టేకూరు సుబ్రహ్మణ్యం

భారత రాజకీయనాయకుడు

టేకూరు సుబ్రహ్మణ్యం స్వాతంత్ర్య సమరయోధుడు, రాజకీయనాయకుడు. ఇతడు బళ్ళారి లోక్‌సభ నియోజకవర్గం నుండి భారత కాంగ్రెస్ పార్టీ తరఫున మూడుసార్లు పార్లమెంటుకు ఎన్నికైనాడు.

టేకూరు సుబ్రహ్మణ్యం
టేకూరు సుబ్రహ్మణ్యం


పదవీ కాలం
1952 – 1967
ముందు ఎవరూ లేరు
తరువాత వి.కె.ఆర్.వరదరాజారావు
నియోజకవర్గం బళ్ళారి

వ్యక్తిగత వివరాలు

జననం (1900-08-09)1900 ఆగస్టు 9
ఉరవకొండ, మద్రాస్ ప్రెసిడెన్సీ, బ్రిటీషు ఇండియా
మరణం 1974 డిసెంబరు 24(1974-12-24) (వయసు 74)
బెంగళూరు,
రాజకీయ పార్టీ భారత జాతీయ కాంగ్రెస్
జీవిత భాగస్వామి మీనాక్షమ్మ
సంతానం 3 కుమారులు, 2 కుమార్తెలు
నివాసం బళ్ళారి
మతం హిందూ మతం

జీవిత వివరాలు

మార్చు

టేకూరు సుబ్రహ్మణ్యం 1900, ఆగస్టు 9వ తేదీన మద్రాస్ ప్రెసిడెన్సీ (ప్రస్తుత ఆంధ్రప్రదేశ్) లోని అనంతపురం జిల్లా, ఉరవకొండ పట్టణంలో జన్మించాడు. ఇతని తండ్రి టేకూరు రామశాస్త్రి. ఇతని ప్రాథమిక విద్యాభ్యాసము బళ్లారిలోని వార్డ్‌లా హైస్కూలులో, ఉన్నత విద్య మద్రాసులోని పచ్చయప్ప కళాశాల, మద్రాసు లా కాలేజీలలో జరిగింది. ఇతడు బి.ఎ., బి.ఎల్., పట్టాలను సంపాదించాడు. ఇతనికి 1921 ఆగస్టు 21న మీనాక్షమ్మతో వివాహం జరిగింది. ఈ దంపతులకు ముగ్గురు కుమారులు (సత్యనారాయణ, వెంకటేశులు, రామనాథ్), ఇద్దరు కుమార్తెలు కలిగారు. సామాన్య రైతుగా జీవితాన్ని ప్రారంభించిన సుబ్రహ్మణ్యం అంచలంచెలుగా ఎదిగి నాటి మద్రాసు ప్రెసిడెన్సీలో రాజకీయ నాయకుడిగా చలామణీ అయ్యాడు. బళ్ళారిలోని అఖిల భారత స్వదేశీ పారిశ్రామిక ప్రదర్శన కార్యదర్శిగా, మద్రాస్ స్టేట్ ఆహార సలహా కమిటీ, హరిజనాభ్యుదయ కమిటీ, గ్రామీణ అభివృద్ధి కమిటీ, రాయలసీమ అభివృద్ధి కమిటీ (1947-52) ల సభ్యుడిగా, బళ్ళారి జిల్లా ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడిగా (1946-58), భాషా ప్రయుక్త రాష్ట్రాల కమిషన్ (1948) అసోసియేట్ సభ్యుడిగా, బళ్ళారి సహకార భూతనఖా బ్యాంకు అధ్యక్షుడిగా పలుబాధ్యతలను నిర్వహించాడు[1]. ఇతడు మద్రాసు రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ కార్యదర్శిగా పనిచేశాడు. 1937-39లలో అప్పటి మద్రాసు ప్రెసిడెన్సీ ప్రధాని రాజాజీకి రాజకీయ కార్యదర్శిగా వ్యవహరించాడు. ఇతడికి అప్పటి దేశనాయకులు గాంధీజీ, నెహ్రూ, రాజాజీ మొదలైన వారందరితో నేరుగా సంబంధాలు ఉండేవి[2][3] .

