆది మానవుడైన మనువు ఒకసారి చేతులు కడుక్కొనుచుండగా నీటిలో చిన్న చేపను చూశాడు. తనను పెద్ద చేపల భారినుండి రక్షిస్తే తిరిగి మేలు చేస్తానని ఆ చేప పిల్ల మనుతో చెప్పింది. అంతట మనువు ఆ చేపను తీసుకొని దానిని పెద్ద పెద్ద కాలువల్లో వేశాడు. అది పెరిగి పెద్దదవాగా దానిని మనువు సముద్రంలో కలిపాడు. ఆ చేప రాబోయే జలప్రళయం గురించి చెప్పి ఒక ఓడను నిర్మించమని మనువుతో చెబుతుంది. జల ప్రళయం సంభవించగా మనువు తన ఓడను ఆ చేప కొమ్ముకి లంకె వేశాడు. ఆ చేప మనువుని ఓడలో ఉత్తర పర్వతాలకు తీసుకెళ్ళింది. చేప చెప్పిన ప్రకారం అక్కడ మనువు తన ఓడను ఒక చెట్టుకు లంగరు వేశాడు. ఆ విధంగా మనువు, జీవరాశులు మాత్రమే బ్రతికి బయటపడ్డాయి. అక్కడ కరిగించిన వెన్నను, తోడంటు, కుంపెరుగును దేవుళ్ళకు సమర్పించాడు. ఇందులోనుండి ఒక స్త్రీ ఆవిర్భవించింది. ఈ స్త్రీ మనువు కుమార్తెగా చెప్పబడింది. ఆమె ద్వారా సమస్త ఆశీర్వచనాలు, వంశాన్ని విస్తరించాడు. మరో కథ ప్రకారం చిరిణి అనే నది ఒడ్డున తప్పసు చేసుకుంటున్న మనువు నీటిలో ఒక చేపను చూశాడు. పెద్ద చేపల భారినుండి రక్షించమని ఆ చేప మనువుని వేడుకొన్నది. అంతట మనువు ఆ చేపను ఒక జాడీలో వేశాడు. ఆ చేప పెరిగి పెద్దదైన తర్వాత దాన్ని మనువు సముద్రంలో వేశాడు. కొద్దికాలంలో నేలమీద ఉన్న సమస్తం మునిగిపోతాయని, కనుక ఓడ నిర్మించుకోమని, అందులో సప్తఋషులతో సహా ప్రతి జీవరాశి విత్తనాన్ని ఎక్కించమని మనువుకు చెబుతుంది. మనువు ఆ విధంగా చేశాడు. ఆ చేప జలప్రళయం సమయంలో ఓడను పట్టుకొని కొన్ని సంవత్సరాలకి హిమావత పర్వతానికి తీసుకెళ్ళింది. ఆ చేప ప్రజాపతి బ్రహ్మగా బయల్పరచుకొని మనువును సమస్త జీవరాశులను సృష్టించమన్నది. సూర్యుడి కుమారుడైన మనువు ఘోర తపస్సు చేసి సృష్టి వినాశనం తర్వాత జీవరాశిని రక్షించే వరాన్ని బ్రహ్మ నుండి పొందుతాడు. మనువు తన ఆశ్రమంలో కొన్ని సమర్పణలు చేస్తుండగా అతని చేతిలోకి ఒక చిన్న చేప పడింది. ఆ చేపను మరువు పెంచాడు. అది పెరిగి పెద్దదవ్వగా దాన్ని గంగా నదిలోకి, తరువాత సముద్రంలోకి వదిలాడు. సముద్రాన్ని కూడా ఆక్రమించిన ఆ చేపను బ్రహ్మ అవతారమైన