నయా ఖిల్లా

తెలంగాణ రాష్ట్ర రాజధాని హైదరాబాదులోని గోల్కొండ కోటకు కిలోమీటరు దూరంలో ఉన్న ప్రాంతం.

నయా ఖిల్లా, తెలంగాణ రాష్ట్ర రాజధాని హైదరాబాదులోని గోల్కొండ కోటకు కిలోమీటరు దూరంలో ఉన్న ప్రాంతం.[1][2] మొఘల్ సైన్యాలకు మరింత రక్షణ ఉండడంకోసం 1656లో సుల్తాన్ అబ్దుల్లా కుతుబ్ షా దీనిని నిర్మించాడు. గోల్కొండ కోటలో ఈ అంతర్భాగమైన అనేక చారిత్రక నిర్మాణాలు ఉన్నాయి. నాయ ఖిల్లాకు ఎదురుగా ఉన్న బయటి కోట గోడలపై రాతి, గారతో చేసిన వింత బొమ్మలు, జంతువులు ఉన్నాయి. భారతదేశంలోని అతి తక్కువగా అన్వేషించబడిన వారసత్వ ప్రదేశాలలో ఇదీ ఒకటి.[2][3]

గోల్కొండ పైనుండి నయ ఖిలా దక్షిణం వైపు దృశ్యం
కొత్త గోల్ఫ్ కోర్స్ వైర్ మెష్

చరిత్ర మార్చు

దక్కన్ పీఠభూమి మొఘల్ గవర్నర్ సుల్తాన్ అబ్దుల్లా కుతుబ్ షా (1625–1672) పాలనలో, ఔరంగజేబు 1656 జనవరిలో గోల్కొండ కోటను లక్ష్యంగా చేసుకున్నాడు. శక్తివంతమైన మొఘల్ సైన్యం ఫిరంగులతో కాల్పులను కొనసాగించింది. నాలుగు నెలల ముట్టడి తరువాత 1656 ఏప్రిల్ లో మొఘల్ సైన్యం కాల్పులను ఉపసంహరించుకుంది. మొఘలుల దాడి కారణంగా కోట బలహీనంగా మారింది, కోట గోడలు ద్వంసమవడం ప్రారంభించాయి. దానివల్ల భవిష్యత్తులో దాడులు, నష్టాన్ని నివారించడానికి సుల్తాన్ అబ్దుల్లా కుతుబ్ షా కోట గోడల మరమ్మత్తు, గోల్కొండ కోట పొడిగింపు కోసం ఆదేశించాడు. ఆ సందర్భంగా నయా ఖిల్లా నిర్మాణం జరిగింది. 1656 సంవత్సరంలో ప్రారంభించబడిన దీని నిర్మాణం, సుల్తాన్ అబుల్ హసన్ కుతుబ్ షాచే పూర్తి చేయబడింది.[4] దాదాపు 30 సంవత్సరాలకు ఔరంగజేబు చక్రవర్తి అయిన తరువాత, అతను గోల్కొండపై మళ్ళీ తన దృష్టిని కేంద్రీకరించాడు. ఈ ఖిల్లా కందకాలతో కూడిన రాతి కట్టడం. గోల్కొండకు మరింత రక్షణగా నిలిచింది. 1687లో ఔరంగజేబు గోల్కొండను స్వాధీనం చేసుకున్నాడు.[5]

కుతుబ్ షాహీ రాజవంశ వాస్తుశిల్పి ముస్తఫా ఖాన్ ఈ కోటను రూపొందించి, నిర్మించాడు; మక్కా మసీదు, టోలీ మసీదులు కూడా ముస్తఫా ఖాన్ చేత రూపొందించబడి, నిర్మించబడ్డాయి. [6]