ఇతడు స్వాతంత్ర్య సమరంలో పెద్ద యెత్తులో పాల్గొన్నాడు. నాలుగు సార్లు అరెస్టు అయ్యి బళ్ళారి, అల్లీపురం, వెల్లూరు, తంజావూరు సెంట్రల్ జైళ్ళలో ఖైదుగా ఉన్నాడు. ఇతడు జైలులో ఉన్నప్పుడు ఇతరులతో సంభాషించడానికి అనుమతించేవారు కాదు. కుటుంబ సభ్యులను చూడటానికి వారానికి ఒకసారి మాత్రం అనుమతి నిచ్చేవారు. వార్తాపత్రికలు, రేడియో మొదలైనవేవీ అందుబాటులో ఉండేవి కావు. 1931లో ఇతని కుమారుడు సత్యనారాయణ మరణించిన సంగతి జైలులో ఉన్న ఇతనికి తెలియజేయలేదు. 1942లో తండ్రి రామశాస్త్రి మరణించినపుడు 15 రోజులు పెరోల్‌పై బయటికి వచ్చి తిరిగి జైలుకు వెళ్ళాడు. 1943లో ఇతనికి కుమారుడు జన్మించినపుడు ఆ బాలుడిని చూడటానికి అనుమతించలేదు. 1944లో జైలు నుండి విడుదల అయిన తర్వాతనే తన కుమారుడిని మొదటిసారి చూడగలిగాడు.

1947 ఆగస్టు 15న భారతదేశానికి స్వాతంత్య్రం వచ్చినరోజున అర్ధరాత్రి బళ్ళారిలోని సాంబమూర్తి మైదానంలో జాతీయపతాకాన్ని ఎగురవేయడానికి మద్రాసు ప్రభుత్వం ఇతడిని ఎన్నుకుంది.

స్వాతంత్ర్యానంతరం ఇతడు భారత జాతీయ కాంగ్రెస్ పార్టీ తరఫున బళ్ళారి లోక్‌సభ నియోజకవర్గం నుండి వరుసగా మొదటి, రెండవ, మూడవ లోక్‌సభకు ఎన్నికై 15 సంవత్సరాలపాటు పార్లమెంటు సభ్యుడిగా కొనసాగాడు. 1956లో కాంగ్రెస్ పార్లమెంటరీ పార్టీకి జనరల్ సెక్రెటరీగా ఉన్నాడు.

ఇతడు స్వాతంత్ర్యోదమంతో పాటు అస్పృశ్యతా నివారణ, హిందీ ప్రచార, హరిజనోద్ధరణ మొదలైన ఉద్యమాలలో కూడా చురుకుగా పాల్గొన్నాడు. ఇతడు గాంధీ సిద్ధాంతాలను ఆచరణలో పెట్టిన సిసలైన గాంధేయవాది. కర్ణాటక రాష్ట్ర గాంధీ స్మారకనిధి చైర్మన్‌గా ఒక దశాబ్ద కాలం 1948లో గాంధీ మరణించిన తర్వాత అతని చితాభస్మాన్ని కలశంలో తీసుకుని వచ్చి తుంగభద్రా నదిలో నిమజ్జనం చేశాడు.

టేకూరు సుబ్రహ్మణ్యం తన 74వ యేట స్వల్ప అస్వస్థతకు గురై 1974 డిసెంబర్ 24వ తేదీ బెంగళూరులో మరణించాడు. 2002లో ఇతని శతజయంతి ఉత్సవాలు బళ్ళారిలో ఘనంగా జరిగాయి. బళ్ళారిలోని ఒక ఉద్యానవనానికి ఇతని జ్ఞాపకంగా ఇతని పేరు పెట్టారు. గాంధీనగర్, బళ్ళారిలోని మోకా రోడ్డును ఇతని సంస్మరణార్థం టేకూరు సుబ్రహ్మణ్యం రోడ్డుగా నామకరణం చేశారు. బళ్ళారి సెంట్రల్ జైలులో ఇతని పేరుతో ఒక శిలాఫలకాన్ని ప్రతిష్ఠించారు.

మూలాలు

మార్చు
  1. వెబ్ మాస్టర్. "Third Lok Sabha Members Bioprofile". PARLIAMENT OF INDIA LOK SABHA HOUSE OF THE PEOPLE. National Informatics Centre (NIC). Retrieved 10 May 2020.
  2. "This jailhouse has a rich past". Archived from the original on 24 సెప్టెంబరు 2015. Retrieved 4 June 2010.
  3. "Caste will play a vital role in Bellary". Archived from the original on 23 నవంబరు 2009. Retrieved 4 June 2010.