జనార్ధనుడిగా గుర్తించాడు. బ్రహ్మ చెప్పిన ప్రకారం మనువు ఓడను నిర్మించి అందులోకి అతని కుటుంబాన్ని, జీవరాశులని, చెట్ల విత్తనాలను తీసుకెళ్ళాడు. జలప్రళయం సంభవించగా జనార్ధనుడు చేప రూపంలోను, అననంత అనే సర్పం త్రాడు రూపంలోను వచ్చి ఆ ఓడను సంరక్షించడం జరిగింది. గతంలో జరిగిన యుగాంతం చివరలో బ్రహ్మ యొక్క పరిశుద్ధ పుస్తకాలను హయగ్రీవుడు అనే రాక్షసుడు దొంగిలించాడు. అందువల్ల మానవులంతా పాపులైపోయారు. అందువల్ల నిషి (Nishi) అను అటవీ తెగలో సప్త ఋషులు, సత్యవ్రతుడు (7వ మనువు) తప్పించి మిగిలిన మానవులంతా పాపులైపోయారు. ఒకసారి సత్యవ్రతుడు నది వద్ద స్నానమాడుచుండగా, ఒక చేప అక్కడికి వచ్చి తనను రక్షించమని సత్యవ్రతుడిని ప్రాధేయపడింది. అంతట సత్యవ్రతుడు దానిని తీసుకొని క్రమేణా పెద్ద పెద్ద పాత్రల్లో పెంచసాగాడు. తరువాత ఆ చేపను విష్ణుమూర్తి అవతారంగా గుర్తించాడు. ఆ చేప చెప్పిన ప్రకారం ఓడ నిర్మించి అందులోకి సప్తఋషులను, వారి భార్యలను, సమస్త జంతువులను ఔషధ మొక్కల విత్తనాలను, ఆహారధాన్యాలను ఎక్కించాడు. ఏడు రోజులకి సముద్రాలు పొంగి భూమినంతా ముంచేశాయి. చేప అవతారంలో ఉన్న విష్ణుమూర్తి ఓడను త్రాడు రూపంలో ఉన్న అనంత అనే సర్పంతో తనకు లంగరు వేసుకొన్నాడు. జలప్రళయం సమాప్తమైన తర్వాత విష్ణుమూర్తి పుస్తకాలను దొంగిలించిన రాక్షసుడిని సంహరించి సత్యవ్రతుడికి ఆ పుస్తకాల్లో ఉన్న విషయాలను వివరించాడు. ఒకసారి భయంకరమైన గాలి వీయగా ద్వారకావటి నగరపు ఓడ రేవుని ముంచివేసింది. రైవతక (Raivataka) కొండల్లో వెళ్ళుతున్న కృష్ణుడు, అతని సోదరుడైన బలరాముడు తప్ప అందరూ ఆ నీటిలో కొట్టుకుపోయారు. శేషు అను సర్పం బలరాముడి శక్తిని హరించివేయగా, బలరాముడి ఆత్మ సముద్రంలో పడిపోయింది. దుష్టత్వంతో నిండిపోయిన ప్రపంచాన్ని మర్నాడు నాశనంచేద్దమనుకొని అలసటతో ఉన్నచోటనే నిద్రించాడు. జర అను వేటగాడు దుప్పి కోసం వేటాడుతూ పొరపాటున కృష్ణుడి ఒక పాదాన్ని దుప్పి తలయంకొని బాణంతో కొట్టాడు. కాషాయ వస్త్రం, నాలుగు చేతులు, చాతీపై నగలు ఉన్న కృష్ణుడు మరణించియుండటం చూచి ఆశ్చర్యపోయాడు. నీటి కెరటాలు జర పాదాను తాకాయి.

