త్రిపురనేని వరప్రసాద్
త్రిపురనేని వరప్రసాద్ (చిట్టి) తెలుగు సినిమా దర్శకుడు.[1] అతని తండ్రి త్రిపురనేని మహారథి తెలుగు సినిమా దర్శకుడు, నిర్మాత. అతని నాన్నగారి పినతండ్రి త్రిపురనేని సత్యనారాయణ ఆంధ్రప్రదేశ్ లోని తొలి థియేటర్ మారుతీ టాకీస్ లో పార్టనర్. అలా ఆ కుటుంబానికి సినిమా నేపథ్యం ఉంది.
జీవిత విశేషాలు
మార్చుత్రిపురనేని మహారథి 1955 జూలై 28న కృష్ణా జిల్లాకు చెందిన గుడ్లవల్లేరు గ్రామంలో జన్మించాడు. తరువాత తన కుటుంబం నిజామాబాదులో స్థిరపడింది. అతని తండ్రి త్రిపురనేని మహారథి హైరదాబాదులో అప్పట్లో దక్కను రేడియో కేంద్రంలో అనౌన్సరుగా పనిచేయడంతో వారి కుటుంబం కొంత కాలం హైదరాబాదులో ఉండేది. ఆక్కడి నుండి చెన్నై వెళ్ళి మహారథి రచయితగా స్థిరపడినందున వరప్రసాద్ చదువంతా చెన్నైలోనే సాగింది. పాఠశాల జీవితంలో అతను నాటకాలలో నటిస్తుండేవాడు. చెన్నైలోని పచ్చయప్ప కాలేజీలో పి.యు.సి చదువుకుంటూనే సినిమా రంగంపై మక్కువతో తన తండ్రి నిర్మించిన దేశమంటే మనుషులోయ్ చిత్రం షూటింగ్ కు సరదాగా వెళ్లాడు. ఈ విధంగా వివిధ సినిమా అంశాల్ని గమనిస్తూ ఉండేవాడు. సినిమాలో దర్శకునిగా ఉండాలనే కోరిక బలంగా ఉండడంతో అతని తండ్రి అతనిని ఆత్రేయ, అప్పలాచార్యల వద్ద కొంత కాలం పనిచేసే ఏర్పాటు చేసాడు. వారివద్ద కొంతకాలం పనిచేసాడు. ఆత్రేయ సినిమాలు చూసి చాలా విషయాలు నేర్చుకున్నాడు. ఆ తరువాత దర్శకుడు ఎం.మల్లికార్జునరావు వద్ద అప్రెంటిస్ గా చేరాడు. అతనితో పాటు కె.ఎస్.ఆర్.దాస్, కొమ్మినేని శేషగిరిరావు తో పాటు తమిళ దర్శకులు ఏ.సి.త్రిలోక్ చందర్, అమృతం, రాజేంద్రన్ దగ్గర కూడా పనిచేసాడు. పద్మాలయా సంస్థ నిర్మించిన హిందీ చిత్రాలకూ పనిచేసాడు. కురుక్షేత్రం సినిమాలో బాబూభాయ్ మిస్త్రీ అనే ఛాయాగ్రాహకునితో కూడా పనిచేసాడు. "నవభారత్" బాబూరావు నిర్మించిన చిత్రాలలో కో డైరక్టరుగా పని చేసాడు. ఈ అకవాశం రావడానికి ప్రధాన కారకుడు మోహన్ బాబు.[2]
దర్శకునిగా
మార్చుఅతను సంతానం సినిమాతో దర్శకునిగా తన ప్రస్థానాన్ని ప్రారంభించాడు. ఈ సినిమాకి ప్రేక్షకుల ఆదరణతో పాటు ప్రభుత్వ పురస్కారాలు కూడా లభించాయి. ఇదే కథను కొంచెం మార్చి పదేళ్ల తరువాత మాతృదేవోభవ సినిమాగా తీసారు. సంతానం సినిమాలో హీరో ఘట్టమనేని కృష్ణ అతిథి పాత్రను పోషించాడు. అతని అభివృద్ధిని కాంక్షించే వ్యక్తి కావడంతో కృష్ణ ఒక స్టార్ గా ఎదిగినా గెస్ట్ పాత్రను పోషించాడు.