ఆకర్షణలు మార్చు

  • పెర్షియన్ గార్డెన్ (బాగ్-ఇ-కుతుబ్ ): అబ్దుల్లా కుతుబ్ షా (1625-1672) చేత నిర్మించబడింది.[7] ఈ నయా ఖిల్లాలో విశాలమైన ఉద్యానవనం ఉండేది. కరెంటు లేని ఆ కాలంలోనే నీటిని విరజిమ్మే ఫౌంటెయిన్లు, గురుత్వాకర్షణ శక్తితో నీటిని తీసుకెళ్లే భూగర్భ కాలువలు మొదలైనవి ఈ ఉద్యానవన అద్భుతాలు. ఇరాన్‌లో రూపుదిద్దుకున్న పర్షియా గార్డెన్ ల మాదిరిగా ఇది నిర్మించబడింది. తాజ్‌మహల్‌ వద్ద ఉన్న మొఘల్‌ గార్డెన్‌కు మాతృక కూడా ఈ ఉద్యానవనమే అని పురావస్తు శాఖ సర్వేలలో తాజాగా వెలుగులోకి తెచ్చింది. మొఘలుల కాలం కంటే ముందే రూపుదిద్దుకున్న ఈ ఉద్యానవనం, మొఘల్‌ చక్రవర్తి ఔరంగజేబు చేతిలో కుతుబ్‌షాహీల పాలన ముగియటంతోనే కాలగర్భంలో కలిసిపోయినట్లు తెలుస్తోంది. 32 ఎకరాల విశాలమైన ప్రాంతంలో ఉద్యానవనానం తీర్చిదిద్దబడింది. ఇరాన్‌ నుంచి నిపుణులను పిలిపించి ఉద్యావనాన్ని రూపొందించారు. లంగర్‌హౌజ్‌లో కాకతీయులు నిర్మించిన శాతం చెరువు, గోల్కొండ చెరువు నుంచి నీటిని తరలించేందుకు భూగర్భంలో టెర్రకోట పైపులతో ప్రత్యేక కాలువలు నిర్మించారు. నీరు గ్రావిటీతోనే తొలుత గోల్కొండలోని కటోరాహౌజ్‌కు, అక్కడినుండి ఉద్యానవనానికి చేరేలా ఏర్పాట్లు చేశారు. ఉద్యానవనం చుట్టూ భారీ వృక్షాలను పెంచడంతోపాటు మధ్యలో అందమైన పూల చెట్లు, నీటి కొలనులు ఏర్పాటుచేశారు. గోల్కొండను మొఘలులు పాలకులు వశం చేసుకున్న తర్వాత పట్టించుకునేవారు లేకపోవటంతో ఉద్యానవనం క్రమంగా కనుమరుగై, నిర్మాణాలు మట్టి కింద కూరుకుపోయాయి. అసఫ్‌జాహీల హయాంలో ఇక్కడ వ్యవసాయం చేయడంతో కొంత భూభాగం సాగుభూమిగా మారింది. మిగతా భూమిని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం స్వాధీనం చేసుకుని రాష్ట్ర పర్యాటకాభివృద్ధి సంస్థకు అప్పగించింది.[8]
  • హతియాన్ కా ఝడ్ (ఏనుగు-పరిమాణ చెట్టు): నయా ఖిల్లా ప్రాంగణంలో ఉన్న ఈ ప్రసిద్ధ బ్రహ్మ మల్లిక చెట్టు 400 సంవత్సరాల కంటే పురాతనమైనది.[9] అరబ్ వ్యాపారులు ఈ చెట్టును హైదరాబాద్‌కు తీసుకొచ్చి, సుల్తాన్ ముహమ్మద్ కులీ కుతుబ్ షాకు బహుమతిగా ఇచ్చారు. ఈ చెట్టు చుట్టుకొలత 27.40 మీటర్లు (89 అడుగులు). ఈ చెట్టు కొమ్మల మధ్య గుహ ఏర్పడింది. ఈ చెట్టుపై అనేక కథలు ఉన్నాయి. ప్రసిద్ధ కథలలో ఒకటి దాని గుహకు సంబంధించినది, దాదాపు 400 సంవత్సరాల క్రితం 40మంది పేరుమోసిన దొంగలు దాచుకోవడానికి ఈ చెట్టు సహాయపడింది.[10][11]
  • ముస్తఫా ఖాన్ మసీదు: కుతుబ్ షాహీ రాజవంశం రాజ వాస్తుశిల్పి జ్ఞాపకార్థం నిర్మించబడింది.[12]
  • మసీదు ముల్లా ఖియాలీ: కుతుబ్ షాహీ రాజవంశానికి చెందిన రాజ కవి జ్ఞాపకార్థం నిర్మించబడింది. రెండూ, ముస్తఫా ఖాన్ మసీదు, ముల్లా ఖియాలీ మసీదు గోల్కొండ ప్రారంభ నిర్మాణ శైలికి క్లిష్టమైన ఉదాహరణలు.[13][7]
  • నయా ఖిల్లా తలాబ్: నయా ఖిల్లాలో ఉన్న నీటి ట్యాంక్.[14] నయా ఖిల్లా శిథిలాలలో కుతుబ్ షాహీ పాలనలో నీటి సరఫరా కోసం ఉపయోగించిన 350 సంవత్సరాల నాటి మట్టి పైపుల శకలాలు ఉన్నాయి.[15]