  • దక్షిణ భారతదేశంలో భిల్ (Bhil) అను అటవీ తెగలవారి నమ్మకం ప్రకారం ఒకనాడు ఒక చాకలి ఓ చేపకు ఆహారం పెట్టాడు. ఆ చేప కృతజ్ఞతతో రాబోవు జలప్రళయం గురించి ప్రవచిస్తుంది. ఆ చాకలి ఒక పెద్ద పెట్టె తయారుచేసి అందులోకి తన స్త్రీని, ఒక కోడిపుంజుని ఎక్కించాడు. వరద సమాప్తి అయిన తరువాత పరిస్థితిని తెలుసుకోవడానికి శ్రీరాముడిచే పంపబడిన దూత కోడి కూతలను బట్టి ఆ పెట్టెను కనుగొంటాడు. రాముడు చాకలిని ప్రశ్నించాడు. ఆ చాకలి ఉత్తరం వైపు, తూర్పు వైపు, పడమర వైపు తిరిగి ఆ పెట్టెలోని స్త్రీ తన సోదరి అని ప్రమాణం చేశాడు; దక్షిణం వైపు తిరిగి ఆమె తన భార్య అని ప్రమాణం చేశాడు. జలప్రళయ రహస్యం ముందుగా చెప్పినందుకు గాను రాముడు ఆ చేప నాలుక కోసివేశాడని, అందుకే చేపలకు నాలుకలుండవని చెప్పబడింది. మనుష్యులను విస్తరించమని చెప్పగా ఆ చాకలి తన సోదరినే వివాహం చేసుకొన్నాడు. ఫలితంగా వారికి ఏడుగురు కుమారులు, ఏడుగురు కుమార్తెలు జన్మించారు. జ్యేష్ట కుమారుడు రాముడు బహూకరించిన అశ్వాన్ని నడుపలేక అడవికి కట్టెలు కొట్టుకోవడానికి పోయాడు. అతడి వంశస్తులే వడ్రంగులయ్యారు.
  • కమర్ (రాయ్ పూర్ జిల్లా, మధ్య భారతదేశం) వారి నమ్మకం ప్రకారం ఒక దంపతులకు కుమారుడు, కుమార్తె జన్మించారు. దేవుడు తనను కోపం తెప్పించిన తోడేలును చంపదలచి జలప్రళయం రప్పించాడు. అది చూచిన దంపతులు తమ పిల్లలను ఒక చెక్క పెట్టెలో, ఆహారంతో సహా భద్రపరుస్తారు. వరద రావడంతో భూమ్మీద అన్నీ తుడిచిపెట్టుకుపోయాయి. 12 సంవత్సరాల తర్వాత దేవుడు రెండు పక్షులను సృష్టించి తోడేలు మరణించిందో లేదో కనుక్కొనడానికి పంపాడు. వాటికి ఏమీ కనిపించేదు, తేలియాడుతున్న పెట్టె తప్ప. అక్కడ వాలి పిల్లలు మాటలు విని విని, వెళ్ళి దేవుడికి చెప్పగా, దేవుడు వరదను తగ్గించి, వారిని పెట్టెలోంచి బయటకు తెచ్చి వారు కథ వింటాడు. అన్నా చెల్లెలు వివాహం చేసుకుంటారు. వారికి పుట్టిన పిల్లలకు దేవుడు వివిధ కులాల పేర్లు పెట్టాడు. నేటి ప్రజలు వీరి సంతానమే.
  • అస్సాం, ఈశాన్య భారతదేశంలో నమ్మకం ప్రకారం ఒకసారి నేల భాగమంతా జలప్రళయంలో మునిగిపోయింది. . ఒక భార్యా భర్తల జంట మాత్రం లెంగ్ హిల్ (Leng hill) అనే కొండపై తలదాచుకొన్నారు. మర్నాడు లే చేసరికి వారు మగపులి, ఆడపులిగా మారిపోయారు. భూమియొక్క దుస్థితిని గమనించిన దేవుడు ఒక పురుషుడిని, ఒక స్త్రీని ఆ కొండపైయున్న గుహనుండి పంపాడు. వారు పులులను చూడగా భీతిచెందారు. బలం కోసం సృష్టికర్తకు ప్రార్ధిచుకొని ఆ పులులను చంపేశారు. ఆ తరువాత వారు ఆనందంగా జీవిస్తూ మానవాళిని విస్తరించారు.
