తెలుగు నవలల ఆధారంగా తీసిన సినిమాలు

తెలుగు సినిమా చరిత్రలో నవలా ఆధారిత కథల యుగం రెండు సార్లు వచ్చింది. మొదటిది : కోడూరి కౌసల్యాదేవి, యద్దనపూడి సులోచనారాణి నవలలు సినిమాలుగా రావడం. రెండవది : యండమూరి వీరేంద్రనాథ్ నవలలు సినిమాలుగా రావడం. మొదటి కోవలో డాక్టర్ చక్రవర్తి, జీవనతరంగాలు లాంటి సినిమాలు వస్తే రెండవ సారి మరణ మృదంగం, ఆఖరి పోరాటం లాంటి సంచలనాలు వచ్చాయి.

యద్దనపూడి సులోచనారాణి, యండమూరి వీరేంద్రనాథ్, మల్లాది వెంకటేశ్వరరావు, కొమ్మనాపల్లి గణపతిరావు, కొమ్మూరి వేణుగోపాలరావు, కోడూరి కౌసల్య, కావిలిపాటి విజయలక్ష్మి ఇంకా చాలా మంది, రచయితలు/త్రులు రాసిన నవలలు సినిమాలుగా వచ్చాయి .

యద్దనపూడి సులోచనారాణి రాసిన "జీవనతరంగాలు". అంతకు ముందే ఆవిడ రాసిన "సెక్రటరీ" ఆంధ్రదేశపు యువతను ఒక్క వూపు వూపేసింది . ఆ నవల సీరియల్ గా జ్యోతి మాసపత్రికలో వచ్చింది. బామ్మ తప్ప ఇంకెవరూ లేని ఒక మధ్యతరగతి అమ్మాయి జయంతి కథ ఇది . ఉద్యోగము కోసం సెక్రటరీగా వనితావిహార్ లో చేరుతుంది. ఆ ఉద్యోగము గురించి, ఎన్నెన్నో కలలు కంటుంది. కాని అవన్నీ కల్లలని తేలిపోతాయి . ఒకరోజు అనుకోకుండా వనితావిహార్ సభ్యులందరికీ ఇష్టుడైన, ధనవంతుడైన, రాజశేఖర్ తో పరిచయము ఏర్పడుతుంది . విపత్కర పరిస్థితులలో వనితావిహార్ లో ఉద్యోగము వదిలేసిన జయంతికి, రాజశేఖర్ తన సెక్రటరీగా ఉద్యోగమిస్తాడు. అక్కడి నుంచి రాజశేఖర్ కు, జయంతి తన మరదలు అని తెలియడంతో బామ్మను, జయంతిని తన ఇంట్లో వుంచుకుంటాడు. బామ్మ చనిపోయిన తర్వాత కొద్దికాలానికి జయంతి, రాజశేఖర్ ల మధ్య అపార్ధాలు మొదలై చివరికి వాళ్లిద్దరూ విడిపోవడం, చివరకు కలిసిపోవటముతో నవల ముగుస్తుంది . ఇందులో జయంతి స్నేహితురాలు సునంద, వనితావిహార్ సభ్యులు, సుమిత్ర, రోజారాణి, డాక్టర్ గారు, ఆయన శ్రీమతి, రాజశేఖర్, పాత సెక్రటరీ శివరాం, శివరాం స్నేహితులు, జయంతికి ఆశ్రయ మిచ్చిన డాక్టర్ లక్ష్మి మొదలైన పాత్రలు దేనికవే ముఖ్యమైనవిగా అనిపించి ఏకబిగిన నవలను చదివిస్తాయి . అన్నట్లు నవల మలుపులకు కారణమైన, నిశ్శబ్దమైన పాత్ర కరుణాకర్ కుమార్తె ప్రమీల. సరళమైన శైలి, అద్భుతమైన మలుపులతో యద్దనపూడి రాసిన ఈ నవల హాయిగా ఏవిధమైన టెన్షన్ లేకుండా చదువుకోవచ్చు .

