జోస్యం జనార్దనశాస్త్రి
This article includes a list of references, related reading or external links, but its sources remain unclear because it lacks inline citations. (2023 సెప్టెంబరు) |
జోస్యం జనార్దనశాస్త్రి రాయలసీమకు చెందిన కవిపుంగవులలో ప్రముఖుడు.
జీవిత విశేషాలు
మార్చుజోస్యం జనార్దనశాస్త్రి కర్నూలు జిల్లా, పాణ్యంలో 1911, అక్టోబరు 2వ తేదీకి సరియైన విరోధికృతు నామ సంవత్సర ఆశ్వయుజ శుద్ధ దశమి నాడు అన్నపూర్ణమ్మ, వేంకటరామయ్య దంపతులకు జన్మించాడు. ఇతడు ములకనాడు శాఖకు చెందిన బ్రాహ్మణకుటుంబంలో పుట్టాడు. కౌండిన్యస గోత్రజుడు. ఇతని తల్లిదండ్రులు ప్రాచీనార్షసాంప్రదాయానికి చెందిన సాత్వికులు. ఇతడు ప్రాథమిక విద్యను 12 సంత్సరములలో ముగించి మేనమామల వద్ద పూర్వపద్ధతులలో సంస్కృతాంధ్రములలో కావ్యనాటక అలంకారములను నేర్చుకున్నాడు. 1933లో ఇతడు మద్రాసు విశ్వవిద్యాలయం నుండి విద్వాన్ పరీక్ష ఉత్తీర్ణుడయ్యాడు. అప్పటి నుండి అనంతపురం జిల్లా, తాడిపత్రిలోని మునిసిపల్ హైస్కూలులో ప్రధాన ఆంధ్రోపాధ్యాయుడిగా అనేక సంవత్సరాలు పనిచేసి పదవీ విరమణ చేశాడు. తరువాత కూడా తాడిపత్రిలోనే స్థిరపడ్డాడు. ఇతడు ప్రైవేటుగా 1942లో ఎస్.ఎస్.ఎల్.సి పరీక్షలు వ్రాసినప్పుడు ఇతనికి 'మంత్రి త్రయము' అనే పాఠ్యగ్రంథం ఉపవాచకంగా ఉన్నది. విచిత్రం ఏమిటంటే ఈ మంత్రి త్రయం వ్రాసింది ఇతడే. మరో విశేషం ఏమిటంటే ఈ పరీక్షను ఇతనితోబాటు ఇతని కుమార్తె సుబ్బలక్ష్మమ్మకూడా అదే సంవత్సరం వ్రాసింది. ఇతడు 20కి పైగా రచనలు చేశాడు. నాలుగు అష్టావధానాలు కూడా చేసి పండితుల మెప్పు పొందాడు. ఇతడికి జ్యోతిషము, వైద్యములలో కూడా ప్రవేశం ఉంది. ఇతని కుమారుడు జోస్యం విద్యాసాగర్ కూడా రచయితగా పేరుగడించాడు. జోస్యం జనార్దనశాస్త్రి తన 87 యేట పింగళ నామ సంవత్సర మార్గశిర బహుళ ద్వాదశినాడు అనగా 1997, డిసెంబరు 25వ తేదీన తాడిపత్రిలో మరణించాడు.
సత్కారాలు
మార్చు- త్యాగరాజకళాసమితి, హైదరాబాదు వారిచే 11-04-1983వ తేదీన ప్రముఖ కవి దాశరథి చేతుల మీదుగా కనకాభిషేకం.
- రచన సాహిత్యవేదిక, కడప వారిచే గడియారం వేంకటశేషశాస్త్రి స్మారక అవార్డుతో సత్కారం.
- 1993లో అనంతపురంలో కల్లూరు సుబ్బారావు అవార్డు.
- 1992లో తాడిపత్రి పురపాలక సంఘం వారిచే పౌరసన్మానం మొదలైనవి.