  • దక్షిణ భారతదేశం, తమిళనాడులో ప్రజల నమ్మకం ప్రకారం కుమారి కందం సగభాగం, మొదటి తమిళ సంఘం కూడా మునిగిపోయింది. ప్రజలు ఆ ప్రాంతాన్ని వదిలి మరోచోట రెండవ తమిళ సంఘాన్ని ఏర్పరచుకోగా, ఆ ప్రాంతాం కూడా సముద్రంలో మునిగిపోయింది. తిరుమారన్ (Thirumaaran) అనే రాజు మిగిలిన తమిళ సాహిత్యాన్ని తీస్కొని నేటి తమిళనాడుకు ఈదుకుంటూ చేరాడు.
  • సిక్కీంలో లెప్చా ప్రజల నమ్మకం ప్రకారం ఒక భార్యా భర్తల జంట జల ప్రళయం నుండి తప్పించుకొని డార్జిలింగ్ వద్ద తెందాంగ్ అనే పర్వతం మీద తలదాచుకొన్నారు.
  • గయా (Gya) అను దేవుడు కనికరించే వరకూ టిబెట్ (Tibet) అంతా నీటిలో మునిగియుండేది. దేవుడు ఆ నీటిని అంతా బెంగాల్ మీదుగా, గురువులను పంపించి అక్కడున్న ప్రజలకు విద్య నేర్పించాడు. అప్పటినుండి ప్రజలు ఆ నేల భాగమంతా విస్తరించారు.
  • అస్సాంలో సింగ్ఫో (Singpho) ప్రజల నమ్మకం ప్రకారం ఒకప్పుడు మానవాళి అంతా గోవులను, పందులను బలి ఇవ్వకపోవడం వల్ల జలప్రళయంలో నాశనమైనది. ఒక భార్యా భర్తల జంట మాత్రం జలప్రళయం నుండి తప్పించుకొని సింఘ్రభం (Singrabhum) అను పర్వతంపై తలదాచుకొన్నారు. వారి సంతానమే నేటి ప్రజలు.
  • అస్సాంలో లుషై (Lushai) ప్రజల విశ్వాసం ప్రకారం జల రాక్షసుల్లో ఒక రాజు నగై తె (Ngai-ti) అను మానవ కన్యను మోహించాడు. ఆమె నిరాకరించి పారిపోయింది. ఆగ్రహించిన రాజు ప్రజలను ఫన్ లు బుక్ అను కొండపై నిర్భందించి, ఆ కొండ చుట్టూరా నీటిని ప్రవహింపజేశాడు. నీటి మట్టం పెరుగుతుండగా ఆ అమ్మాయిని నీటిలోకి త్రోసివేశారు. అంతే నీటిమట్టం తగ్గిపోయి జల ప్రళయం సమాప్తమైనది. అప్పటివరకూ కొండలు లేని భూమిపై నీరు వెళిపోతున్నప్పుడు కొండలు చెక్కబడ్డాయి.
  • లిసు (Lisu) (వాయువ్వ యున్నన్, చైనా, పరిసర ప్రాంతాలు) ప్రజల విశ్వాసం ప్రకారం ఒక గ్రామంలో నివసించిన అన్నా చెల్లెళు రెండు బంగారు పక్షులు చెప్పిన ప్రకారం గుమ్మడి కాయలో దాక్కొని 99 రోజులపాటూ సంభవించిన జలప్రళయంనుండి తప్పించుకొని కొండపైకి చేరారు. ఆ పక్షుల సాయంతో డ్రాగన్ రాజునుండి ధనస్సును, విల్లులను సాధించి, వాటితో సూర్య చంద్రులను తప్ప, ప్రకాశించేవాటన్నిటినీ రాల్చారు. ఆ కొండపై మానవమాత్రులు ఎవరూ లేకపోవడంతో ఆ బంగారు పక్షులు చెప్పిన ప్రకారం అన్నా చెల్లెళు ఇద్దరూ వివాహం చేసుకొన్నారు . ఫలితంగా వారికి ఆరుగురు కుమారులు, ఆరుగురు కుమార్తెలు పుట్టారు. వారు వివిధ దిశల్లోకి ప్రయాణించి వివిధ జాతులవారికి పూర్వీకులైయ్యారు.
