సర్ ఆర్థర్ కాటన్ ఆనకట్ట

గోదావరి డెల్టా ప్రధాన నీటిపారుదల వ్యవస్థ
(ధవళేశ్వరం ఆనకట్ట నుండి దారిమార్పు చెందింది)

సర్ ఆర్థర్ కాటన్ ఆనకట్ట (ధవళేశ్వరం ఆనకట్ట) తూర్పు గోదావరి జిల్లా లోని రాజమహేంద్రవరానికి సమీపాన ఉన్న ధవళేశ్వరం, పశ్చిమ గోదావరి జిల్లా లోని విజ్జేశ్వరాలను కలుపుతూ గోదావరి నదిపై నిర్మించిన ఆనకట్ట. ఈ ఆనకట్ట సర్ ఆర్థర్ థామస్ కాటన్ అనే బ్రిటిషు ఇంజనీరు ఆధ్వర్యంలో 1847 లో ప్రారంభించి 1852 నాటికి పూర్తిచెయ్యబడింది. పాత ఆనకట్ట బలహీనమైనందున కొత్త ఆనకట్టను 1970 లో నిర్మాణం ప్రారంభించి 1982 లో పూర్తి చేశారు. [1]

సర్ ఆర్ధర్ కాటన్ ఆనకట్ట
రాజమండ్రి లో సర్ ఆర్థర్ కాటన్ ఆనకట్ట
సర్ ఆర్థర్ కాటన్ ఆనకట్ట is located in Andhra Pradesh
సర్ ఆర్థర్ కాటన్ ఆనకట్ట
Andhra Pradesh లో సర్ ఆర్ధర్ కాటన్ ఆనకట్ట స్థానం
దేశంభారతదేశం
ప్రదేశంరాజమండ్రి, తూర్పు గోదావరి జిల్లా, ఆంధ్రప్రదేశ్
అక్షాంశ,రేఖాంశాలు16°55′51″N 81°45′57″E / 16.9307594°N 81.7657988°E / 16.9307594; 81.7657988
ఆవశ్యకతనీటిపారుదల, త్రాగునీరు
స్థితిక్రియాత్మకం
నిర్మాణం ప్రారంభం1970
ప్రారంభ తేదీ1982
యజమానిఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం
ఆనకట్ట - స్రావణ మార్గాలు
ఆనకట్ట రకంవంతెన
నిర్మించిన జలవనరుగోదావరి నది
పొడవు3,599 m
Website
(Projects ->SIR ARTHUR COTTON BARRAGE( G.D.System))
సర్ ఆర్ధర్ కాటన్ ఆనకట్ట

భౌగోళికం సవరించు

రాజమహేంద్రవరానికి ఈ అనకట్ట కు సరిహద్దులైన ధవళేశ్వరం 12.9 కి.మీ. విజ్జేశ్వరం 20 కి.మీ. దూరంలో ఉన్నాయి. OSM పటం చూడండి.

 
సర్ ఆర్ధర్ కాటన్ ఆనకట్ట OSM పటం

గోదావరి నది సవరించు

గోదావరి నది మహారాష్ట్ర లోని నాసిక్ దగ్గర సముద్రమట్టానికి 1067 మీటర్ల ఎత్తులో గల త్రయంబకం వద్ద ఉన్న బ్రహ్మగిరి పర్వతం లో పుట్టి, మహారాష్ట్ర గుండా 770 కి.మీ ప్రవహించి, బాసర వద్ద తెలంగాణ లోనికి ప్రవేశించి, భద్రాచలం దగ్గర గల సీతాపురం ప్రాంతంలో ఆంధ్రప్రదేశ్ లో ప్రవేశిస్తుంది. కూనవరం, పోలవరం, పట్టిసీమ లను దాటుకొని, రాజమహేంద్రవరం వద్ద వెడల్పాటి నదిగా మారి, దిగువున ఉన్న ధవళేశ్వరం వద్ద తూర్పుగా, దక్షిణంగా రెండు పాయలుగాచీలి బంగాళాఖాతములో సంగమిస్తుంది. ధవళేశ్వరం వద్ద రెండుగా చీలిన గోదావరి తూర్పు పాయను గౌతమి అంటారు. ఇది 70 కి.మీ. ప్రవహించి, ప్రధానంగా వృద్ధగౌతమి, కోరింగ, నీలరేవు అను మూడు భాగాలుగా చీలి యానాం వద్ద సముద్రంలో కలుస్తుంది. అలాగే దక్షిణ పాయను వశిష్ట అంటారు. ఇది దక్షిణంగా 40 కి.మీ. ప్రయాణించి వశిష్ట, వైనతేయగా చీలి అటు అంతర్వేది, ఇటు ఓడలరేవు వద్ద సముద్రంలో కలుస్తుంది.