ఈ నవలను సినిమాగా సురేష్ ప్రొడక్షన్స్ డి.రామానాయుడు, కె.యస్. ప్రకాశ రావు దర్శకత్వములో నిర్మించారు. మాటలు, పాటలు ఆచార్య ఆత్రేయ రచించగా, కె. వి మహదేవన్, పుహళేంది సహాయకత్వలో సంగీతం సమకూర్చారు. రామకృష్ణ, పి. సుశీల, యస్.పి.బాలసుబ్రమణ్యం గానామృతాన్ని అందించారు .

నాయికా నాయికలు, రాజశేఖర్, జయంతిలుగా, అక్కినేని నాగేశ్వరరావు, వాణిశ్రీ బాగానే ఉన్నారు. మిగిలిన పాత్రలకు కూడా, పాత్రదారులుగా వేసినవారు సరిపోయే వున్నారు . కాబట్టి పాత్రధారుల ఎంపికలో లోపమేమీ లేదు నవలలో రాజశేఖరం, జయంతిల పరిచయము వనితావిహార్ లో జరిగిన ఒక కార్యక్రమములో ఏర్పడుతుంది . అప్పుడు అతనే రాజశేఖరం అని తెలియకపోయినా ఒక గౌరవనీయుడుగానే భావిస్తుంది జయంతి . కాని సినిమాలో రాజశేఖర్ ఒక రౌడీలా, అమ్మాయిల వెంట పడేవాడుగా పరిచయము అవుతాడు జయంతికి. కారణమేమైనప్పటికీ, ఆ ఎత్తుగడే నచ్చలేదు. నవలలో జయంతి, రాజశేఖర్ ల వ్యక్తిత్వము గురించి ఒక అవగాహన వారి ప్రవర్తనల వల్ల స్పష్టంగా చూపిస్తారు రచయిత్రి . అదే సినిమాలో, జయంతి తిక్క, రాజశేఖర్ పొగరు సరిగ్గా చూపించలేక పోయారు . నవలలో జయంతికి చివరివరకూ రాజశేఖర్ తనకు బావ అని తెలియదు . సినిమాలో మధ్యలోనే తెలిసిపోయి, తర్వాత జయంతి ప్రవర్తన కొంచం వెకిలిగా అనిపించింది . అలాగే కరుణాకరం రాజశేఖర్ ని కొట్టించటము, ఆ విషయము డాక్టర్ గారు అనుమానపడి జయంతికి తెలపటము వగైరా ఎందుకో నప్పలేదు . ఇలా ప్రతి ఫ్రేం లోనూ నవలకు, సినిమాకు తేడా కొట్టవచ్చినట్లుగా కనిపించింది . నవల చదవకుండా సినిమా మాత్రమే చూస్తే బాగుంటుందేమో కాని, నవలతో పోల్చి చూస్తే మటుకు నిరాశ కలగక మానదు .

యద్దంపూడి ఇంకో నవల "విజేత" ఆధారముగా తీసిన సినిమా విచిత్రబంధం . అది కూడా చాలా నిరాశ పరిచింది.

జీవనతరంగాలు సినిమాగా ఎంతగానో బాగున్నది. తండ్రి చిన్నప్పుడే కుటుంబాన్ని వదిలి ఇంటినుండి వెళ్ళిపోగా, తమ్ముడితో, తల్లితో బాధ్యత తెలీని మేనమామ పంచనచేరి, మేనత్త నిరాదరణలో పెరిగిన సరోజ కథ ఇది . నాయకుడు విజయ్ కూడా తండ్రి చనిపోగా సవితి తల్లి ఇంటి నుండి గెంటేయగా, కుటుంబ శ్రేయోభిలాషి, వేణుగోపాలరావు ఆదరణలో స్వయంశక్తితో పెరిగినవాడు . సవితి తల్లి అవసానదశలో తన తప్పు తెలుసుకొని విజయ్ ను పిలిపించి తన కొడుకు అనంత్ ను, ఆస్తిని విజయ్ చేతికి అప్పగించి కన్ను మూస్తుంది . దయార్ద్ర హృదయుడైన అనంత్ చేసే దానధర్మాల కోసం, కల్ల బొల్లి కబుర్లు చెప్పి, పబ్బం గడుపుకునే అమ్మాయిల నుండి జాగ్రతగా కాపాడుకుంటూ వుంటాడు విజయ్ . వేణుగోపాలరావు గారికి ఇద్దరు అమ్మాయిలు. భార్య చనిపోతుంది . చిన్న కూతురు అవిటిది . పెద్ద కూతురు లావణ్య తండ్రి మీద లేనిపోని అపోహలతో, ఎప్పుడూ తండ్రిని బాధ పెడుతూ వుంటుంది. ఇక రోజా (సరోజ) తమ్ముడు చందూ మేనత్త పెట్టే బాధలు భరించలేక చిన్న తనములోనే దారి తప్పి, స్మగ్లర్స్ మూఠాలో చేరుతాడు. తమ్ముడిని రోజా నుండి రక్షించుకునే ప్రయత్నములో, రోజాకు మత్తు మందు ఇచ్చి పెళ్ళి చేసుకుంటాడు విజయ్. అనంత్ ప్రాపకంతో వేణుగోపాలరావు గారి దగ్గర పనికి చేరుతుంది రోజా. అనుకోకుండా రోజా ఆయన కూతురే నని ఆయనకు తెలుస్తుంది . చివరకు ఆయన రోజాకు ఆ సంగతి ఎలా చెపుతారు విజయ్, రోజా ల మధ్య అపార్ధాలు ఎలా తొలిగిపోయి ఒక్కటవుతారు అన్నది నవల చదివి తెలుసుకోవలసిందే !