  • లోలో (Lolo) (నైరుతి చైనా) ప్రజల విశ్వాసం ప్రకారం ఆదిలో ప్రజలు దుర్మార్గులైయుండేవారు. Tse-gu-dzih అనే దేవుడు తన దూతను భూమీదికి పంపాడు. ఆ దూత మనుష్యులను రక్త మాంసాలను అడుగగా డు-ము (Du-mu) అను ఒక యువకుడు మాత్రమే స్పందించాడు. ఇది గమనించిన దేవుడు జలప్రళయాన్ని సృష్టించాడు. డు-ము తన నలుగురు కుమారులను, నీటి కుక్కలను, అడవి బాతులను, మొదలైన వాటిని ఒక పడవలో ఎక్కించుకొని జలప్రళయం నుండి తప్పించుకొన్నాడు. చదివి వ్రాయగలిగిన వారు ఈ నలుగురు కుమారుల సంతానం, విద్య లేనివారు డు-ము చెక్కిన చెక్క బొమ్మల సంతానం.
  • జినో, దక్షిణ యున్నాన్ (Jino, South Yunnan), చైనా వారి నమ్మకం ప్రకారం సృష్టి ఆరంభం నుండి ప్రజలు సుఖ సంతోషాలతో జీవించసాగారు. అనుకోకుండా ఒకసారి జలప్రళయం వచ్చింది. ఒక భార్యా భర్తల జంట పెద్ద చెట్టును నరికి, దాని కాండం లోపల తొర్రగా చేసి, తమ కవల పిల్లలను అందులో కుర్చోబెట్టి, ఆహారాన్ని, చాకుని, తేనె మైనాన్ని కూడా పెట్టి, కాండం రెండువైపులా ఆవు చర్మంతో మూసేశారు. ఆ చెట్టుకు చిన్న ఇత్తడి గంటలు కూడా కట్టారు. ఆ కవల పిల్లలు - మహె (Mahei), మనియు (Maniu) అని పిలువబడే ఆన్నా చెల్లెలు. జల ప్రళయం చాలా సంవత్సరాలు కొనసాగిన తరువాత, ఆ చెట్టు కాండం నేలకు తగలడంతో గంటలు మ్రోగాయి. అప్పటికే వారు ముసలివారైపోయారు. వారిద్దరూ తప్ప ఇంకెవ్వరూ బ్రతకలేదని, వారు కూడా మరణిస్తే ఇంకెవ్వరూ భూమ్మీద ఉండరని గ్రహిస్తారు. వారిద్దరూ వివాహం చేసుకొన్నారు. కాని వారు వృద్ధులగుట వలన పిల్లలను కనలేకపోయారు. చివరికి వారు తెచ్చుకొన్న గుమ్మడికాయ నుండి కొంగ్ (Konge) ప్రజల పూర్వీకుడైన అపో (Apo), హన్ దాయ్ (Han Dai), జినో మొదలైన పూర్వీకులు ఉద్భవించారు.
  • కరేన్ (Karen), బర్మా వారి ప్రకారం ఇద్దరు సోదరులు పడవపై జలప్రళయం నుండి బయటపడ్డారు. వారిద్దరూ స్వర్గానికి వెళ్ళేదాకా నీటి ప్రవాహం పెరగసాగింది. దేవభూమిలోంచి ఒక మామిడి చెట్టు ఎదిగింది. చిన్నవాడు ఆ చెట్టు ఎక్కి మాడికాయను తిన్నాడు. అంతే ప్రళయం తగ్గిపోయింది.
