నాదీ ఆడజన్మే
మనిషికి బాహ్యసౌందర్యం కంటే అంతఃసౌందర్యం ప్రధానమైనది అనే ఇతివృతంతో రూపొందిన చిత్రం నాదీ ఆడజన్మే.నందమూరి తారక రామారావు, సావిత్రి , హరనాధ్, జమున నటించిన ఈ సినిమా 1964 లో విడుదల అయ్యింది.
నాదీ ఆడజన్మే (1964 తెలుగు సినిమా) | |
దర్శకత్వం | ఎ.సి.త్రిలోకచందర్ |
---|---|
నిర్మాణం | ఎస్.వి.రంగారావు |
రచన | డి.వి. నరసరాజు |
తారాగణం | నందమూరి తారక రామారావు, సావిత్రి, హరనాధ్, జమున, ఎస్.వి. రంగారావు, రమణారెడ్డి, ఛాయాదేవి, అల్లు రామలింగయ్య, సురభి బాలసరస్వతి, కె.జగ్గయ్య |
సంగీతం | ఆర్ సుదర్శనం |
నేపథ్య గానం | ఘంటసాల, పి.సుశీల, పిఠాపురం నాగేశ్వరరావు |
గీతరచన | దాశరథి కృష్ణమాచార్య |
నిర్మాణ సంస్థ | శ్రీవాణి ఫిల్మ్స్ |
భాష | తెలుగు |
ఐ.ఎమ్.డీ.బి పేజీ |
చలన చిత్ర నేపథ్యం
మార్చుఈ చిత్రానికి మూలం నానుమ్ ఒరుపెణ్ అనే విజయవంతమైన తమిళ చిత్రం. శ్రీశైలేష్ డే రచించిన బెంగాలీ కథను ఆధారంగా చేసుకుని ఈ తమిళ చిత్రం నిర్మితం అయి మంచి విజయాన్ని సాధించింది. తమిళంలో ఏవియం బేనర్లో ఈ చిత్రాన్ని నిర్మించిన మెయ్యప్పన్ చెట్టియార్‌ను ఆ చిత్రాన్ని తెలుగులో రీమేక్ చేయమని విజయా పిక్చర్స్ డిస్ట్రిబ్యూషన్ సంస్థ అధినేత పూర్ణచంద్రరావు వంటి వారు కోరినా ఆయన అంగీకరించలేదు. తమిళ మాతృకలో జమీందారు పాత్రను ధరించి ప్రశంసలు పొందిన ఎస్.వి.రంగారావు తెలుగులో కూడా ఈ చిత్రం నిర్మితం కావాలని, తాను తెలుగులో అదే పాత్ర ధరించాలని కోరిక వుండి తనకు చెట్టియార్‌తో ఉన్న చనువును పురస్కరించుకుని రీమేక్ హక్కుల్ని తనకివ్వమని కోరారు. చెట్టియార్ రంగారావును ఆశ్చర్యపరుస్తూ హక్కులు ఇవ్వడం ఎందుకు? ఇద్దరం భాగస్వాములుగా నిర్మిద్దామని ప్రతిపాదించారు. అంతటి నిర్మాత తనవంటి కొత్తగా నిర్మాత అయినవాడితో సినిమా తీద్దామనే సరికి ఆశ్చర్యానందాలతో అంగీకరించారు. అలా సినిమా తెలుగులో రీమేక్ చేయడం ప్రారంభమైంది.[1]
కథాంశం
మార్చుచిల్లరకొట్టు వ్యాపారి సింహాద్రి అప్పన్నకు ఇద్దరు చెల్లెళ్ళు. పెద్ద చెల్లెలు కళ్యాణి, చిన్న చెల్లెలు మాలతి. ఇద్దరూ సుగుణవతులే అయినా కళ్యాణి చదువుకోలేదు, నల్లగా వుంటుంది. ఆ గ్రామ జమీందారు విజయ రాజేంద్రప్రసాద్ నిత్యం మరణించిన భార్య జ్ఞాపకాలు నెమరువేసుకుంటూ జీవిస్తూంటాడు. ఆయన పెద్దకుమారుడు భాస్కర్, చిన్నకుమారుడు చంద్రం. సింహాద్రి అప్పన్న, జమీందారు బావమరిది దశరథరామయ్యతో కుట్ర చేసి పెళ్ళిచూపుల్లో భాస్కర్‌కి మాలతిని చూపించి అనుకోని స్థితిగతుల్లో కళ్యాణికి తాళికట్టాల్సివచ్చేట్టు చేస్తారు. కళ్యాణి నల్లనిదని కొన్నిరోజులు గిజాటులాడినా ఆమె మంచితనం, సుగుణాలను చూసి జమీందారు చల్లపడతాడు. కానీ వారందరూ సంతోషంగా గడపడం నచ్చని దశరథరామయ్య కుట్రజేసి కళ్యాణికి, ఆమె మరిది చంద్రానికి అక్రమసంబంధాన్ని అంటగట్టి, నిష్కల్మషమైన ఆమెపై చెడ్డ ఆరోపణలు చేసి జమీందారు మనసును విషతుల్యం చేసి ఇంటినుంచి కళ్యాణిని, కొడుకులిద్దరినీ ఇంటినుంచి గెంటిస్తాడు. ఆపైన అనేకమైన మలుపులు జరిగి, కళ్యాణి నిష్కల్మషాన్ని, కొడుకుల మంచితనాన్ని, బావమరిది కుట్రలను జమీందారు అర్థం చేసుకుని అందరూ కలవడంతో సినిమా ముగుస్తుంది. ఈ సినిమా బాహ్య సౌందర్యం కన్నా అంత:సౌందర్యమే మిన్న అన్న సందేశాన్నిస్తుంది.