జీవనతరంగాలు కూడా సురేష్ ప్రొడక్షన్ లో డి. రామానాయుడు, తాతినేని రామారావు దర్షకత్వంలో నిర్మించారు . బ్లాక్ అండ్ వైట్ సినిమా ఇది. శోబన్ బాబు నాయకుడు విజయ్ గా, వాణిశ్రీ నాయిక రోజాగా నటించారు. అనంత్ గా చంద్రమోహన్, చందుగా కృష్ణంరాజు, వేణుగోపాలరావుగా గుమ్మడి వెంకటేశ్వరరావు, లావణ్యగా లక్ష్మి తమ తమ పాత్రలకు న్యాయం చేకూర్చారు, ప్రతి పాత్రా వారిని దృష్టిలో పెట్టుకొనే రాసారా అన్నంత బాగా ప్రాణం పోసారు . కథను ఎక్కడా మార్పులు చేయలేదు. కాకపోతే నవల చందూ మరణముతో కొంచం విషాదంగా ముగుస్తుంది. కాని సినిమాలో చందూను స్మగ్లర్స్ ముఠా నుండి విజయ్ చాకచక్యంగా విడిపించటం, లావణ్య తండ్రిని అర్ధం చేసుకొని అభిమానించటం మొదలైన వాటితో సుఖాంతం అవుతుంది. ఈ ముగింపు నాకు చాలా నచ్చింది . సినిమా ఆద్యంతమూ చక్కగా నవలను సజీవముగా చూసిన అనుభూతి కలిగింది .

యద్దనపూడి సులోచనారాణి రచించిన ఇతర నవలలు, ‘రాధాకృష్ణ‘, ‘ఆత్మీయులు‘, ‘ప్రేమలేఖలు‘, ‘ మీనా‘, ‘బంగారుకలలు‘, ‘ అగ్నిపూలు‘ . ‘గిరిజా కళ్యాణం‘ కూడా సినిమాలు గావచ్చాయి . జీవనతరంగాలు తరువాత, ‘ ప్రేమలేఖలు ‘, ‘ మీనా ‘, ‘ ఆత్మీయులు ‘ కూడా పరవాలేదు బాగానే తీసారనిపించింది .