  • చింగ్ పా, ఎగువ బర్మా (Chingpaw, Upper Burma) వారి నమ్మకం ప్రకారం జల ప్రళయం వచ్చినప్పుడు పాపా నాంచాంగ్ (Pawpaw Nan-chaung), అతని చెల్లెలైన చాంగ్ కొ (Chang-hko) పెద్ద పడవతో బయటపడ్డారు. వర్షం తగ్గుముఖం పట్టగా రోజుకి ఒక కోడి పుంజునును, ఒక సూదిని విసరసాగారు. తొమ్మిదవ రోజున అలా చేయాగా కోడి కూసింది, సూది భూభాగాన్ని తాకింది. వారు పడవదిగి దగ్గరలో అన్నా చెల్లెలు ఇద్దరు మంత్రగత్తెల ఉండే గుహకు వెళ్ళారు. వారిద్దరూ వివాహం చేసుకొని పిల్లల్ని కన్నారు. వారిద్దరూ పనికోసం బయటకు వెళ్ళగా, ఒంటరిగా కేరింతలు కొడుతున్న శిశువుని ఒక మంత్రగత్తె చూచి ఈర్ష్యపడి, ఆ శిశువుని చంపి ముక్కలు ముక్కలుగా చేసి, చిందవర వందర చేసి, కొన్ని ముక్కలను మాత్రం తీసుకెళ్ళి కూర వండుకొన్నది. ఇది తెలుసుకొన్న తల్లి నాలుగు రోడ్ల కూడలికి వెళ్ళి ఆవేదనతో తన శిశువుని ఇచ్చేయమని గొప్ప ఆత్మను వేడుకొన్నది. అది అసంభవమని, కాని ఆమెను మానవాళికి తల్లిగా చేస్తానని మాట ఇచ్చింది. అంతే ఒక్కొక్క దారి నుండి ముక్కలైపోయిన శిశువు భాగాల నుండి ఎన్నో జాతులవారు ఉద్భవించారు.
  • చైనావారి నమ్మకం ప్రకారం మానవుల దుష్ప్రవర్తనకు ఆగ్రహించిన రాజ్యాధిపతి ఆజ్ఞ ప్రకారం జల దేవుడైన గాంగ్ గాంగ్ (Gong Gong) జల ప్రళయాన్ని రప్పించాడు. 22 ఏళ్ళపాటూ కొనసాగిన జలప్రళయంలో ప్రజలు పర్వత గుహల్లో తలదాచుకొన్నారు. నీటి ప్రవాహాన్ని ఆపడానికి గన్ (Gun) అనే వీరుడు స్వర్గం నుండి సారవంతమైన మన్నును దొంగిలించాడు. కాని రాజ్యాధిపతి అగ్ని దేవుడిని పంపించి గన్ ను చంపించాడు. మూడు సంవత్సరాల తర్వాత కూడా గన్ శరీరం కుళ్ళిపోలేదు. అతన్ని ముక్కలు చేసిన తర్వాత అతని కుమారుడు యు (Yu) కొమ్ములున్న డ్రాగన్ రూపంలో ఆవిర్భవించాడు. గన్ శరీరం కూడా డ్రాగన్ వలే మారిపోయింది. రాజ్యాధిపతి అదిరిపడ్డాడి యుకు మట్టిని ఇచ్చి యింగ్ (Yeng) అనే డ్రాగన్ తో పంపాడు. ఆ డ్రాగన్ ఇతర దేవుళ్ళ సాయంతో గాంగ్ గాంగ్ ను తరిమి, ఆ మట్టిని ప్రళయం ఆగిఫొయేలా విస్తరించింది.

ను కువా (Nu Kua) అను దేవత రాజుని ఓడించి కొండపైకి తరిమేసింది. ఆ రాజు ఒక స్త్రీ చేతిలో ఓడిపోవడం అవమానంగా భావించి తన తలను-ఆకాశ వెదురు (Heavenly Bamboo) గెడకేసి కొట్టుకొని ఆత్మ హత్య చేసుకొన్నాడు. ఆ వెదురు చెట్టు ఆకాశాన్ని చీల్చుకొంటూ కూలిపోయింది. అంతట వరద వచ్చి కువా, ఆమె సైన్యాన్ని తప్పించి సమస్తాన్ని నాశనం చేసింది.ను కువా ఐదు రకార రంగు రాళ్ళతో చేసిన ప్లాస్టర్ తో ఆకాశంలో చిల్లుని మూసివేసింది. వరద ఆగిపోయింది.