సంతానం సినిమా విడుదల కాగానే అతనికి నాలుగు కొత్త ఆఫర్లు వచ్చాయి. అడ్వాన్సులు కూడా తీసుకున్నాడు. ఆ తరుణంలో రాఘవ సినిమా చేద్దామని అతనిని కబురు పంపారు. రాఘవపై ఉన్న గౌరవంతో అతని ఆఫర్ ను అంగీకరించాడు. రాఘవ ఒప్పందం ప్రకారం ఒక సినిమా చేస్తున్నప్పుడు వేరే ఏ సినిమాకు పని చేయకూడదు. అతని తో చేయవలసిన సినిమా ఆలస్యమైంది. రాఘవతో అతనికి వచ్చిన చిన్న చిన్న అభిప్రాయ భేదాల వల్ల స్వంతంగా సినిమా తీయకుండా, మరో సినిమాలో చేయకుండా బ్లాక్ కావలసి వచ్చింది. వారి మధ్య రాజీ కుదరక రాఘవతో పనిచేయలేనని అతను చెప్పేసాడు.
రాఘవ సినిమా అతను వదిలెసిన తరువాత అతను అంగీకరించిన చిత్రం నా పేరే దుర్గ. ఆ సినిమాకు సిల్క్ స్మిత కథానాయిక. తరువాత సిల్క్ స్మిత బ్రహ్మా నీ రాత తారుమారు అనే సినిమాను తీస్తూ అందులో అతనిని దర్శకునిగా ఎన్నుకుంది. ఈ చిత్రానికి రాధాకృష్ణ నిర్మాత. కానీ ఆ సినిమా అనేక అడ్డంగులతో రిలీజ్ కాలేదు. అది కెరీర్ పరంగా అతనికి నష్టం కలిగిందించి. తరువాత స్వంతంగా సినిమా తీద్దామని భావించి రైతు భారతం సినిమాను ప్రారంభించాడు. అందులో సౌందర్యను కథానాయకిగా పరిచయం చేసాడు. కానీ దర్శకుడు పి.ఎన్.రామచంద్రరావు అభ్యర్థన మేరకు ఆమెను మనవరాలి పెళ్ళి చిత్రానికి నటించేందుకు అవకాశం ఇచ్చాడు. అది హిట్ కావడంతో ఆమె మరో తమిళ సినిమాలో కూడా నటించింది. అలా రైతుభారతం విడుదల కాకుండానే ఆమె బిజీ హీరోయిన్ అయింది.
ఆతనికి సామాజిక సందేశంతో సినిమాలు తీయడమంటే యిష్టం. అందువల్ల కమర్షియల్ సినిమాలు కాకుండా ఇష్యూ ఆధారిత సినిమాలు తీయడానికి యిష్టపడుతుంటాడు. అలా కేరళలో జరిగిన ఓ సంఘటన ఆధారంగా "గెలుపు" సినిమా తీసాడు. ఇది న్యూస్ ని ఆధారంగా తీసిన సినిమా. తరువాత అతను మా నాన్న పెళ్ళి సినిమా సినిమా తీసాడు ఈ సినిమా సౌందర్య నటించిన చివరి సినిమా. ఆమె తొలి సినిమా, చివరి సినిమా కూడా అతనిదే కావడం విశేషం. [3]
రాజకీయ జీవితం
మార్చు1998లో అతని జీవితంలో మలుపు తిరిగింది. అతను భారతీయ జనతా పార్టీలో చేరాడు. నాలుగేళ్ళపాటు ఆ పార్టీలో చురుకైన పాత్ర పోషించాడు. వాజ్ పేయి గారిని ప్రధాన మంత్రిగా చూడాలనుకున్నాడు. అది నెరవేరిన తరువాత అతను మళ్లీ సినిమా రంగంలోని ప్రవేశించి "గెలుపు" సినిమాను తీసాడు.
మూలాలు
మార్చు- ↑ "Indiancine.ma". Indiancine.ma. Retrieved 2021-05-12.
{{cite web}}
: CS1 maint: url-status (link) - ↑ నవ్య మ్యాగజైన్, 2012 ఆగస్టు 29, పుట: 60,61 : మహారథి గారి కొడుకుగా పుట్టడం నా అదృష్టం - త్రిపురనేని వరప్రసాద్
- ↑ "దర్శకుడు 'త్రిపురనేని వరప్రసాద్ ( చిట్టి)". TELUGUCINEMA CHARITRA (in అమెరికన్ ఇంగ్లీష్). Retrieved 2021-05-12.