ఆనకట్ట నిర్మాణానికి ముందు గోదావరి డెల్టా నేపథ్యం సవరించు

 
గోదావరి డెల్టా విహంగవీక్షణం

గోదావరి నదిపై ధవళేశ్వరం వద్ద ఆనకట్ట నిర్మించకముందు, గోదావరి డెల్టా లోని రెండు జిల్లాలవారూ అతివృష్టి వలన, తుఫానుల వలన ముంపునకు గురై, అనావృష్టి వలన కరువుకాటకాలకు లోనై, ప్రజలు అష్టకష్టాలు పడుతూ, దుర్భర దారిద్ర్యానికి లోనై జీవించేవారు. 1833 లో అనావృష్టి వలన దుర్భరమైన క్షామం, కరువు వచ్చి, వేలసంఖ్యలో ఆకలి చావులు సంభవించాయి.[2] దీనినే నందన క్షామము అంటారు. దాదాపు రెండు లక్షలమంది కరువు బారిన పడ్డారు. తిరిగి 1839 లో తీవ్రమైన తుఫానులు, ఉప్పెన కారణంగా పొలాలు, గ్రామాలు ముంపునకు గురై, క్షామ పరిస్థితులేర్పడి, వేలాది జనం కాందిశీకులుగా ప్రక్క జిల్లాలకు, ప్రక్క రాష్ట్రాలకు వలస వెళ్ళవలసివచ్చింది. [3]

ఆనకట్ట స్థలం ఎంపిక సవరించు

గోదావరి జిల్లాల ప్రజల దుర్భర పరిస్థితులను గమనించిన అప్పటి జిల్లా అధికారి సర్ హెన్రి మౌంట్, ప్రజల కష్టాలను వివరిస్తూ ప్రభుత్వానికి ఒక నివేదికను పంపారు. ఆ నివేదికకు స్పందించిన బ్రిటిషు ఇండియా ప్రభుత్వం, గోదావరి నదిపై ఆనకట్ట కట్టుటకుగల అనుకూల, ప్రతికూల స్థితిగతులను అంచనా వేయడానికి ఆర్థర్ కాటన్ అనే ఇంజనీరుకు ఉత్తర్వు ఇవ్వడం జరిగింది. ప్రభుత్వ ఆదేశంపై రాజమండ్రి వచ్చిన కాటన్, గోదావరి నదిపై ఆనకట్ట కట్టడానికి అనువైన ప్రాంతం కోసం అన్వేషణ ప్రారంభించారు. కాటన్ గోదావరి తీరప్రాంతాన్ని గుర్రంపై పర్యవేక్షించాడు. సరియైన ఆహారం దొరకనప్పుడు అరటిపళ్లతోనే సరిపెట్టుకున్నాడు. గుర్రంపై స్వారీచేస్తూ, గోదావరి నది ప్రాంతాన్ని కూలంకషంగా పరిశీలించడం మొదలుపెట్టాడు. మొదట కోయిదా-జీడికుప్ప ప్రాంతాన్ని, పాపికొండల ప్రాంతాన్ని పరిశీలించాడు. పొపికొండలవద్ద గోదావరి సన్నబడి కేవలం 200మీటర్ల వెడల్పు మాత్రమే ఉంటుంది. అక్కడ ఆనకట్ట కట్టుటకుగల సాధ్యాసాధ్యాలను అంచనా వేశాక, పోలవరం దగ్గరనున్న మహానందికొండ-పొదలకొండ తీరప్రాంతాన్ని పరిశీలించాడు. చివరికి ధవళేశ్వరం, విజ్జేశ్వరము మధ్య నదివెడల్పుగా ఉండటం, లంకలు, ఇసుకతిప్పలు ఉండటం వలన, ఆనకట్ట నిర్మాణ సమయంలో నదినీటిని ప్రక్కకు మళ్లించుటకు అనుకూలంగా ఉంటుందని భావించి, అక్కడి పరిస్థితులను అధ్యయనము చేసి, ఆనకట్ట కట్టడానికి అనుకూలమైనదంటూ కాటన్ తన నివేదికను అప్పటి మద్రాసు గవర్నరు మార్కస్ ట్వేల్ డేల్ కు సమర్పించాడు. ఆయనకూడా దానిని ఆమోదించి, లండను లోని బోర్డు ఆఫ్ డైరెక్టర్లకు పంపించాడు. వారు ప్రాజెక్టు రిపోర్టును పరిశీలించి, డిసెంబరు 23, 1846 న తమ ఆమోదం తెలుపుతూ, అనుమతి పత్రముపై సంతకంచేశారు. ఆలస్యం చెయ్యకుండా, కాటన్ ఆధ్యర్యములో 1847లో ఆనకట్ట నిర్మాణానికి శ్రీకారం చుట్టారు.

