తుంగభద్ర నది పుష్కరం

(తుంగభద్ర నది పుష్కరము నుండి దారిమార్పు చెందింది)

బృహస్పతి మకరరాశిలో ప్రవేశించునప్పుడు తుంగభద్రనది పుష్కరాలు నిర్వహిస్తారు. 12 సంవత్సరాలకు ఒకసారి జరిగే తుంగభద్ర నది పుష్కరాలు 2008, డిసెంబర్ 10న ప్రారంభమై 12 రోజుల పాటు జరిగాయి. తుంగ, భద్ర రెండు నదుల కలయిక వలన కర్ణాటకలో పుట్టిన తుంగభద్రనది ఆంధ్ర ప్రదేశ్లో ప్రవేశించి కర్నూలు, మహబూబ్ నగర్ జిల్లా సరిహద్దుల గుండా ప్రవహించి ఆలంపూర్ సమీపంలోని సంగమేశ్వరం వద్ద కృష్ణానదిలో సంగమిస్తుంది. ఆంధ్రప్రదేశ్‌లో తుంగభద్ర పుష్కరాలను నిర్వహించడం ఇది తొలిసారి. ఈ నది ఆంధ్రప్రదేశ్‌లో రెండే జిల్లాల నుండి ప్రవహిస్తుంది కాబట్టి రెండు జిల్లాలలో ఉన్న తుంగభద్ర తీరప్రాంతాలలో స్నానఘాట్లను ఏర్పాటుచేసి జిల్లా యంత్రాంగం 12 రోజుల పాటు యాత్రికులకు సౌకర్యాలు కలుగజేసింది.

హంపి, కర్ణాటక ప్రాంతంలో తుంగభద్రానది

తుంగభద్ర పుష్కరం విశిష్టత

మార్చు

దేశంలో పుష్కరాలు నిర్వహించే 12 నదులలో తుంగభద్రనదికి ఒక ప్రత్యేకత ఉంది. ఇతర పుష్కర నదుల వలె కాకుండా ఈ నది సరాసరి సముద్రంలో సంగమించదు. అంతేకాకుండా ఈ నది పుట్టుక కూడా ఇదే పేరుతో లేదు. కర్ణాటక రాష్ట్రంలో తుంగ, భద్ర అనే రెండు నదుల కలయిక వలన ఏర్పడిన ఈ నది కర్ణాటక, ఆంధ్రప్రదేశ్‌లలో ప్రవహించి సంగమేశ్వరం వద్ద కృష్ణానదిలో కలుస్తుంది. మకరరాశిలో గురుడు ప్రవేశించినప్పుడు తుంగభద్ర నది పుష్కరాలు నిర్వహిస్తారు. తుంగభద్ర రెండు జిల్లాలలోనే ప్రవహిస్తున్ననూ అనంతపురం, వైఎస్ఆర్ జిల్లా వాసులు కూడా ఈ నీటిని వినియోగిస్తున్నారు. చెన్నై వరకు వెళ్ళే తెలుగుగంగలో కూడా తుంగభద్ర ఉంది.[1] చరిత్రలో ప్రముఖ రాజ్యమైన విజయనగర సామ్రాజ్యము తుంగభద్ర తీరానే వెలిశింది.

ఆంధ్రప్రదేశ్‌లో తుంగభద్ర పుష్కరాలు

మార్చు

తుంగభద్ర నది ఆంధ్రప్రదేశ్‌లో రెండే జిల్లాల గుండా ప్రవహిస్తుంది కాబట్టి తుంగభద్ర పుష్కరాలు కేవలం ఈ రెండు జిల్లాలలో తుంగభద్ర తీరాన ఏర్పాటు చేశారు. కర్నూలు జిల్లాలో 17 ఘాట్లను, మహబూబ్ నగర్ జిల్లాలో 5 ఘాట్లను ప్రభుత్వం ఏర్పాటుచేసి పుష్కర సమయంలో వచ్చే భక్తులు, యాత్రికులకు సౌకర్యాలను కల్పించింది.