యద్దనపూడి, ఆనందారామం మొదలైన రచయిత్రుల నవలలు, వాటితో తీసిన సినిమాలు ఆంధ్ర పాఠకలోకాన్ని ఉర్రూతలూగిస్తున్న సమయములో యండమూరి వీరేంద్రనాథ్ “తులసి” నవలతో పాఠకుల దృష్టి మరల్చారు . మంత్రాలు, చేతబడులు, స్మగ్లింగ్, డాన్ లు అబ్బో ఒకటేమిటి నాలాంటి మామూలు వాళ్ళకు తెలియని ప్రపంచాన్ని పరిచయము చేసారు ! ఒకసారి నవల చదవటము మొదలు పెడుతే చివరి వరకు ఏమౌతుందా అని, ఊపిరి బిగబట్టి, ఏకబిగిన చదివేయాల్సిందే తప్ప మధ్యలో ఎక్కడా ఆగదు .చదువుతుండగా మధ్యలో ఎవరైనా ఏ పనైనా చెపితే, వాళ్ళ మీద ఏ మంత్రమో, తంత్రమో ప్రయోగించేయాలన్నంత కోపం వచ్చేంతగా చదివించేట్లుగా పాఠకుల మనస్సులోకి చొచ్చుకుపోయారు యండమూరి ! యండమూరి నవలలు చాలానే సినిమాలుగా వచ్చాయి . మొదట్లో నవలలు పాఠకుల కోసమే వ్రాసినా, ఆ తరువాత సినిమాల కోసం, ముఖ్యంగా చిరంజీవి కోసమే వ్రాసారు . సినిమాలకు కావలిసిన మసాలాలు దండిగా వడ్డించారు . చాలావరకు యండమూరి నవలల సినిమాలలో చిరంజీవే హీరోగా నటించారు . అలా చిరంజీవి కోసం రాసిన నవలలలో ఒకటి ” నల్లంచు తెల్ల చీర ” .

పల్లెటూరిలో ఎంత అమ్మినా చీరలు ఎక్కువగా అమ్ముడు కావటములేదని పట్నంలో ఐతే బాగా అమ్మవచ్చని మేనమామను ఒప్పించి విజయవాడ తీసుకొని వస్తాడు రవి . అక్కడ ఎండకు తిరగలేక ఒక వీధి అరుగు మీద పడుకుండిపోతాడు మేనమామ. రవి వీధులన్నీ “చీరలు చీరలు ” అని అరుచుకుంటూ తిరుగుతాడు కాని అమ్మలేక పోతాడు . చివరకు ఎం .ఎల్ . ఏ గారి ఇంట్లో వారి అమ్మాయిని మెప్పించి, ఆమెకు మిస్ .విజయవాడకు చేసుకోవలసిన మేకప్ కు తగిన సూచనలను ఇచ్చి, నల్లంచు తెల్ల చీరను ఆమెకు అమ్ముతాడు రవి . ఆ సంతోషంలో మేనమామ దగ్గరకు వచ్చేసరికి వడగాలికిఆకలికి తట్టుకోలేక, చనిపోతూ చివరిక్షణంలో వుంటాడు మామ. ఆయన చనిపోతూ, తన కూతురు మాధవిని పెళ్ళి చేసుకోవాలి అని రవి దగ్గర మాట తీసుకుంటాడు . రవి అలాగే మాధవిని పెళ్ళిచేసుకొని, మాధవిని, అత్తగారిని, బావమరిదిని చూసుకుంటూ వుంటాడు . ఒక బట్టల షాప్ లో సేల్స్ బాయ్ గా చేరి అక్కడ పెద్ద వస్త్ర వ్యాపారి ఐన శర్మను తన ప్రవర్తనతో మెప్పిస్తాడు . అక్కడ వుద్యోగము వదిలి సొంతముగా ఆప్లిక్ వర్క్ చీరలను అమ్ముతున్న రవిని శర్మ తన పాట్నర్ గా చేసుకుంటాడు . ఎవరికి ఎలాంటి చీర నప్పుతుందో, ఎవరు ఎలా చీర కట్టుకుంటే బాగుంటారో చెప్పగల నైపుణ్యం రవిది . తన తెలివితేటలతో, కష్టపడి రవితేజా కంపెనీని వృద్ధిలోకి తెస్తాడు .