తొలి నిర్మాణం సవరించు

 
పాత అనకట్ట అక్విడక్ట్

అర్ధర్ కాటను గోదావరిపై ఆనకట్ట నిర్మించుటకై ఎన్నుకున్న ప్రాంతంలో నది వెడల్పు దాదాపు 6 కి.మీ. అందులో మూడోవంతు లంకలున్నాయి. నీటి మళ్ళింపుకై మొదట ఇసుకగట్లను కట్టారు. 1847 నాటికి ఆనకట్ట నిర్మాణం కోసం పదివేలమంది కూలీలను, ఐదువందల మంది వడ్రంగులను, ఐదువందల మంది కమ్మరులను నియమించారు. కూలీలు పనిచేయు సమయంలో కాటను భార్య ఎలిజెబెత్, కూలీల పిల్లలకు పాఠాలు చెప్పేవారు. 1847 అగస్టు మూడవ వారమునాటికి ఉక్కు రాగానే, యంత్రసామాగ్రితో నిర్మాణపు పనులు ముమ్మరమయ్యాయి. ఆనకట్టకు అవసరమైన రాయిని రైలు వ్యాగనుల ద్వారా నదిఒడ్డుకు చేర్చేవారు. అలా చేర్చిన రాళ్లను పడవలద్వారా నదిలోని నిర్మాణప్రాంతానికి రవాణా చేసేవారు. ఇందుకు 25 టన్నుల భారం మోయగల 18 నావలను వాడారు. రోజుకు దాదాపు 150 టన్నుల రాయిని నదీగర్భములో నిర్మాణస్థలానికి తీసుకెళ్లేవారు, ఈ పడవలద్వారా. ఇదే సమయంలో తగినంత ఇటుక తయారుకాగానే, ఆనకట్ట పునాదులు, నూతులు త్రవ్వుట వంటిపనులు చురుకుగా ప్రారంభించి, 1847 జూలైలో నదిలో నీరుచేరువరకు కొనసాగించారు. నదిలో నీరుచేరగానే పడవలలో రాళ్లను నదిలోని లంకలకు చేర్చి, గట్లను గట్టిపరచే పనులు మొదలుపెట్టారు. లంకలోని అన్నిగట్లను ఏకకాలంలోనే కట్టడం మొదలుపెట్టారు. తగినంత ఆర్థికసహాయం అందుబాటులోకి రాగానే, 1849 ఫిబ్రవరిలో విజ్జేశ్వరం వైపు ఆనకట్ట పనులు ప్రారంభించారు. 1852 లో ఆనకట్టనిర్మాణం పూర్తయ్యింది. కాటన్ చిత్తశుద్ధితో చేయడం వలన ఆనకట్ట నిర్మాణం అతితక్కువ సమయంలోనే పూర్తయ్యింది.

కాటన్ పనితీరు సవరించు

దేశీయుల ఆదరాభిమానాలకు మన్ననలకు కాటన్ పాత్రుడయ్యాడు. కాటన్ ఆచరణలో దేశీయులపై ఉంచిన నమ్మకం, వారిచే పనిచేయించుకున్న తీరు, పల్లకి ఎక్కిన ప్రభువులాగాక తానూ ఒక కూలీగా అందరితో కలసి కష్టించిన ఫలితంగా ఆయనకు ఆదరణ లభించింది. వి.వీరన్న వంటి పర్యవేక్షకుడు (ఓవర్సీర్) కాటన్ కు లభించారు. వీరన్న తరువాత సబ్-ఇంజనీరుగా పైకివచ్చాడు. రాయ్ బహదూర్ బిరుదు పొందాడు. కాటన్ కు సహకరించి పనులు జరగటానికి తోడ్పడ్డాడు. ఆనకట్టపై ఒకచోట అతని పేరిట ఫలకం ఉంది. 1867లో వీరన్న చనిపోయాడు. [3]

