తక్కళ్లపల్లి పాపాసాహేబు

అనంతపురం జిల్లా కీర్తి ప్రతిష్ఠలు పెంచిన జాతిరత్నాలలో తక్కళ్లపల్లి పాపాసాహేబు ఒక అనంత ఆణిముత్యం.

తక్కళ్లపల్లి పాపాసాహేబు
జననంతక్కళ్లపల్లి పాపాసాహేబు
1928
అనంతపురం జిల్లాయాడికి మండలం కేశవరాయునిపేట గ్రామం
మరణం1981
వృత్తిరాజకీయాలు
ప్రసిద్ధిరాష్ట్రకవి, పండితుడు
మతంఇస్లాం
తండ్రిఫక్రుద్దీన్
తల్లిఫక్రుబీ

జీవిత విశేషాలుసవరించు

1928లో తక్కళ్లపల్లి పాపాసాహేబు[1],[2] తన మాతామహుల ఇంటిలో కేశవరాయునిపేటలో జన్మించాడు. ఇతని విద్యాభ్యాసము ప్యాపిలి, పత్తికొండ, గుత్తి గ్రామాలలో జరిగింది. కాశీ విద్యాలయంలో చదువబోయి కారణాంతరాల వల్ల ఆ ప్రయత్నాన్ని మానుకొని స్వయంకృషితో విద్వాన్ పరీక్ష ఉత్తీర్ణుడయ్యాడు. గాంధీగారి స్ఫూర్తితో రాజకీయాలలో ప్రవేశించి కాంగ్రెస్ పార్టీకి అంకితమై దేశానికి సేవ చేశాడు. చిన్నతనం నుండి కవితాభ్యాసం చేసి పదికి పైగా కావ్యాలను వ్రాశాడు. ఇతని అంబ కావ్యము ఆంధ్ర విశ్వవిద్యాలయం వారి భాషాప్రవీణ పరీక్షకు పాఠ్యగ్రంథంగా ఉండేది. ఇతని రచనలపై విశ్వవిద్యాలయాలలో ఎం.ఫిల్., పి.హెచ్.డి. స్థాయిలలో పరిశోధనలు జరిగాయి. 1964లో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఇతనిని రాష్ట్రకవిగా గుర్తించి సత్కరించింది. రాయప్రోలు సుబ్బారావు ఇతడికి మహాకవి అనే బిరుదును ఇచ్చాడు. పాపాసాహేబు 1981లో మరణించాడు.

రాజకీయరంగంసవరించు

ఇతడు టంగుటూరి ప్రకాశం పంతులును రాజకీయ గురువుగా భావించి రాజకీయాలలోకి ప్రవేశించాడు. ఇతడు కాసు బ్రహ్మానందరెడ్డి అనుయాయిగా అనంతపురం జిల్లా రాజకీయాలలో కీలకపాత్ర వహించాడు. 1958 నుండి జిల్లా కాంగ్రెసు కార్యవర్గ సభ్యుడిగా, ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ సభుడిగా ఉన్నాడు. 1962, 1967, 1972 శాసనసభ ఎన్నికలలో గుత్తి నియోజకవర్గం నుండి కాంగ్రెస్ పార్టీ తరఫున పోటీ చేశాడు. రాజకీయాలలో తలమునకలుగా ఉండికూడా ఇతడు సాహిత్య వ్యాసంగాన్ని కొనసాగించాడు. ఇతడు తన రాజకీయ అనుభవాలను "నా రాజకీయ జీవితానుభవములు" అనే గ్రంథరూపంలో వివరించాడు[3].

రచనలుసవరించు

 1. అంబ
 2. అవధి
 3. కన్నీటి చుక్కలు
 4. నా రాజకీయ జీవితానుభవాలు
 5. పాపుసాబు మాట పైడిమూట
 6. ప్రేమవిలాపము
 7. రస ఖండము
 8. రాజ్యశ్రీ
 9. రాణీ సంయుక్త
 10. శకుంతల
 11. సత్యాన్వేషణ
 12. విశ్వనాథ నాయకుడు

రచనల నుండి మచ్చుతునకలుసవరించు

తన్నె వివాహమాడుట కెదన్ త్వరబొందెడు రుక్మిణిన్ మహా
పన్నత కుందు దాని మురభంజను డెత్తుక పోయినట్లు వే
గన్నరుదెమ్ము స్వామి నను గైకొని పోవగ వేచియుందు వే
గన్నుల నీదు రాకకయి కైరవ మిందుని కోస మట్టులన్
పరమ పవిత్రమైన మన భారతభూమి ప్రతిష్ఠ స్వార్థ త
త్పరమతి దుమ్ములో కలుపు తండ్రియెకాదు మరెవ్వరైననున్
స్థిర కరవాల ధారలను నిర్దయ గొంతులు కోతు, గొఱ్ఱెలం
గరణి దదసృగార్ద్ర శితఖడ్గము నిచ్చెద నీకు కాన్కగా
(రాణీసంయుక్త కావ్యం నుండి)
ప్రాణము పోవుచున్న దలవంచని పౌరుషసాహసాలు, వా
గ్దానమొసంగి తప్పని యుదార గభీరగుణమ్ము, లొంగుటే
గానని యాత్మగౌరవము, కంపము చెందని గట్టి చేవయున్
మానపరాయణత్వ మసమాన మఖండము నై విరాజిలున్
(సత్యాన్వేషణ నుండి)
యావజ్జీవము, మాతృదేశ భయదోద్యద్దాస్య నిర్మూలనా
భావోల్లాస వికాస చిత్తమున, దౌర్భాగ్యాభి పూత ప్రజా
సేవా దీక్షకు, ధారవోసిన దయాశ్రీసాంద్ర నిస్తంద్ర తే
జో విస్తార! జగత్పితా! కొనుమివే జోహారులర్పించెదన్
(మహాత్మాగాంధీ గురించి)
తురక కేమి తెలుసు పరమ వేదార్థమ
టంచు నెత్తి పొడుతు రవని సురులు
కన కబీరు తురక గాకేమి గరకయా
పాపుసాబు మాట పైడి మూట
(పాపుసాబు మాట పైడి మూట నుండి)

మూలాలుసవరించు

 1. రాయలసీమ రచయితల చరిత్ర - మూడవసంపుటి - కల్లూరు అహోబలరావు
 2. అనంతధామం - ఆశావాది సాహితీస్వర్ణోత్సవ విశేష సంచికలోని మాన్యకవి తక్కళ్లపల్లి వ్యాసం - విద్వాన్ పెనకలపాటి ఆంజనేయులు
 3. బత్తుల, వేంకటరామిరెడ్డి (9 December 1979). "ముస్లిం కవి తక్కెళ్లపల్లి పాపాసాహెబ్". ఆంధ్రపత్రిక దినపత్రిక (సంపుటి 66, సంచిక 247). Retrieved 3 January 2018.