తారాగణం
మార్చు- నల్లని, విద్యావతి కాని సుగుణవతి కళ్యాణి పాత్రలో సావిత్రి
- పెద్ద జమీందారు విజయ రాజేంద్రప్రసాద్‌గా ఎస్.వి. రంగారావు.
- జమీందారు కుమారుడు, కళ్యాణి భర్త భాస్కర్‌గా కథానాయక పాత్రలో ఎన్.టి.రామారావు
- జమీందారు రెండవ కుమారుడు చంద్రం పాత్రలో హరనాథ్
- కళ్యాణి అన్నయ్య, చిల్లరకొట్టు వ్యాపారి సింహాద్రి అప్పన్నగా అల్లు రామలింగయ్య
- సింహాద్రి అప్పన్న, కళ్యాణిల చెల్లెలు మాలతిగా జమున
సాంకేతిక వర్గం
మార్చునిర్మాణం
మార్చుడెవలెప్మెంట్
మార్చుతమిళంలో ఈ చిత్రమాతృకను నిర్మించిన చెట్టియార్, ప్రముఖ చలన చిత్ర నటుడు ఎస్.వి. రంగారావు కలిసి ఈ చిత్రాన్ని నిర్మించారు. త్రిలోక్ చందర్ సినిమాకు దర్శకత్వం వహించగా తమిళ చిత్రంలోని సన్నివేశాలను, పాటలకు బాణీలను అనుసరించి తెలుగు చిత్రాన్ని తీశారు.
తారాగణం గురించి
మార్చుతమిళంలో జమీందారు విజయ రాజేంద్రప్రసాద్ పాత్రను పోషించిన ఎస్వీ రంగారావు తెలుగులోనూ అదే పాత్రను పోషించారు. నిజానికి ఆ పాత్రపైన అభిమానంతోనే ఈ సినిమాను నిర్మించారు. ఆయన సినిమా అంతటికీ ప్రాణమైన జమీందారు పాత్రను ఒకపక్క అమాయకత్వం, మరొకవైపు చెప్పుడుమాటలు వినే గుణం వంటివి తనకే ప్రత్యేకమైన శైలిలో పరిపోషించారు. ప్రధానమైన పాత్రను పోషిస్తూ సావిత్రి కరుణ రసాత్మక నటనతో గొప్పగా మెప్పించారు.[1]
పాటలు
మార్చు- కన్నయ్యా నల్లని కన్నయ్యా నిను కనలేని కనులుండునా నిను ప్రేమింతురే నిను పూజింతురే నను గనినంత నిందింతురే - రచన: దాశరథి కృష్ణమాచార్య - టి.వి రాజు? - పి.సుశీల
- చిన్నారి పొన్నారి పువ్వు, విరబూసి విరబూసి నవ్వు...మన ఇంటి పొదరింటి పువ్వు, నినుజూసి ననుజూసి నవ్వు - రచన: దాశరథి కృష్ణమాచార్య - ఘంటసాల, పి.సుశీల
- నా మాట నమ్మితి వేల నా మీద కోపమదేల నను వీడి పోవుట మేలా ఏనాటికి నిన్ను విడజాల - రచన: దాశరథి - పి.సుశీల
- నా మాట నమ్మితివేలా నామీద కోపమదేల నను వీడి పోవుట మేలా - పిఠాపురం నాగేశ్వరరావు
- ఒడిలోన పవళించు వేళ నేను పాడేను ఒక జోల పాట ( బిట్) రచన :దాశరథి - పి.సుశీల
- కళ్ళళ్ళో గంతులువేసే బొమ్మా నీపేరేవేమ్మా గుండెల్లో గుసగుసలాడే , రచన :దాశరథి, కృష్ణమాచార్య, పిఠాపురం నాగేశ్వరరావు, పి.సుశీల
- మేఘాలు విడిపోయే ఈ నాటితో .. కన్నయా నల్లని కన్నయ్యా ( బిట్) రచన : దాశరథి , పి.సుశీల
వెలుపలి లింకులు
మార్చుమూలాలు
మార్చు- ↑ 1.0 1.1 రవిచంద్రన్, కంపల్లె (11 January 2015). "నాదీ ఆడజన్మే-నలుపును నిలదీసిన చిత్రం". ఆదివారం ఆంధ్రజ్యోతి.
- డి.వి.వి.ఎస్.నారాయణ సంకలనం చేసిన మధుర గాయని పి.సుశీల మధుర గీతాలు, జె.పి.పబ్లికేషన్స్, విజయవాడ, 2007.
- సి.హెచ్.రామారావు: ఘంటసాల 'పాట'శాల అనే పాటల సంకలనం నుండి.
- ఘంటసాల గళామృతము బ్లాగు - కొల్లూరి భాస్కరరావు, ఘంటసాల సంగీత కళాశాల, హైదరాబాద్ - (చల్లా సుబ్బారాయుడు సంకలనం ఆధారంగా)