మార్పులు చేర్పులు సవరించు

తరువాతి కాలంలో, అదనంగా ఎక్కువ పొలాలకు సేద్యపునీటిని అందించడానికీ, పడవల ప్రయాణ అవసరాలకూ 1862-67 మధ్య ఆనకట్ట ఎత్తు రెండు అడుగులు పెంచబడింది. మరలా 1897-99 లలో సిమెంటు కాంక్రీటుతో నిర్మించి తొమ్మిది అంగుళాలు పెంచారు. తిరిగి 1936 లో మూడు అడుగుల తలుపులు అమర్చి పదిలక్షల ఎకరాలకు సేద్యపునీరు అందించారు. ఆనకట్ట బలహీనమవడంతో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం, రోడ్డుతో కూడిన కొత్త ఆనకట్ట, 1970 లో ప్రారంభించి 1982 లో పూర్తి చేశారు. దీనికి సర్ ఆర్థర్ కాటన్ ఆనకట్ట గా పేరు పెట్టారు. ఈ రోడ్డు మీదుగా చిన్నవాహనాలు ఆర్.టి.సి.బస్సులు ప్రయాణిస్తాయి.

ఆనకట్ట మధ్యలో లంకలు ఉండటం వలన ఆనకట్ట నాలుగు భాగాలుగా ఉంటుంది. ధవళేశ్వరం-పిచ్చుకలంక మధ్య ఉన్న ధవళేశ్వరం విభాగం ఆనకట్ట 1440.5 మీ పొడవు ఉండి 70 గేట్లను కలిగి ఉంది. ఆ తరువాత పిచ్చుకలంక-బొబ్బర్లంక మధ్య ఉన్న ర్యాలి విభాగం ఆనకట్ట 884.45 మీ. పొడవు ఉండి, 43 గేట్లను, బొబ్బర్లంక-మద్దూరులంక మధ్య ఉన్న మద్దూరు విభాగం 469.6మీ పొడవు ఉండి, 23 గేట్లను కలిగి ఉండగా, మద్దూరులంక-విజ్జేశ్వరం మధ్య ఉన్న విజ్జేశ్వరం విభాగం ఆనకట్ట 804.9 మీ.పొడవు ఉండి, 39 గేట్లను కలిగి ఉంది. ఈ ఆనకట్టల నిర్మాణం 3599 మీ. ఉండగా, లంకలతో కలుపుకొని ఆనకట్టమొత్తము పొడవు 5837మీటర్లు, మొత్తం గేట్లసంఖ్య 175, ఒక్కోగేటు పరిమాణం 19.29X3.35మీటర్లు, ఒకగేటు బరువు 27టన్నులుగా ఉంది.

ఈ ఆనకట్ట క్రింద తూర్పుడెల్టాకాలువ క్రింద 2.76 లక్షల ఎకరాలు, మధ్యడెల్టాకాలువ క్రింద 2.04 లక్షల ఎకరాలు, పశ్చిమడెల్టాకాలువ క్రింద 5.20 లక్షల ఎకరాలు సాగులో ఉంది.

ఆనకట్ట నిర్మాణంలో ఉపయోగించిన యంత్రాలు సవరించు

ధవళేశ్వరం ఆనకట్టకు చేరువగా ఉన్న కాటన్ మ్యూజియంలో ఉంచిన, ఆనాడు ఆనకట్ట నిర్మాణంలో వాడిన యంత్రాలు, కృష్ణానది బ్యారేజి నిర్మాణంలో వాడినవి, కొన్ని యంత్రాల కూడా ఉన్నాయి.

మూలాలు సవరించు

  1. "SIR ARTHUR COTTON BARRAGE( G.D.System)". AP Irrigation Department. Retrieved 2021-06-24.
  2. మాదల 1967, p. 70.
  3. 3.0 3.1 నరిసెట్టి ఇన్నయ్య. "  ఆర్థర్ కాటన్".   అబద్ధాల వేట - నిజాల బాట. వికీసోర్స్. 

వెలుపలి లంకెలు సవరించు