మహబూబ్ నగర్ జిల్లాలో తుంగభద్ర పుష్కరాలు

మార్చు

మహబూబ్ నగర్ జిల్లాలో 5 తుంగభద్ర పుష్కర ఘాట్లను ఏర్పాటు చేశారు. అన్నింటిలో ప్రముఖమైనది ఆలంపూర్. ఇది కాకుండా వడ్డేపల్లి మండలం రాజోలి, మానోపాడు మండలం పుల్లూరు, అయిజా మండలం వేణిసోంపూర్, పుల్లికల్ లలో ఘాట్లను ఏర్పాటుచేశారు. పుష్కరాల కోసం రాష్ట్ర ప్రభుత్వం రూ. 4.5 కోట్లను కేటాయించింది.[2] తొలి రోజు (డిసెంబర్ 10, 2008) ఆంధ్రప్రదేశ్ దేవాదాయశాఖమంత్రి రత్నాకర్ రావు, టీటీడి బోర్డు చైర్మెన్ ఆదికేశవులు నాయుడు పాల్గొన్నారు. రెండో రోజున ముఖ్యమంత్రి వై.ఎస్.రాజశేఖర్ రెడ్డి ఆలంపూర్ పుష్కర ఘాట్ వద్ద తుంగభద్రమ్మ విగ్రహాన్ని ఆవిష్కరించాడు. మూడవ రోజు నుంచి జిల్లాలో భక్తుల రద్ది పెరిగింది. నాలుగు, ఐదవ రోజులలో సెలవు దినాలు ఉండుటచే ఊహించని రీతిలో రద్దీఏర్పడింది. రోజులు గడిచే కొలది రద్దీ పెరిగి 11వ రోజున భక్తుల సంఖ్య 2లక్షలకు పెరిగింది. చివరి రోజు రెండున్నర లక్షల ప్రజలు పుష్కర స్నానాలు చేశారు.[2009 1] మహబూబ్ నగర్ జిల్లాలో 5 స్నానఘాట్లను ఏర్పాటు చేయగా దాదాపు సగభాగం కంటే ఎక్కువ రద్దీ ఒక్క ఆలంపూర్ లోనే ఏర్పడింది. పురాతనమైన దేవాలయాలు ఉండుట, 5వ శక్తిపీఠం కావడం, నదిలో నీళ్ళు సమృద్ధిగా ఉండుటచే దూరప్రాంతాల భక్తులు ఇక్కడికే వచ్చారు. వేణిసోంపూర్‌ అయిజా నుండి ఎమ్మిగనూరు వెళ్ళు మార్గంలో ఉండుటచే మంత్రాలయం వెళ్ళు భక్తులు అధిక సంఖ్యలో సందర్శించారు. వేణుగోపాలస్వామి దేవాలయం ఉండుట ఇక్కడి అదనపు ఆకర్షణ.[3] జిల్లాలోని అన్ని ఆర్టీసీ డీపోలు ప్రధాన పట్టణాలనుండి పుష్కర స్థానాల వరకు ప్రత్యేక బస్సులను నడిపించారు. 2020వ సంవత్సరంలో నవంబరు 20 నుంచి డిసెంబరు 1 వరకు తుంగభద్ర పుష్కరాలు జరగనున్నాయి. ఈ సారి కొవిడ్-19 కారణంగా ప్రభుత్వాలు అధికారికంగా ఎలాంటి ఏర్పాట్లు చేయడం లేదు. కానీ, గతంలో ఏర్పాటు చేసిన పుష్కరఘాట్ల వద్ద భక్తులు కొవిడ్ నిబంధనలు పాటిస్తూ పుణ్యస్నానాలను ఆచరించవచ్చని ఆయా రాష్ట్రాల ప్రభుత్వాలు ప్రకటించాయి.

కర్నూలు జిల్లాలో తుంగభద్ర పుష్కరాలు

మార్చు

కర్నూలు జిల్లాలో తుంగభద్ర పుష్కరాలకై 17 ఘాట్‌లను ఏర్పాటుచేశారు.[4] తుంగభద్ర పుష్కరాల సందర్భంగా కర్నూలు జిల్లాలో లక్షలాది యాత్రికులు వచ్చారు. జిల్లా కేంద్రంలోనే 5 పుష్కర స్నానఘాట్లను ఏర్పాటు చేయగా తుంగభద్ర పంప్‌హౌస్, సంకల్‌బాగ్‌లలో 5లక్షల వరకు భక్తులు పవిత్ర స్నానాలు చేశారు.[5] విశ్వహిందూ పరిషత్తు ప్రముఖుడు ప్రవీణ్ తొగాడియా కూడా కర్నూలులో సంకల్‌బాగ్ వద్ద స్నానమాచరించాడు. జిల్లాలోని ప్రముఖ పట్టణాల నుండి పుష్కర ఘాట్‌ల వరకు ప్రత్యేక బస్సులను ఏర్పాటు చేశారు.

ప్రముఖ తుంగభద్ర పుష్కర ఘాట్లు

మార్చు

మూలాలు

మార్చు

[6]

  1. ఈనాడు దినపత్రిక, కర్నూలు ఎడిషన్, తేది 13.11.2008
  2. ఈనాడు దినపత్రిక, మహబూబ్ నగర్, తేది 11.12.2008
  3. ఈనాడు దినపత్రిక, మహబూబ్ నగర్, తేది 13.12.2009
  4. ఈనాడు దినపత్రిక, కర్నూలు ఎడిషన్, తేది 21.11.2008
  5. ఈనాడు దినపత్రిక, కర్నూలు ఎడిషన్, తేది 15.12.2008
  6. కృష్ణా పుష్కరాలు Archived 2020-10-27 at the Wayback Machine, కృష్ణా పుష్కరాలు విశేషాలు


ఉల్లేఖన లోపం: "2009" అనే గ్రూపులో <ref> ట్యాగులు ఉన్నాయి గానీ, దానికి సంబంధించిన <references group="2009"/> ట్యాగు కనబడలేదు