వ్యాపారంలో దినదినాభివృద్ధి చెందుతూ డబ్బులు, మంచి పేరు ప్రఖ్యాతులు గడిస్తాడు రవి . కాని భార్య మాధవి దగ్గర నుంచి ఏమాత్రం ప్రోత్సాహం వుండదు . ఇంట్లో శాంతి వుండదు .ఇద్దరికీ ఎప్పుడూ కీచులాటలే ! శర్మ భార్య ఒకప్పుడు రవి, విజయవాడలో మిస్ విజయవాడ అయ్యేందుకు చిట్కాలు చెప్పి చీర అమ్మిన అమ్మాయే! . ఆమె తండ్రి పదవి పోయి, దివాలా తీసిన క్లిష్ట పరిస్ధితులలో, వయసులో పెద్దవాడైన శర్మకు రెండో భార్యగా ఇచ్చి వివాహము చేస్తాడు . ఆమె రవికి తెలీకుండా రవిని గమనిస్తూవుంటుంది . రవి సెక్రెటరీకి ఆక్సిడెంట్ అయి సెలవులో వుంటే, ప్రియంవద టెంపరరీ సెక్రెటరీగా చేరుతుంది . రవిని అభిమానిస్తూ, చాలా చనువును చూపిస్తూ వుంటుంది . ఈ ముగ్గురు అమ్మాయిల మధ్య, ప్రత్యర్థి చెంచురామయ్య పై వేసే ఎత్తులు పైఎత్తుల మధ్య రవి కథ నడుస్తుంది . వ్యాపారపు పని మీద రవి అమెరికా వెళ్ళి వచ్చేసరికి మాధవి హత్య చేయబడుతుంది . రవే ఆ హత్య చేసినట్లుగా ఋజువులు వుంటాయి . ఆ నేరారోపణ నుండి రవి ఎలా బయట పడతాడు ? అసలు హంతకుడు ఎవరు ? ప్రియంవద ఎవరు ? మొదలైన ప్రశ్నలన్నిటికీ జవాబు నవలనే !

రంగనాథ్ ఆఫీస్ లో పోలీస్ లు సోదాచేస్తుండగా పొరపాటున పోలీస్ ఆఫీసర్ ను హత్య చేస్తాడు. హత్య చేస్తుండగా అతని సెక్రెటరీ చెంచురామయ్య (రావుగోపాలరావు ), అతని సహాయకుడు బ్రహ్మాజీ ( గొల్లపూడి మారుతీరావు ) అక్కడే ఉంటారు. పోలీస్ ఆఫీసర్ చనిపోతూ అన్న మాటలను బ్రహ్మాజీ టేప్ రికార్డర్ లో రికార్డ్ చేసి, అతనిని భయపెట్టి, రెండు లెటర్స్ మీద సంతకము చేసి, కూతురితో సహా వూరు వదిలి పారిపోయేటట్టుగా చేస్తాడు చెంచురామయ్య . రంగనాథ్ భార్య ( జయంతి ) కు ఈ సంగతి తెలిసి, తమ్ముడితో కలిసి ఇల్లు వదిలివెళ్ళిపోతుంది . ఇది బాక్ గ్రౌండ్ కథ !

