డి.ఎస్.ఎన్. మూర్తి

డి.ఎస్.ఎన్. మూర్తి నాటకరంగ నటుడు, దర్శకుడు, అభినయ అధ్యాపకుడు.

డి.ఎస్.ఎన్. మూర్తి
డి.ఎస్.ఎన్. మూర్తి
జననండిసెంబరు 1, 1944
బాపట్ల, గుంటూరు జిల్లా
ప్రసిద్ధినాటకరంగ నటుడు, దర్శకుడు, అభినయ అధ్యాపకుడు.
భార్య / భర్తసరస్వతి
తండ్రిరామచంద్రరావు
తల్లిభారతీదేవి

జననం మార్చు

డి.ఎస్.ఎన్. మూర్తి 1944, డిసెంబర్ 1 న రామచంద్రరావు, భారతీదేవి దంపతులకు మూడో సంతానంగా గుంటూరు జిల్లా బాపట్లలో జన్మించాడు. ఇతని పూర్తిపేరు దేశిరాజు శ్రీమన్నారాయణమూర్తి.

విద్య - ఉద్యోగం మార్చు

బాపట్ల ఉన్నత పాఠశాలలోను, చీరాల కళాశాలలోను విద్యాభ్యాసం చేశాడు. జానపద నాటకం- చిందు భాగోతం అనే అంశం మీద పరిశోధన చేసి కేంద్రీయ విశ్వవిద్యాలయం నుండి డాక్టరేట్ పట్టాపొందాడు. నేషనల్ శాంపిల్ సర్వే ఆర్గనైజేషన్ లో కొన్నాళ్ళు పనిచేశాడు. హైదరాబాదు విశ్వవిద్యాలయములో రంగస్థల కళలశాఖలో ఆచార్యునిగా పనిచేసి పదవీ విరమణ చేశాడు.

రంగస్థల ప్రవేశం మార్చు

ఇతను తన పదవ ఏట (1954) పాఠశాలలో భక్తమహిమ అనే నాటిక ద్వారా రంగస్థల ప్రవేశం చేసి, నాలుగు దశాబ్దాలకు పైగా నాటకరంగంతో తన అనుబంధాన్ని కొనసాగించాడు. రాష్ట్రస్థాయిలో శిక్షణ శిబిరాలను నిర్వహించి ఔత్సాహిక నటీనటులకు శాస్త్రీయ పద్ధతిలో శిక్షణ ఇచ్చాడు. అనేక నాటక పోటీలలో పాల్గొని ఉత్తమ నటునిగా, ఉత్తమ దర్శకునిగగా అనేక బహుమతులను పొందాడు.

రంగస్థల ప్రస్థానం మార్చు

1880 నుండి 1980 వరకు తెలుగు నాటకరంగంలో వచ్చిన పరిణామ దశలను వివరిస్తూ ‘నూరేళ్ళ తెలుగు నాటకం- రంగస్థలం’ అనే పేరుతో డాక్యుమొంటరీలో రంగస్థల నాటకాన్ని ప్రదర్శంపజేశాడు. 50మంది కళాకారులతో, 25 మంది సాంకేతిక నిపుణులతో ప్రతిష్ఠాత్మకంగా తయారుచేసిన ఆ నాటకానికి ప్రేక్షకుల నుండి ప్రశంసలు లభించాయి. రాజకీయ వ్యవస్థను చూపిస్తూ, కూచిపూడి నృత్యాన్ని అందులో పొందుపరిచి, ఇంద్రసిహాసనం పేరుతో ప్రదర్శించిన ఒపేరాకు దర్శకత్వం వహించి విలక్షణ దర్శకుణిగా పేరు తెచ్చుకున్నాడు.

ఎలెక్స్ హేలీ రాసిన రూట్స్ అనే అమెరికన్ నవలను నాటకీకరించి స్వీయ దర్శకత్వంలో ప్రదర్శించాడు. కాళీపట్నం రామారావు రాసిన యజ్ఞం, చావు కథల ఆధారంగా వచ్చిన నాటికలకు దర్శకత్వం వహించాడు. రౌండ్ గా ఉన్న ప్రాంతంలో 5 వేదికలను ఏర్పరచి, ప్రేక్షకులు చుట్టూ ఉండి ప్రదర్శనను చూసేవిధంగా చావు నాటికు ప్రదర్శించాడు. నెమలికంటి తారకరామారావు రాసిన బకాసుర నాటకాన్ని, గిరీష్ కర్నాడ్ రాసిన నాగమండలం, అగ్నివర్షం నాటకాలకు దర్శకత్వం వహించి వాటి విజయాలకు తోడ్పడ్డాడు. విదేశి నాటక శైలులను తెలుగు నాటకరంగానికి పరిచయం చేసిన వారిలో డి.యస్.యన్ ప్రథముడు. ఇతను రచించిన మహానగరం వీధి నాటకం నగరవాసుల బాధల్ని, గాథల్ని వివరిస్తుంది. తెలుగు విశ్వవిద్యాలయంలోని రంగస్థల కళలశాఖ ఎం.ఫిల్ విద్యార్థి డి.ఎస్.ఎన్. మూర్తి దర్శకత్వ కృషి - పరిశీలన అనే అంశంపై పరిశోధన చేశాడు.

మూలాలు మార్చు