బిరుదులు
మార్చు- అభినవ వేమన
- ఆర్షవిద్యా విశారద
రచనలు
మార్చు- కన్నతల్లి
- ప్రకృతి కన్నతల్లి
- కన్నీటి చుక్కలు
- కృతిపతి
- ఉన్నమాటలు
- పసిడిపంట
- దుర్గా సప్తశతి (ఆంధ్రీకరణము)
- సీతమ్మ (ఖండకావ్యము)
- వీరాంజనేయ విలాసము
- రామలింగ సుప్రభాతము
- విజయజ్యోతి
- వీరశ్రీ
- రామలింగ సుప్రభాతము
- కథామంజరి
- చంపకాలు నూటపదార్లు
- శాంతలహరి
- భావసపర్య
- ఆనందలహరి
- పురుషోత్తమ శతకము (అనువాదము)
- శృంగారలహరి
- కైంకర్యం
- శ్రీ మల్లేశా (శతకము)
- మంత్రిత్రయము (చాణక్యుడు, యుగంధరుడు, తిమ్మరుసు)
- భాషాముకురము
- విద్యార్థి కల్పతరువు మొదలైనవి
రచనల నుండి ఉదాహరణలు
మార్చుఇతడి కృతిపతి కావ్యంలో గువ్వల చెన్నుడికి, అతడి భార్యకు మధ్య జరిగిన సంభాషణను పాత్రోచితంగా గ్రామ్యభాషలో ఈ విధంగా వ్రాశాడు.
మార్చుభార్య:- మామా! యేంతిక్కోనివి?
ఆ మారాజే అడక్క ఆకడె మిస్తే
నీ మన్సెంబడి తుంటా
నే మోజుగ అడుగు తుంటె యీరా దేమే?
చెన్నుడు:- పిల్లా! దాని గ్గాదే
యిల్లాలికి సొమ్ములేంటికే! యెరి మొగమా!
యిల్లూ, వాకిలి, మొగుడూ,
సల్లగ తిననీకి వుంటే సాల్లేదేమే?
నాపాలి పున్నె మాయని,
ఆ పెద్దయ్యకు దయొచ్చి ఆయన కాయ్నే
ఆ పద్యాల్మూలాన్నే
నా పేర్నిలబెట్టు సంతు నాక్కలిగించెన్
పోయే! అయియేకము దా
నా! యేపాటి సుగాలుగాని యేం సాస్వత మౌ
తాయా? యివన్ని యెంటొ
స్తాయా? పేరొకటి తప్ప తతిమా వల్లా!
ఉన్నమాటలు నుండి కొన్ని పద్యాలు
మార్చుదొడ్డగా శతక్రతువు లాచరింప నీ
మూడు లోకములకు ఱేడుగాని
యొరుల సతుల కుఱక నొడలెల్ల గుల్లయౌ
నున్నమాట జోస్యమన్నమాట
బాల భటుడు, బాల వటుడు, బాల నటుండు
బాల యతియు, పతియు బాల విధవ
కీర్తి మువ్వురు నపకీర్తి మువ్వురు గాంతు
రున్నమాట జోస్యమన్నమాట
సంతు దొంతులు బడిపంతులకు ధనమ్ము
కాగితంపు చింపు కవికి ధనము
అల్లరులు తగవులె న్యాయవాదికి ధన
మున్నమాట జోస్యమన్నమాట
ఇవి కూడా చదవండి
మార్చుమూలాలు
మార్చు- రాయలసీమ రచయితల చరిత్ర(రెండవ సంపుటి) - కల్లూరు అహోబలరావు - పేజీలు 104-112
- కర్నూలు జిల్లా రచయితల చరిత్ర - కె.ఎన్.ఎస్. రాజు - పేజీలు 101-104
- అవధాన సాధన - ఆశావాది ప్రకాశరావు - పేజీ 3
- ఆర్షవిద్యావిశారద, అష్టావధాని శ్రీ జోస్యము జనార్దనశాస్త్రి - రాపాక ఏకాంబరాచార్యులు - ఆంధ్రజ్యోతి -ఆదివారం అనుబంధం - 1 మే, 2005 పేజీ 6
- అవధాన విద్యాసర్వస్వము - రాపాక ఏకాంబరాచార్యులు - పేజీలు 257-259