  • కొరియా ప్రజల నమ్మకం ప్రకారం ఒక బాలుడు అప్సరసకు, పున్నాగ చెట్టుకు జన్మించాడు. బాలుడికి 7 సంవత్సరాల వయస్సు వచ్చేసరికి వర్షాలు మొదలై కొన్ని నెలలపాటూ కొనసాగి భూమినంతా ముంచేసింది. ఆ బాలుడు చెట్టుతో సహా నీటిలో తేలుతుండగా, ఒక చీమల దండు వచ్చి కాపాడమని వేడుకొనగా అ చెట్టు అనుమతి తీసుకొని వాటిని కాపాడతాడు. తరువాత దోమలను, ఆ తరువాత మరో బాలుడుని కాపాడతాడు. వరద అలల తాకిడికి ఆ చెట్టు ఒక కొండపైకి చేరింది. చేమను, దోమలు ఆ బాలుడికి కృతజ్ఞతలు చెప్పి అక్కడినుండి సెలవు తీసుకొన్నాయి. బాలురు ఇద్దరూ ఆ కొండపై వృద్ధ స్త్రీ ఉండే ఒక ఇంటికి చేరుకొన్నారు. ఆ వృద్ధ స్త్రీ తన కుమార్తెను, పెంపుడు కుమార్తెను ఈ ఇద్దరి బాలురకు ఇచ్చి వివాహం చేసింది. ఈ ఇద్దరి దంపతులనుండి నేటి మానవజాతి ఆవిర్భవించింది.

దొంగల వల్ల తండ్రిని కోల్పోయిన గిం (Gim) పగను పెంచుకొన్నాడు. దారిలో అదే దొంగల ముఠా చేతిలో తండ్రి ప్రాణాలు కోల్పోయిన మరో బాలుడిని కలిశాడు. వారిద్దరూ స్నేహితుయ్యారు. కాని వారిద్దరూ నది దాటుతుండగా భయంకరమైన తుఫాను వల్ల పడవ మునిగిపోయి వీడిపోయారు. దొంగలవల్ల అనాథగా మారిన మరో బాలుడు గింను కాపాడాడు. నదిలో వారిద్దరూ కూడా తుఫాను వల్ల విడిపోయారు. ఒక ద్వీపానికి కొట్టుకువచ్చిన గింను ఒక వృద్ధ స్త్రీ కాపాడుతుంది. ఒకనాడు ఒక అపరిచితుడు వచ్చి గింను తనతో పాటూ తీసుకెళ్ళాడు. గిం 16 ఏళ్ళ వయసు వచ్చేవరకూ అతడి వద్ద మంత్ర విద్యలు నేర్చుకొన్నాడు. ఆ ద్వీపపు రాజుని దొంగలభారినుండి కాపాడమని అపరిచితుడు గింతో చెప్పగా, గిం ఆయుధాలతో మాయా గుర్రంపై రాజ కోటకు వెళతాడు. అక్కడ అగ్నిని ఊదుతున్న ఒక నల్లటి వ్యక్తి, పంచాంగం చదువుతున్న పండితుడిని, వరద తెప్పించే విధంగా తోక ఊపుతున్న ఎలుకను, అగ్నిని విసురుతున్న రాక్షసుడిని చూసాడు. గిం వారితో పోరాడి రాజుని తీసుకొని ఒక ద్వీపంవైపు తీసుకెళతాడు. ఎలుక వెంబడించి తన తోకనుండి నీటిని సృష్టించి ద్వీపాన్ని సగం ముంచేయగా, గిం ఒక సీతాకోకచిలుక సాయంతో రాజుని తీసుకొని దూరపు కొండపై గుహ వద్దకు చేరతాడు. అక్కడ బాల్యంలో మొదట కలిసిన వ్యక్తిని కలుస్తాడు. అతడితో పోరాడి చంపేయగా ఆ ద్వీపం కూడా మునిగింది. అక్కడినుండి మరో ద్వీపానికి కాకి సాయంతో చేరతాడు. అక్కడ బాల్యంలో రెండవసారి కలిసిన వ్యక్తిని కలుస్తాడు. అతడితో పోరాడి చంపేయగా ఆ ద్వీపం కూడా మునిగింది. మూడవ ద్వీపం కూడా మునిగిపోగా ఒక ఓడలో తలదాచుకుంటారు. 3 సంవత్సరాల తర్వాత గిం యొక్క ముఖ్య అనుచరుడు వస్తాడు. అప్పుడు గిం తన మాయతో పిడుగులను తెప్పించి శత్రువులను నాశనం చేశాడు. శత్రుదేశంలోకి వెళ్ళి అతని తల్లిని కనుగొని, రెండవ స్నేహితుడి సోదరిని వివాహం చేసుకొన్నాడు.