దీని తరువాత రవితేజ ( చిరంజీవి ) చీరల గురించి వివరిస్తూ వుండగా సినిమా మొదలవుతుంది . రవితేజ మూలముగా చెంచురామయ్య చీరల వ్యాపారం దెబ్బ తింటుంది . రవితేజను ఎలా దెబ్బ తీయాలా అని చెంచురామయ్య ప్లాన్ లు వేస్తూవుంటాడు . ఒకరోజు టెండర్ వేసేందుకు వెళుతున్న రవితేజాను గుండాలతో కొట్టించే ప్రయత్నము చేస్తాడు . అప్పుడు నాగరాజు ( చిరంజీవి ) వచ్చి రవితేజను రక్షిస్తాడు . అతను అచ్చం రవితేజాలా వుంటాడు . ఈ నాగరాజు, రంగనాథ్ భార్య జయంతి తమ్ముడు . స్టంట్ మాస్టర్ నాగరాజుగా పెరిగి బ్లాక్ మార్కెట్ లో సినిమా టికెట్స్ అమ్ముతూ వుంటాడు . ఇంకా చిల్లర వేషాలు వేస్తూ వుంటాడు . వ్యాపారములో అభివృద్ధి సాధిస్తున్నా, రవితేజకు ఇంట్లో శాంతి వుండదు . భార్య లలిత ( మాధవి), అత్తగారు ( రాజసులోచన), బావమరిది ( గిరిబాబు) అతనిని వేదిస్తూ వుంటారు . ఈ పరిస్థితిలో ప్రియంవద ( భానుప్రియ) రవితేజ దగ్గర సెక్రటరీగా చేరుతుంది . తన చిలిపి మాటలతో రవితేజను ఆకర్శిస్తుంది . మన:శ్శాంతి కోసము ప్రియంవదను తీసుకొని వూరికి వెళతాడు రవితేజ .అక్కడ హోటల్ రూంలో వీరూదాదా ( చరణదాస్) ప్రియంవద తన భార్య అని చెప్పి, ఘర్షణలో ప్రియంవదను హత్య చేస్తాడు . తెల్లబోయిన రవితేజ ప్రియంవదను హత్య చేసిన పిస్టల్ ను పట్టుకుంటాడు . అప్పుడు బ్రహ్మాజీ వచ్చి ఫొటోలు తీస్తాడు . చెంచురామయ్య ఆ ఫొటోలతో రవితేజను బ్లాక్ మేయిల్ చేస్తుంటాడు . అది తట్టుకోలేక రవితేజ ఆత్మహత్య చేసుకోబోతే, నాగరాజు రక్షించి, రవితేజగా నాగరాజు, నాగరాజుగా రవితేజ వెళ్ళే ఏర్పాటు చేస్తాడు . నాగరాజు తన ప్రియురాలు మల్లి ( రాధిక ) తోసహా రవితేజ ఇంట్లో చేరి, లలితను, ఆమె తల్లి, తమ్ముడు లను దారికి తెస్తాడు . చెంచురామయ్య అసలు సంగతి తెలుసుకొని నాగరాజుగా వున్న రవితేజను, జయంతిని బంధిస్తాడు . అక్కడ రవితేజ, ప్రియంవద బతికి వుండటము చూస్తాడు . ఆమె రంగనాథ్, జయంతిల కుమార్తెగా తెలుస్తుంది . నాగరాజుగా మారువేషముతో వచ్చి రవితేజ మొదలైన వారిని విడిపించి, చెంచురామయ్య, బ్రహ్మాజి, వీరూ దాదాలను పోలీస్ లకు పట్టించటముతో సినిమా ముగుస్తుంది .

సినిమాలో చిరంజీవి ద్విపాత్రాభినయనము చేసాడు . నవలలో అలా దిపాత్రలు లేవు . అలాగే నవలలో ముఖ్య పాత్రలైన శర్మ, మిస్ విజయవాడ పాత్రలు సినిమాలో లేవు . నవలలో రవితేజ భార్య మాధవి హత్య కాబడుతుంది . సినిమాలో రవితేజ సెక్రెటరి హత్యకాబడుతుంది . సినిమాలో నల్లంచు తెల్ల చీర ప్రస్తావన ఎక్కడా లేదు. పాటలో వున్నా, ఆ పాటలో రాధిక నల్లంచు తెల్ల చీర కట్టుకోదు . అసలు చీరే కట్టుకోదు . అన్నీ మోడరన్ డ్రెస్ లు వేసుకుంటుంది ! ప్రియంవద పాత్రకు నవలలో వున్న డైలాగులే చాలా వరకు వున్నాయి . చెంచురామయ్య పాత్ర ఎక్కువ నిడివి వుంది . కథ నేపథ్యము తప్ప ఎక్కువగా సంఘటనలలో నవలకు, సినిమాకు పోలిక లేదు .

” సినిమాకు కావలసిన హంగులన్నీ చేర్చాక కథ మరొక విధం గా తయారైంది. మిస్ విజయవాడ పాత్ర మాయమైంది . ప్రియంవద మంచిదైంది . మాధవి మరణించలేదు . కాబట్టి నల్లంచు తెల్ల చీర నవలకీ ఆ సినిమాకీ ఏ సంబంధమూ లేదు .కేవలం పాత్రల ఆధారం గా తీయబడిన సినిమా అది .” అని రచయితనే నవల పరిచయములో చెప్పారు ! కాబట్టి ఇక మనము అనేందుకు ఏమీ లేదు . భార్యాభర్త ల మధ్య కమ్యూనికేషన్ చాలా సున్నితమైంది. అది యధాతధంగా సినిమాలో చూపించటం కాస్త కష్టము . అందుకే నవలగా విడిగా రాశాను అని కూడా అన్నారు రచయత . ఏమైనా చీరల నేపథ్యములో చక్కటి నవల, సినిమాలలో ఇదే మొదటిదేమో !