వివాదాలు మార్చు

నయా ఖిల్లా ప్రాంతంలో హైదరాబాద్ గోల్ఫ్ కోర్స్ నిర్మాణం వల్ల వారసత్య నిర్మాణానికి ముప్పు వాటిల్లుతుందని వివిధ స్వచ్ఛంద సంస్థలు, సంస్థల నుండి చాలా నిరసనలు ఎదురయ్యాయి.[16] గోల్కొండ కోట ప్రాంతంలో గోల్ఫ్ కోర్స్ నిర్మాణం వల్ల నిర్వాసితులైన రైతులకు అక్కడి భూమికి బదులుగా నగరంలో భూమిని ఇచ్చారు.[17] చారిత్రాత్మక భూములను గోల్ఫ్ కోర్స్‌గా ఉపయోగించడం గురించిన వివాదం, భారత ప్రభుత్వం 'అడాప్ట్ ఎ హెరిటేజ్' స్కీమ్‌కు సంబంధించిన వారసత్వం సర్కిల్‌లలో భాగంగా చర్చలకు దారితీసింది. దీనికింద దాల్మియా భారత్ ప్రైవేట్ లిమిటెడ్ దీనిని దత్తత తీసుకోవడానికి అనుమతించబడింది.

ఇతర వివరాలు మార్చు

ఈ నయాఖిల్లా ప్రాంతంలో జరిపిన తవ్వకాల్లో రెండు అడుగుల లోతులోనే పెద్దపెద్ద రాళ్లతో కట్టిన నిర్మాణాల ఆనవాళ్ళు బయటపడ్డాయి. దాన్నిబట్టి నయాఖిల్లా అడుగున మరో నగరం ఉండేదని పురావస్తు నిపుణులు అభిప్రాయపడుతున్నారు. అర కిలోమీటరు మేర బండరాళ్ళ వరుస, గది లాంటి నిర్మాణం, నీటి ట్యాంకులు, ఫౌంటేన్‌, డ్రైనేజీ వ్యవస్థ, పైప్‌లైన్లు, హుక్కా సేవించే పరికరాలు, మొఘల్‌ కాలంనాటి నాణేలు వెలుగులోకి వచ్చాయి.[18]

మూలాలు మార్చు

  1. "Andhra Pradesh / Hyderabad News : Excavation in Naya Qila opposed". The Hindu. 16 March 2011. Archived from the original on 28 April 2011. Retrieved 2022-09-24.
  2. 2.0 2.1 "Naya Qila played down in Unesco list". The Times of India. 31 May 2011. Archived from the original on 5 November 2012. Retrieved 2022-09-24.
  3. "History and Culture-Qutb Shahi Style". APonline. Archived from the original on 10 January 2013. Retrieved 2022-09-24.
  4. "Yahoo! Groups". Tech.groups.yahoo.com. Archived from the original on 2013-01-05. Retrieved 2022-09-24.
  5. "Qutb Shahi dynasty (Indian dynasty) - Britannica Online Encyclopedia". Encyclopædia Britannica. Retrieved 2022-09-24.
  6. "How protected is our heritage?". The Times of India. 12 September 2011. Archived from the original on 6 November 2012. Retrieved 2022-09-24.
  7. 7.0 7.1 "Metro Plus Hyderabad / Columns : Naya Qila". The Hindu. 12 December 2009. Archived from the original on 9 November 2012. Retrieved 2022-09-24.
  8. "భువిలో దివి!". Sakshi. 2017-03-26. Archived from the original on 2022-09-24. Retrieved 2022-09-24. {{cite web}}: |archive-date= / |archive-url= timestamp mismatch; 2017-03-28 suggested (help)
  9. gigapan: search
  10. "Naya Quila, in Dire Straits ?". Thenews.co.in. 30 December 2008. Archived from the original on 2020-07-14. Retrieved 2022-09-24.
  11. "Naya Qila". Minor Sights. Retrieved 2022-09-24.
  12. "Andhra Pradesh / Hyderabad News : Outrage over golf at Naya Qila". The Hindu. 22 February 2009. Archived from the original on 25 February 2009. Retrieved 2022-09-24.
  13. "Yahoo! Groups". Tech.groups.yahoo.com. Archived from the original on 5 జనవరి 2013. Retrieved 29 May 2011.
  14. "IASC 2011 - Sustaining Commons: Sustaining our Future". Iasc2011.fes.org.in. Retrieved 2022-09-24.
  15. "History and Culture-Qutb Shahi Style". APonline. Archived from the original on 10 January 2013. Retrieved 2022-09-24.
  16. "Naya Qila played down in Unesco list". The Times of India. 31 May 2011. Archived from the original on 5 November 2012. Retrieved 2022-09-24.
  17. Ifthekhar, J. S. (2013-11-18). "Naya Qila farmers likely to get land in city". The Hindu. ISSN 0971-751X. Retrieved 2022-09-24.
  18. "నయాఖిల్లా కింద మరో నగరం ఉండేదా..?". ETV Bharat News. 2019-12-15. Archived from the original on 2022-09-24. Retrieved 2022-09-24.