ముగింపు మార్చు

పూర్వపు రోజుల్లో సుమారు గ్రంథ రచయితలందరూ తమ తమ ఆలోచనలకు అనుగుణంగా జలప్రళయ సిద్ధాంతాలను సృష్టించడం గమనార్హం. వివిధ ప్రాంతాలకు, వివిధ సంస్కృతులకు, వివిధ కాలాలకు చెందిన రచయితలు జలప్రళయ సిద్ధాంతాలను ఎందుకు సృష్టించారు అని నేటి చరిత్రకారులకు, రచయితలకు అంతుపట్టలేకున్నది. వేల సంవత్సరాల నుండి మంచు క్రమేణా కరిగిపోతూవుండటం వల్ల సముద్ర మట్టం పెరగడం, సముద్ర కెరటాల వల్ల భూభాగం తరిగిపోవడం జరుగుచున్నది కావున నిజంగానే జల ప్రళయం మానవ చరిత్ర ఆరంభంలో సంభవించియుండవచ్చు, భవిష్యత్తులోనైనా జల ప్రళయం సంభవించవచ్చు అని కొద్దిమంది విష్లేషకుల భావన.

జల ప్రళయం అనేది పాఠకులను ప్రత్యేకంగా ఆకట్టుకొనే అంశం కావున ఎక్కువమంది రచయితలు దాన్ని రకరకాలుగా ప్రస్తావించేవారని, మొదటిసారిగా ఒక రచయిత తన రచనలో ప్రస్తావిస్తే ఇతర రచయితలు కూడా అదే బాటను అవలంబించే అవకాశం లేకపోలేదు కనుక జల ప్రళయం చరిత్ర కాకపోవచ్చని కొద్దిమంది అభిప్రాయం . 2011లో జల ప్రళయ అంశంపై ఒక సిద్ధాంతంతో 2012 అనే హాలీవుడ్ సినిమా కూడా విడుదలైనది.

అయితే సృష్టి వినాశనం జల ప్రళయం వల్ల జరుగదని, వాహనాలు, కర్మాగారాలనుండి విడుదలయ్యే కాలుష్యం, సెల్ ఫోన్ టవర్ల నుండి వెలువడే రేడియేషన్, భూమిలో గనులు - ఇంధనాల వెలికితీత వల్ల రానున్న వెయ్యి సంవత్సరాల తర్వాత భూమి ఉష్ణోగ్రత అనూహ్యంగా పెరిగిపోయి సముద్రాలు, నదులు, సరస్సులు ఇంకిపోయి, సమస్త జీవ జాతి అంతరించిపోయి క్రమేణా మానవుడుకూడా నాశనమైపోవచ్చునని, ఆ విధంగా సృష్టి వినాశనం క్రమేణా సంభవిస్తుందని పలు శాస్త్రజ్ఞుల అభిప్రాయం.

ఇంకా చదవండి మార్చు

మూలాలు మార్చు

  1. 1.0 1.1 1.2 1.3 Flood Stories from Around the World - by Mark Isaak